"దొరా! ప్రొఫెసర్ కృష్ణస్వామి నీకు తెలుసు. మోడి ఆట అనంతరం శ్వేతనాగు నామీదకు రావాలని ప్రయత్నిస్తే వారు అడ్డుకున్నారు. వారిమీద అది కక్ష తీర్చుకుంది. ఇప్పుడు ప్రొఫెసర్ కృష్ణస్వామి అచేతనంగా పడి ఉన్నారు. వారిని నీవు ఎప్పటిలా చైతన్యమూర్తిలా చేయగలవనుకుంటున్నాను. అంతటి శక్తి సంపన్నత కలిగినవాడవు నీవు ఒక్కడివే. ఎలాగయినా వారిని మామూలు మనిషిని చెయ్యి. అందుకు ప్రతిఫలంగా మరొకమారు మృత్యువుకు మారుపేరులాంటి ఈ గుహలోకి వెళ్లి నీకు మూలికలు తెచ్చి ఇస్తాను" అన్నది వాణి.
షైజా కన్నీటి పర్యంతమయినాడు. కృతజ్ఞతాభారముతో అతని శరీరం కుంగిపోయింది.
"పట్నవాసం దొరసానీ! నేను చేయగలిగిన సాయమేదయినా ఉంటే అది నా కర్తవ్యంగానే భావిస్తాను. నేను యాచించే ప్రతిఫలం ఏమిలేదు. కానివారు తిరిగి మామూలు మనిషి కావాలంటే తృణ జ్యోతిని సాధించి తీరాలి." అన్నాడతడు మరింత పట్టుదలగా! ఆ మాట వింటూనే వాణి కృత నిశ్చయురాలు అయింది.
"నేను తృణజ్యోతిని సాధించి తీరుతాను." అని ప్రతిజ్ఞ చేసిందామె. అప్పటికి రవంత పొద్దు పైకి వచ్చింది.
షైజా, రేనో వెంటరాగా తిరుగు ప్రయానమయింది వాణి. ఇప్పుడామె ఆంతర్యంలో చెలరేగుతున్న సంఘర్షణ శ్వేతనాగు పగకు తాను బలి అవుతానన్నది కానే కాదు. ప్రొఫెసర్ క్రిష్ణస్వమిని మామూలు మనిషిగా, ఆరోగ్యశాలిగా తీర్చిదిద్దాలన్నదే! ఆయన మృతప్రాయంగా ఉంటే విద్యార్ది లోకానికి ఎంతో నష్టం వాటిల్లుతోంది. అంతకన్నా తన స్వీయ సమస్యలు మరింత జటిలమవుతున్నాయి.
అందునించి వారిక్షేమం కోసం షైజా దగ్గర తన ప్రాణాలను పణంగా ఒడ్డింది వాణి.
O O O
వాణి తిరిగి రావటంతో అదొక సంచలనాత్మకమైన వార్త అయింది. కేశవరావుగారి హై బి. పి. ఎంచక్కా ఎగిరిపోయింది. వారి శరీరంలోకి జవసత్వాలు వచ్చినాయి.
అల్లరి కృష్ణుడు అందరూ హడలిపోయేలా ఎడ్చేయటం మానుకున్నాడు. ప్రేగుత్రెంచుకొని పుట్టిన బిడ్డను తిరిగి గుండెకు హత్తుకున్నప్పుడు వాణి నేత్రాలు సజలమైనాయి.
"వాణీ డియర్! నీవు తిరిగి వచ్చావు. మామగారికి ఓ బహుమతి ఇచ్చావు. ఇప్పుడు వారి ఆరోగ్యం కుదుటపడింది. చిన్నారి కృష్ణుడికి చిరుముద్దు కానుకగా ఇచ్చేశావు. మరి నా సంగతి ఏమిటి?" అని అడిగాడు ఆకలిగా చూస్తూ.
"ఏమిటా చూపులు!" అన్నది వాణీ చిరుకోపంగా.
"అవును. నిజమేనోయ్! ఒక్కసారి హడలగోట్టేసి మళ్ళి క్షేమంగా తిరిగి వచ్చావు. కేవలం చూపులతోనే ఈ శుభముహుర్తాన్ని వృధా చేస్తున్నాను" అంటూ తన బాహు వల్లరిలో వాణిని బంధించాలని ప్రయత్నించాడు స్వప్నకుమార్.
అల్లరి కృష్ణుడు కిలకిలా నవ్వాడు.
