Previous Page Next Page 
జైలు పేజి 13


    జెయిలు ముందు భాగాన వున్న సిమెంట్ చప్టా మీద కూర్చున్నాడు కైలాసం.

 

    అతనికి ముప్ఫయి అయిదేళ్ళ వయసుంటుంది. చిన్నప్పట్నుంచీ అతనికి తండ్రిలేడని అతన్ని చూస్తేనే మనకు తెలిసిపోతుంది. నూనె ముఖం ఎరగని వంకీలు తిరిగిన జుట్టు చిక్కుపడిన ఇనుపకమ్మీ వుండలా ఉంటుంది. బూడిద రంగు కళ్ళు అక్కడక్కడా బీటలు తీసినట్టు ఎర్రటి చారికలు కనిపిస్తుంటాయి. ఒకప్పుడు కండలు తిరిగిన శరీరం యిప్పుడు గాలి తీసేసినట్టు వూగుతుంటుంది.

 

    అతను కుడిచేతిలోని కలకత్తా పాన్ ని బుగ్గన పెట్టుకుని, ఎడమ చేతిలో వున్న చార్మినార్ సిగరెట్ ను నోట్లో పెట్టుకున్నాడు.

 

    అతను జైల్లోకి రావడాన్ని గమనించిన హెడ్ వార్డర్ ఆర్ముగం పరుగున అక్కడికి వచ్చాడు.

 

    వచ్చీ రాగానే "నిన్న సాయంకాలం చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళి పోయావ్? ఏదో నమ్మకస్తుడివని ఈ పని నీకు అప్పగిస్తే ఇలా చేస్తావా? వార్డర్లంతా నామీద కారాలు మిరియాలు నూరుతున్నారు" అన్నాడు చిరుకోపంతో.

 

    కైలాసం పొజిషన్ లో ఏ మార్పు లేదు. తాపీగా జవాబు చెప్పాడు. "అలా కంగారుపడకు నిన్న ఓ అర్జంట్ పని తగిలింది. పెళ్ళాం లేనివాడ్ని గదా!ఎవరో ఓ పిల్ల తగిలింది. దాంతో రాలేకపోయాను. మే డబ్బు ఎక్కడికీ పోలేదు ఇదిగో నిన్న కలెక్షన్ వందరూపాయలు. నా కమీషన్ ఇరవై పర్సంట్ పోగా మిగిలిన ఎనభై రూపాయలు."

 

    జేబులోంచి ఎనిమిది పది రూపాయల నోట్లను తీసిచ్చాడు.

 

    ఆర్ముగం మరో మాట మాట్లాడకుండా వాటిని తీసుకుని లెక్క పెట్టుకున్నాడు. "ఇంకెప్పుడూ కలెక్షన్ ఇవ్వకుండా వెళ్ళకు" హెచ్చరిస్తున్నట్లు అన్నాడు.

 

    "సరే"

 

    కైలాసం వార్డర్ల బ్రోకర్. అతనూ ఒకప్పుడు ఖైదీనే. నిన్న మొన్నటివరకు అతను గూడ్సురైలు వ్యాగన్లను లూటీ చేసేవాడు. అంతే గాకుండా అప్పుడప్పుడూ వీధి పోరాటాలు కూడా నడిపేవాడు. పోలీసులకు దొరికినప్పుడు జైలుకి వచ్చేవాడు.తరచూ జైలుకి రావడంవల్ల వార్డర్లూ. వాళ్ళ వీక్ నెస్సులా అన్నీ క్షుణ్ణంగా తెలుసు.

 

    ఈ మధ్య ఓరోజు జైలునుంచి రిలీజయి వెళుతుంటే ఆర్ముగం వచ్చి అతన్ని ఆపాడు. ఆప్యాయంగా అతని భుజంపై చేయివేసి దగ్గర్లో వున్న ఓ టీ అంగడికి తీసుకెళ్ళాడు.

 

    "శిక్ష అయిపోయింది గదా! వెళ్ళి ఏం చేస్తావ్?" అని అడిగాడు.

 

    ఈ మాటలకు కైలాసానికి నవ్వొచ్చింది. "ఈ ఉద్యోగం పొతే నువ్వేం చేస్తావ్? ఏమీ చేయలేవు. అలాగే నేను వ్యాగన్లు లూటీ చేయకపోతే తిండి జరగదు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే"

 

    "కానీ ఇందులో నీకు రిస్కు ఎక్కువ. మళ్ళీ పోలీసులు - జైలు - శిక్ష. ఇవేమీ లేకుండా వుండే పని ఒకటి చెబుతాను. చేస్తావా?"

 

    "ఏమిటది?"

 

    "మా వార్డర్లకు బ్రోకర్ గా వుండు. రాజాలా బతకచ్చు"

 

    "అంటే? ఏం చేయాలి?"

 

    "నీకు జైలు గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం వుంది? జైలు మాన్యువల్ లో ఏం వుందో మాకంటే నీకే బాగా తెలుసు. ఖైదీల కోటా బజార్లో అమ్మిపెట్టడం దగ్గర్నుంచి ఖైదీల కోసం వచ్చే విజిటర్స్ నుంచి లంచాలు తీసుకునేవరకు నువ్వే చేయాలి. ప్రతిరోజూ సాయంకాలం మాకు కలెక్షన్ కట్టాలి. కోటా అమ్మినందుకు నీకు టెన్ పర్శంట్ కమీషన్, విజిటర్స్ కలెక్షన్ లో ట్వంటీ పర్శంట్ కమీషన్"

 

    కైలాసం మౌనంగా వింటున్నాడు.

