రోడ్డుమధ్య నుంచుని__
"మా యింటికి రావా" అన్నాను.
"రాకేమి! యెప్పుడు?"
ఆశ్చర్యపడి చూశాను. ఇంకా పూర్తి పరిచయంలేని నాతో అంత శుభ్రంగా మాట్లాడింది. ఈర్ష్యలో పుట్టి ఈర్ష్యలో వూరే పురుష హృదయం తబ్బిబ్బు పడ్డది. ఇంత సహృద్భావం నాతోనేనా! ఇంకా__ అనే నా శునకత్వాన్ని గట్టిగా నొక్కిపట్టాను.
ప్రేమదానం, తరవాత స్త్రీ ఇవ్వగలది సౌందర్యదానం. తాయారు యెన్నడూ ప్రేమహృదయం, ఆత్మసంయోగం యిట్లాంటివి మాట్లాడలేదు. తన దేహంవల్ల యింకోరు సంతోషించారంటే వారి సంతోషమే ఆమెకి సంతోషాన్నిచ్చేది అట్లాంటి ఉదారత్వం గల స్త్రీలు చాలా నకృతు. తనకేమి ఇస్తున్నాడని కాదు. తానేమి ఇస్తున్నాని ఆమె ధ్యాస. పురుషుడి కళ్ళలో ఆరాధనని చూసి చిన్నపిల్లవలె కిలకిలా నవ్వుతుంది. తన శృంగారపు విలువని, తన శరీర బహుమానాన్ని తన కిష్టమైన పురుషుడు అనుభవించి ఆమోదిస్తున్నకొద్దీ ఆమెకి ఉత్సాహం. సులభంగా తనని లోకం చేసిన న్యూనతని ఆమె గుర్తించనన్నా గుర్తించలేదు. తనని చూసి వెక్కిరించే లోకంమీద పసిపిల్లకి ఏం కోపమొస్తుంది? ఎవరన్నా ఎత్తిపొడిచే మాటలు ముఖంమీద అన్నా తనూ నవ్వేది. అసూయ, ద్వేషం, ఇతరుల్ని గాయపరచడం ఇటువంటి గుణాలు ఇతరుల కన్నా స్వంత వారినే యెక్కువ బాధిస్తాయని వివేకవంతులు వాటిని వదులుకుంటారు. అపురూపమైన కొందరు అసలు వాటి సంగతే యెరుగరు. ఏ పూర్వజన్మలలోనో వాటిని వదిలి సంస్కరించుకునే పుడతారు.
ఆ గుణాలు వారికి కలగనే కలుగవు. అట్లాంటిది తాయారు. ఎవరిలోనన్నా మనమో సుగుణాన్ని గుర్తించామా, ఆ సుగుణం పూర్తిగా లేదన్నమాట వారిలో. ఇంకా ఆ గుణాన్ని సాధన చేస్తున్నాడన్నమాట.
ఏ దుర్గుణం అసలు ఏమి ఎవరిలో ఏమాత్రమూ లేదో, అది లేదని ఎవరూ గుర్తించరు. "ఆహా, యీ దుర్గుణం మీలో లేదు" అని ఎవరన్నా 'సిన్సియర్' గా అన్నారా, ఆ దుర్గుణం కొంచెంగా ఆ అనబడ్డవారిలో, అంతకన్న అధికంగా ఆ అనేవారిలో వుందన్నమాటే" అనఖ్కర్లేదు. అనుకున్నా చాలు.
ఎవరన్నా పెద్దమనిషితో, ఇంకోరు "తమరూ చాలా పుణ్యాత్ములండీ, పసిపిల్లల్ని నిష్కారణంగా గొంతు పిసకరు" అంటారా? అంటే, విన్నవారు అనుమానపడరా; ఆ యిద్దరిని గురించీ.
శ్రీరాముడు ఏకపత్మీవ్రతుడు.
ప్రహ్లాదుడు భక్తుడు.
దమయంతి పతివ్రత__
అని అనగానే, అనబడ్డవారూ, అనేవారూ, అనుమానాలకి లోనవుతారు.
మనిషి అభివృద్ధి చెందినకొద్దీ, అతనిలో colour lessness ఎక్కువవుతుంది. సుగుణాలూ, దుర్గుణాలూ, కనిపించడం తక్కువవుతాయి. గొప్ప సుగుణాలు ఎవరిలో గట్టిగా కనపడతాయో, వాడు చాలా Hypocrite జాగ్రత్త.
ఒకరిలో గొప్పతనం కనపడుతుంది. కాని నిజమైన గొప్పతనానికి కారణాలు కనపడవు.
