Previous Page Next Page 
జైలు పేజి 15


    వెళ్ళబోతున్న వార్డర్ ఆగి "ఎవరూ?" అంటూ బ్యారెక్కులోకి తొంగిచూశాడు.

 

    "నేను తిలక్ ని, టైమ్ ఎంతయింది?"

 

    మరొకరైతే అప్పటివరకు నిద్రపోనందుకు కేక వేసేవాడే కానీ అతను కాబట్టి "టైమా! పన్నెండు" అని చెప్పి వెళ్ళిపోయాడు.

 

    తిలక్ పడుకున్నాడు. ఎగ్జాట్ గా కరెంట్ ఎన్నిగంటలకు పోతుందో తెలుసుకోవటం ఎలా అని ఆలోచిస్తున్నాడు. ఇక వార్డర్లు కూడా ఇటురారు.

 

    టైమ్ తెలుసుకోవడానికి చిన్నప్పుడు టీచర్ చెప్పిన ఉపాయం గుర్తొచ్చింది అతనికి. మెల్లగా ఒకటి అనేటప్పటికీ ఒక సెకను అవుతుందని నాలుగో తరగతిలోనో, అయిదో తరగతిలోనో టీచర్ ప్రత్యేక్షంగా చూపించాడు. ఆయన పెదవుల కదలికలను గుర్తు చేసుకున్నాడు. అలానే టీచర్ ని అనుకరిస్తూ "ఒకటి" అన్నాడు.

 

    అతని పెదవులు మెల్లగా కదుల్తున్నాయి.

 

    "రెండు... మూడు... నాలుగూ... అయిదు... వెయ్యీ... వెయ్యిన్నీ ఒకటీ... రెండువేలు... రెండువేలా ఆరువందలా తొంభై తొమ్మిది..."

 

    స్విచ్ ఆర్పినట్లు పెదవులు ఆగిపోయాయి.

 

    మొత్తం జైలంతా చీకటి కమ్మేసింది. ఆ చీకటిలో తుపాకీ శబ్దం వినపడగానే పారిపోయిన కుందేలు పిల్లలా వెలుగు ఎక్కడో అంతర్థానమైంది.

 

    అతని ముఖం మాత్రం ఆనందంతో వెలిగిపోయింది.

 

    ప్రపంచపు తలుపులు నిశ్శబ్దంగా తెరుచుకుంటున్నాయి. స్వేచ్ఛాగానం లీలగా విన్పిస్తోంది. ప్రకృతి రెండు చేతులనూ చాచి ఆహ్వానిస్తోంది. సంకెళ్ళు వాటంతటవే విడిపోతున్నాయి. బంధనాలు తెగిపోతున్నాయి ఎవరో మంత్రించినట్టు.

 

    సరిగ్గా అప్పుడే జైలును వూపేస్తున్నట్టు ఎవరో హృదయ విదారకంగా అరిచారు.

 

    తిలక్ దిగ్గునలేచి కూర్చున్నాడు.

 

    మళ్ళీ అదే అరుపు - ఈసారి మరింత భీకరంగా.

 

    ఆ చీకట్లో మళ్ళీ... మళ్ళీ... మళ్ళీ... అనే కేకలు.

 

    తిరునాళ్ళలో అంతా వరుస చేయి పట్టుకుని తిరిగిన కొడుకు షడన్ గా కనిపించకపోతే ఓ తండ్రిచేసే ఆక్రందన - క్షణం క్రితం తాళి కట్టించుకున్న అమ్మాయి పెళ్ళిపందిరి మంటల్లో కాలిపోతుంటే భర్త పెట్టిన గావుకేక, కన్నబిడ్డలా పెంచుకున్న పూలతోట కళ్ళముందే తుఫాను గాలికి నేలమీద ఒరిగిపోతే ఓ రైతు చేసే రోదన ఇవన్నీ మిళితమైనట్టు ఓ ఖైదీ పిచ్చి పట్టినట్టు అరుస్తున్నాడు.

 

    గాఢనిద్రలో వున్న ఖైదీలు ఒక్కొక్కరే నిద్ర లేస్తున్నారు. వార్డర్లు అటూ - ఇటూ పరుగెత్తడం తెలుస్తూనే వుంది.

 

    ఎవరికి ఏం జరిగిందో తెలియని తిలక్ అలా శూన్యంలో చూస్తున్నాడు.

 

                                      *    *    *    *    

 

    "రాత్రి ఎవరు అలా అరిచింది?"

 

    ఉదయం ఎనిమిది గంటలకు తోటలో పనికి దిగాక బుద్ధుడ్ని అడిగాడు తిలక్.

 

    "అతనిక్కడ ఓ ఖైదీ. లునటిక్ సెల్లో వుంటాడు. అంటే పిచ్చి వాళ్ళ బ్యారెక్కు అన్నమాట."

 

    "ఈ జెయిల్లో యినటిక్ సెల్ కూడా వుందా?"

