అద్దం
నిలువుటద్దం అమ్మేసి "పప్పు"కు బత్తాయిలు తినిపించాలనుకుంది ఫాతిమా. కాని అద్దం అమ్మే విషయం అత్తగారితో చెప్పలేకపోయింది. ఆ మాట చెపితే అత్తగారు ముందు అరవడం ప్రారంభిస్తారు. తరవాత భోజనం మానేస్తారు. గుండె దడ పుట్టుకొస్తుంది. ఏడుపు లంకించుకుంటారు. అద్దం అమ్మడానికి అప్పగిస్తే ఇంట్లోంచి పీనుగ వెళ్ళినట్లు ఏడుపులు, మొత్తుకోళ్లు సాగుతాయి. అది ఫాతిమాకు అనుభవమే. ఇదివరకు ఇంట్లోంచి కదిలిన ప్రతి వస్తువుకూ పీనుగు కదిలినంత అట్టహాసం జరిగింది. అయినా "పప్పూ"కు బత్తాయిలు లభించనేలేదు. 'పప్పూ'కు బత్తాయిలు పెట్టాలంటే వేరే గత్యంతరం లేదు. అద్దం అమ్మాల్సిందే.
పప్పూకు మందుతోపాటు బత్తాయిలు కూడా ఇవ్వాలని డాక్టర్ సంవత్సరంగా చెబుతున్నాడు. బత్తాయిలు ఇవ్వందే పప్పూ పేలకాళ్లకు బలం రాదనీ చెపుతున్నాడు. బత్తాయిలు ఇవ్వకుండానే పరిగెత్తిస్తా నంటూంది ఫాతిమా-భర్త అస్లమ్ తో ఏడాదిగా. ఏడాది నుంచీ అస్లమ్ కు అదే అనుభవం. ఆఫీసు నుంచి వస్తాడు. మురికి తిండి ఈగలు ముసిరే పప్పూను చూస్తాడు. టీ పొగ చూరిన వాసన వస్తుంది. పత్రికలో వెధవ వార్తలుంటాయి. ఫాలిమా మురికి బట్టలతో సిద్ధం. పైగా కోపంతో పిల్లలమీద ఎగురుతుంటుంది. అత్త అవకాశం కోసం నిరీక్షిస్తుంటుంది, కోడలు మీద కొడుక్కు చాడీలు చెప్పడానికి.
ఆఫీసునుంచి వచ్చిన అస్లమ్ వళ్లుమండుతుంది. ఏదో అంటాడు. జగడం మొదలు, పెళ్ళాం మొగుడి తగాదా చూడ్డానికి పొరుగింటి ఆవిడ వెంటిలేటర్ లోంచి తొంగి చూస్తుంది. ఆమె వ్యవహారమూ అంతే. భర్త ఆఫీసు నుంచి రాగానే తగాదాలు మొదలు. నువ్వెంత అంటే నువ్వెంత అని సాగుతుంది. అలాంటప్పుడు ఫాతిమా తన కన్నీరు తుడుచుకొని పొరుగింటి పోట్లాట చూడ్డానికి వెంటిలేటర్ లోంచి తొంగిచూస్తుంది.
ఫాతిమా తన పంతం నెగ్గించుకోవడానికే పప్పూకు బత్తాయిలు ఇవ్వడంలేదని అస్లమ్ అభిప్రాయం. కాని రెండువందల రూపాయలతో ఇల్లు గడవడం ఎంతకష్టమో ఫాతిమాకు మాత్రమే తెలుసు.
తొలిరోజుల్లో ఫాతిమా అన్ని గట్టి ఏర్పాట్లు చేసింది. ఇంటి బడ్జెట్ కూడా పకడ్బందీగా ఏర్పాటుచేసింది. అప్పుడు అత్తగారు చాలా సంతోషించారు. అయినా అస్లమ్ జీతం చాలందే. ఒకనెల్లో అద్దె బకాయి పడేది. మరో నెలలో కరెంటు బిల్లు. ఇరవయ్యోతేదీ వచ్చిందంటే తల్లీ కొడుకుల గొణుగుడు మొదలు అయినా వచ్చినదానితో సరిపెట్టుకుంటున్నందుకు అస్లంకు సంతోషంగా ఉండేది. సంవత్సరం గడిచేసరికల్లా నియమాల బంధంలో ఇరుక్కొని విసిగిపోయాడు.
