ఆ మాటలకి అందరు సంతసించి 'గుడ్డిలో మెల్ల' అన్నట్లు ఈ సలహా బాగుండటంవల్ల ఈ విద్యల తల్లి దగ్గిర శెలవు తీసుకుని మరో లోకానికి పయనమయ్యారు అందరు.
* * * *
"ఇక్కడ చాలా చలిగా ఉందికదూ!" నడిమింటి నాంచారమ్మ పైట చెంగుని భుజాల చుట్టూతా తిప్పి కప్పుకుంటూ అంది.
"మంచుకొండమీద చలిగా ఉండక వేడిగా ఉంటుందా? నీ పిచ్చి గాని," సూరంపూడి సూర్యకాంతాదేవి ముద్దుగా కోప్పడుతూ అంది.
ఎమ్.బి.బి.యస్. చదువుదామని టెన్త్ వరకు కలలు కని టెన్త్ క్లాస్ మూడుసార్లు తప్పి చివరకు వో డాక్టరుగారి భార్య అయిన అమృతవల్లి "మా...డాకటారుగారు అంటుంటారు కదా జరాలొచ్చినప్పుడు అసలే మందులూ వాడక్కరలేదు. కాళ్ళకి చెప్పులు లేకుండా నడినెత్తిమీద కిలో ఐస్ గడ్డలమీద ఉత్తకాళ్ళతో పది నిమిషాలు అటూ ఇటూ తిరిగితే సరి. టకీ మని జ్వరం ఎగిరిపోతుంది" అని తరచూ చెబుతుంటారు. డాకటారుగారు వో సారి వో రోగికి అలాగే వైద్యంచేస్తే టక్కున జ్వరంతగ్గిపోయింది." అమృతవల్లి మాట పూర్తిచేయకముందే రంగనాయకి అందుకుని "టకీమని జ్వరమే తగ్గిందో 'ఠా' అని ఆ జీవుడే ఎగిరిపోయాడో ఎవరికీ తెలుసు!" వ్యంగ్యంగా అంది.
"నాకేం అబద్దాలాడే అవసరంలేదు. ఆ రోగికొచ్చింది మామూలు జ్వరం కాదు. ముందు చాలి జ్వరం వచ్చి అది ఫ్లూలోకి దించి ఆ తర్వాత నలభైరోజులు టైఫాయిడ్ గ మారింది అన్ని రకాల జ్వరం, అన్ని రోజులు...ఆ రోగిని పట్టిపీడిస్తుంటే ఈ జ్వరం మందులవల్ల తగ్గదని తెలిసి మా డాకటారుగారు..."
"ఆగాగు. వాడికసలే చలిజ్వరం అంటున్నావ్. ఆపై ఫ్లూ అది చాలక టైఫాయిడ్ జ్వరం. అదొచ్చి నలభై రోజులు. అలాంటి రోగి నడినెత్తిన ఐస్ పెట్టుకొని మంచుగడ్డలమీద నడిచాడా! ఏవమ్మోయ్! నువ్వెంత డాక్టర్ గారి భార్యవయితే మాత్రం ఇంత అభూత కల్పనలు పనికిరావ్. అంత ఇది పనికిరాదు" అంది రంగనాయకి.
"ఇది అంటే ఏమిటి?" అమృతవల్లి 'ఇది' అన్నమాటను నొక్కిపలుకుతు అంది.
"ఇది అంటే ఆ మాత్రం తెలీదా హా...హతవిధి!" అంటూ తమాషాగ వాపోయింది కామాక్షి.
"మీరంతా కాసేపు నోరు మూసుకొంటారా. లేకపోతే ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుడు వాగుతుంటారా?" లీడర్ లీలారాణి కోప్పడింది.
"మాట్లాడుతూంటే సమయం తెలీదు. అందరూ మాట్లాడుకుంటువెళ్లడమే మంచిది. సరదాగా వుంటుంది." మహా రచయిత్రి మహాదేవి శెలవిచ్చింది.
కవయిత్రి కాంచనమాల "ఔనౌను" అంటూ ఆమె మాటలకి వంత పాడింది.
"నాకో చిన్న డౌటు. అడగనా వద్దా!" అనుమానాల అప్పలమ్మ అడిగింది.
"నీకు ప్రతిదీ డౌటే. ఆ మాటంటే అదొక డౌటు. ఎందుకొచ్చిన గోలకాని నీ అనుమానమేదో అడిగి తీర్చుకో" అంది నీలవేణి.
"లక్ష్మి... సరస్వతి... పార్వతి... ముగ్గురిలో ఎవరు గొప్ప?"
"ఎవరికి వాళ్ళే గొప్ప"
"అదెలా కుదురుతుంది? లక్ష్మీదేవి దగ్గిర ధనం మూలుగుతుంటుంది. సరస్వతీదేవి దగ్గిర సంగీత సాహిత్యాలు ఊ కొడుతుంటాయ్. మరి పార్వతీదేవి దగ్గిర ఏం కొడుతుంటాయ్?"
