"ఊరుకోరా అప్రాచ్యపు మాటలూ నువ్వూనూ! వద్దురా అంటే యీ పాడు ఉద్యోగానికి వెళ్ళావు. అస్తమానం చావు అదిగో పొంచివుందని నన్ను భయపెడతావు. నీకు డెబ్బయియేళ్ళ ఆయుస్సు ఉంది. నాకు తెలుసు. నా పిల్ల లెవ్వరూ అల్పాయుష్మంతులు లేరు." కడుపుతీపితో శంకర్ ని మనసులోనే ఆశీర్వదించుకుంటుంది.
విజయ యింక స్వదేశం తిరిగివస్తుందన్న ఆశ వదిలేసుకున్నారు ఆ దంపతులిద్దరు. కూతుర్ని చూడా లనిపించినప్పుడల్లా విజయ పంపిన ఫోటోలు తీసి చూసుకుని సంతృప్తి పడుతూంటారు.
డెబ్బయో పడిలో పడిన జగన్నాథంగారికి అన్ని అనుభవాలు పూర్తి అయాయి. దైవచింతనలోనే ఎక్కువకాలం గడపసాగారు. ఉదయం లేచి స్నానం, జపం, తపం వగైరాలు పూర్తి చేసుకుని, తన చేతుల్తో నాటిన పూలమొక్కల యోగక్షేమాలు విచారించి, పార్వతమ్మ భోజనానికి పిలిచేవరకు పేపరు పట్టుకు కూర్చుంటారు. భోజనం అయాక కాసేపు నడుంవాల్చి, లేచి కాఫీ తాగి, ఎదురింటి ఇంజనీరు తండ్రితో వీధి వరండాలో చదరంగం పేరుస్తారు. సాయంత్రం ఐదుగంటలయాక అలా వాహ్యాళికి వెళ్ళి ఓ గంట కాలక్షేపం చేస్తారు. రాత్రి భోజనం అయాక తొమ్మిది వరకు పార్వతమ్మను కూర్చోపెట్టుకుని ఏ భాగవతమో, భగవద్గీతో చదివి వినిపిస్తాడు.
పార్వతమ్మకి, వంటకి మనిషి ఉన్న, భర్తకు కావలసినవి, యింటికి కావలసినవి చూసుకోడం, వంటమనిషికి పనులు చెప్పి సామానులు యీయడం, ఇంట్లో పాడి చూసుకోవడం, రోజుకి నాలుగు గంటలు దైవపూజలో నిమగ్నమవడంతో రోజు గడిచిపోతుంది.
ఆ యిద్దరి దినచర్యలో మార్పు ఏమన్నావుంటే యింటికి పిల్లలు వచ్చినప్పుడే, పిల్లలు నలుగురూ ఎప్పుడు వస్తారా, ఎప్పుడు యిల్లు సందడిగా కలకలలాడుతుందా అని సెలవలకోసం ఎదురుచూస్తుంటారు ఆ సెలవలకైనా నలుగురూ ఒకసారి రారు. 'వీలులే' దని ఒకరు, 'సమ్మర్ కి ఊటీ వెడుతున్నా'మని ఒకరు, 'సెలవ దొరకలే'దని ఒకరు రాస్తే ఆ యిద్దరి ఉత్సాహం నీళ్ళుకారిపోతుంది.
వాళ్ళు పెద్దవాళ్ళయారు. వాళ్ళ సంసారాలు, వాళ్ళ తాపత్రయాలు వాళ్ళకి వుంటాయి. రాలేదని బాధపడితే ఎలా అని నచ్చ చెప్పుకుంటారు. నలుగురూ ఎప్పుడు వస్తే అప్పుడే పండగ అని సరిపుచ్చుకుంటారు. అక్కడికీ సెలవలకి మనవలు ఎవరో ఒకరు వస్తూంటారు. అయినా ఆ వృద్ధప్రాణాలకి సంతృప్తి అనిపించదు. ఈ వృద్ధాప్యంలో అందరూ తమని ఒంటరిగా వదిలి మరచిపోయి నట్లు బాధపాడుతారు. కాని.....రెక్కలు వచ్చిన పక్షులు గూటి నంటి పెట్టుకుని ఉండవన్న నిజం గుర్తించలేక పోవడం మానవనైజమేమో!
3
"ఏమండీ, ఉష రైలు వచ్చే టైమయినట్లుంది. స్టేషనుకి వెడతారా ఏమిటి?"
"నే నెందుకే పడుతూ లేస్తూ స్టేషనికి వెళ్ళడం? నీ మనవరాలు అంత ముద్దరాలా! టాక్సీ ఎక్కి యింటికి రాలేదా ఏమిటి?" పేపరు మడుస్తూ అన్నారు జగన్నాథంగారు.
