Previous Page Next Page 
శరతల్పం పేజి 12


    "ఏమో మనకెట్ల తెలుస్తుంది?" నారాయణస్వామి ముక్తసరిగా సమాధానం చెప్పారు.
    ఈమధ్య నారాయణస్వామి ఎక్కువ మౌనంగా ఉంటున్నారు. ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా బహు సంక్షిప్తంగా మాట్లాడుతున్నారు. అది మరికొంత చిరాకుకు కారణం అయింది నాంచారమ్మకు.
    "దేనికి సరిగ్గా జవాబు చెప్పరేమండి! లచ్చమ్మ రాకుంటే నాకు పిచ్చెక్కినట్లున్నది" నాంచారమ్మ.
    నారాయణస్వామి జవాబు చెప్పలేదు. వారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. రామకిష్ణయ్య రావటం మానేశాడు. అంతేకాదు తనను ఇరకాటంలో పెట్టాడు. మిగతా ఊళ్ళోవాళ్ళు సుమారు తనను బహిష్కరించారు. ఇదంతా గురువయ్యతో తనకు కలిగిన ఆత్మీయత వల్ల. గురువయ్య కూడా ఇటు రావడం మానేశాడు. తాను దగ్గరకి తీసినవారూ తనను దగ్గరకు తీసినవారూ దూరం అయినారు. ఎందుకీ పరీక్ష ప్రభూ! ఏం పాపం చేశాన్నేను? అనుకున్నారు.
    "గురువయ్య పాటకూడా వినిపించడం లేదు. అసలు ఊళ్ళ ఉన్నరా? ఎటన్న పోయిన్రా!"
    నారాయణస్వామి మారు పలకలేదు. వారి ఆలోచన మళ్ళీ సాగింది. తాను ఓడిపోయినట్లా? ఎవరు ఓడించారు తనను? రామకిష్ణయ్య. ఎందుకు? గురువయ్యతో పాటు పుట్టదాకా పోయినందుకు? ఎందుకు వెళ్ళాడు తాను? రామకిష్ణయ్య గురువయ్యతో చేయించిన పాపానికి. పాపం చేయిస్తాడు. పరిహారం వద్దంటాడు! ఎందుకు? గురువయ్య మాలవాడు కాబట్టి! మాలవానితో ఉపకారం పొందవచ్చు.ప్రత్యుపకారం చేయరాదు! ఎంత నీచం! ఎంత నీచుడు రామకిష్ణయ్య? భగవంతుడు నీచులకే సంపద నిస్తాడా? అక్కడ ఆగిపోయాయి ఆలోచనలు. మనుషులు నీచులా? సంపద నీచమా? ఇక్కడ మొదలయింది చర్చ. సంపదలే నీచములు కావచ్చు. సామ్రాజ్యం లేకుంటే రాముడు అడవికి ఎందుకు పోయేవాడు? సంపద లేకుంటే భారతయుద్ధం ఎందుకు జరిగేది, అవును సంపదలే నీచములు. అవి మనిషితో నీచములైన పనులు చేయిస్తాము.  నహుషుడు ఇంద్రాసనం లభించగానే నీచుడు కాలేదా? మరి రామకిష్ణయ్య నీచుడుకావడం తప్పేమీ? అవును కాని తాను నీచునికి లొంగడమా?
    ఇంతలో గురువయ్య గుర్తుకు వచ్చాడు. గురువయ్య! ఎంత గొప్పవాడు! ఉపకారం చేస్తాడు. ప్రత్యుపకారం ఆశించడు. అతనితో తాను స్నేహం చేశాడు. తప్పేం? అతడు మాల. అవును. తాను అతన్ని కావిలించుకున్నాడా? అతనికి శాస్త్రాలు ఉపదేశించాడా? శాస్త్ర విరుద్దమైనపని ఏంచేశాడు తాను? ఎందుకు రామకిష్ణయ్య కి తనమీద పగ? ఎందుకు? ఎందుకు?
