"అదికాదు అలివేలూ! శుచి శుభ్రానికి, డబ్బుకి సంబంధం ఏమిటి? మా చుట్టాలింట్లో ఒకాయన సశ్యం పీలుస్తాడు. రెండువేళ్ళూ ఎప్పుడూ ముక్కులోనే వుంటాయి. బోలెడు డబ్బుంది ఆయనకి. అయినా అగ్లీగా ప్రవర్తిస్తుంటాడు. రిచ్ నెస్ కి నీట్ నెస్ కి సంబంధం లేదు" గంభీరంగ సెలవిచ్చింది పద్మిని ప్రియదర్శిని.
రిచ్ నెస్ అంటే ఏమిటో నీట్ నెస్ అంటే యేమిటో వాళ్ళకి తెలుసు. కాకపోతే పద్మిని ప్రియదర్శిని ఆ మాటలని ఇంగ్లీషులో వాడటంవలన అప్పుడు వాళ్ళకి అర్ధం కాలేదు.
"శుచి శుభ్రానికి, డబ్బుకి సంబంధం లేదు" అన్న ఆ ఒక్కమాట అలివేలుకి అర్ధమయింది. "మీరలా మాట తిరకాసు వెయ్యకండి అమ్మాయిగారూ! నాకే డబ్బులుంటేనా? నా తల్లో పేలని కుక్కించుకోటానికి నా ముక్కులో పొక్కులు తీయటానికి తలోపనికి తలో పనిమనిషిని పెట్టుకునేదానిని. ఆ..." అంటూ యింత పొడుగు దీర్ఘం దీసింది.
"నేను చెప్పేది మీరు అర్ధం చేసుకోవటం లేదు..." అంటూ ఇంకేదో చెప్పబోయింది పద్మిని. వెంటనే అచ్చమ్మ అడ్డు తగిలింది. "మీకెందుకు అమ్మాయిగారూ! మీరు చెప్పేవేవీ మా కర్ధంకావు. ఈ పేటలో పుట్టాను. ఈ పేటలోనే ఇంతదాన్ని అయ్యాను. నాకేం మాయరోగం నిచ్చేపంగ వున్నాను" అంటూ మాట మార్చబోయింది.
అయినా ఊరుకోలేదు పద్మిని వాళ్ళకి అర్ధమయేలా చెప్పాలని నోరు తెరిచింది. సరీగ అప్పుడే కుంటి రాజయ్య అక్కడికి కుంటుకుంటూ వచ్చి అలివేలు దగ్గరగా కూర్చున్నాడు.
ఒక కాలు ఎదగకపోవటంతో కాలు ఈడుస్తూ కుంటుతు నడుస్తాడు. రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర అడుక్కుని కాసిని డబ్బులు సంపాదించుకొని వస్తాడు. తల్లి చెల్లెలు పాచిపని పదిళ్ళలో చేసి సంపాదిస్తున్నారు. తిండికి లోటు లేదు. రాజయ్య సంపాదించుకున్న పైసలు సినిమాలు చూడటానికి సరిపోతాయి. కాలు కుంటి తప్ప మిగతా విషయాలలో వాడికి విచారం లేదు.
"ఏంటిరోయ్ రాజయ్యా! యీపూట ఇంటికాడ వున్నావ్! రైళ్ళు, బస్సులు ఆగిపోయినవా ఏంటి?" వెంకటమ్మ నవ్వుతూ అడిగింది.
"రాత్రి రెండు సినిమాలు చూశానే అప్పా! దాంతో యీపూట ఆలిశ్శంగ లేచాను. బద్ధకంగ వుండి డూటీ కెక్కలేదు" దర్జాగా చెప్పాడు రాజయ్య.
"నీపనే బాగుందిరా రాజిగా!" అంది అలివేలు నవ్వుతూ.
"ఏం చినిమాలు చూశావురా రాజిగా!" అచ్చమ్మ ఆతృతగా అడిగింది.
"నీ కిష్టిగాడి సినిమా ఒకటి నా చిరంజీవోడి సినిమా మరొకటి చూశాను. అదిరిపోయిందనుకో. రెండూ రెండే" అంటూ సినిమా పేర్లు చెప్పాడు రాజయ్య.
"ఆ కతలు రెండూ చెప్పరా రాజిగా! ఏది బాగుంటే దానికి వెళతాం అమ్మాయిగారు చినిమాకి డబ్బెట్టిదిలే" అంది అచ్చమ్మ.
"నాక్కూడానా!" అంది వెంకటమ్మ.
"అమ్మాయిగారు తలుచుకోవాలే గాని ఈ పేటలో ఆళ్ళందరికి వంద చినిమాలు చూపించుతుంది" అమ్మాయిగారు తరపున తానే చెప్పేసింది అచ్చమ్మ.