"బాగుందండీ, ఆడపిల్లకాదా!"
"మద్రాసునుంచి ఒంటరిగా రాగలిగిన ఆడపిల్ల-యిల్లు తెలిసిన నీ మనవరాలు టాక్సీ కుదుర్చుకు వస్తుందిలే! అయినా యీనాటి ఆడపిల్లలు నీలాంటి ఆడవాళ్ళేమిటి! ఒంటరిగా విదేశాలే తిరిగి వస్తున్నారు!"
"స్టేషనుకి వెళ్ళమంటే ఏమిటో పురాణం చెపుతారు" విసుక్కుంది పార్వతమ్మ.
"ఇదివరకు ఎన్నిసార్లు రాలేదు అది! అదే వస్తుంది. దానికి యీవూరు కొత్తా ఏమిటి? ఈ ఎండలో నేను వెళ్ళలేను సుమా!"
"బాగుంది. వాడు ఆడపిల్లను ఒక్కర్తినీ పంపడమూ అలాగే ఉంది!...." సణుగుకుంటూ వెళ్ళిపోయింది పార్వతమ్మ.
పడకకుర్చీలో పడుకుని కునికిపాట్లుపడుతున్న జగన్నాథం గారు టాక్సీ గుమ్మందగ్గర ఆగడం, ఉష లోపలికి రావడం గమనించనేలేదు.
"తాతగారూ!" ఉష పిలుస్తూంటే ఉలిక్కిపడి లేచాడాయన. మనవరాలిని చూస్తూనే ఆయన ముఖం విప్పారింది. "వచ్చావా అమ్మా. రైలు ఆలస్యం అయినట్లుందే!" అని కుశల ప్రశ్నలు వేస్తూ లోపలికి దారితీశాడు.
"అయితే మీ ఒంట్లో ఎలావుంది యిప్పుడు? జ్వరం తగ్గిపోయినట్టేనా?" ఉష కాస్త అనుమానిస్తూ అడిగింది.
"జ్వరమా!.....నాకా!" అని తెల్లబోయి, అంతలోనే కొడుకు రాసిన ఉత్తరం జ్ఞాపకం వచ్చి......సర్దుకుంటూ "తగ్గిందిలే అమ్మా! .....ఆమధ్య నాలుగురోజులు ఒంట్లో బాగాలేదు! ఇప్పుడు బాగానే వుంది" అన్నారు. ఉషకి అసలు సంగతి తెలియదు అని గ్రహించి.
"మరి......నాన్న ఎందుకు అంత గాభరాగా నన్ను ప్రయాణం చేయించారు? తాతగారికి ఒంట్లో బాగులేదుట. నేను వెడదామంటే సెలవులేదు. అమ్మని పంపితే నాకు యిబ్బంది. నువ్వు వెళ్ళి కాస్త చూసిరా. ఇద్దరూ పెద్దవాళ్ళు, ఒంటరిగా వున్నారు. బామ్మకి ఏం తెలియదు. అంటూ నన్ను హడావుడిగా పంపారు. యీమాత్రం దానికేనా?" ఆశ్చర్యం వెలిబుచ్చుతూ అంది ఉష.
"వచ్చావా, తల్లీ.....ముఖం అంతా వాడిపోయింది ప్రయాణంతో. పదమ్మా, కాస్త కాఫీ తాగి, స్నానం అదీ చేద్దువుగాని!" మనవరాలి తల ఆప్యాయంగా నిమిరి, లోపలికి తీసుకెళ్ళింది పార్వతమ్మ.
ఉష అచ్చు తల్లి పోలికే! మీనాక్షి కంటే యింకొంచెం పొడుగు. పచ్చని రంగు, పెద్ద వాలుజడ, నాజూగ్గా అందంగా వుంటుంది. రూపంలో తల్లి పోలిక అయినా, బుద్దులలో అంతా తండ్రిపోలిక. తెలివైంది. మనస్థయిర్యం, పట్టుదల ఉన్నాయి. నెమ్మది స్వభావం. పెద్దలఎడ గౌరవం, నమ్రత, మాట మన్నన అన్నీ వున్నాయి ఉషకి. తల్లి దగ్గిరకంటే తండ్రిదగ్గిర చేరికెక్కువ. రామానికి కొడుకు శ్రీనివాస్ మీదకంటే ఉషమీద ప్రేమానురాగాలు ఎక్కువ. తండ్రీ కూతురు స్నేహితుల్లా ఉంటారు యింట్లో. అనేక విషయాలు గురించి మాట్లాడుకుని చర్చిస్తారు. తల్లిమాట కంటే తండ్రిమాటమీద ఎక్కువ గురి ఉషకి.