    సమాధానం అందలేదు. మేధస్సు శూన్యం అయింది. ఆకాశాన్ని చూచారు. చుక్కలు మిలమిలా మెరుస్తున్నాయి. వాటిలో అరుంధతి కూడా ఉందనిపించింది. అవును ఎవరు అరుంధతి? అరుంధతి ఎవరు? తాను మూర్ఖుడెందుకు కావాలి? గురువయ్యను ఎందుకు వదులుకోవాలి? రామకిష్ణయ్యనే వదులుకోవడం మేలు.....రామకిష్ణయ్యను వదులుకోవడమే. అంతే. రామకిష్ణయ్యనే వదులుకోవాలి!
    ఒక నిర్ణయానికి వచ్చేశారు నారాయణస్వామి. తుపాను తరువాత ఏర్పడ్డ ప్రశాంతతలా ఉంది వారి మనస్సు. ఇప్పుడు మనసు నిర్మలంగా ఉంది. ఏదో హాయిగా ఉంది. సుఖంగా ఉంది.
    నాంచారమ్మను చూచారు నారాయణస్వామి. ఏ లోకాల్లోనో తిరిగివచ్చి స్థిర పడ్డట్లున్నాయి ఆ చూపులు! నాంచారమ్మకు తేలికనిపించింది. సుడిగాలికి ఎక్కడెక్కడో ఎగిరిన ఆకు ఒక కొమ్మకు తాకి నిలిచినట్లనిపించింది భర్తను చూస్తే.
    "ఏమండీ! గురువయ్య ఇంటికి పొయ్యొస్తే ఒకసారి!" ఆమె మాటల్లో అభ్యర్ధన ఉంది. గుండె గాయం ఉంది. ఆతురత ఉంది.
    "అట్లనే రేప్పోత."
    ఆ మాటలు నమ్మలేకపోయింది నాంచారమ్మ. ఆమెలో సంతోషం పొంగింది. లేచి కూర్చొని భర్త చేతులు పట్టుకొని ఊపుతూ అడిగింది. "నిజంగా పోతరానండి నిజంగా.......నా......నాతోడు" అనబోయి మాట మింగేసింది.
    "పోతనన్నగద నిజంగా పోత" నారాయణస్వామి చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వు స్నిగ్ధంగా ఉంది. అలాంటి నవ్వు చూచి ఆమె చాలాకాలం అయింది.
    చంద్రోదయం అయింది. వెన్నెల విరిసింది.
    తెల్లవారి లేవగానే బయలుదేరారు స్వామి. వేపపుల్ల వేసుకొని గూడెం వైపు సాగారు. గూడానికి వెళ్ళి అలాగే ఏటికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తానని చెప్పి బయలుదేరారు. గూడేనికి వారెప్పుడూ వెళ్ళలేదు. ఆ చాయసైతం సోకలేదు వారికి. గూడెపు చాయలు చేరేవరకూ తోళ్ళ వాసన! ముక్కులు బద్దలవుతున్నాయి. ఆగి పోయారు. భరించలేక పోయారు. ఆలోచించారు. వెనక్కు మళ్ళారు. మళ్ళీ ముందుకు సాగారు. ధైర్యం చేశారు పట్టుదలతో సాగారు.
    అప్పుడే తెల్లవారింది. ఆడవాళ్ళు పొన్నలు దంచుతున్నారు. అక్కడక్కడా రోకటిపాటలు వినిపిస్తున్నాయి. మగవాళ్ళు పనుల్లోకి వెళ్ళడానికి సిద్దం అవుతున్నారు. నారాయణస్వామి ఒకణ్ణి గురువయ్య ఇంటిని గురించి అడిగాడు. అతడు నారాయణస్వామిని చూచి అదిరిపడ్డాడు. "అయ్యగారొచ్చిండు అయ్యగారొచ్చిండు." అని కేకలు వేశాడు. ఇళ్ళల్లో ఉన్న జనం అంతా వింత చూడ్డానికా అన్నట్లు బయటపడ్డారు. ఆడవాళ్ళు దంపుడు మాని బయటపడ్డారు. ఒకడు గురువయ్య ఇంటివైపు నడిచాడు. గుంపు సాంతం అటు నడిచింది.