 

    ఆర్ముగం కొనసాగించాడు. "రోజుకి ఇంత తిండి పెట్టాలని కోటా వుంది గదా. అయితే అంత కోటా మేము పెట్టం. అందులో కొంత భాగం నువు బజార్లో అమ్ముకు రావాలి. ఉప్పు పప్పు దగ్గర్నుంచి మాంసం వరకు మన సరుకును తీసుకునే హోటళ్ళున్నాయి. మేము ఇచ్చే కోటాను నువు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చెయ్యాలి. వాళ్ళిచ్చే సొమ్మును పట్టుకు రావాలి. ఇక నువు చేయాల్సిన రెండో పని. ఖైదీలను చూడటానికి వాళ్ళ బంధువులు, స్నేహితులు వస్తుంటారు. అయితే ఖైదీలను ఎప్పుడంటే అప్పుడు చూడటానికి కుదరదు. దానికి టైమూ గట్రా వుంటాయి. కానీ ఇవి తెలియని వాళ్ళు వస్తుంటారు. మేము ఖైదీలను చూడటానికి ఇప్పుడు కుదరదు అని చెప్పేస్తుంటాం..."

 

    కైలాసం అడ్డు తగిలాడు. "ఇక చెప్పకు ఆర్ముగం. అంతా అర్థమయింది ఖైదీలను చూడటానికి వీలుకాదని మీరు అన్నప్పుడు నేను రంగంలోకి దిగాలి. వచ్చిన వాళ్ళను పరిచయం చేసుకోవాలి. తృణమో, పణమో అర్పిస్తే పని అయిపోతుందని నేను చెప్పాలి. ఇక విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. అలా వచ్చిన వాళ్ళకి మీరు ఖైదీలను చూపిస్తుంటారు. అంతేకదా, కానీ ఆర్ముగం.... ఇవన్నీ వ్యాగన్లు లూటీ కంటే, వీధి కోట్లాటల కంటే హీనంగా వున్నాయి" అన్నాడు.

 

    "నీ తెలివి తేటలు అద్భుతం కైలాసం. అందుకే నిన్ను సెలక్ట్ చేశాం. నిన్నవరకు ఈ పనులు చేస్తున్నవాడు మందు ఎక్కువై టపాకట్టేశాడు. దాంతో ఈ ఛాన్స్ నీకు తగిలింది. ఇంతకీ నువ్వు ఒప్పుకున్నట్టేనా?"

 

    "ఒప్పుకుంటున్నాను"

 

    ఆర్ముగం ఆనందంతో అరిచాడు. "రెండు స్ట్రాంగ్ టీ"

 

    అలా కైలాసం అక్కడ బ్రోకర్ గా సెటిల్ అయిపోయాడు.

 

    ఆర్ముగం కలెక్షన్ డబ్బు జేబులో పెట్టుకున్నాక "ఈరోజు ఆదివారం కదా! మటన్ తెచ్చాం. ఏవో ఎముకలను మాత్రం పులుసు పెట్టి ఖైదీలకు పోస్తునాం. మిగిలినదంతా మంచి మటన్. ఇది తీసుకుని వెళ్ళి అప్సరా హోటల్ లో ఇచ్చేయ్. వాడు డబ్బిస్తాడు. పట్టుకొచ్చేయ్. ఈ రోజు ఖైదీలను చూడటానికి వచ్చే విజిటర్స్ కూడా ఎక్కువగా వుంటారు. నిన్న మరీ డల్ కలెక్షన్" అన్నాడు ఆర్ముగం.

 

    "సరే. క్షణంలో వచ్చేస్తాను. మటన్ ఎక్కడ?"

 

    "అదిగో ఆ రిక్షాలో వుంది"

 

    కైలాసం సిగరెట్ ను కిందపడేసి రిక్షా దగ్గరికి వచ్చాడు.

 

    "కైలాసం.... కైలాసం"

 

    ఎవరో పిలుస్తున్నట్లపించి రిక్షా ఎక్కబోతున్న వాడల్లా ఆగాడు.

 

    తలతిప్పి చూస్తే చిత్ర ఇంట్లో పనిచేసే వెంకట్రాజు అనే ఖైదీ కనిపించాడు.

 

    "ఏమిటి విషయం?" విసుగ్గా అడిగాడు కైలాసం అతను దగ్గరికి రాగానే.

 

    "నిన్ను అమ్మగారు రమ్మంటున్నారు"

 

    "నన్నా! ఆశ్చర్యపోయాడతను.

 

    "ఏదో రహస్యమట. అర్జెంటుగా రమ్మన్నారు"

 

    చిత్ర తనను ఎందుకు పిలిచిందో అతను వూహించలేకపోయాడు. వెంకట్రాజు వెంట మౌనంగా నడిచాడు.

 

                                      *    *    *    *                    

 Previous Page Next Page