సమయం ఆరుగంటలైనట్టు సైరన్ మ్రోగింది.
ఎర్రటి కిరణాలలో ఆకాశం కొరడా దెబ్బలు తిన్న గారడీవాడి వీపులా వుంది.
ఖైదీలు తమ చేతనున్న గునపాలను, పారలను స్టోర్స్ రూమ్ లో పెట్టి బ్యారెక్కుల దగ్గరికి వచ్చారు.
న్యూజైల్ మొదటి బ్యారెక్కు దగ్గరికొచ్చి క్యూలో నిలబడ్డారు తిలక్, బుద్ధుడు, ఉత్తీర్ణుడు.
ఇద్దరు వార్డర్లు బ్యారెక్కు మొదట్లో నిలబడి ఖైదీలను లెక్కలేసుకుంటూ ఒక్కొక్కర్నే లోపలికి వదులుతున్నారు.
కాసేపటికి లెక్క పూర్తయ్యింది.
"మొత్తం ముప్ఫై ఒక్కమంది" ఒక వార్డర్ మరో వార్డర్ తో చెప్పాడు.
"సరిపోయారు"
వార్డర్లు తలుపు మూసి, తాళం వేశారు.
ఎనిమిది గంటల ప్రాంతాన భోజనాలు వచ్చాయి. ఖైదీలకు పగలు భోజనం తోటలో పెడితే రాత్రి భోజనం బ్యారెక్కుల దగ్గరికి తీసుకువచ్చి పెడతారు.
భోజనాలు పూర్తి కాగానే కొందరు పడుకున్నారు. మరికొందరు పేకాటకు కూర్చున్నారు.
'గన్' పేకముక్కలను కలిపి 'లోపలా బయటా' వేస్తున్నాడు. దానిమీద పందాలు, పై పందాలు కాస్తున్నారు చుట్టూ చేరినవాళ్ళు. టోకన్లు గల గలమంటున్నాయి.
ఖైదీల దగ్గర దబ్బులుంచరు. జైలు క్యాంటీన్ లో డబ్బులకు బదులు టోకన్ లు ఇస్తారు. వాటినే తిరిగి క్యాంటీన్ లో ఇచ్చి తమకు కావాలసినవి ఖైదీలు కొనుక్కుంటారు. జైల్లో టోకన్లే మారక సాధనం.
దాదా అప్పటికే క్వార్టర్ బాటిల్ మందు లాగించేసి ఓ మూలన పడుకుండిపోయాడు. రోజూ రాత్రయ్యేసరికి అతనికి బ్రాందీ వస్తుంది. నైట్ షిప్టుకి వచ్చే వార్డర్లు తెచ్చి ఇస్తుంటారు. క్వార్టర్ బాటిల్ కావాలంటే ఐదో పదో ఎక్కువివ్వాలి. అయితే డబ్బిచ్చిన ప్రతివాడికీ వార్డర్లు మందు తెచ్చివ్వరు. దాదా లాంటివాళ్ళకే ఈ సదుపాయం వుంటుంది.
పేకాట హోరు చెవులను తూట్లు పొడుస్తున్నా తిలక్ మాత్రం తన ఆలోచనల్లో తానున్నాడు. రాత్రి ఒంటిగంటవరకు మేల్కొని కరెంట్ ఆఫ్ అవుతుందో లేదో స్వయంగా చూడాలనుకున్నాడు. అందుకే కళ్ళమీద వాలుతున్న నిద్రను బలవంతంగా దూరంగా తరుముతున్నాడు.
"బాసూ" అని వినపడేసరికి కళ్ళు తెరిచాడు.
ఉత్తరుడు అతని ఎదురుగ్గా కూర్చుని "ఓ విషయం చెప్పాలని వచ్చాను బాసూ. నిద్రపోతున్నావా?" అని అడిగాడు.
"లేదు! ఏమిటి విషయం!"
"నా పర్సనల ప్రాబ్లమ్ బాసూ. ఇంతకాలం ఎవరికీ చెప్పక నాలోనే దాచుకున్నాను. రెండు మూడు రోజులుగా నైఫ్ గాడు మరీ పేట్రేగిపోవటంతో ఇక చెప్పక తప్పదని నీ దగ్గరికి వచ్చాను"
"వాడేం చేస్తున్నాడు?"
"వాడు నన్ను ప్రేమిస్తున్నాడట. నువు రాక ముందు నుంచీ ఇదే వరస. నేను పెళ్ళామట, వాడు మొగుడట. తనతో జతకడితే రోజూ స్వర్గసౌఖ్యాలు చూపిస్తాట. ఇదే వాగుడు. నాకేదో భయంగా వుంది బాసూ" అంత మసక వెలుతురులోనూ అతని కళ్ళు భయంతో కొట్టుకోవడం తిలక్ గమనించాడు.
"నువ్వేమంటున్నావ్?"