అత్తగారు రోజూ పులగమే తింటూంది. పాలే తాగుతూంది. రోజూ పులగం తినడం అంటే విషం తిన్నట్లుంది. ఇహ ఫాతిమా నెయ్యీ, చెక్కెరా తూచి వేసేది. తులం అటుగాని ఇటుగాని కానిచ్చేది కాదు. అదే రుచి. అదే పులగం వేల సంవత్సరాల నుంచి తింటున్నట్లనిపించేది, పులగం ముందుకువస్తే తన్నేయాలనిపించేది. రాత్రి మిగిలిన పాచిరొట్టెలు, కుండలో మిగిలిన కూరనంజుకొని తినాలనిపించేది. కాని కోడలు చదువుకున్నది. పాచి పదార్ధం తిననిస్తుందా? కోడలు భయం ఏమంటే అత్త అపథ్యం చేస్తే మందు తెప్పించాలి. మందు తెప్పిస్తే మరో ఖర్చు తగ్గించాలి. ఏ ఖర్చు తగ్గించాలో తెలీదు. అన్నీ బొటాబొటిగా ఉన్నాయి ఖర్చులన్నీ పోటీలుపెట్టి నిలబెట్టిన యింటిలా ఉంది. ఏది లాగినా ఇల్లంతా కూలేట్లుంది. అందువల్ల కుటుంబం సాంతం కొయ్యబొమ్మల్లా ఫాతిమా సంజ్ఞల ప్రకారం కదలాల్సి వచ్చేది.
కొడుకును కోడలు కొంగున కట్టుకుంది అంటుంది అత్తగారు. అస్లమ్ పరమ సోమరి. అయినా సిగరెట్టు బూడిద నేలమీద పడనీయడు. జాగ్రత్తగా "యాష్ ట్రే"లో దులుపుతున్నాడు. ఎముకలు కోరికే చలి ఉన్నా స్నానం చేయక టిఫిన్ చేయడు. లోకం తలకిందులయినా రాత్రి పదింటికి పడకగదికి చేరుకుంటాడు.
అత్తగారు నేలమీద ఊయలేకపోతూంది. మూతికి కట్టిన ఉమ్మి పాత్ర వదిలించుకోవాలని తహతాహ లాడుతూంది.
పొరపాటున పక్కింటి పిల్లలు ఇంట్లోకి వస్తే పాతిమా చిరచిరలాడేది. వాళ్ల అల్లరి సహించలేకపోయేది. పిల్లల తల్లులను తూలనాడేది. 'నాదిరా' పుట్టింతరవాత ఫాతిమాకు తెలిసివచ్చింది. విటామిన్లున్న తిండి తినిపించేది. డిసెంబర్ చలిలోను రెండుసార్లు స్నానం పోసేది. అల్లం బెల్లం అన్నీ అంటనిచ్చేదికాదు. సమయానికి ఆహారం గొంతులో కుక్కేది. అయినా నాది రాకు అడ్డమయిన నాయనమ్మ అలవాట్లన్నీ వచ్చేశాయి. ఫాతిమా చెప్పింది అస్సలు చేసేదికాదు. ఫాతిమా సంత్రాలు తినిపించాలనుకునేది. నాది రాకు అవి విషంలా తోచేవి. వద్దన్నప్పుడు సంత్రాల కోసం పొర్లి ఏడ్చేది. చప్పని కూరలంటే ఆమెకు అసహ్యం. మసాలాలు, కారం ఉన్న కూరల కోసం ఉవ్విళ్ళూరేది.
ఒక్క నాదిరాతోనే పడలేకుండా ఉంది ఫాతిమా, చూస్తూ చూస్తుండగానే అల్లరిపిల్లలు అనేకమంది తయారయినారు. గిల్లి కయ్యాలు పెట్టుకునే పిల్లల సమాఖ్య పెరిగిపోతూంది. ఫాతిమా చాకిరి చేసే గొడ్డులా తయారయింది. ఒకనికి స్నానం చేయించి, రెండోవాణ్ణి పట్టుకునేది. అప్పటికి మొదటివాడు మట్టి పులుముకొని మళ్ళీ తయారు.
కుటుంబంలో క్రమశిక్షణ తలక్రిందులైంది. ఎప్పుడూ ఇంట్లో అల్లరే! నాదిరా జబ్బున పడుతుంది. ఆమెకు మందు వస్తుంది. ఇంతలో శన్నూ మెట్లమీంచి పడుతుంది. మరోరోజు పప్పు కాళ్లు చచ్చువడ్తాయి. ఫాతిమాను వెక్కిరించడానికా అన్నట్లు పిల్లల జబ్బులు పరిగెత్తుకొని వచ్చేవి.
కుటుంబ నిర్వహణ ఫాతిమాకు అలవికాకుండా పోయినప్పుడు అత్తగారు పాత కొట్టు తాళం తీయాల్సివచ్చింది. అది అత్తగారి తండ్రి సామాను ఉన్న గది. వీలునామా ప్రకారం ఆ సామానుకు వారి పిల్లలే వారసులు. ప్రస్తుతం అత్తగారే వాటికి వారసురాలు.
