Previous Page Next Page 
జనవరి 5 పేజి 13

  

       "ఎక్కడకెళ్ళి పోయుంటారు?" అచ్యుత్ తన ప్రక్కనే కేతువుని ఉద్దేశించి ప్రశ్నించాడు.
   
    "బహుశా భయంతో పారిపోయి ఎక్కడన్నా తలదాచుకుని వుండవచ్చు" అభిరామ్ కొట్టిన దెబ్బల తాలూకు నెప్పుల్ని పళ్ళ బిగువున భరిస్తూ అన్నాడు కేతువు.
   
    "ఎక్కడికి పారిపోతారు? ఈ నగరంలోని ఏ మూల దాగినా నా రాజ్య పరిధిలో వున్నట్టే లెక్క.... ఎక్కడున్నా రప్పిస్తాను" అన్నాడు అచ్యుత్ కసిగా పళ్ళు కొరుకుతూ.
   
    "బయట పడకపోయినా ఈ నగరంలో మనమంటే గిట్టనివాళ్ళు కూడా వున్నారు. వాళ్ళే, ఎవరన్నా వారికి రక్షణ కలిపించి వుండవచ్చు" కేతువు సాలోచనగా అన్నాడు.
   
    "మీరు దెబ్బలు తిన్న వ్యవహారాన్ని అతను ఎదురు తిరిగిన వైనాన్ని బట్టి వాడో సింహపు పిల్లలాంటివాడు. కానుక వాడికి భయం కాని, పిరికితనం కాని ఉండవు. సో-వాడు తప్పించుకునే ప్రయత్నం చచ్చినా చేయడు. ఆ గ్రెసివ్ నేచర్ వున్న వ్యక్తుల సైకాలజీ నాకు బాగా తెలుసు."
   
    "మరయితే?"
   
    "కొడుకుని రక్షించుకునేందుకు ఆ అరుణాచలమే ఏదో చేసుండవచ్చు"
   
    "ఏం చేసుంటాడు? అసలింతకీ ఈ ఏరియాలోనే ఉంచినట్లా...లేక...."
   
    "చెప్పలేం ఊరు దాటించే ప్రయత్నం చేసినా చేసుండవచ్చు" పరి పరివిధాల ఆలోచిస్తూ అన్నాడు అచ్యుత్.
   
    అప్పటికే అతని కాళ్ళ దగ్గర సిగరెట్ పీకలు గుట్టగా పడిపోయాయి.
   
    కొద్దిక్షణాల మౌనం తర్వాత క్విక్ గా రియాక్ట్ అవుతూ --"మన వాళ్ళనిక బయట కొచ్చేయమను. మరో అరగంటకల్లా బస్ స్టాండ్ ని, రైల్వే స్టేషన్ ని, నగరం నుంచి బయటకు సాగిపోయే అన్ని రహదారుల్ని ముట్టడించాలి. కమాన్.....క్విక్...." అన్నాడు అచ్యుత్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ.
   
                        *    *    *    *    *
   
    మేఖల ఎంక్వయిరీ కౌంటర్ లో వున్న వ్యక్తిని ఏఏ ట్రైన్స్ ఎటు వెళ్ళేది అడగటం, అతను మరో అరగంట వరకు ఏ ట్రైన్ లేదనటం....అంతా అభిరామ్ గమనిస్తూనే వున్నాడు.
   
    పిరికి వాళ్ళలా అలా ఊరు విడిచి వెళ్ళవలసి  రావటాన్ని అవమానంగా భావిస్తున్నాడు.
   
    కన్న తల్లి, అంత నిర్ధయగా వ్యవహరించడం తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోంది.
   
    ఇంకో ప్రక్క తనెంతో ప్రేమించే అక్క..... తన బాధ్యతను ఏ మాత్రం వెరపు లేకుండా నెత్తికెత్తుకోవడం ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ వుంది.
   
    అక్క అడ్డు రాకుండా వుంటే ఈ నగరానికి పట్టిన దౌర్భాగ్యాన్ని త్రుంచిపడేసేవాడే! పులిని గాయపరచకుండా యెవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే ఆ పులికి ఆకలయినప్పుడు ఒక వ్యాపారస్తుడ్నే వేటాడేది.
   