"ఇందులో అనటం కూడానా! వాడి మాటలు వుంటుంటే శరీరం మీద తేళ్ళూ జెర్లూ పాకుతున్నట్టుంది. ఈ మధ్య ఏకంగా లవ్ లెటర్స్ రాస్తున్నాడు. వాడు దాదాతో కలిసి ఏమైనా చేస్తాడేమోనని భయంగా వుంది బాసూ."
"నువ్వేమీ ఆందోళనపడకు ఉత్తరా, అంతవరకూ వస్తే వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఇక కొద్ది రోజుల్లో నిన్ను ఈ ఊబినుంచి తప్పిస్తాను. నువ్వూ, నేను, బుద్ధుడు త్వరలో జైలునుంచి పారిపోతున్నాం."
ఉత్తరుడు షాక్ తిన్నట్టు అటూ ఇటూ కదిలాడు.
"అవును ఉత్తరా. నాకోసం మీరిద్దరూ ఎంతో చేశారు. అందుకే మిమ్మల్ని ఈ నరక కూపం నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నాను."
"నిజమా బాసూ"
అప్పటికే ఉత్తరుడు స్వేచ్ఛామయ జీవితాన్ని వూహించుకోసాగాడు.
"ఇక వెళ్ళిపడుకో ఉత్తరా"
ట్రాన్స్ లో వున్నట్టు చలనం లేకుండా లేచి తన పక్క దగ్గరికి వచ్చి పడుకున్నాడు. అతని కళ్ళముందు విశాలమైన ప్రపంచం పరుచుకుంటోంది. అతను అలానే కలలు కంటూ నిద్రలోకి జారుకున్నాడు.
మరో అరగంటకు పేకాట ముగిసింది.
టోకన్లనన్నిటినీ గన్ గెలుచుకున్నాడు. ఆరోజే కాదు ప్రతిరోజూ దాదా మనుషులే గెలుస్తుంటారు విచిత్రంగా.
అందరూ పడకలు సర్దుకుని నిద్రకుపక్రమించారు.
ఓ ఖైదీలేచి లైట్ ఆర్పాడు. మొత్తం బ్యారెక్కునంతా చీకటి మింగేసింది. బయట వరండా మాత్రం వెలుగుల నదిలా వుంది.
ఓ వార్డర్ బ్యారెక్కు దగ్గర నిలబడి "నిద్రపోండి. టైమ్ పదిగంటలయింది. ఇక శబ్దాలు వినిపిస్తే కుళ్ళబొడుస్తాను" అని హెచ్చరించాడు. మెల్లగా మాట్లాడుకుంటున్న ఖైదీలు మాటలు మాని గట్టిగా కళ్ళు మూసుకున్నారు.
తిలక్ మనసులో పారిపోయే పథకానికి తుదిరూపం యిస్తున్నాడు.
కరెంట్ ఒంటిగంటకు ఆఫ్ కావడం నిజమైతే ఆ టైమ్ తో కరెంట్ తీగలను ముట్టుకున్నా ప్రమాదం జరగదు. సైరన్ మ్రోగదు. అందువల్ల ఆ టైమ్ లో గోడదూకాలి. అటువైపు వెళ్ళాక వార్డర్లకు దొరక్కుండా ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకోవాలి. బ్యారెక్కు నుంచి పగలే బయటపడి, రాత్రయ్యేవరకు జైల్లోనే దాక్కుని ఒంటిగంటకు గోడ దూకేటట్లు ప్లాన్ చేసుకున్నాడు అతను.
ఇవన్నీ జరగాలంటే కరెంట్ ఆఫ్ కావడం నిజమోకాదో తేలాలి. అందుకే అతను కళ్ళు తెరిచి వరండాలోకి చూస్తున్నాడు.
కొందరు ఖైదీలు పెడుతున్న గురక అగ్గిపెట్టెలో వేసిన జోరీగల రొదలా వుంది.
కరెంట్ ఆగిపోయినప్పుడు కరెక్టుగా టైమ్ ఎంత అయిందో తెలుసుకోవాలని తిలక్ ఆరాటం. కానీ జైళ్ళ బ్యారెక్కుల్లో టైమ్ పీస్ వుండదు.
సత్యనారాయణ చెప్పిన సమాచారం మేరకు వార్డర్లు పన్నెండు గంటల వరకు వరండాలో రౌండ్లు వేస్తుంటారు. నిజానికి తెల్లవారే వరకూ పచార్లు చేస్తుండాలిగాని అంత ఓపికల్లేని వార్డర్లు ఓ దగ్గిర అందరూ పోగయి బాతాఖానీ వేస్తుంటారు. కొందరైతే ఏకంగా నిద్రపోతారు.
చివరిసారి రౌండ్ కొచ్చే వార్డర్ కోసం చూస్తున్నాడు అతను.
క్రమంగా జైలంతా గాఢనిద్రలోకి జారిపోయింది.
కొంతసేపటికి ఓ వార్డర్ వచ్చి తలుపుకున్న తాళం లాగి చూస్తున్నాడు.
అతను ఠక్కున లేచి "హలో" అన్నాడు.