"లెక్కల మాస్టారు భుజమ్మీద కండువా యిచ్చారు. ఇది మడత బెట్టుకుంటాను" దూరంగా వున్న కండువాను అందుకుని మడత బెట్టుకుంది లక్ష్మి.
చీకటి దట్టంగా అలుముకుంటోంది.
గుడిసెలోంచి బయటికొచ్చింది లక్ష్మి.
అటూ ఇటూ భయం భయంగా చూస్తున్న తండ్రి యాదవరెడ్డి కళ్ళలోని తెలీని బాధను పసిగట్టలేకపోయింది ఆ పసిమనసు.
ఊరు మధ్యలోకొచ్చింది లక్ష్మి.
శివుని ముందు దీపం వెలుగుతూనే వుంది. ఊరు దాటుతుంటే ఏడుపొచ్చింది లక్ష్మికి. దాంతో కళ్ళెంట నీళ్ళొచ్చేశాయి.
ఆ కన్నీళ్ళు వెచ్చగా వున్నాయి.
* * * *
మాసిపోయిన కుందనపు బొమ్మలా వున్న లక్ష్మిని చూడగానే సంబరపడ్డాడు కుమారస్వామి.
"రోజూ పావుకేజీ మాంసంపెట్టి, పట్టుబట్ట కడితే పిల్ల హిందీ సినిమా స్టారై పోదూ... చూడు యాదవరెడ్డీ... పిల్లని చూడకుండా మూడు వేలన్నాను పిల్లని చూసి అంటున్నాను. అయిదు వేలు... ఇదిగో" జేబులోంచి కొత్త కరెన్సీ కట్టని తీసి చేతిలో పెడుతూ అన్నాడు కుమారస్వామి.
"ఊరు కాని ఊరు, భాష కాని భాష... పిల్లకే ప్రమాదం లేదు కదా?" భయంగా అడిగాడు యాదవరెడ్డి.
"ఎన్నిసార్లు అడుగుతావవి... బొంబాయిలో ఎంతోమంది ధనవంతులు యాభై, అరవై ఏళ్ళ వాళ్ళు... పెద్ద పెద్ద భవంతుల్లో ఎవ్వరూ లేకుండా వుంటారా... వాళ్ళు ఇలాంటి పిల్లల్ని, పెద్ద పెద్ద జీతాలిచ్చి ఇళ్ళల్లో వుంచుకుంటారా... ఈ పనిపిల్లలు మంచిగా వున్నారనుకో... వాళ్ళు చచ్చిపోయే ముందు వాళ్ళ లక్షల ఆస్తిని వీళ్ళ పేరున రాసేసి చచ్చిపోతుంటారు. నీ కూతురు అదృష్టవంతురాలైతే, ఆ పెంచుకున్నవాడు చచ్చాడనుకో. టక్కున నీ కూతురు లక్షాధికారి అయిపోతుంది."
పక్కనున్న నర్సింహ వైపు చూసి మాయ నవ్వు నవ్వాడు కుమారస్వామి.
"ఏదో మాట చలవ... మీ దయవల్ల దాని బ్రతుకు బాగుపడితే" అంతకుమించి మాట్లాడలేకపోయాడు యాదవరెడ్డి.
వాళ్ళు నలుగురూ రైల్వేస్టేషన్ చేరేసరికి బాగా తెల్లవారిపోయింది.
హైద్రాబాద్ వెళ్ళే ట్రైన్ అప్పటికే స్టేషన్లో వుంది.
ఇద్దరూ లక్ష్మిని తీసుకొని సెకండ్ క్లాస్ కంపార్టుమెంటులోకి అడుగుపెట్టారు.
వాళ్ళిద్దరూ తీరుబడిగా సీట్లలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
కళ్ళనీళ్ళతో కంపార్టుమెంటు డోరు దగ్గర నుంచుంది లక్ష్మి.
కూతురు జుత్తు నిమిరి, బుగ్గమీద ముద్దుపెట్టుకొని, కళ్ళలోకి ప్రేమగా చూసి-
"భయపడకమ్మా! నీ మంచి కోరే నిన్ను పంపుతున్నాను. నువ్వు ఎక్కడున్నా నీ వెనక నేను, మీ అమ్మ వుంటాం. నువ్వెక్కడున్నా, ఎలా వున్నా కన్న ఊరుని మరిచిపోకమ్మా..." ఆ తండ్రి హృదయంలో ఏదో తెలియని బడబాగ్ని.
