Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 12


    "డోంట్ లాఫ్... రెస్పెక్టెడ్ లాయర్... ఇట్స్ ట్రూ" ఆదిత్య గొంతు నరాలు బిగుసుకున్నాయి.

 

    "నో... మిస్టర్ ఇట్స్ ఏ లై" లాయర్ అన్నాడు.

 

    "డాక్టర్! ఇతని మెంటల్ కండిషన్ ఎలా వుంది?" జడ్జి అడిగారు.

 

    "ఇట్స్ ఆల్ రైట్ సర్!"

 

    "నో... ఐ డోంట్ బిలీవ్ ఇట్... డూ నేససరీ టెస్ట్స్" జడ్జీ లేస్తూ అన్నారు.

 

    అందరూ ఒకేసారి తమ సీట్లలోంచి లేచారు.

 

    అప్పుడు ఆదిత్య-

 

    "మిస్టర్ జడ్జ్! నేను చెప్పిందంతా నిజం.నౌ అయామ్ మెంటల్లీ ఆల్ రైట్ సర్! ఎమ్మెల్యే అహోబలపతి తనని చంపమని నాకు అయిదు లక్షలిచ్చాడు. పిస్టల్ కూడా యిచ్చాడు" అరుస్తున్నట్టుగా చెప్పాడు ఆదిత్య.

 

    అందరూ నవ్వుకొంటూ వెళ్ళిపోతున్న దశలో-

 

    లాయర్ గబగబా ఆదిత్య బెడ్ పక్కకొచ్చి-

 

    "చూడు మిస్టర్! నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో... తెలీకుండా మాట్లాడుతున్నావో నాకయితే తెలీదుగానీ, నువ్విప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెల్సా? కొత్త చీఫ్ మినిస్టర్ గారి గురించి వాగుతున్నావ్ గుర్తుంచుకో" చెవిలో గుసగుసలాడి వడివడిగా వెళ్ళిపోయాడు ఆ లాయర్.

 

    ముందు తను విన్నదేంటో అర్ధంకాలేదు ఆదిత్యకు.

 

    అర్ధంకాగానే డీప్ షాక్ కి లోనయ్యాడు.

 

    ఇదెలా సంభవం? ఒక మాజీ ఎమ్.ఎల్.ఏ, పార్టీ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టరయిపోయాడా?

 

    న్యూ చీఫ్ మినిస్టర్ అహోబలపతి!

 

    న్యూ చీఫ్ మినిస్టర్ అహోబలపతి!!

 

    జరిగిన సంఘటనలన్నీ అతని క్రిమినల్ బ్రెయిన్ ఎనలైజ్ చేస్తోంది.

 

    చీఫ్ మినిస్టరయి కూడా తనని రక్షించే ప్రయత్నం చేయలేదు. కనుక తనీ ట్రాప్ లోంచి ఇప్పట్లో బయటపడటం కష్టం. ఒక మాజీ ఎమ్.ఎల్.ఏ. చీప్ మినిస్టర్ ఎలా అయిపోయాడు? అది యాదృచ్చికంగా జరిగిందా? లేక ఒక స్ట్రాటజీ ప్రకారం జరిగిందా? తనను చంపనందుకు అహోబలపతి ఐదు లక్షలు తిరిగి ఇచ్చేయమంటాడా? తనకు తెలీకుండానే తనేదయినా ట్రాప్ లో ఇరుక్కున్నాడా?

 

    తప్పించుకుంటే తప్ప యివన్నీ తెలియవు.

 

    ఆదిత్య మనసులో రకరకాల ఆలోచనలు. ముందు యిక్కడ నుంచి తప్పించుకోవాలి ఎలా?

 

    హిస్టరీలో యిలాంటి సన్నీ వేశాల్లో ఎస్కేప్ అయిన కిల్లర్స్ లిస్ట్ ను గుర్తుకు తెచ్చుకుంటున్నాడు ఆదిత్య.


                                               *    *    *    *    *


    ఆరు గంటలు గడిచాయి.

 

    కళ్ళు మూతలుపడినా మనసు మూతపడడంలేదు. గుండెలనిండా వేదన. అటూ ఇటూ కదులుతున్నాడు ఆదిత్య.

 

    "ఇంత అమాయకంగా కన్పిస్తున్నారే... చీఫ్ మినిస్టర్ని ఎలా మర్డర్ చేశారబ్బా?"

 

    ఆ మాటలకు కళ్ళిప్పాడు ఆదిత్య.

 

    పక్కనే కుర్చీలో కూర్చుని అతని వేపే తదేకంగా చూస్తోంది నర్స్ ట్రెస్సా.

 

    గదిలో ప్రశాంతంగా వెలుగుతున్న ట్యూబ్ లైటు.

 

    "మీకు క్రైమ్ స్టోరీస్ పిచ్చట గదా! ఆ అబ్సెసన్ తోనే ఈ మర్డర్ చేశారట గదా?" తిరిగి అంది ట్రెస్సా.

