11
చి|| ల|| సౌ|| శకుంతలకు,
మీ అమ్మ దీవించి వ్రాయునది .కార్డుతప్ప వ్రాయని నేను కవరు దానిలో వ్రాసిన అరడజను కాగితాలు చూచి, ఇది వ్రాసింది అమ్మేనా! అని ఆశ్చర్యపోతున్నావా? మరి__ఇక్కడ జరిగిన సంఘటనలు చూచినట్లయితే నీకూ ఆశ్చర్యం కలగక తప్పదు.
ఈ వూళ్ళోనే పాండురంగంగారని హెడ్ మాష్టరు వున్నారు. బహు కుటుంబీకుడు. వారి పెద్ద అమ్మాయి సుధారాణి వీణ డిప్లమో పాస్ అయింది. చక్కని కంఠము. యీ వూళ్లోనే అక్కడక్కడ పాటకచ్చేరీలు చేసిందట. కృష్ణ చాలాసార్లు సుధాగానం విన్నాడట. అప్పుడు వారిరువురికీ పరిచయం అయింది. సుధ వాళ్ళ వాళ్ళతో చెప్పి వివాహం చేసుకుందామనుకున్నారట. ఓ రోజు కృష్ణ సుధ మాట్లాడుకోవటం సుధ నాన్నగారి దృష్టిలో పడింది. చివాట్టుపెట్టి సుధను యింటికి తీసుకెళ్ళారట.
వాళ్ళ వాళ్ళు పెళ్ళికి అభ్యంతరం చెప్పాల్సిందేకాని అమ్మ దేనికీ అడ్డుచెప్పదు, నీతిమాలిన పనిచేస్తే తప్ప తెలిసిన అమ్మాయిని పెద్దల అనుమతితో పెళ్ళిచేసుకోటం నేరంకాదని తెలిసి సరాసరి కృష్ణ వాళ్ళింటికి వెళ్ళాడుట. వెళ్ళి......"మా అన్న కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకున్నాడు. నేనూ కట్నం తీసుకోను. నమ్మించి మోసగించే రకాన్ని కాదు. వొండొరులం యిష్టపడ్డాము. మీరు ఊ అంటే మా అమ్మగారిని తీసుకువస్తాను." అని చెప్పాడుట.
అప్పుడు వాళ్ళేమన్నారో తెలుసా శకూ! బహుశా నీ వూహకు అందదేమో? నేను వాళ్ళకు తెలుసట. వాళ్ళేమన్నదీ వివరం రాసేబదులు రెండు ముక్కల్లో రాస్తాను. "ఓహో! ఆతల్లి కన్నబిడ్డవా? అలా చెప్పు. పోలికలెక్కడికి పోతాయి. మా యింటావంటా లేదు. ప్రేమలు పెళ్ళిళ్ళు" అంటూ నాలుగు దులిపారట. కృష్ణది వూరుకొనే తత్వంకాదు తననవలసింది అని వచ్చేశాడట. నాలుగురోజుల తరువాత ఎలా పోష్టు చేయగలిగిందోగాని సుధ వద్ద నుంచి కృష్ణకు లెటర్ వచ్చింది.....తనని మేనమామకిచ్చి పెళ్లి చేయటానికి ముహూర్తాలు పెట్టబోతున్నారట. నా పెళ్లి చేసుకోటానికి నాకు హక్కు వుంది. మైనరు తీరింది. ఫలానారోజు నీకోసం ఎదురుచూస్తుంటాను నన్ను తీసుకెళ్ళు. లేకపోతే యీ లోకం నుంచే శలవుతీసుకుంటాను" అని.
మధ్యాహ్నం షాపుకి లెటర్ వచ్చిందిట. రెండు రోజులక్రితం అందవలసింది, ఆరోజు అందింది. షాపునుంచి అటే వెళ్ళి సుధను వెంటబెట్టుకొచ్చాడు కృష్ణ.
కృష్ణ చెప్పింది విన్నతరువాత మందలించలేకపోయాను. అలా అని వూరుకోలేదు. "ప్రేమ గుడ్డిది. మగవాడిని నమ్మి ఆడది వంటరిగా బైటకు రాకూడదు." అని సుధతో అంటే ఏమందో తెలుసా? "ఆయన వ్యక్తిత్వం అవగాహన చేసుకునే బైట కాలుపెట్టాను" అంది.
"రుక్మిణి రాయబారం పంపితేనే కదమ్మా శ్రీకృష్ణుడు కదిలి వెళ్ళింది." అన్నాడు కృష్ణ.
కృష్ణ, సుధలలాంటి ప్రేమికులు ఎందరోవుండవచ్చు. కాని......కార్యాచరణకు వస్తే అందరూ వెనకడుగు వేసేవారే, యిరువురిలో ఒకరు మోసకారులయితే రెండోవారి భవిష్యత్తు అంధకారమేకదా?
సుధ నాన్నగారు మరికొందరువచ్చి పోట్లాడారు. రిజిష్టర్ మేరేజీ చేసుకున్నామని కృష్ణ దభాయించాడు. అక్కడితో కాస్త తగ్గారు. యీమధ్య ఆడవాళ్ళుమాత్రం చాటుగావచ్చి చూచివెళ్ళారు.