"నాన్నా! నన్ను చూడ్డానికి అప్పుడప్పుడూ వస్తావు కదూ!"
"వస్తానమ్మా! ఎందుకు రాను? నేను రాకపోయినా నువ్వు బెంగ పడకు. బాధపడకు ఆ యిద్దరు మావయ్యలూ చాలా మంచివాళ్ళు. నీకేదైనా బాధ కలిగితే వాళ్ళిద్దరితో చెప్పుకో. ఏం..."
అమాయకంగా తలూపింది లక్ష్మి.
ఫ్లాట్ ఫారమ్మీద అలజడి పెరిగింది.
దూరంగా రెడ్ లైటు గ్రీన్ లైటుగా మారింది.
"అమ్మా లక్ష్మీ! ఎవరికీ ఎప్పుడూ భయపడకమ్మా! అమాయకంగా వుండకమ్మా! ధైర్యం... ధైర్యంగా బతుకమ్మా..." ఆ తండ్రి కళ్ళలో నుంచి పొంగిన నీళ్ళు చెంపలమీద జారి యింకిపోతున్నాయి.
ట్రైను నెమ్మదిగా కదలడం మొదలయింది.
అప్పుడు జ్ఞాపకానికొచ్చింది యాదవరెడ్డికి... గబుక్కున జేబులో చెయ్యి పెట్టాడు. అయిదువేల రూపాయల నోట్ల కట్ట చేతిలోకి తీసుకున్నాడు.
ట్రైను నెమ్మదిగా వేగం పుంజుకుంటోంది.
ఫ్లాట్ ఫారమ్మీద పరిగెడుతున్నాడు యాదవరెడ్డి.
"అమ్మా! ఈ డబ్బు నువ్వుంచుకో. నాకిక్కడ డబ్బు అఖ్ఖర్లేదమ్మా! ఈ డబ్బు..." చెయ్యి ముందుకు సాచాడతను.
తండ్రి చెయ్యి కూతురికి అందడం లేదు.
జనం మధ్యలోంచి పరుగెడుతున్నాడు ఆ తండ్రి.
డోరు దగ్గర నిల్చున్న జనం మధ్యలోంచి తండ్రి చేతిని అందుకోడానికి ప్రయత్నిస్తోంది లక్ష్మి.
లాభం లేదు... తండ్రికి ఆ చేయి అందదు. తండ్రి ముఖం ఆ పసిపిల్లకు కనబడదు.
ట్రైను ప్లాట్ ఫారం దాటిపోతోంది. మరింత వేగం పుంజుకుంది.
పరిగెడుతున్నాడు యాదవరెడ్డి.
"అమ్మా... లక్ష్మి... లక్ష్మీ..." ఊపిరిని, కన్నీళ్ళనూ బిగపట్టుకుని ఆ డబ్బును కూతురికి యివ్వడానికి తండ్రి పరిగెడుతున్నాడు.
కళ్ళనిండా నిండిపోయిన కన్నీళ్ళ వలన కళ్ళముందు ఏదో మసక! చేతిలో అయిదువేల రూపాయల నోట్ల కట్ట!
వేగంగా పరిగెడుతున్న యాదవరెడ్డికి ఎవరో మనిషి అడ్డుగా వచ్చాడు.
అంతే...
మరుక్షణంలో అతని చేతిలోని నోట్లకట్ట చెయ్యిజారిపోయింది.
గాలికి ఆ నోట్లు ఎగురుతున్నాయి.
ప్లాట్ ఫారం దాటిపోతున్న చివరి బోగీని పట్టుకుని పరిగెట్టబోయిన అతను...
కాలు జారిపోవడం, ప్లాట్ ఫారానికి, చివరి భోగీకి మధ్యపడిపోవడం...
అంతే...
క్షణాల్లో జరిగిపోయింది.
ఆ దారుణం తెలీని రైలు వెళ్ళిపోయింది.
ప్లాట్ ఫారం అంచున యాదవరెడ్డి శరీరంలోంచి ఫౌంటెన్ లా ఎగజిమ్మిన నెత్తురు చుక్కలు...
పట్టాల మీద ఎగురుతున్న వందరూపాయల మీద పడి నిగనిగమని మెరుస్తున్నాయి.
అవి నెత్తురు చుక్కలు కావు... గడ్డకట్టిన కన్నీటి చుక్కలు...
యాదవరెడ్డి రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడుతున్నాడు.
* * * *