 

    "ఆఁ! జెయిలంటే ఏమిటనుకున్నావ్ మరి, జెయిల్లో వుంటూ పిచ్చిపట్టకుండా వుండాలంటే వాడు స్థిత ప్రజ్ఞుడయినా అయి వుండాలి. లేదూ అన్నిటా రాటుదేలి రాయిలాగా మారిపోయిన వాడయినా అయి వుండాలి. ఈ నరకాన్ని భరించలేక ఎందరో ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకెందరో మతి స్థిమితం తప్పి పిచ్చివాళ్ళయి పోయారు. వాళ్ళలో మరీ పిచ్చి ముదిరినవాడు ఆనందరావనే కుర్రవాడు. అతనే రాత్రి అరిచింది. అతనిది పెద్ద విషాద కథలే."

 

    "అదేమిటో చెప్పు"

 

    "ఇతను ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఆమె తండ్రి ఇతనిమీద కిడ్నాప్ కేసు పెట్టాడు. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని తండ్రి ఆమెను హింసించాడు. దీన్ని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఎస్కార్టు లేదనే సాకుతో ఆనందరావును దహనక్రియలకు కూడా పంపలేదు అప్పటి జెయిల్ సూపరింటెండెంట్. దాంతో అతనికి పిచ్చి పట్టింది. అప్పట్నుంచి ట్రీట్ మెంట్ లేక అలానే వున్నాడు."

 

    వింటున్న తిలక్ ఒళ్ళు జలదరించింది. ప్రపంచంలో అంత క్రూరత్వం ఎలా పెరిగిందో అతనికి మింగుడు పడటం లేదు. ఆనందరావుకి ట్రీట్ మెంట్ ఇప్పించేటట్టు జెయిల్ సూపరింటెండెంట్ మీద వత్తిడి తీసుకురావాలనుకున్నాడు!

 

    అదే విషయం చెప్పబోయాడు. "బామ్మర్దీ" అని వినపడటంతో తల తిప్పి చూశాడు.

 

    తనవేపే చేయి వూపుతూ వస్తున్నాడు ఏకాంబరం.

 

    ఆయన తనను సమీపించాక ఏమిటన్నట్టు చూశాడు.

 

    "ఎవరో మరదలు పిల్ల. నీకోసం వచ్చింది. విజిటర్స్ గదిలో వుంది. పేరు లాలసట"

 

    ఒక్కసారిగా తను వింటున్నదేమిటో తిలక్ కి అర్థం కాలేదు. తనకోసం ఎవరో వచ్చారంటే నమ్మబుద్ధి కావడం లేదు. లాలస పేరు కూడా ఇంతకు ముందెప్పుడూ వినను కూడా లేదు . అలాంటిది తనకోసం లాలస అనే పేరుగల అమ్మాయి వచ్చిందంటే అతను ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

 

    "నాకోసమా?" మరోసారి స్పష్టంగా తెలుసుకోవాలని అడిగాడు.

 

    "నీకోసమేనని చెప్పింది. మరదలు పిల్ల ఎవరోకాని బంగినిపల్లి మామిడిపండులా భలే పసందులా వుంది. అన్నాడు ఏకాంబరం నాలుకను పెదాలకేసి రాసుకుంటూ.

 

    మగవాళ్ళను బామ్మర్దీ అనేకాకుండా ఆడవాళ్ళను మరదలు పిల్ల అని పిలిచే అలవాటు కూడా ఏకాంబరానికి వుండటం గురించి అతను ఆలోచించటం లేదు. తనకోసం వచ్చింది ఎవరో తెలియక గింజుకు పోతున్నాడు.

 

    ఇక తప్పదని ఏకాంబరం వెంట విజిటర్స్ గదికి నడిచాడు.

 

    వీళ్ళను చూడగానే ఆమె లేచి నిలుచుంది.

 

    తిలక్ వేపు చూసి రెండు చేతులూ జోడించి "నా  పేరు లాలస. మీకోసమే వచ్చాను" అంది నవ్వుతూ.

 

    అతను అన్యమనస్కంగానే ప్రతి నమస్కారం చేశాడు.

 

    "ఏం మరదలా! ఇతని కోసమేనా నువ్వొచ్చింది" అన్నాడు ఏకాంబరం ఆమెకి మరింత దగ్గరగా జరిగి.

 

    "అవును బావా" అదే ధోరణిలో వ్యంగ్యంగా అని, ఆ పై చిరునవ్వు నవ్వుతూ "నీలాంటి గొప్ప సంస్కారవంతుడు నాకు బావ అయినందుకు ఎంత సంతోషంగా వుందో చెప్పలేను బావా. ఎన్నో ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను! జవాబు చెపితే వంద రూపాయలిస్తాను" అంది.

 

    ఆయన ఎగిరి గంతేశాడు. అడుగు మరదలా"   

 Previous Page Next Page