ఎవరెట్లాంటివారయినా సుధ చాలా మంచిపిల్ల. కృష్ణ ఎన్నిక సరి అయినది. పరిస్థితులు చక్కబడింతరువాత నలుగురి ఎదుట కృష్ణ, సుధల వివాహం జరుగుతుంది. ఆరోజు వరకు ఆగుతామన్నారు. సుధ మనింట్లోనే వుంది. రఘు, రాధ కూడ సుధంటే యిష్టం చూపుతున్నారు. "మామగారిచేత కాళ్ళు తరువాత కడిగించుకోవచ్చు. రిజిష్టర్ మేరేజి ముందు చేసుకోటం మంచిది" అని రఘు అన్నాడు. ఇదే విషయం కృష్ణ ఆలోచిస్తున్నాడు.
పరిస్థితులు చక్కబడుతున్నాయి, అనుకుంటూవుండగా కనీ వినీ ఎరుగని సంఘటన జరిగింది. అది మీ నాన్నగారి రాక__
ఆశ్చర్యపోతున్నావా శకూ? ఏది మంచిది జరుగుతున్నదో! ఏది చెడుకి జరగనున్నదో! ముందు యింకేం జరగనున్నదో! విధికి తలవంచాల్సిందేతప్ప కాలానికి ఎదురీది నిలిచే శక్తి నాలో నశించింది.
ఇంతకాలమూ యీ సంసారం నడిపింది నేనా? అనుకుంటే, నిజమా అనిపిస్తున్నది.
"పార్వతికి నోట్లో నాలుకలేదు. పార్వతి చాలా మంచిపిల్ల. ఓమాట అన్నా తనను కాదన్నట్టు పోతుంది. పార్వతి యీ కాలం పిల్లకాదు భయస్తురాలు. తెలిసిన వారందరూ నాగురించి ఓనాడు యివేమాటలన్నారు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నా కాళ్ళమీద నేనిలబడితే, లోకందృష్టిలో గడుసుదాన్ని, అన్నింటికీ తెగించిన మొగరాయుణ్ని అయ్యాను.
మగవాడి అండలేని ఆడది సచ్చరితురాలయినా అపవాదులకులోటువుండదు. అంతేకాదు, అణగతొక్కటానికి చూస్తారు. లొంగనప్పుడే ఎన్నిపేర్లయినా వచ్చేది. అనుభవంలో గ్రహించిన సత్యం యిది.
జీవిత పోరాటంలో గెలుపు నాదే అయినా అలసిపోయాను శకూ! దేహమూ, మనసు విశ్రాంతి కోరుతున్నాయి. ఇదే సమయంలో నాన్నగారు వచ్చారు. పిన్ని వద్దకు వెళ్ళి ఎడ్రస్ కనుక్కొని వెతుక్కుంటూ నాకోసం వచ్చారు.
"పార్వతీ! నీకు తీరని అన్యాయం చేశాను, పిల్లల పట్ల తండ్రిగా నాధర్మం నిర్వర్తించకుండా ముఖం తప్పించాను. గాలికి తిరగటం అలవాటు అయి నాటక సమాజమే నా ఊపిరి, ప్రాణం, అందుకే జన్మ ఎత్తానని మురిసిపోయాను. సంసారము, బరువు బాధ్యతలు కొద్దిగానన్నా గుర్తెరిగినవాడినయితే నా జీవితం మరోవిధంగా వుండేది.
నాటకాల్లో నాయకుడిగా వేషంవేస్తున్న రోజుల్లో నిజజీవితంలో కూడా రాజకుమారుడిలా బ్రతికాను. అఖండ కీర్తిగౌరవాలు, వాటితో అంధుడిని అయ్యాను.
క్రొత్తనాటక సమాజాలు వెలిశాయి. క్రొత్త పద్ధతులు ప్రవేశించాయి. సరిక్రొత్త నటులు పెరిగిపోయారు. మేమేస్తున్న ప్రతినాటకం ఘోరంగా దెబ్బతిన్నాయి. మాలో మాకు చీలికలు ఏర్పడ్డాయి. ఎవరిదోవవారు చూచుకున్నారు. ఒంటరిగా మిగిలిపోయాను. ఇంటికి రావటానికి ముఖం చెల్లలేదు. దేశంమీద పడ్డాను. నాటకసమాజంలో తప్ప నిజ సమాజంలో జీవించటమే చేతకాని నేను పిడికెడు మెతుకుల కోసం నరకం చవిచూచాను. ఏమీచేయలేక నీవున్నావనుకుంటూ వచ్చాను పార్వతీ! దేహీ అంటూ నీపంచ చేరాను. నీ నిర్ణయం ఏదయినా సంతోషంగా స్వీకరిస్తాను." అంటూ మీ నాన్నగారు అతిదీనంగా అంటుంటే ఆ సమయంలో ఏం చేయాలి? నీవే చెప్పు శకూ!