Previous Page Next Page 
ఆక్రోశం పేజి 13


    ఇద్దరు వ్యక్తులు షర్టులు, ఫ్యాంటులు వేసుకున్నారు. మూడో వ్యక్తి పంచె, జుబ్బా వేసుకున్నాడు.

 

    "యాదవరెడ్డీ... ఇక్కడ నుంచి ఊరెంత దూరం" ఒక వ్యక్తి అడిగాడు. అతని పేరు కుమారస్వామి. నలభై ఏళ్ళుంటాయి అతనికి.

 

    "రెండు కిలోమీటర్లు" చెప్పాడు యాదవరెడ్డి.

 

    "సంచిలో రెండు ఫుల్ బాటిల్స్ వున్నాయి. ఇక్కడెక్కడైనా కూర్చుందాం" రెండో వ్యక్తి అన్నాడు. అతని పేరు నర్సింహ అతనికో ముప్పై ఏళ్ళుంటాయి.

 

    "వెళ్ళే దారిలో పాడుబడ్డ బిల్డింగుంది... దానరుగుమీద కూర్చుందాం" చెప్పాడు యాదవరెడ్డి.

 

    ముగ్గురూ పావుగంటసేపు నడిచారు.

 

    మట్టిరోడ్డుకి ఎడంపక్క పాడుబడ్డ బిల్డింగు, విశాలమైన పెద్ద అరుగు.

 

    ఆ అరుగుమీద ముగ్గురూ కూర్చున్నారు.

 

    నర్సింహ సంచిలోంచి బాటిల్స్ తీసి పక్కన పెట్టాడు. మూతలు తీసి ఒక బాటిల్ యాదవరెడ్డి కిచ్చాడు. రెండో బాటిల్ తను తీసుకున్నాడు.

 

    "ఒరే నర్సింహా... మనకు టైం లేదు. రేపు మధ్యాహ్నం మన వాళ్ళందరితో కలిసి మనం బొంబాయి వెళ్ళాలంటే ఇవాళ రాత్రి యీ పనిని గప్ చుప్ గా చేసుకుని రేపుదయానికల్లా మనం హైద్రాబాద్ లో వుండాలి... అర్ధమైందా?" కుమారస్వామి సీరియస్ గా అన్నాడు.

 

    "టాక్సీ తీసుకుంటే రేపటికి హైద్రాబాద్ లో వుంటాం కంగారెందుకురా?" బాటిల్ ని సగంవరకూ పూర్తిచేస్తూ అన్నాడు నర్సింహ.

 

    "చూడు యాదవరెడ్డీ... ఇప్పుడీ వ్యవహారం విషయం వదిలెయ్. పిల్ల బాగుంటుందంటున్నావ్. బంగారుబొమ్మలా వుంటుందంటున్నావ్... ఇంకో మాట... ఇకనుంచి మీ వూళ్ళోనే కాదు... చుట్టుపక్కల వూళ్ళల్లో ఎక్కడన్నా మంచిపిల్లలుంటే చూడు నెలకు ఒకర్ని అప్పగించావనుకో... నువ్వూ హాయిగుంటావ్. మేమూ హాయిగుంటాం."

 

    తన పరిస్థితి అలా దిగజారిపోయినందుకు మనసులోనే బాధపడ్డాడు యాదవరెడ్డి.

 

    మరో అరగంట గడిచింది. ఖాళీ సీసాల్ని పక్కకు తోసేసి, అరుగుమీంచి దిగి-

 

    యాదవరెడ్డి వెనక వూళ్ళోకి నడవడం మొదలుపెట్టారు కుమారస్వామి, నర్సింహ.

 

    దూరంగా ఊరు... మసక వెలుతురులో వూరంతా మట్టిముద్దలా కన్పిస్తోంది.

 

    'మీరిక్కడే వుండండి. పిల్లని తీసుకొస్తాను" యాదవరెడ్డి వూళ్లోకి అడుగు పెట్టాడు.

 

    శిధిల దేవాలయం దగ్గరకొచ్చాడు.

 

    శివలింగం ముందు వెలుగుతున్న దీపంవైపు వింతగా చూశాడు. ఎప్పుడూ వెలగని దీపం ఆ వేళ వెలగడం ఆశ్చర్యంగా వుందతనికి.

 

    తలదించుకొని గుడిసె వైపు భారంగా అడుగులు వేశాడతను.


                                                *    *    *    *


    గుడిసెలో ఆముదపు దీపం అఖండ దీపంలా వెలుగుతోంది.

 

    గుడిసె మధ్యలో నిద్రరాక అటూ ఇటూ పొర్లుతున్న లక్ష్మి అడుగుల చప్పుడికి తలతిప్పి చూసింది.

 

    తండ్రి యాదవరెడ్డి.

 

    "నాన్నా" ఏడుపు గొంతుతో గబుక్కున లేచి తండ్రిని చుట్టేసింది లక్ష్మి.

