ఎక్కడ వుందో, యేం చేస్తుందో, ఇన్నేళ్ళు కనపడకుండా ఏమయిందో! ఈ తామర రేకుల మధ్య కనపడే మృదువైన లేయెరుపు రంగుచూస్తే ఆమె భుజాల క్రింద యెరుపే జ్ఞాపకం వస్తోంది. అచ్చ తెలుపు కింది రక్తపు వుబుకు!
తాయారు సాంఘికంగా cut cast పలకరించేవారు లేక ఒక్క మంచిమాట అనేవారు లేక దిక్కులేక మాడిపోయిన ఆ అధమురాలు. ఆమె జీవితచరిత్రలోంచి నేనెరిగిన ఒక చిన్న పుట చదువుతాను పతివ్రతల్లారా, ఆమెని గుమ్మాల పక్కకి చేరనీని నీతి చరిత్రలారా, వినండి. హృదయమాన్యాయత్తమై, ఆమెని మనఃపూర్వకంగా ఆదరించని నా దౌర్భాగ్యానికై పశ్చాత్తాప పడతానీనాడు.
అతను అప్పుడే స్త్రీలోకంలో కళ్ళు తెరచిన నవయవ్వనుడు. నా పుస్తకాలన్నీ చదివివున్నా, వివాహంలోనూ, గాఢ నిశ్చల, శాశ్వత, ప్రేమానుబంధంలోనూ, దాంహ్య పవిత్రతలోనూ, విశ్వాసం. తాయారును కలుసుకున్నాడు. ప్రేమించాడు. ఇద్దరికీ మిత్రుడైన నాకు తెలుసు ఆమెకి కూడా అతనిమీద చాలా ఇష్టమని అతనితో చెప్పకుండా నన్ను వారించింది. అతను తనకింక జీవితంలో స్త్రీ ఆమెతప్ప యెవరులేరని విశ్వసించాడు. తను ప్రేమించిన వస్తువులో కళంకం చూడలేనంత విశ్వాసం గల హృదయం అతనిది. వారించే ప్రజలు ఆమెమీద చెప్పేవన్నీ అపనిందలన్నాడు. తనని వివాహమాడమని ప్రాధేయపడ్డాడు ఒకనాటి సాయంకాలం. ఆమె తబ్బిబ్బు పడ్డది. మాట్లాడకుండా లేచిపోయింది. ఆ పెళ్ళికి ఆమె అంగీకరిస్తే ఆమె దరిద్రం, కష్టాలు, భవిష్యత్తులో భయం, లోక శ్రౌర్యం, అన్నీ వదిలిపోతాయి. అతని ఆరాధన, ప్రేమ, మర్యాద, ధనం, నిశ్చింత, ఇంకో దేశం, కొత్త ప్రజలు, ఒక్కమాటతో అన్నీ తనవి అవుతాయి.
ఉత్తరం వ్రాశాడు ఆమె లేనిది బతకలేనని. ఆ వివాహం వల్ల, అతనికి బంధువులతో విరోధం ,స్నేహితుల హేళన, వెలి, సమస్తమూ, అయినా పట్టుపట్టాడు, దేన్నీ లక్ష్యం చెయ్యని మోహంలో. ఎప్పుడైనా వాస్తవత తెలుసుకుంటే ఏమౌతాడా అని నా భయం. ఆమెను బతిమాలితే, అతన్ని నిరాకరించమనీ, వాస్తవం చెప్పెయ్యమనీ, నేనే చెపితే ఆమెకి, ఆ సహృదయకి ,ద్రోహమా! ఆమె నోటినుంచి జీవితానికంతా సౌఖ్యాన్ని లాగివేసినవాణ్ణి ఔతానా? వాస్తవం చెప్పకపోతే, అతనికి ద్రోహం కాదా?
నేనేమీ నిశ్చయించుకోక మునుపే, ఆమె ఆ వూరినుంచి మాయమయింది. ఒక్కమాట, ఒక్క జాడ వదలక. "ఏ కొత్తవాడితో?" అని నవ్వుకున్నాము నీచులము. ఆమె ఆప్తులం, మేము.
అతను, పాపం, అతను, ఆరాలు తీస్తూ లోకయాత్ర సాగించాడు ఆమెకోసం _ నెలల తరవాత కలుసుకున్నాడు. ఆమె నాయుడి యింట్లో కలిసివుండడం కూడా అతని కళ్ళని తెరవలేదు. ఆమె తనకి అతనిమీద యిష్టంలేదనీ, అతన్ని యింక తనవైపు రావొద్దనీ శాశించింది. అతను ఆమె గదిముందు వున్న లాంతరు స్తంభానికి నీడ అయినాడు. అతనికి ఆమె తప్ప వేరే ప్రపంచం లేదు. ఆమె కిటికీ పక్కన దడి గుంజగా మారాడు. కిటికీలోంచి ఆమె యెన్నడన్నా కదిలినప్పుడు కనపడుతుందేమోనని ధీనంగా ఆమె నీడ కోసం చూస్తూ వారంరోజులు నుంచున్నాడు. ఆమె రాత్రులు చీకట్లోంచి_ అతనికి కనపడక అతనివంక చూస్తూ దిండును కన్నీటితో తడిపేది.
