Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 12


                                            ఎవరికి ఎవరు

    నీకేమిటోయి ఆరుగురు కొడుకులున్నారు. తలో కొడుకు దగ్గిర తలో రెండు నెలలున్నా నీ రోజులు దివ్యంగా వెళ్లిపోతాయి అనేవాడు ఆరుగురు ఆడపిల్లల తండ్రి రామ్మూర్తి మేష్టరు విశ్వనాధంతో ఎప్పుడూ.
    "ఆ.... యీనాటి కొడుకులు తల్లిదండ్రులని చూస్తారటోయి.... మనకి పెట్టవద్దూ పాడువద్దూ, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతికితే చాలులే" అనేవాడు విశ్వనాథం మాష్టారు.
    పైకి అన్నా లోలోపల "ఆరుగురు కొడుకులున్నారు" ఆరుగురిలో ఏ ఒక్కడన్నా ఆదుకోకపోతాడా అన్న నిబ్బారం ఆయనకీ వుండేది.
    అందుకే ఈ రోజు నాలుగో కొడుకు ఇంటినుంచి వెడుతూ 'ఇంకా ఇద్దరున్నారు ఫరవాలేదు' అన్న ఆశతో ఐదో కొడుకింటికి ప్రయాణం అయ్యాడు ఆయన.
    నలుగురు కొడుకుల ఇళ్ళల్లో మర్యాదలు ముట్టాయి. యింక ఐదో కొడుకేదో తవ్వి తలకెత్తుతాడని ఆయన ఊహ!
    తవ్వి తలకెత్తాలని, మర్యాదలు సత్కారాలు చేయాలని ఆయనెన్నడూ కోరలేదు! ఆశించలేదు! ఆయన ఆశించింది రెండుపూటలా పట్టెడన్నం. పంచభక్ష్య పరమాన్నాలు కావాలని ఆయనమాత్రం ఎలా కోరతాడు! తను వాళ్ళకి చెప్పించిన చదువులతో వాళ్ళ తాహతులెరిగిన ఆయన మాత్రం అలాంటి కోరికలు ఎలా కోరతాడు! తండ్రి కాబట్టి వార్ధక్యంలో ఆదుకోడం తమ కర్తవ్యం అని గుర్తించి ఇంత పచ్చడివేసయినా అభిమానంగా పెట్టాలని ఆయన కోరుకున్నాడు. తిట్టుకుంటూ, విసుక్కుంటూ సణుక్కుంటూ, ముష్టివెధవకి పడేసినట్లు కాకుండా కాస్త ఆప్యాయంగా అభిమానంగా కనిపెట్టాలని కోరుకున్నాడు.
    అదే, చిన్నకోరిక కూడా అసంగతమై పోయింది ఆయన విషయంలో.
    మొదట్లో ఒక పది రోజులు కాస్త తండ్రి అన్న అభిమానంతో చూసేవారు.... తరువాత తరువాత ముందు గొణగడం; పిల్లిమీద ఎలక మీదపెట్టి విసుక్కోడం, ఆ తర్వాత ఎదురుగానే సాధింపులు.... కసురుకోడాలు ఆరంభమయ్యాయి.... ఒక్కొక్కళ్ళ యింట్లో ఆరు నెలలు వుండేసరికి గగనం అయింది. అదయినా అభిమానం చంపుకుంటే.... హు అభిమానం ఒకటేడిసిందా నాకు అనుకునేవాడు విశ్వనాథం.
    నలుగురు కొడుకులయ్యారు. యింక మిగిలిన యిద్దరూ మాత్రం యింతకంటే ఏం తీసిపోతారు అనిపించినా తప్పేదేముంది? కానీ చూద్దాం. ఆ మర్యాదలు కూడా రుచిచూద్దాం.... అనుకున్నాడు విశ్వనాథం.
    ఏమాటకామాటే చెప్పుకోవాలి.... పాపం పెద్దకోడలు ఓ రెండు నెలలు అభిమానంగానే చూసింది. మామగారన్న మర్యాద చూపెట్టింది. తర్వాత మరి ఏమయిందో సణుక్కోవడం విసుక్కోవడం ఆరంభించింది. "అబ్బబ్బ వెధవగోల వచ్చిపడింది, మనిషికోరకంగా వండి వార్చలేక చస్తున్నాను. అసలే యీ చాకిరీకితోడు యీ చప్పిడి వంటలు, ఈ రొట్టెలు నా నెత్తిన వచ్చిపడ్డాయి పీడ! విసుక్కుంటూంటే, పాపం పిల్లలతో చేసుకోలేక విసుక్కుంటుంది అని సర్డుకునేవాడు విశ్వనాథం.  సర్దుకోక ఏంచేస్తాడు కనక.... ఎవరిమీద కోపగిస్తాడు? కోపగిస్తే వూరుకునేది ఎవరు! వాళ్ళన్నారనికాదు తన రోగమూ అలాంటిదే. ఏంచేస్తాడు? బ్లడ్ ప్రషర్ ట.... షుగర్.... కడుపునొప్పి _ ఇంకా ఏవేవో ధనవంతుల రోగాలన్నీ తనకెందుకు పెట్టాలి ఆ భగవంతుడు? డబ్బున్న వాళ్ళకి జరిగినట్లు తనకెలా జరుగుతుంది?
    కోడలు.... పోనీ పరాయి యింటిపిల్ల తనమీద అభిమానం ఎందుకుంటుంది! కొడుకు.... కన్నకొడుక్కికూడా తనెంత శత్రువయ్యారు? తనేదో మూటలు దాచుకుని తనకి ఇవ్వడంలేదని కొడుక్కి కోపం.
