Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 12

    మాయాదేవి అలా అతనికేసి చూస్తుండిపోయింది. మోటార్ సైకిల్ ఎంతకీ స్టార్ట్ కాలేదు.

   
    "నీ జీవితం స్టార్ట్ కానీ మోటార్ సైకిల్లా అయిపోకూడదు. నా మాట విను....భగవంతుడు జీవితాన్నిచ్చింది ఆనందించడానికి, అనుభవించడానికి. వివాదాలతో, వేదనలతో శాంతిని, ప్రశాంతతని కోల్పోటానికికాదు. సెక్షన్ 375లో పురుషుడు స్త్రీని రేప్ చేస్తే అందుకు ఏ శిక్ష విధించాలో ఉందితప్ప, స్త్రీ పురుషున్ని రేప్ చేస్తే ఏ శిక్ష విధించాలన్నది అందులోలేదు. కావాలంటే ఇండియన్ పీనల్ కోడ్ బుక్కుతెచ్చి క్షుణ్ణంగా చదువుకో. నీ మంచికే చెబుతున్నాను. నువ్వు నామీద గెలవలేవు. నువ్వేకాదు మరెవ్వరూ గెలవలేరు. నా తెలివితేతలమీద, నాకున్న సమయస్పూర్తి మీద, నా వ్యక్తిత్వం మీద నాకంత నమ్మకం వుంది" అని తన కారుకేసి వెళ్ళిపోయింది మాయాదేవి.
   
    వెళుతున్న ఆమెకేసి చూస్తూ మోటార్ సైకిల్ స్టార్ట్ చేయడం కూడా మరచిపోయాడు మనోహర్.
   
    తనని రెచ్చగొట్టినందుకు ఆమెమీద కోపం రాకపోగా హఠాత్తుగా ఆలోచనల్లో పడిపోయాడు మనోహర్.
   
    ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్- 375లో స్త్రీని, పురుషుడు రేప్ చేస్తే శిక్ష వుంది కాని-పురుషుడ్ని స్త్రీ రేప్ చేస్తే శిక్ష లేకపోవడం ఏంటీ....? మాయాదేవి చెప్పిన ఆ మాటల దగ్గరే అతని ఆలోచనలు ఆగిపోయాయి.
   
    మరికొద్ది క్షణాలకు తేరుకున్న మనోహర్ పరిసరాలను గమనించాడు తను నియమించుకున్న లాయర్ మాలవ్య కనిపిస్తుందేమోనని, కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు.
   
                                            *    *    *    *
   
    కోర్టు దగ్గర బయలుదేరిన మనోహర్ డైరెక్ట్ గా లాయర్ మాలవ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె స్నానం చేసేందుకు లోపలికి వెళ్ళిందని తెలుసుకున్న మనోహర్ ఆమె ఆఫీస్ రూంలో ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు.
   
    ఓ పావుగంట తరువాత మాలవ్య తన ఆఫీస్ రూంలోకి వచ్చింది.
   
    మనోహర్ చెప్పిందంతా విన్న ఆమె కొన్ని క్షణాలు నిశ్శబ్దంలో కూరుకుపోయింది.
   
    "చెప్పండి-మాయాదేవి చెప్పింది నిజమేనా?"
   
    "నిజమే...అందుకనే నాకు కొద్దిగా టెన్షన్ గా వుంది. కేసు ఏ మలుపు తిరుగుతుందో నా వూహకు అందటంలేదు. సెక్షన్-375లో స్త్రీకి శిక్ష విధించడం అనే ప్రస్థావనే లేదు."
   
    "మరిప్పుడెలా......?" ఆందోళనగా ప్రశ్నించాడు మనోహర్.
   
    "ఒక రకంగా చెప్పాలంటే మీకు తొందర ఎక్కువ. కేసు ఫైల్ చేయండి..కేసు ఫైల్ చేయండంటూ, నామీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ తొందరలో ఏమాత్రం ఆలోచించకుండా నేను కేసు ఫైల్ చేశాను. దానిలో నా క్లయింటు మనోహర్ ని, మిస్ మాయాదేవి రేప్ చేసిందంటూ అభోయోగం మోపాను. తీరా చూస్తే సెక్షన్ 375లో ఆ విషయం ప్రస్తావనే లేదు. మిస్ మాయాదేవి అసాధారణమైన తెలివితేటలు కల యువతి. ఏ మాత్రం భయం లేకుండా గౌరవనీయులైన న్యాయమూర్తుల తోటి వాదనలకు దిగింది. మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అభియోగా స్వరూపాన్ని మార్చి వుంటే బాగుండేది" సాలోచనగా అంది లాయర్ మాలవ్య.
   
