Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 12


    ఆ తరువాత ఆయన చిరాకు, కోపం, అసహనం అన్నీ మామూలే!
    "ఆ... ఏదో చెపుతూ దేన్లోకో వెళ్ళిపోయాను. డాక్టర్! ఎంతవరకు చెప్పాను?"
    శారద ఆయాసంగా ఆగింది. విజయ వాచి చూసుకుంది.
    "టూకీగా చెప్తాను డాక్టర్! ఎంతో చెప్పచ్చు. మహాభారతం అవుతుంది అన్ని గొడవలూ చెపితే-ఆఁ... మా కాపురం మొదటిరోజు గురించి చెప్పాను కదూ! ఆయన స్వభావం కొంత అర్ధం అయింది. ఇంక ఆయనతో వాదించి గెలవలేను. ఆయ నన్నదానికి తలవూపడం తప్ప గత్యంతరం లేదని అర్ధం అయి, దానికి అనుగుణంగానే నడవసాగాను.
    సామాను కొందాం రమ్మంటే నాకు ఆఫీసుంది నీవు వెళ్ళి కొనుక్కో. నీ కట్నం డబ్బు ఇచ్చారుగా మీ వాళ్ళు అన్నారు. కొత్త ఊరు. కొత్తచోటు వక్కర్తినీ ఎలా వెళ్ళను. అయినా మా ఇంటికి కావల్సినవి కొత్త సంసారానికి ఇద్దరం వెళ్ళి ముచ్చటగా ఏరి తెచ్చుకోవాలనిపించినా ఆయనకి నచ్చచెప్పలేననిపించి తలాడించాను-
    ఇంటికి కావల్సిన ముఖ్యమైనవి చవకరకంలో తేలిపోయె ఇండాలియమ్ గిన్నెలు, స్టీలు కంచాలు రెండు, వంటపాత్రలు నాలుగు ముఖ్యావసరానికి కొనేసరికి ఆరువంధాలు అయింది. కొద్దిగా బియ్యం, దినుసులు, ఓ జనతా స్టవ్, మరో బాల్చీ వగైరాలన్నీ కొన్నాను. మరో రెండు వందలు అయింది.
    బొత్తిగా మడత మంచం ఎలాగని ఓ నవారు మంచానికి ఆర్డరిచ్చాను. నవారుతో కలిసి నూటపాతిక అయింది. మిగిలిన డెబ్బై ఐదుతో ఓ చవక రకం బట్టలస్టాండు, రెండుపీటలు చవకరకం టేబిల్ కి ఆర్డరిచ్చి వచ్చాను. అన్నీ కొంటూంటే తల్లిదండ్రులు ఆడపిల్లలకి వేలకి వేలు కట్నాలు పోసే బదులు, కాపురానికి కావల్సిన వస్తువులు నాలుగు కొని ఇస్తే ఎంత బావుంటుంది అన్పించింది.
    ఇంట్లో వస్తువులు నీట్ గా సర్ది సాయంత్రం ఆయన వచ్చేసరికి వేడిగా ఉప్మాచేసి, కాఫీ చేసి, వంట కూడా పూర్తిచేసి ముస్తాబయి వున్నాను. ఏర్పాటులు చూసి ఆయన ప్రసన్నులైనట్టు కనిపించింది.
    కాని మెచ్చుకోవడం పరువు తక్కువన్నట్టు ఉప్మాతింటూ, "ఎంత ఖర్చయింది? ఏం కొన్నావు?" అన్నారు.
    ఆమాత్రం అడిగినందుకే సంతోషంగా నేను చేసినదంతా ఏకరువు పెట్టాను.
    "ఊఁ -అంతా ఖర్చయిందన్నమాట. ఇదంతా మీ వాళ్ళ ఖర్చు. అనవసరంగా నా నెత్తిన రుద్దావు."
    ఆమాటతో మళ్ళీ ఆ ప్రసక్తి తేగానే నా ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్లయింది. అయినా ఏం అంటే తప్పోనని వూరుకున్నాను.
    ఆయనకి ఎనిమిది వందల జీతం. ఇంటద్దె రెండువందలు పోను భార్యా భర్తలం ఇద్దరం ఆరొందలతో హాయిగా స్వేచ్చగా బతకొచ్చు. వందోరెండొందలో పొదుపుగా వాడుకుంటే మిగుల్చుకుని ఇంటికి కావల్సినవి ఒక్కొక్కటి చేర్చుకోవచ్చును. ఆమాత్రం సంపాదన వుండి ప్రతిదానికి అత్తవారు ఇదివ్వలేదు, అందివ్వలేదని సాధించే ఆయన మనస్తత్వం నాకు ఎంతో అసహ్యం అనిపించేది. స్వశక్తితో తన డబ్బుతో తను సంసారానికి నాలుగూ అమర్చుకోడంలో ఎంత తృప్తి వుంటుంది! మరొకరు యిచ్చినదానితో పబ్బంగడుపుకోవాలనే ఆయన ఉద్దేశాలని చూస్తే వళ్ళు మండేది. చదువుండి, సంస్కారంలేని ఆయన ప్రవర్తనని క్షమించలేకపోయేదాన్ని.
    ఆయన మనస్త్తత్వమే అసలు చిత్రంగా ఉండేది. ఎప్పుడూ సీరియస్ గా ఏదో ఆలోచిస్తున్నట్లుంటారు. మొహాన నవ్వే వుండదు. మనసారా నవ్వుతూ మాట్లాడడం తప్పన్నట్టు నలుగురిలో నవ్వినా బలవంతంగా నవ్వినట్టే వుండేది. షార్టు టెంపర్ సరేసరి. ఏ చిన్న మాటన్నా ముక్కు మీద వుంటుంది కోపం. తన మాటతప్ప మరొకరిమాట వినడం అన్నది చిన్నతనం అనుకునే స్వభావం.
    ఇవన్నీ అలావుంచి ఓ సరదాలేదు. సినిమాలు చెత్తఅంటారు. పుస్తకాలన్నా చదవరు. ఉదయం లేవడం, ఏడుగంటలకి తయారై ఫాక్టరీకి వెళ్ళడం, ఏ సాయంత్రం ఆరు గంటలకో రావడం, అలిసిపోయి పడుకొని లేచి ఎనిమిది గంటలకి భోంచేసి కాసేపు పేపరు తిరగేసి, న్యూస్ విని పడుకోడం -ఇదీ దినచర్య. మిగతా రోజుల్లో ఎలావున్నా ఏ సెలవు రోజన్నా ఎటన్నా వెళ్లాలనిపించదు ఆయనకి. ఆయనకీ స్నేహితులనేవారే లేరు. రోజంతా ఒక్కర్తినీ వుంటాను. కనీసం ఆయన వచ్చేకన్నా సరదాగా మాటాడుకుంటూ, ఏ వారానికో ఒకసారి సినిమాకో, షికారుకో తిరిగి రావాలనుకోడం యే భార్యన్నా కోరుకునే అతి చిన్న కోరికలు! ఆయనకి సినిమాలు ఇష్టం లేకపోయినా భార్యకోసం ఆమాత్రం వెళ్ళచ్చు. ఉహుఁ-యింకొకరికోసం సర్దుకోవడం ఆయనస్వభావానికే విరుద్ధం. యితరులు ఆయనకోసం సర్దుకోవాలి గాని ఆయన ఏ చిన్న విషయంలోనూ తన పద్దతి మార్చుకోలేరు. హాస్యానికన్నా స్పోర్టివ్ గా తీసుకోలేరు.

 Previous Page Next Page