 

    ఆమె మాటలకు ఉలిక్కిపడ్డాడు ఆదిత్య. అది అహోబలపతి వర్షన్.

 

    "ఎవరు చెప్పారు నీకిది?"

 

    నవ్వింది ట్రెస్సా.

 

    "ఎవరు చెప్పడం ఏంటి... ఇవాళ అన్ని తెలుగు, ఇంగ్లీష్ పేపర్ల నిండా మీ గురించి స్టోరీసే. హాస్టల్లో మీ ఫ్రెండ్స్ తో మీరు తీసుకున్న ఫోటోలు కూడా వేశారు..." చెప్పింది ట్రెస్సా.

 

    హాస్టల్లో ఫ్రెండ్స్ తో తీయించుకున్న ఫోటోలు... అంటే... ఆ ఫోటోలు పోలీసులకెలా వచ్చాయి?

 

    ఆదిత్యకు చప్పున ఫోటోగ్రాఫర్ రమేష్ చంద్ర గుర్తుకొచ్చాడు.

 

    అతని ఐడెంటిటీ కార్డ్, కెమెరా గుర్తుకొచ్చింది.

 

    "ఎవరో ఫోటోగ్రాఫర్ ఐడెంటిటీ కార్డుతో నిజాం కాలేజీలోకి వెళ్ళారట గదా... అది కూడా వేశారు."

 

    ఆ ఐడెంటిటీ కార్డ్ ని హుసేన్ సాగర్లోకి విసిరేశాడతను. అంటే... గాలికి వెనక్కి వచ్చేసిందా?

 

    రమేష్ చంద్రను కూడా పోలీసులు అరెస్ట్ చేశారా?

 

    క్రైమ్ స్టోరీస్ అబ్బెషన్ తో, మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి... చీఫ్ మినిస్టర్ ని మర్డర్ చేశానని నిర్ధారించారన్నమాట.

 

    "ఇంకేం రాశారు నా గురించి..." అడిగాడు ఆదిత్య ఆతృతగా.

 

    "చాలా రాశారు. కానీ మీ స్టూడెంట్స్ మాత్రం వాటిని నమ్మడం లేదు. మిమ్మల్ని రోజూ చూస్తున్నాను గదా... మీ మొహం... మర్డర్ మొహంలా లేదు. ఎక్కడో పొరపాటు జరిగిందనిపిస్తోంది... పాపం..." అంది జాలిగా.

 

    "నేను నిజంగా మర్డరర్ ని, కిల్లర్ ని కాను. ఒక భయంకరమైన ట్రాప్ లో యిరుకున్నానేమోననిపిస్తోంది. నాకో హెల్ప్ చేసి పెడతావా..."

 

    "ఏంటి... మీరు మర్డర్ కారా...? మరి?!" ఆశ్చర్యపోయింది ట్రెస్సా.

 

    "ఇక్కడనుంచి తప్పించుకోవాలి... నువ్వు హెల్ప్ చేస్తావా..."

 

    ఆ మాటకు కెవ్వుమని భయంగా అరిచింది ట్రెస్సా.

 

    "అయ్యబాబోయ్. గదిలో మీరూ, నేను వున్నామనుకుని తప్పించుకుందామనుకుంటున్నారా... బయట ఈ గది చుట్టూ స్పెషల్ పోలీస్ ఫోర్స్ వరండాలో... మెట్లదగ్గర... హాల్లో... ఆస్పత్రి ముందు, వెనక గేటు దగ్గర ట్వంటీఫోర్ అవర్స్ కాపలా వుంది. ఆ విషయం తెలుసా మీకు."

 

    అంత పోలీస్ ఫోర్స్ కాపలాగా వుందని తెలీదు ఆదిత్యకు. అంటే తను కావాలనే ప్రీప్లాన్డ్ గా వచ్చి చీఫ్ మినిష్టర్ ని హత్య చేశానని నిర్ధారణ చేసుంటారు. ఇక యీ దశలో అహోబలపతి కూడా తనకు హెల్ప్ చేయకపోవచ్చు. చేస్తే తన పదవికి ముప్పు రావచ్చని భావించవచ్చు.

 

    "మంచిపని చేశారు. ఇప్పటికే మాజీ చీఫ్ మినిస్టర్ మూడొందల కోట్లు తిన్నాడని ఒక అంచనా అట. రాష్ట్రానికి పీడా వదిలింది..." అంది ట్రెస్సా కసిగా.

 

    "నేను తప్పించుకోవటం సంగతి..." తిరిగి అడిగాడు ఆదిత్య.

 

    "అలాంటి ప్రయత్నమేం చెయ్యకండి. కాల్చి చంపేస్తారు... బైదిబై మీకో విషయం తెల్సా..."

 

    "ఏంటది..." అసహనంగా అడిగాడు ఆదిత్య.

 Previous Page Next Page