"నరుసుబావ నోసారి రమ్మన్నానని చెప్పు" అని నే ననబోతో వుంటే నోరు నొక్కాడు.
నరసుబావా, నేనూ చిన్నప్పుడు ఆడుకున్నాను. అతనికి నన్నిస్తామని కూడా అనుకున్నారు. కాని అదేమీ మనసులో లేకుండా నాతో చాలా సరదాగా వుండేవాడు. ఎవరితోనూ నన్ను చనువుగా వుండనీని (చివరికి తనతో కూడా) నా పెనిమిటి, నరసుబావతో సరదాగా మాటాడనిచ్చేవాడు. నరసుబావ ఆడవాళ్ళ మధ్యకు వొస్తే మొగవాడు వచ్చినట్టే ఫీల్ అయ్యేవారు కారు.
ఏమీ తోచనప్పుడు నరసుబావ వస్తే బావుండుననేదాన్ని అమీర్ తో.
"రానీ. వాన్ని నరసు దెయ్యంగా మారుస్తాను" అనేవాడు.
నరసుబావ సుగుణాన్ని యెంత పొగిడినా అమీర్ కోపం తగ్గలేదు. ఒకసారి చివాలున లేచి....
"వొరే నరసుబావా, వొచ్చావా! చివరికి" అని అప్పుడే వొచ్చిన నక్కనోదాన్ని రాళ్ళతో మైదానం చివరిదాకా తరిమాడు. అప్పణ్ణించి నక్క కనబడినప్పుడల్లా నరసుబావ అంటాడు. తరవాత కోపమొచ్చింది గావును. మాకు కనపడకుండానే నరసుబావ చాలా అల్లర్లు సాగించాడు. సగం కొరికిన బొమికల్ని మా గుడిశలో పారేశాడు. అదేం పుట్టిందో పడుకుంటే కాలివేలు మెల్లిగా కొరికి లేపుతాడు. మూతపెట్టుకున్న అన్నం కింద చిమ్మిపోతాడు. అట్లాంటి పనులు ఏం జరిగినా, నరసుబావ చేసి పోయినాడనే వాడు అమీర్. కొన్ని పనులు అమీర్ చేశాడని నా నమ్మకం. కాని పాపం నరసుబావ లేకుండా చూసి, అతన్ని నక్కని చేశామే అని దిగులువేసేది నాకు. బావ-అతని లావు వొళ్ళూ, గుండ్రని బుగ్గలూ, అమాయకత్వమూ నా మీద ప్రేమా జ్ఞాపకం వొచ్చి సిగ్గేసేది.
4
అమీర్ దిగులుపడ్డాడు. అతని తరహా పూర్తిగా మారిపోయింది. అన్నం తినడు. వూరికే వదలకుండా పడుకుంటాడు. పలకరిస్తే విసుక్కుని ముసుగు పెట్టుకుంటాడు. అది జబ్బో, మనోవ్యాధో, నా మీద కోపమో, విసుగో తెలీటంలేదు. ఒక్కత్తెకీ నాకు ఏమీ తోచక, దిగులుభారంతో యిటూ అటూ తిరుగుతున్నాను. ఆలోచించి కనిపెట్టి మీరా అనే కుర్రాడు వొచ్చినప్పుడు మాత్రం లేచి అతనితో యేదో రహస్యముగా మాట్లాడుతున్న సంగతి గ్రహించాను. చాలాసార్లు అతనితో కలిసి వూళ్ళోకీ వెళ్ళివస్తాడు అమీర్. వొచ్చాక మరీ దిగులుగా వుంటాడు.
ఆ కుర్రాడు మీరాని చూస్తే నాకు సరదా. అమీర్తో మాట్లాడుతూ వుంటే యెందుకో అతన్ని పిలిచి పలకరించి కబుర్లు చెప్పాలనిపించేది. అట్లాంటి తమ్ముడు వుంటే బావుండును. కొడుకు వుంటే బావుండును. అనుకుంటాను కాని నన్ను అనుమానంతో, విరోధంతో భయంతో చూసేవాడు. దానివల్లనే నాకు తోచింది. నాకు వ్యతిరేకమయిన పని ఏదో తలపెడుతున్నాడని, అమీర్ కి బోధిస్తున్నాడని, నేనతనికి విరోధం యెందుకు కావలసి వచ్చింది? నేనేం చేశాను? పైగా మీరావల్ల అమీర్ మనసు చెడిపోతున్నట్లు కనబడుతోంది.