 

    "చెప్పకుండా ఎక్కడకు వెళ్ళిపోయావ్ నాన్నా?" కూతురి ప్రశ్నకు తండ్రి దగ్గర జవాబు లేదు.

 

    "పనేదైనా దొరుకుతుందేమోనని పట్నం వెళ్ళానమ్మా" సంచిలోంచి అన్నం పొట్లం తీసి, విప్పి కూతురి ముందు పెడుతూ అన్నాడు యాదవరెడ్డి.

 

    అన్నం మెతుకుల్ని చూడగానే లక్ష్మి కళ్ళు వింతగా మెరిశాయి. ఆమె చేతివేళ్ళు పొట్లం వైపు కదిలాయి.

 

    గ్లాసుతో నీళ్ళు తెచ్చి పక్కన పెట్టాడు తండ్రి.

 

    సాయంత్రం తను పదిరూపాయలు సంపాదించి దాచిన విషయాన్ని తండ్రితో చెప్దామనుకుని ఎందుకో చెప్పలేకపోయింది లక్ష్మి.

 

    "పని దొరికిందా నాన్నా?" అన్నం తింటూ అమాయకంగా అడిగింది లక్ష్మి.    

 

    తల్లీ, తండ్రి మధ్య తను కళకళగా తిరిగిన రోజులు, ఏదో తెలియని జబ్బొచ్చి తల్లి తనతో చెప్పకుండా వెళ్ళిపోయిన రోజులు, అంత వరకూ వ్యవసాయం చేసిన తండ్రి అకస్మాత్తుగా బండి లాగుతూ కాలం గడిపిన రోజులు, తండ్రితోపాటు ఊరు కూడా రోజు రోజుకు తరిగిపోతున్న రోజులు, ఆకలితో మనుషులు చచ్చిపోతున్న రోజులు, ఆకలితో మనుషులు వూరు విడిచి పారిపోతున్న రోజులు,ఎక్కడ చూసినా ఆకలి మంటలు చెలరేగిన రోజులు, వూళ్ళో వున్న ఒకానొక మంచినీటి బావి కూడా ఎండిపోయిన రోజులు-

 

    చెట్టులాంటి తండ్రి మోడులా మారిపోయి తాగుడికి, వ్యసనాలకు బానిసైన రోజులు, ప్రతిక్షణం ఆకలితో బాధపడుతున్న రోజులు, కళ్ళ వెనక దుఃఖాన్ని, మనసు వెనక బాధని దాచుకోడానికి అలవాటుపడి, రాని నవ్వుని నవ్వుతూ ఊళ్ళో పరిగెడుతున్న రోజులు-

 

    బాల్యం కెమెరా లాంటిది.

 

    ఎన్నెన్నో విషాదాల నెగెటివ్స్ నో దాచుకుంటుందది.

 

    "లేదమ్మా... లేదు... పని నాకు దొరకలేదు. కానీ... నువ్వు అదృష్టవంతురాలివి తల్లీ! నీకు పని దొరికిందమ్మా... ఇక్కడ కాదు బొంబాయిలో... హాయిగా నిన్ను చూసుకునే మనుషులు దొరికారమ్మా."

 

    ఆ మాటలు చెప్తున్న తండ్రివైపు ఆశ్చర్యంగా చూసింది లక్ష్మి.

 

    "బొంబాయి అంటే ఏంటి నాన్నా?" అమాయకంగా అడిగింది లక్ష్మి.

 

    "బొంబాయి అంటే అదో ఊరమ్మా... పెద్ద వూరు... పేదరికం లేని వూరు... దరిద్రం లేని వూరు... నువ్వు కార్లల్లో తిరిగే వూరు... అందుకే... అందుకే... బొంబాయి వెళ్తావు కాదమ్మా?" నీళ్ళు నిండిన కళ్ళతో అడిగాడు యాదవరెడ్డి.

 

    "నువ్వూ వస్తావు కదూ నాన్నా!" అప్రయత్నంగా అడిగింది లక్ష్మి.

 

    "ఇప్పుడు రాను. తర్వాత వస్తాను... తర్వాత... నువ్వు సుఖంగా వున్నావని తెలిసిన తర్వాత అప్పుడు... నీ దగ్గరే వుంటాను కదమ్మా" ఆ తండ్రి గుండె అప్పటికే పగిలిపోయింది. ఆ తండ్రి గుండె అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసింది.

 

    "బట్టలు సర్దుకో... బయలుదేరదాం" మాట అనేసి నాలిక కరుచుకున్నాడు యాదవరెడ్డి.

 

    వంటిమీద చిరుగుల బట్టలు తప్ప మరేవీ బట్టలు... తన చిన్నారి కూతురికి వున్నది ఒకే ఒక జత. వంటిమీద చిరుగుల జత.

 Previous Page Next Page