"నా బొంద వెధవ అనుమానాలూ నువ్వూనూ, ఇదేమన్నా సెంటా! కంపుగొట్టటానికి."
"నీలవేణి! అప్పలమ్మకొచ్చిన అనుమానం అదికాదు. లక్ష్మీదేవి ధనానికి, సరస్వతీదేవి చదువులకి అధిపతి అయినట్టు 'పార్వతిదేవి ఏ విషయంలో అధిపతి' అని అనుమానంతో అడిగింది" లీడర్ లీలారాణి చిరునవ్వుతో అంది.
"ఓ అదా! పార్వతీదేవి సర్వశక్తి సంపన్నురాలు చదువు, ధనం కన్నా గొప్ప శక్తి ఆమె దగ్గర వున్నాయి. చేత శూలం ధరించిందంటే మహాకాళి అయిందన్నమాటే." తనకు తెలిసింది చెప్పింది నీలవేణి.
"అయితే మన కోరికల్ని పార్వతీదేవి తప్పక తీరుస్తుంది. నో డౌట్" అంది అనుమానం తీరిపోయిన అప్పలమ్మ.
ఆమె మాటలకి "ఔనౌను." అన్నారంతా.
వాళ్ళలా మాట్లాడుకొంటు చల్ల చల్లగ నడుస్తూ పార్వతీదేవి దగ్గిరకి వెళ్ళారు.
వీళ్ళు వెళ్ళేసరికి పార్వతీదేవి ఒంటరిగ కూర్చొని నలుగుపిండితో తమాషా బొమ్మలు చేస్తోంది.
శ్రీ మహాలక్ష్మి దగ్గర ఉన్నట్టు.... సరస్వతీదేవి దగ్గర ఉన్నట్టు ఇక్కడ అసిస్టెంట్లు కాని కంప్యూటర్లు కాని టైపు మిషన్ చప్పుళ్ళ వీణా నాదాలు అవేమీ లేవు. కామ్ గా వుంది అక్కడంతా ఓ ప్రక్కన మాత్రం శూలాలు, బరిశెలు, గొడ్డళ్ళు....రకరకాల ఆయుధాలు మాత్రం కట్టగట్టి వో మూలన పడేసి వున్నాయ్.
ఆయుధాల్ని చూడంగానే అరుణవర్ణం దుస్తులు ధరించిన అరుణేందిర ముఖం ట్యూబ్ లైట్ కి ఎర్ర కాగితం చుట్టినట్టు వెలిగిపోయింది.
అందరు కలిసి ఒక్కసారిగా "అమ్మా! నమస్కారం" అంటూ పలకరించారు.
పార్వతీదేవి తలయెత్తి చూసింది. ఎదురుగా బోలెడుమంది ఆడవాళ్ళు రణరంగానికి తరలివచ్చిణ రమణీమణుల్లా ఉన్నారు. వలల చేతుల్లో ఆయుధాలు చూస్తూంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రణచండికలా తోస్తున్నారు.
"ఎక్కడికి మీ పయనం? ఎవరిమీద యుద్దం చేయడానికి వెళుతున్నారు?" పార్వతీదేవి చల్లని చిరునవ్వుతో అడిగింది.
"యుద్ధమా!" అంతా తెల్లబోయారు.
"మీ భూలోకంలో ఆధునికమైన ఆయుధాలు వచ్చిం తర్వాత నా ఆయుధాల్ని మూటగట్టి పడేశాను బాంబులు, తుపాకులు లాంటి మారణాయుధాలకి మీ భూలోకంలో కరువొచ్చిందా! అన్నీ నక్సలైట్లు కొనేసి దాచుకొన్నారా?" అని అడిగింది పార్వతీదేవి.
పార్వతీదేవి అడుగుతున్నదేమిటో వాళ్ళకి కొంచెం అర్ధమయ్యీ కానట్టుగా ఉంది. తమ చేతిలోవున్న అప్పడాల కర్రలు...చీపురు కట్టలు....మొదలగునవి చూసి ఆమె తామంతా యుద్దానికి వెళుతున్నట్టు పార్వతీదేవి పొరబడిందని గ్రహించారు.
"మేము ఎవరిమీదా యుద్ధం చేయడానికి వెళ్ళటంలేదు తల్లీ! మా బాధల్ని మీతో విన్నవించుకొని మాకోర్కెలు నెరవేరేలా వరాలు పొందుదామని వచ్చాం. మొదట శ్రీ మహాలక్ష్మి దగ్గిరకెళ్ళాం. ఆమె డబ్బు లెక్కలతో, బోలెడుమంది అసిస్టెంట్లతో ఊరిరాడనంతగా తలమునకలై ఉంది. మా కోరికలు వినే ఓపికగాని తీర్చే మార్గంగాని ఆమె ఏమీ చెప్పలేదు."