    "అరే! గురువ! అయ్యగారొచ్చిండురా-ఎళ్ళు ఇవుతలికి" నలుగురు కేకలు వేశారు.
    నారాయణస్వామి ముక్కుమీద కండవావేసుకొని దూరంగా నుంచున్నారు. గురువయ్య ఉరికి వచ్చి స్వామిని చూచి దిగ్భ్రమ చెంది నిలిచిపోయాడు-వెనుకనే లచ్చమ్మ వచ్చింది. గురువయ్యకు మాటలు తడబడ్డాయి. అయినా అన్నాడు-
    "కాల్మొక్త. నాకోసం గూడేనికి వచ్చినారు! చెప్పంపుతే రాకపోయినాను......గులాపోన్ని....చెప్పుండి ఏం చెయ్యమంటరో?"
    "అమ్మగారు బాగున్నాదుండి.....కండ్లల్ల ఆడతాన్రు కాల్మొక్త.....వద్దన్నడు వస్తనంటే" లచ్చమ్మ అన్నది.
    జనం గుంపుకూడి వింత చూస్తున్నారు.
    "రావటం బంద్ చేసిన వెందుకు గురువయ్య?" నారాయణస్వామి వేసింది ప్రశ్నే అయినా గాలం అయి గుండెలో గుచ్చుకుంది గురువయ్యకు.
    "ఏం చెయ్యమంటరు కాల్మొక్త......మీ ఇంటికొస్తే పురుగులుపడి చస్త నన్నడు కోంటాయన.....అందుకే"
    నారాయణస్వామి హృదయం క్షోభిస్తుంది. రక్తం ఉడుకెత్తింది. కళ్ళు ఎర్రబడ్డాయి.
    "వాడే పురుగులు పడిచస్తడు" గుండెను చీల్చుకొని వచ్చాయి మాటలు. గునపాల్లా ఉన్నాయి. వాడిగా ఉన్నాయి. వేడిగా ఉన్నాయి.
    ఆ మాటలు పదును అక్కడ నుంచున్నవారినే ఆశ్చర్య చకితుల్ను చేసింది. చిత్తరువులా నుంచొని స్వామిని చూస్తున్నారు. స్వామి ముఖంలోకి ఎగదన్నిన రక్తం క్రమంగా దిగిపోతూంది. అప్పుడు నారాయణస్వామికే ఆశ్చర్యం అయింది తాను అలా అన్నందుకు! వారికి అంత కోపం ఎన్నడూ రాలేదు. అది గ్రహించారు స్వామి. అర్ధం చేసుకున్నాక జనాన్ని చూచారు. తననే చూస్తున్నారు. ఒక చిరునవ్వు నవ్వి మామూలు దిశకు వచ్చారు.
    జనం ఊపిరి పీల్చుకున్నారు.
    "గురువయ్యా! రామకిష్ణయ్య చెప్పింది నిజంకాదు. వస్తవా ఒకసారి ఇంటికి?" అన్నారు స్వామి.
    "వస్తనుండి అయ్యగారు-వస్త పురుగులు పడి చచ్చినా వస్త-దేవునసువంటి మీరు మా గుడిసె కొచ్చిన్రు - మా గూడేని కొచ్చిన్రు - వస్త కాల్మొక్త.....వస్త......గులాపోన్ని.....పావెలచ్చి దేవుడోచ్చిండు మన ఇంటికి.....రావె లచ్చి రా....కాల్మొక్తం అయ్యగారికి" అని ఇద్దరూ నేలమీదపడి స్వామికి మొక్కారు.

 Previous Page Next Page