Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 13

    "నీకా?"
    "అవును నాకే...చెప్పానుగా నా స్టాండర్డ్. రేపు ఎగ్జామ్స్ లో ఖాళీ పేపర్ పెట్టేయకుండా కొంచమైనా రాయందే డాడీ ఎలా పాసు చేయిస్తారు? ఎంత సిండికేట్ మెంబరయినా అది సాధ్యం అవుతుందా?"
    నవ్వేడు శ్రీకర్.
    "నవ్వకు శ్రీ...రజూ గంట చెప్పు నెలకి రెండొందలు యిస్తారు డాడీ! ఆయనకదో లెక్క కాదు. అసలు నేచెబితే స్కాలర్ షిప్ కూడా ఏర్పాటు చేస్తారనుకో...కానీ నీకు ముక్కుమీదే ఉంటుందిగా కోపం...వినవుగా..."
    "శ్రీకర్ సమాధానం యివ్వలేదు.
    "అదిగో! అప్పుడే నీకు కోపం వచ్చేస్తోంది. ప్లీజ్! నా మాట వినవూ - కనీసం ఓ గంట అయినా నిన్ను చూస్తూ గడిపే అవకాశం యివ్వు."
    "జ్యోతీ!"
    "ఏం-"
    "ఓ పనిచెయ్!"
    "ఏమిటో అది -" ఆందోళనగా అడిగింది.
    "నన్ను నీ సెక్రట్రీగా వేసుకో ... నెలనెలా మీ డాడీ ఇచ్చే అయిదొందలూ యిచ్చెయ్_" యే భావం బయటపడకుండా అన్నాడు.
    ఆ మాటలకే ఆమె ముఖం వికసించింది. "రియల్లీ! అలాగయితే యిప్పుడే ఎపాయింట్ మెంట్ యిచ్చేస్తా. ఒక మంత్ శాలరీ ఎడ్వాన్స్ తీసుకో" బ్యాగ్ తెరవబోయింది.
    "డోంట్! డోంట్ బీ హర్రీ! మైడియర్ జ్యోతీ! నీవెంత అమాయకురాలివి? నేకాక మరెవరయినా అయితే?"
    అతని మాట పూర్తి కాకుండానే "ఇంకొకరా? వాడ్డూయూ మీన్ - మరో మగాడు నా ఎదురుగా యిలా కూచుని కబుర్లు చెప్పగలడా? జ్యోతి అంటే ఏంటనుకున్నావ్? ఫైర్ బ్రాండ్ తెలుసా?" అంది రోషంగా.
    "థాంక్యూ! థాంక్యూ మై లేడీ. థాంక్యూ ఫర్ ది ఫాస్ట్ స్టాప్ కార్నర్ ...కానీ ఓ విషయం విను" అన్నాడు లేస్తూ.
    "టైమయిందా?"
    "ఆఁ తప్పదు వెళ్ళాలి. చూడు జ్యోతీ! మేం మధ్య తరగతి మనుషులం. మా ధనం అభిమానధనం అంతే! మేం అభిమానిస్తాం. అంతేకానీ అభిమానాన్ని అమ్ముకోలేం. నీ ఆరాటం అర్ధమైంది. ఎడారిలో ఒంటరిగా మిగిలిన వ్యక్తికి తోడు దొరికినట్లుగా ఉంది. ఈ జనారణ్యంలో నీకు నచ్చిన దోస్తీ కావాలి అంతేకదా - దానికోసం నా ట్యూషన్ వద్దు, నీ సెక్రటరీ పనీ వద్దు.
    కేవలం ఫ్రెండ్ షిప్ చాలు.
    ఏది ఏమయినా రోజూ నీకోసం ఒక గంటయినా వ్యయిస్తాను. దట్సాల్! కానీ జ్యోతీ! దైవ సాన్నిధ్యంలో గడపాలనీ భక్తుడికీ ఉంటుందని తెలుసు. కేవలం దేవత కరుణిస్తే ఇంకేం చెప్పాలి?"
    వేసవి కాలంలో తొలకరి చినుకుల్లాంటి అతని మాటలకి ఆమె పులకరించిపోయింది. ఉద్వేగంతో అతని చేయి అందుకుని "హౌ లక్కీ అయాం! థాంక్యూ శ్రీ...థాంక్యూ" అని తర్వాత చప్పున అతని చేతిని పెదాలకి ఆనించుకుని మృదువుగా చప్పుడు చేసింది.
    చిలిపిగా నవ్వాడు శ్రీకర్.
    సిగ్గుపడిపోయింది జ్యోతి. జీవితంలో తొలిసారిగా
    "జీ బేగం సాహెబ్ సెలవు."
    హుందాగా సెలవు తీసుకుని వెళ్ళాడు శ్రీకర్.
    'హాయ్' గిర్రున తిరిగింది జ్యోతి. ఆమెకి యెంతో ఆనందంగా ఉంది. వెంటనే యింటికి వెళ్ళి రికార్డు పెట్టుకుని డాన్స్ చేయాలనిపించింది. పార్క్ నుంచి యిల్లు వేలమైళ్ళ దూరం వున్నట్టనిపించిందామెకి.