"నువ్వోకడివి కళ్ళముందు చేయి అడ్డుంచాడు స్వప్న.
"థాంక్యు బాబూ!" అంటూ పట్టుసడలించాగానే తుర్రున పారిపోయింది వాణీ.
"మీ అమ్మని నానుంచి కాపాడేందుకు కంకణం కట్టుకున్నావన్నమాట. గుద్దానంటే చూడు" అంటూ తమాషాగా పిడికిలి బిగించి చేయి ఎత్తాడు స్వప్న.
దాంతో చిన్నికృష్ణుడు బావురుమని ఏడుపు లంకించుకున్నాడు. అతడ్ని సముదాయించేందుకు విశ్వప్రయత్నం ప్రారంభించాడు స్వప్నకుమార్.
ఈ తమాషా అంతా తలుపుచాటు నించి గమనించిన వాణీ అక్కడనించి వెళ్ళిపోయింది. ఇంక శ్రీవారికి చేతినిండా చాలినంతపని, చిన్నిక్రిష్ణుడ్ని సముదాయించటమంటే మాటలు కాదు. అది కనీసం అరగంటయినా తీరికలేని కార్యక్రమం! ఆ పనిలో పడిపోయాక తన గురించి మరచిపోతాడు స్వప్న. సరిఅయిన సమయానికి గాత్రం విప్పి తనకు విముక్తి కలిగించిన చిలిపికృష్ణుడికి మనసులోనే ఆశీస్సులు అందిస్తూ ఏకాంతానికి వెళ్ళిపోయిందామె. తిరిగి మనసులోని బుసలుపైకి లేచినాయి.
యోగి మరణించాక శ్వేతనాగు పగనించి తనను కాపాడగలిగిన శక్తి గురించి ఆలోచిస్తోందామె. మనసు వ్యధాకులితమయింది.
ఈ సృష్టిలోని ఏ శక్తులూ తనను కాపాడలేవన్న వాస్తవము అంతర్యపు పొరల్ని తెంచుతోంది ఒకప్పుడయితే విజ్ఞాన ప్రపంచంలో వెలుగుదారులు నిర్మించేందుకు ఏ క్షణములో ప్రాణత్యాగం చేయటానికయినా సంసిద్దురాలయిందామె.
కానీ ఇప్పటి స్థితి వేరు. చిన్నారి కృష్ణుడితో పెంచుకున్న అనుబంధం మనసు పొరల్ని తెంచుతోంది. అనాలోచితంగా తాను తాళపత్రాలను రెండింటిని భద్రపరచిన రీడింగ్ రూమ్ లోకి వెళ్లిందామె తనకు పి, హెచ్. డి సంపాదించి ఇచ్చిన ఆ రెండు తాటి ఆకుల్ని ఒక అందమయిన వెండి పేటికలో దాచింది.
జ్ఞాపకాల పొరల మధ్య తేలియాడుతూ ఆ రజిత పేటికను తెరిచింది వాణి. దానిలో తాళపత్రాలకు చుట్టుకొని ఉన్న ఆకృతి ఉఫ్..... ఫ్ మంటూ పడగ విప్పసాగింది. దానినేత్రాలు పద్మరాగవర్ణంలా విప్పుకుంది. మృత్యువు అందించే ఆహ్వానంలా విప్పార్చిన పడగను ఊపుతూ భయంకరంగా పూత్కారం చేస్తోంది శ్వేతనాగు.
కెవ్వున అరచి విరుచుకు పడిపోయింది వాణి.
వెండి పేటిక దాని పరవళ్ళకు జారి కిందపడిపోయింది. తాళపత్రాలు మాత్రం శ్వేతనాగు శరీరాన్ని చుట్టుకున్న చుట్టలో మిగిలిపోయాయి. దాని శరీరం మీద పొలుసులు అమిత వేగంతో కదలాడుతున్నాయి.
సువిశాలంగా విప్పార్చిన పద్మదళంలా ఉన్న పడగ మీది శ్రీకృష్ణ పాదాలే పవిత్ర చిహ్నంకితాలు. దాని శరీరంలోంచి వెలువడుతున్న పూత్కారం ఆ గదిలో గాలిని మండిస్తోంది. క్రమంగా చుట్టవిప్పుతోంది శ్వేతనాగు.
ఎక్కడో అడవిదారుల వెంట స్వేచ్చగా బ్రతుకును కొనసాగించే తమ జీవితాలలో అపశ్రుతికి కారకురాలయిన ముద్దాయి నేలమీద స్మృతివిహీనంగా పడివుంది.