    "నాన్నా, ఈ నెలన్నా మీ పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి వీలుంటుందా? అహ, వీలుంటేనే, ఆ బట్టలకొట్టువాడు ప్రాణాలు కొరుకుతున్నాడు" అంటూ నిష్టూరంగా అడిగాడు....
    డబ్బుంటే ఈయకుండా మూటకట్టుకుపోతాడా తను! ఆ మాత్రం ఎందుకు ఆలోచించరో! కోడలు వెనకనించి సన్నాయి నొప్పులు నొక్కుతుంది.
    "ఆ.... మనమెంతకని అడుగుతామండీ, ఆయనకుండాలి ఆ యింగితం. అయ్యో కరువుకాలం పిల్లలు వాడు అవస్థ పడుతున్నారని పదో పరకో చేతిలో పెట్టాలిగాని, మీరెన్నిసార్లు అడుగుతారు? తినేది యిక్కడ, దోచిపెట్టేది ఇంకోరికి" అంది.
    ఎవరికి దోచిపెడ్తున్నాడు తను! వాళ్ళే పిల్లలా.... ఈ కొడుకు కొడుకుకాదా! తనకొచ్చే ముష్టి నలభైఐదు రూపాయల పెన్షన్ దాచేసుకుని మూటలు కడ్తున్నాడని వాళ్ళ అపోహ! డబ్బుంటే కొడుకు ఇబ్బందులుచూస్తూ తనుమాత్రం వూరుకుంటాడా? ఆ ముష్టి నలభై రూపాయలకి ఎన్ని ఖర్చులు! ఒకనెల బొత్తిగా పంచెలు చినిగిపోతే నాలుగు కొనుక్కున్నాడు. మరి ఆ ఖర్చుకూడా కొడుకునెత్తిన రుద్దలేడుగదా! సరే ఇంకా ముక్కుపొడుం అనో, మందులనో తన ఖర్చులుండనే వున్నాయి. ప్రతి దమ్మిడీ కొడుకుని ఎక్కడ అడుగుతాడు! ఇంకో నెల నాలుగో కొడుక్కి కూతురు పుడితే మరి ఆ చంటిదానికి ఓ చిన్నమెత్తు బంగారమన్నా పెట్టి ఏదో చేయించాలిగదా, బారసాలకి దానికి వెళ్ళిరావడానికి రైలు ఖర్చు అది అలా అయిపోయింది. ఇంకోనెల పెళ్ళాం మాసికలు వేసిన గుడ్డలు కట్టుకుంటూంటే రెండు చీరలు, జాకట్టులు, చలికి ముడుచుకు పడుకుందని ఓ రెండు దుప్పట్లు కొన్నాడు. ఆ నెల మూడో కూతురు వచ్చింది. ఆడపిల్ల పుట్టింటికొచ్చిన ఆడపిల్లకి తాము వుండగానే గదా ఏదో యింత పసుపు కుంకం పెట్టడం! తర్వాత అన్నలు పెట్టబోయారా వాళ్ళు పుచ్చుకోబోయారా.... దానికి చీర రవిక, పిల్లల చేతుల్లో పది రూపాయలు పెట్టేసరికి ఆ నెల పెన్షన్ డబ్బుకాస్తా హరించింది. ఇంకో నెల ఏమయినాసరే కొడుక్కి ఇవ్వాలనే అనుకున్నాడుగాని.... అనుకోని ఖర్చు నెత్తినపడితే తనేం చేస్తాడు? కళ్ళజోడు గూట్లో పెట్టింది కాస్తా నాలుగేళ్ళ మనవరాలు లాగిపడేసింది. గుంటముండ! ఏం చేస్తాడు. జోడు లేకపోతే కళ్ళు కనపడిచావకాయ.... క్రొత్తది కొనుక్కున్నాడు. ఇలాగే ఆరునెలలనుంచి అయిపోయింది. నిజమే ఇంట్లో వున్నాడు. డబ్బు చాలక యిబ్బంది పడ్తున్నారు. ఓ పదో పదిహేనో చేతిలో పెడదామని తనకుమాత్రం లేదూ! ఏం చేస్తాడు! ఖర్చులు అలా వచ్చాయి. ఏ వేళకి వాళ్ళకి అన్నీ జరిపించాలిగదా! యీ మాత్రం అర్థంచేసుకోకుండా కొడుకు కూడా అలా మాట్లాడడం కష్టం కలిగించింది.
    ఓ ఆర్నెల్లుండి రెండో కొడుకింటికి ప్రయాణం అయ్యాడు. అక్కడేదో ఇంతకంటే పరిస్థితి బాగా వుంటుందన్నట్టు!
    తీరా అక్కడికి వెళ్ళగానే పెద్దకోడలే ఎంత నయమో తెలియవచ్చింది. పెద్దకోడలు ఓ రెండు నెలలయినా గౌరవంగా చూసింది. ఈవిడ వెళ్ళినవారం పదిరోజులకే యీ రొట్టెలు చేయడం వేరే చప్పిడివంటలు అవి వండడం తనవల్లకాదని ఖచ్చితంగా చెప్పేసింది. వుంటే వుండమన్నట్లు మాట్లాడింది ఎదురుగానే, మామగారన్న గౌరవం అయినా లేకుండా ఏంచేస్తాడు! చచ్చినట్టు అవే తిన్నాడు. అన్నం తింటే షుగర్ ఎక్కువయింది. డాక్టరు వద్దంటాడు. ఇంట్లో కోడలు చేయదు. కారాలు పడక కడుపు నొప్పి ఎక్కువయింది.

 Previous Page Next Page