    కాని తను ఆ పులిని గాయపరిచి, అహాన్ని నిద్రలేపి, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి (రౌడీలకు, గూండాలకు, ఆత్మాభిమానం వుంటుందా) మధ్యలో వచ్చేసాడు.
   
    సెంటిమెంట్, ప్రేమ, గౌరవం అలా తనను వెనక్కి లాగేసాయి. అది న్యాయమా? తననే నమ్ముకుని, తన అండగా నిలిచి, తనకు సపోర్టు అందించిన తన మిత్రుల్ని పులికి యెదురు నిలిపి, యెరగా వేసి రావడం నిజంగా అన్యాయమే!
   
    దేనికైనా ముందుండే తను.... యీ రోజు తప్పించుకురావటం దారుణం!
   
    అక్క ఒక్కసారి వదిలివేస్తే వాటన్నింటినీ చక్కబెట్టి రావచ్చు. కానీ అడగాలంటే యేదో జంకు! తాను లేనని తెలిసి ఇంటి మీదకు వెళితే? ధర్మరాజు లాంటి తన తండ్రి వారిని యెదుర్కోగలడా?
   
    కేవలం ఇంటి సభ్యుల మీద మాత్రమే యెగరగల తల్లి, అచ్యుత్ అనుచరుల్ని చూసి ధైర్యంగా నిలబడగలదా?
   
    అభిరామ్ ఇలా ఆలోచిస్తుండగా---
   
    మేఖల ఆలోచనలు మరికొంత ముందుకు వెళ్ళాయి.
   
    అచ్యుత్ పేరు వింటే చాలు.... రౌడీయిజం.....జబర్దస్తీ....
   
    గూండాగిరి.....చందాలు.... లాంటి వినకూడని, తలవకూడని పదాలు వెలికి వస్తుంటాయి.
   
    అతనెవరో? ఎలా వుంటాడో తనకు తెలీదు. తను చూడలేదు.
   
    గత సంవత్సరం తాను ఓ హోల్ సేల్ టెక్స్ టైల్ కన్ సరన్ లో జాబ్ చేస్తుండగా మొట్టమొదటిసారి అతని గురించి విన్నది.
   
    బట్టల వ్యాపారస్తులంతా కలిసి రెండు లక్షలు వసూళ్ళు చేసి తనకు పంపించాలని అచ్యుత్ ఆదేశించాడు. అని తాను పోషిస్తున్న పనీపాటా లేని సోమరిపోతులయిన తన అనుచరుల ఖర్చులకని సెలవిచ్చినట్లు కూడా విన్నది.
   
    ఎందుకివ్వాలని తను పని చేసిన కంపెనీ మేనేజర్ ని అడిగింది.
   
    న్యాయంగా ఇవ్వక్కర్లేదు. కానీ మనకు జరిగిన, జరగగలవనుకునే అన్యాయాన్ని, మాన ప్రాణాల్ని రక్షించటానికి సమయానికి పోలీసులు రారు. వచ్చినా మామూళ్ళడుగుతారు.
   
    ఒకవేళ ఇచ్చినా కంప్లయింట్ యివ్వాలని, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలని, సాక్ష్యాలుండాలని, లేవంటే సేకరించాలని, నానా హింసలు పెడతారు. అన్నింటికీ సరే అని ఒప్పుకున్నా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. అందుకని లైసెన్స్ గూండాస్ కి లంచాలిచ్చేకన్నా, ఆన్ లైసెన్స్ గూండాస్ కి మామూళ్ళు యిచ్చి వారినే రక్షణ కోరి న్యాయం చేయమంటే అర్జీ పెట్టుకోకుండానే, సాక్ష్యాలడక్కుండానే ఆ పని చేసేస్తారు. అలాంటప్పుడు యివ్వాలా లేదా అంటూ ఆయన తననే ప్రశ్నించడం తనకింకా గుర్తు.
   
    ఆ తరువాత ఓ హోల్ సేల్ గోల్డ్ మర్చెంట్ దగ్గర తను కొన్నాళ్ళు పని చేసింది. అతను బులియన్ మార్కెట్ అంతటికీ సెక్రటరీ! అతను పనికట్టుకుని బంగారం వ్యాపారం చేసే ప్రతి వ్యాపారస్తుడి దగ్గరా చందా వసూళ్ళు చేసి అచ్యుత్ పంపించినప్పుడు కూడా  అడిగింది యిది పిరికితనం కాదా అని!
   