వ్యవహారం ముదురుతోంది. అమర్ని అడిగితే లాభంలేదు. ఎన్ని ప్రశ్నలడిగినా దాస్తున్నాడు. మీరా దగ్గిర్నించే నేను తెలుసుకోవాలి. కాని మీరా చెపుతాడా? నావంక అంత కోపంగా చూసేవాడు! కాని అమీర్ క్షేమం కోసం నేను ఆ ప్రయత్నం చెయ్యాలి.
ఆ సాయంత్రం యేరు వొంటరిగా దాటి యిసికలో నడుస్తూ అవతలి గట్టుకు చేరుకున్నాను. సూర్యుడు మైదానం చివరి భూమిని తాకుతున్నాడు. చిన్న గాలిలో గడ్డి నా పాదాలకేసి వొంగింది. ఇసిక గుంటల్లోని పిచ్చిక లెగిరి చెట్లమీద కూచుని నన్ను చూసి విసుక్కుంటున్నాయి. చాపల ఆశని వొదిలి నీలపు పిట్టలు గూటికి ప్రయాణం కట్టాయి. కొంగలబారు నా తల మీద వెడుతూ లోకంలో నా వొంటరితనాన్ని గాఢంగా స్ఫురింప చేసింది. ఒక్కడూ పాడుకుంటూ మీరా వొస్తున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యపడి ఆగి, చప్పున తలొంచుకొని నన్ను దాటి వెళ్ళిపోవాలని చూశాడు. పిలిచి ఆపి దగ్గరికి వెళ్ళాను ముందే.
"నాతో చెప్పవా?" అని అడిగాను.
సిగ్గుపడి తెప్పరిల్లి 'ఏమిటి?' అన్నాడు.
"ఆ సంగతి-నువ్వు తెచ్చే కబురు."
"ఏం లేదు."
అని వెళ్ళిబోతున్నాడు. చిరునవ్వుతో అతనివంక చూస్తూ అతని భుజాలమీద చేతులువేసి, దగ్గిరికి వొంగి, నా కళ్ళల్లో మార్దవత్వాన్ని కల్పించి "నాతో చెప్పవా?" అన్నాను సొగసుగా.
తడబడ్డాడు. "ఏంలేదు ఏంలేదు" అని మెల్లిగా తనలో తను అనుకున్నాడు. అతని గడ్డంకింద చెయ్యేసి కళ్ళల్లోకి చూస్తూ "నాతో చెప్పాలి. నన్ను చూస్తే నీకెందుకు విరోధం? నేనేం చేశాను? నాకేదో ఆపద కలిగిస్తున్నావు. నా అమీర్ మనసుని పాడు చేస్తున్నావు. ఇంత మంచివాడివలె కనబడుతున్నావే....ఇంత అందంగా వున్నావే....నువ్వు ఇంకోళ్ళని, దిక్కులేని స్త్రీలని క్షోభపెట్టడం న్యాయమేనా? నీకే అక్క వుంటే యిట్లా యేడిపిస్తావా?"
నా కళ్ళు నీళ్ళతో నిండాయి.
"నేనేం చేశాను?" అన్నాడు మెల్లిగా.
"ఏం చెయ్యకపోతే, చెప్పు."
అమీర్ రహస్యం యింకొకరికి చెపుతున్నానే అని భయం ఒక మూల. నా కళ్ళు చూసి భరించలేకపోవడం ఒక మూల. కదిలే నీళ్ళలో కాంతి ప్రతిఫలిస్తున్నట్టుంది అతని మొహం. కాని అమీరే జయించాడు. మాట్లాడక తప్పించుకోవాలని చూస్తున్నాడు. అతని కళ్ళలో సౌందర్యారాధన నాకు కనబడ్డది గావును, జయిస్తానని రూఢిగా తేలింది. ఎందుకంటే ఒక పురుషుడు అందులో అమీర్ వంటి రసికుడు, ప్రేమించిన తరవాత స్త్రీకి తన సౌందర్య మహిమ గోచరించకుండా వుండదు.
"అబ్బాయీ, ఇట్లా చూడు. నా బాబువి కాదూ! నాతో చెప్పవా?" అని మార్దవంగా అని, "చెప్పాలి. చెపుతావు, నాకు తెలుసు" అని చిన్న చిరునవ్వుతో పలికాను.
వెంటనే నాకు సిగ్గేసింది, నా ఆకర్షణని అట్లా వుపయోగించడం! కాని నా ఆనందమే భగ్నమౌతూ వుంటే! మీరా యెడల అన్యాయమనిపించింది. కాని నీళ్ళలో మునిగే మనిషి ఏం ఆలోచిస్తుంది? వశ్యుడైనాడు. కదలలేక నా వంక చూస్తూ నిలబడి చెప్పేశాడు. అమీర్ తో మాత్రం చెప్పవద్దని బతిమాలాడు.