స్త్రీ చవక కావడం వల్ల, స్త్రీ సౌందర్యాన్ని పూజించడం మానేశాడు పురుషుడు. కృతజ్ఞతాభావం నశించింది. గేదె అప్పుడప్పుడు తంతుంది గనక, పాలిచ్చినప్పుడు గేదెమీద కొంత కృతజ్ఞత వుందిగాని, దేహమర్పించే స్త్రీమీద అసలు లేదు. స్త్రీ గేదెకన్న హీన స్థితికి, పకోడీ విలువకి దిగింది. పురుషుడూ అంతే అయినాడు స్త్రీకి. ఎందుకంటే చాలామంది పురుషులకి భార్యకన్న గతిలేదని, ఆ భార్యకి తెలుసును గనక. ఎక్కడో కొత్త పెళ్లికూతుళ్ల సిగ్గుల్లోనూ, పూర్తిగా దేహసౌఖ్యానికే బతికి, లోకమంతా వుమ్మేసి, వేశ్యకన్న హీనంగా చూసే, పికిరీ వీధి స్త్రీల మాటలలో తప్ప, యింక యెక్కడా కృతజ్ఞతాభావం కనపడదు. తనకి లోబడనన్నాళ్ళు ప్రాధేయపడతాడు పురుషుడు. పార్వతివి, దేవివి, తల్లివి, రాణివి, కోయిలవి, రంభవి అంటాడు. చేతికి చిక్కిందా మామిడిపండును చీకినట్లు అనుభవించి టెంకను విసిరి పారేసినట్టు పారేస్తాడు. స్త్రీ కూడా పురుషుడి కోర్కె సమాప్తికాగానే దెబ్బతిన్న కుక్కమల్లే వంగి దూరంగా పోతుంది. నరాలలో జనించే దివ్య సౌఖ్యంలో ఒకరితో ఒకరు పకపక నవ్వడమూ, కృతజ్ఞతతో ఒకరినొకరు చూసుకోవడమూ అరుదైపోయింది. అటువంటివి వుంటాయని వ్రాసినవాడూ ఆ సౌఖ్యాలూ పాపాలు కావన్నవాడూ పాపాత్ముడూ, అవి నీతి బోధకుడూ, దేహలంపటుడూ అయినాడు. తాయారు వంటి స్త్రీలని లోకం కరిచి దూరంగా తరుముతోంది.
ఈ స్థితి సామాన్య మానవులలోనే కాదు, నన్నయభట్టునూ, షెల్లీనీ తన్ని పుట్టామనీ, శృంగారాలకి పుణ్య విలువలకి హృదయాలు ఆలవాలనీ విర్రవీగే, నేటి కవులలో కూడా చూడవచ్చును. వలచి పొందని స్త్రీని గూర్చి కవిత్వాలు, తాము వలచి తమని వలవని కన్యల కోసం గీతాలు, మరణించిన భార్యలమీద విలాసాలు గంపెడు. ఆ కన్య తమని పెళ్ళాడిందా, తిరిగి ఆ చచ్చిన భార్య ఆత్మ కొత్త భార్యలో దర్శనమిచ్చిందా, యింక కవిత్వం ఆఖరు. అంతటితో మొత్తానికి ప్రేమగీతాలు వెలువడవు. సంసార తాపత్రయాల మీదన్నా, సంభోగ జుగుప్సలమీదన్నా వ్రాయరుగదా నాలుగు ఆరోగ్యకరమైన కందాలు!
దానం దానం చేశారు, అన్నదానం చేశారు, భూమి దానం చేశారని గొప్పగా చెప్పుకుంటారు. రసికుల ఆర్తికి స్త్రీ తన దేహం దానం చేసిందంటే మండిపడతారు. మళ్ళీ ధనాలు పోసి, కట్నాలని, వరశుల్కాలని దేహాల్ని కామాల్ని కొనుక్కుంటూనే వున్నారు, మర్యాదగా సంసారాల్లో. గొప్ప గొప్పవారు వరుల్నీ, కన్యల్నీ, గొడ్లనులగు విలువలు కట్టడం వింటాను ప్రతిరోజూ. తన స్వార్థమే మరిచి తన అందంలో యితరులు పొందే ఆనందంలో తానానందపడే తాయారు తనకోసం వాంఛపడే పురుషుడి దీనత్వాన్ని చూసి విలవిలలాడే తాయారు, ప్రపంచపు వాస్తవపు విలువల్లో తలతంతుంది, యీ విశ్వదాతల్ని, దానకర్ణుల్నీ! దగ్గిరికి వస్తే నిజంగానే తన్నేది.