పద్మిని ప్రియదర్శిని కళ్ళప్పజెప్పటం తప్ప పెదవి కదపలేదు.
రాజయ్య రెండు సినిమా కతలు చెప్పాడు. డైలాగ్స్, పాటలు రెండర్దాల మాటలు అన్నీ పొల్లుపోకుండా చెప్పాడు.
"రాధని చూస్తే ముద్దెట్టుకోవాలనిపించింది. చిరంజీవోడు లటుక్కున ముద్దెట్టుకుంటే ఏంబోయింది? రాధ లడ్డులా వుంది. అదే నేనైతేనా!" అంటూ పద్మిని ప్రియదర్శిని వైపు చూసి అదోలా పళ్ళికిలించాడు రాజయ్య.
అదేదో పెద్ద జోకయినట్లు అందరూ పడిపడి నవ్వారు.
పద్మిని ప్రియదర్శిని కోపంగా చూసిన విషయం ఎవరూ చూడలేదు పట్టించుకోలేదు. వాళ్ళ ఆనందంలో వాళ్ళున్నారు. రాజయ్యకి కాలు అవుడు సంగతి మరిచాడు అక్కడ వున్నది అమ్మాయిగారని మరిచాడు. తనో మగవాడు మగతనం గుర్తుకు వచ్చింది. అమ్మాయిగారి వేపు వికారంగ చూపులు సారిస్తూ సినిమాలో రాధని తలుచుకుంటు రెండర్ధాల మాటలకి మరో రెండర్ధాల మాటలు కలిపి వేడి వేడి అన్నం తిన్నంత తేలికగా బూతులు మాట్లాడేస్తున్నాడు.
వాళ్ళకా మాటలు వికారంగ లేవు. ఉత్సాహంగ ఉడుకుడుకు నీళ్ళు పోసుకున్నంత హాయిగా వున్నాయి. మాటలు వింటు హాయిగ ఎంజాయ్ చేస్తున్నారు.
అలాంటి మాటలు అక్కడ వద్దని చెప్పే అధికారం పద్మినికి లేదు. ఎక్కడికన్నా వెళదామంటే వెళ్ళే చోటులేదు. ఇంట్లోకి వెళదామంటే అదో ఇరుకు గది. మంచం మీద అటు తిరిగి పడుకుంది పద్మిని.
వాళ్ళ సినిమా మాటలు ఇంకా అలా సాగుతూనే వున్నాయి.
8
అర్దరాత్రి.
పన్నెండో ఒంటిగంటో అయింది. హఠాత్తుగా మెలకువ వచ్చింది పద్మినీ ప్రియదర్శినికి. మెలకువ వచ్చింతర్వాత మళ్ళీ నిద్ర పట్టలేదు. ఒళ్ళంతా భారంగ అదో యిదిగ వున్నట్టనిపించింది. కాని అప్పటికప్పుడు శరీరానికేర్పడ్డ ఆ నలత కర్ధం ఏమిటో తెలీలేదు.
ఒక పక్కనించి మురుగు వాసన గాలిపాటు ఇటు వచ్చినప్పుడల్లా ముక్కుకి తాకి వెళుతున్నది. ఒంటికి ఓడో మాస్ రాసుకోవడంవల్ల పాపం దగ్గరికి రావడానికి భయపడుతున్నాయ్ గాని వాటి పాట కచేరి మాత్రం ఆపలేదు దోమలు.
పద్మిని దగ్గరగా తిరుగుతూ జుయ్ అంటున్నాయ్. దోమలు ఒక్కసారిగ అన్ని వాయిద్యాలకి పని కల్పించిన బాండ్ మేళం వాయించేవారిలా.
కాస్త దూరాన పడుకున్న యలమందయ్య పంపు
కొట్టినట్టు గుర్రుపెడుతూ నిద్రపోతున్నాడు.
పద్మిని మంచానికి ఆ పక్కగా వున్న అరుగుమీద అచ్చమ్మ పడుకొని వుంది. కాళ్ళూ చేతులూ గాలికి ఒదిలేసినట్టు బారజాపి ఫ్రీగా హాయిగా నిద్రపోతున్నది అచ్చమ్మ.
అర్ధరాత్రప్పుడు ఏ ఇంట్లోవాడు చుట్ట కాలుస్తున్నాడో గాని గాలిలో తెలుస్తూ ఆ చుట్టవాసన కూడా వస్తున్నది. నాలుగు గుడిసెల అవతల వున్న ఇంటిలోని పాపయ్య బాగా తాగొచ్చినట్టున్నాడు. గార్ధభ స్వరం వేసుకొని పాట పాడుతున్నాడు. అక్కడ ఎవరికీ నిద్రాభంగం కలిగినట్టు లేదు. పాపయ్య పాట పచ్చిబూతులతో సాగుతోంది.