    "నా ఇల్లు తగలబడుతుంటే బకెట్ కోసం ప్రక్కింటికెళితే, అప్పటికే ఆ యింటి యజమాని తడుముకుంటూ కనిపించాడు. నా యింటి మంట నార్పితే ఆటోమేటిగ్గా అతనిల్లు సేవ్ అవుతుందని అతనికి తెలీదా? తెలుసు కానీ అతనేమనుకుంటాడంటే వాడిల్లు పోతే పోయింది. యీలోపు తనింటిని తడిపి వుంచుకుంటే గాలి వాలుకి నిప్పురవ్వలొచ్చినా ఏమీ కాదని.
   
    నడిరోడ్డు మీద అన్యాయంగా ఒక అమాయకుడిని నలుగురు కొడుతుంటే ఎవరయినా ఆగి చోద్యం చూస్తారే తప్ప రక్షించేందుకు ప్రయత్నిస్తారా? లేదు.
   
    ప్రైమ్ మినిస్టరీకి, ముఖ్యమంత్రులకు చట్టం కల్పించే సెక్యూరిటీ వుంటుంది. మరి సామాన్య ప్రజలకు? అందుకే యికపై సామాన్య ప్రజలు సైతం బియ్యం, కిరసనాయిలు ఇంటి అద్దె, బట్టలు లాంటి ఖర్చుల పద్దులతో మరో పద్దుని ఖచ్చితంగా వ్రాసుకోవాలి.
   
    ఆ పద్దు పేరు రౌడీ మామూళ్ళు.
   
    మన నిత్య జీవితంలో రౌడీ మామూళ్ళు చాలా మామూలు అయిపోయిందమ్మా! దాని గురించి ఆశ్చర్యపోవడం, ఆవేశపడటం అనవసరం" అని అతను నవ్వుతూ అంటుంటే తాను షాక్ తిన్నది.
   
    ఆమె ఆలోచనలలా సాగిపోతూనే వున్నాయి. ఆ అక్కా తమ్ముళ్ళను పట్టుకునేందుకు అచ్యుత్ మనుష్యులు నగరాన్ని గాలించడం ప్రారంభమైంది.
   
    "అక్కా...." అన్నాడు అభిరామ్ మనస్సులో ఒక నిశ్చయానికొస్తూ.
   
    ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్న మేఖల చటుక్కున తలతిప్పి యేమిటన్నట్లు కనుబొమ్మల్ని ఎగురవేసింది.
   
    "నా ఫ్రెండ్స్ ని అలా మధ్యలో వదిలేసి రావడం అన్యాయం.....అచ్యుత్ ముఠా పగబట్టి వాళ్ళనేదయినా చేస్తే...? నే ఒక్కడినే ఆ ఇష్యూలో పాల్గొని వుంటే యిదంతా  ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ నా కేదయినా జరుగుతుందేమోనని వాళ్ళు భయపడి వచ్చి అందులో యిరుక్కుపోయి అచ్యుత్ మనుష్యులకు శత్రువులయిపోయారు. అది కేవలం నా మూలంగానే కదా!? మరి నేనిలా తప్పించుకు పారిపోతే...?" యికపైన మాట్లాడలేక బెరుగ్గా చూస్తూ ఆగిపోయాడు.
   
    మేఖలకి కూడా తన తమ్ముడి వాదనలో ఉన్న లాజిక్ అర్ధమైంది.
   
    కానీ ఆమె భయం ఆమెకుంది.
   
    ఇప్పుడు తమ్ముడిని వదిలేసి తన ఫ్రెండ్స్ ని రక్షించుకొమ్మని అనుమతిస్తే... తఃమ్ముడికి సమాజంలో మంచి పేరు రావచ్చు ఆపద్భాందవుడని అందరూ గుర్తించవచ్చు.
   
    నాయకత్వ లక్షణాలున్నాయని, పిరికి వాడు కాదని అందరూ పొగడవచ్చు.
   
    కానీ ఆ సందర్భంలో తమ్ముడి కేదయినా జరిగితే? తను భరించగలదా?
   
    తన తల్లికి సమాధానం చెప్పుకోగలదా?
   
    తమ్ముడిని ఎంతగానో ప్రేమించే తన తండ్రి బ్రతగ్గలడా? ముమ్మాటికీ లేదు.

 Previous Page Next Page