                                                        12
    "శ్రీమద్రమారరణ గోవిందో హరి!"
    ముఖంనిండా పెల్లుబుకుతున్న ఆనందంతో అంది జ్యోతి. అల్మారాకి తాళం పెట్టేస్తూ...నవ్వొచ్చింది శ్రీకర్ కి జ్యోతిని ఆ భంగిమలో చూసేసరికి...
    "ఎందుకూ?"
    "నవ్వడమా? పరీక్షలయిపోయాయని యెంత సంబరపడిపోతున్నావా" అని నవ్వొచ్చింది. సారీ జ్యోతీ! ఈ మూడు నెలలూ నిన్ను చాలా బాధపెట్టాను. అయాం రియల్లీ సారీ! ఏమిటో నా పిచ్చిగానీ నువ్వు ఎలాగూ పాసయ్యేదానివి. అలాంటి నిన్ను అనవసరంగా బాధపెట్టాను.
    "నథింగ్ శ్రీకర్...ఇందులో యింత ఆనందం వుందంటే నేను మొదటినుంచీ శ్రద్ధగానే చదివేదాన్ని. మా నాన్న చెడగొట్టాడు. మొదటినుంచీ ఫస్టుక్లాసులో కాన్వెంట్ స్కూల్లో చేరింది మొదలు ఇంటర్ పూర్తయ్యేదాకా నాపాలిట శనిలాగా ట్యూషన్ కి తయారయింది ప్రిన్సిపాల్ మేరీ బ్లెస్సీనా...ట్యూషన్ యిస్తూంది. కాబట్టి నే బాగా చదివినా, చదవకపోయినా ఎప్పుడు ఫిఫ్త్ రాంక్ కి తగ్గించేదికాదు. ఇక డిగ్రీలో చేరాక నేను ట్యూషన్ కి గుడ్ బై కొట్టింది."
    శ్రీకర్ కి జాలేసింది ఆమెను చూస్తే. "చాలామంది అంతే జ్యోతీ! ఎదిగీ యెదగని వయస్సులో వున్న వ్యక్తుల్ని తమ ప్రిన్సిపల్స్ కి, తమ ఆదర్శాలకు యిన్ స్ట్రుమెంట్స్ లాగా వాడుకుంటాడు. అది చాలా తప్పు. ఎవరంతకివాళ్ళని వదిలెయ్యాలి. ఆఖరికి పిచ్చి మొక్కయినా అలాగే వదిలేస్తే చక్కగా ఎదుగుతుంది. కానీ అల వదిలెయ్యం. మన బౌండరీస్ లో, మనకంటికి రూల్సులా పెంచుతాం. అది ఒక్కసారి అవతల వ్యక్తిత్వాన్ని ఎదగనీక నాశనం చేస్తూంది. ఇంత తెలిసీ నేనూ అదే తప్పు చేశాను అన్నాడు సానుభూతిగా.
    "శ్రీమద్ జ్యోతీరమణ శ్రీకరో శ్రీకరం !" తమాషాగా అతనిచుట్టూ తిరిగింది. దండం పెట్టింది. ఆమె చిలిపితనం అతనిలో ఆనందాన్ని సృష్టించింది.
    "అర్ధం తెలుసా?" అన్నాడు కొంటెగా చూస్తూ.
    చప్పున భావం అర్ధమై సిగ్గుపడిపోయింది జ్యోతి.
    "వండర్ ఫుల్ జ్యోతీ!" అతనికి మాటలు పెగలలేదు. నిండుపున్నమి జాబిలిని చూసి సంపూర్ణంగా విచ్చుకున్న కలువలా ఉన్న జ్యోతి ముఖం చూసి అన్నాడా మాటలు.
    కొన్ని క్షణాలు గడిచాయి.
    టప్ లో పాప్ మ్యూజిక్ వినిపిస్తోంది. జ్యోతి మనస్సు తృప్తితో, ఆనందంతో గంతులేస్తోంది...అంతలో టేప్ అయిపోయింది. మార్చాడు శ్రీకర్...యం.ఎస్ పాడిన విష్ణు సహస్రనామం రాసాగింది. ఠక్కున ఆపేశాడు శ్రీకర్.
    "ఏం ఆపేశావ్?" అర్ధంకాక అడిగింది.
    "బోర్! ఎలా వింటాం...ఇది మీ నాయనమ్మ కోసం రికార్డు చేశావా?" అడిగాడు.
    "నో! నాకోసమే! ఉదయం నిద్రలేవగానే అది వింటూవుంటే ఎంతో ఆనందంగా వుంటుందని! అదో అలౌకమైన ప్రపంచంలో కెళ్ళిపోయినట్లుగా ఉంటుంది!" అరమోడ్పు కన్నులతో అంది ఆమె.
    జ్యోతీ! నీలో ద్వంద్వ వ్యక్తిత్వం వుందే?"
    "అంటే?"
    "నీ కత్తికి రెండు వైపులా పదునుందే?"
    "ఊహు ప్లీస్ బిక్లియర్ ..."
    "పోనీలే దాని గొడవెందుకుగానీ...ఇక నేను మా వూరు వెళ్ళిపోతాను."

 Previous Page Next Page