ఇంక భరించలేకపోయింది ఆమె హృదయం. అతన్ని పిలిపించి, పక్కన కూచోపెట్టుకుని మళ్ళీ అబద్ధం చెప్పింది, తనకి అతని మీద ప్రేమ లేదని. ఆమెకు తెలుసు తన కన్యత్వంలో నూనృతంలో విశ్వాసంలో, అతనికి విశ్వాసమని. ఏ అపవాదన్నా విన్నాడా పిచ్చెత్తుతుందో ఆత్మహత్య చేసుకుంటాడో అని ఆమె భయం. అంతేకాదు ఆమె మనో నిబ్బరంలో ఆమెకే నమ్మకంలేదు. పెళ్లయిన తరవాతైనా తనకోసం పరితపించే మానవుడే వుంటే అతనిమీద కనికరించకుండా ఉండగల నిబ్బరం తనకి వుండదని భయం. అతని నిర్మల విశ్వాసం ముందు తన మలిన చరిత్రను, తన గుండె బలహీనత్వాన్ని ఒప్పుకునే ధైర్యంలేకపోయిందో లేక అతని సుందరస్వప్నాన్ని కలత పెట్టడమే యిష్టం లేకపోయిందో! ఎవరు చెప్పగలరు? ఎవరందుకోగలరు స్త్రీ హృదయ అగాధాలని, ఆ త్యాగశిఖర ఔన్నత్యాలని! తనకి ఇంకోరిమీద ప్రేమ అని చెప్పి, తనని వదిలిపెట్టి వెళ్ళమని కన్నీళ్ళతో బతిమాలింది. అంగీకరించాడు. కాని వదిలిపోలేనన్నాడు. అట్లానే నశిస్తానన్నాడు. ఆమె అంత దగ్గిరిగా అతన్ని బతిమాలడమూ, ఆమె చూపులూ, మాటలూ ఎట్లాగో తెలియ చేస్తున్నాయి అతనికి ఆమెకి తనమీద ప్రేమలేకపోలేదని. ఇంకా పట్టుబడితే, బతిమాలితే ఆమె అభ్యంతరం కలుగుతుందని అతని ఆశ.
చివరికి ఆమె నిలవలేకపోయింది. అతని ధీనత్వానికి ఆమె హృదయం అంత నీచమయింది. పతివ్రతల్లారా! శపించండి.
"నానించి నీకు ఏమి కావాలి?"
"నువ్వు"
"అంతేనా?"
"నీ ప్రేమ"
"ప్రేమ లేదు."
"పోనీ పెళ్ళిచేసుకో. చాలు."
"నా అందం కోసమా?"
"అవును"
"పెళ్ళి ఎందుకు! నా అందం నీది. నా దేహం నీది. ఎప్పుడు కావలసినా__"
తేరిపార చూశాడు. భూమి బద్దలయింది. మన్ను కాళ్ళకింద దించుకుపోయింది. మెల్లిగా బైటికి వచ్చాడు. ఇట్లాంటిదా? ఎంత అపాయం తప్పింది? అని సద్దుకున్నాడు. మూడు నెలల్లో ఒక గొప్ప షాహుకారు కూతుర్ని పెళ్ళి చేసుకుని సుఖంగా బతుకుతున్నాడు.
అతనిమీద తన ప్రేమనంతా హృదయంలోనే మననం చేసుకొని__ఆ తీవ్ర త్యాగంలో కాలి__ యామయిందో! నాకు ఉత్తరాలు వ్రాయడం కూడా మానింది.
సీతలూల్ దమయంతులూ, సావిత్రులూ, చేశారే త్యాగాలు! ఆ త్యాగాలు చూసి పొంగి బోర్ల బడుతున్నారు. ఉమ్మెయ్యండి ఇట్లాంటి స్త్రీలమీద. పెళ్లి అయిన ఆ ఒక్కడికే భద్రంగా దాచుకుని ప్రతిరోజూ సమర్పించుకుని, స్వర్గాని కెగబాకాలని చూసే పతివ్రతలూ, నవ్వండి, యెక్కిరించండి, తరమండి దూరంగా యీ నీచ స్త్రీలని. అధికులమని కులకండి. ఆ స్వర్గమెంత నీచ ప్రదేశమై వుండాలి, ఆ దేవుడెంత క్షుద్రుడై వుండాలి, మీవంటి వాళ్ళని చుట్టూ చేరనిచ్చి సంతోషించేందుకు?