అత్తగారు గది తలుపు తెరిచింది. తప్పలేదు. అందులోని బట్టల్ని పట్టుకొని బోరున ఏడ్చింది. అన్నం మానివేసింది. గుండెదడ ఎక్కువయింది. తండ్రి పోయిం తరువాత వచ్చిన కష్టాలన్నీ గుర్తుకు తెచ్చుకుంది. అందులోనుంచి ఒక అల్మారీ బయటికి తీసింది. అస్లమ్ వ్యాపారిని తీసుకువచ్చాడు. ఆ తరవాత పీనుగును పారేసిన ఇంటిలా ఇల్లంతా వెలవెలబోయింది.
అలా ఒక నెల హాయిగా గడిచింది. మళ్ళీ భార్యాభర్తల కీచులాట మొదలు. పిల్లల ఏడ్పులు. ఇవన్నీ విన్న అత్తగారు కన్నీళ్లు తుడుచుకుంటుంది. కొట్టుకున్న తుప్పుపట్టిన తాళం తీస్తుంది. ఒకనాడు అక్రమ్ ఖజానా చూచాడు. తల్లి పెట్టెలోంచి తాళంచెవి తీశాడు. ఇప్పుడతనికి రెండో ఆట సినిమా చూడ్డం, అన్నచాటుగా సిగరెట్లు కాల్చడం సుళువయింది.
తాతగారు మాత్రం చేసిందేమిటి-ఏదో కొద్దిపాటి వకాల్తీ, ఆమాత్రంతో అతడేం బొక్కసాలు నింపిపోయాడా? అత్తగారి వెలసిపోయిన కోరికల్లాంటి ముక్కలు చెక్కలయిన సామగ్రి ఏడాదిలో దారిచూచుకుంది. మిగిలింది కొట్టుకొట్లో చిమ్మచీకటి, పందికొక్కులు తోడిపోసిన మట్టిరాసులు, చిందరవందరగా పడిన కుండపెంకులు, కాగితం ముక్కలు- చూడ్డానికి అసహ్యంగా ఉంది. మట్టిరాసులు- గాలిదూరని కొంపా. లోన అడుగుపెడ్తే తల తిరిగిపోతుంది. ఇహ ఆ గదిలో మిగిలింది గోడకు తగిలించిన నిలువుటద్దం మాత్రమే. ఆ అద్దం చూస్తే అత్తగారికి తండ్రి గుర్తుకువస్తాడు. అతడు కొట్టుకు వెళ్ళేప్పుడు ఆ అద్దంలో చూస్తూ కోటువేసుకునేవాడు. ఆ అద్దం చూస్తే తండ్రి నుంచున్నట్టు అనిపించేది అత్తగారికి. పసిడిచాయ ముఖం, తెల్లని గడ్డం, నల్లని కోటు-నిలువెత్తు విగ్రహం - ఆమె కళ్లు చెమ్మగిల్లుతాయి. అందుకే అద్దం గోడవైపుండేటట్లు తగిలించింది. గది కాళీ అయిన తరువాత అద్దం దాగలేదు. బయటపడింది.
నెలలు దొర్లిపోతున్నాయి, మందుకు డబ్బు లేనప్పుడు జబ్బులు మాత్రం ఏం ముఖం పెట్టుకొని వస్తాయి? అంటూ. పప్పూ కాళ్లు మాత్రం బత్తాయిలు లేకుండా బాగుకావని బిర్రబిగిసి కూర్చున్నాయి. రోజంతా పక్కలోపడి మూలుగుతుంటాడు. ఫాతిమా వైద్యుల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరిగీ తిరిగీ కాళ్లు అరగతీసుకుంది. అస్లమ్ చెప్పిన సలహాలను అనుసరించింది, అయితే ఎంతకాలమని! రోజూ మందుకు అర్థరూపాయి పెట్టడం పెద్ద సమస్య అయిపోయింది. పైసకు పైస కూడబెట్టి వండిన వంట రాత్రిళ్లు అలాగే పడిఉండేది. అస్లమ్ ఇంటికి వచ్చి ఫాతిమాతో పోట్లాటలో పడిపోయేవాడు. అలసిపోయి కన్ను మూతపడేది. ఫాతిమా పిల్లలతో పడలేక చెవులు మూసుకొని ఏడ్చేది. అస్లమ్ నిరాకరించిన భోజనపు పళ్ళెం అత్తగారు ఫాతిమా ముందుంచేది. ఆమెతోనూ చీవాట్లు పడి పళ్ళెం అల్మారీమీద పెట్టేసేది.