    ఒక్కసారి షాక్ తిన్నట్లయిపోయాడు మనోహర్. ప్రపంచంలోని కసి, కోపం, ఉక్రోషం, ఆ క్షణాన తన కళ్ళలో కనిపించింది.
   
    "మిమ్మల్ని మిస్ మాయాదేవి సెడ్యూల్ చేసినట్లు కేసు ఫైల్ చేసుకుంటే బాగుండేది."
   
    "సెడ్యూస్ చేయడమంటే?"
   
    "ముని వ్రతాన్ని చెడగొట్టడానికి ఇంద్రుడు - రంభ, ఊర్వశి మేనకల్ని పంపినట్లు...."

    బిత్తరపోయి చూశాడు మనోహర్.

    "అక్కడ కూడా రంభ, ఊర్వశి, మేనకలకు శిక్ష పడుతుందా....? లేక వాళ్ళను పంపిన ఇంద్రునికి పడుతుందా?" అయోమయంగా అడిగాడు మనోహర్.
   
    మాలవ్య మాట్లాడకుండా, ఏదో ఆలోచిస్తుండిపోయింది.
   
    The Enticement of a Female who Unlawful sexual intercourse without use of force:
   
    By persuasion or False Promises, Temptation: Something that attracts or charms :
   
    ఆ వాక్యాలకేసి చూస్తూ చాలాపొద్దుపోయేవరకూ నెక్లెస్ రోడ్డు గార్డెన్ లో కూర్చున్న మనోహర్ అటుగా వచ్చిన గార్డు మందలించడంతో ఇంటిదారి పట్టాడు.
   
           
                                           *    *    *    *
   
    ఇంటికొచ్చిన మాయాదేవి బాత్రూంలోకెళ్ళి షవర్ కింద తలారా స్నానం చేసి, నైటీ వేసుకుని బాల్కనీలోకొచ్చి వెన్నెల్లో వింతగా కనిపిస్తున్న చిరాన్ ప్యాలెస్ చెట్లని, పొదలనీ చూస్తూ ఆనందంలో మునిగి పోయింది.
   
    మాయాదేవికి స్వభావరీత్యా చిరుచినుకుల వర్షమన్నా, వెండి వెన్నెలన్నా, పచ్చటి అడవులన్నా, అల వెనుక అలను విసిరే సముద్రమన్నా చాలా ఇష్టం.
   
    అంతలో ఏదో అడుగుల శబ్దం వినిపించింది. చటుక్కున తలతిప్పి చూసింది మాయాదేవి. ఎదురుగా తన బాల్య స్నేహితురాలు ప్రియ నుంచుని నాటకీయంగా కనుబొమ్మలు కదిలిస్తూ మాయాదేవికేసే చూస్తోంది.
   
    "నీక్కూడా నేను వింతగా కనిపిస్తున్నానా?" నవ్వుతూ అడిగింది మాయాదేవి.
   
    "నాక్కూడానా? నాకేమిటే బాబూ....నీ కేసు విషయం బైటికివస్తే, భారతదేశంలో నున్న తొంభై కోట్లమంది ప్రజలు కూడా పిచ్చెక్కిపోవడం ఖాయం. అయినా ఇదెక్కడి గొడవే? నువ్వేమో సూపర్ ఫాస్ట్...అతనేమో గూడ్స్. ప్రాణంలేని సరుకులను మోసే గూడ్సుకీ, ప్రాణం వున్న మనుషులను మోసే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కీ లంకె ఎలా కుదురుతుందే? నన్ను అర్ధం చేసుకోవే బాబూ...." బుగ్గన చూపుడువేలు పెట్టుకుని బాల్కనీ గోడకు చేరబడి, పల్లెటూరి అమాయకపు గృహిణిలా ప్రియ ప్రశ్నిస్తుంటే ఫక్కున నవ్వేసింది మాయాదేవి.

 Previous Page Next Page