అడుగు జాడలు చెట్లవెనక అదృశ్యమయ్యాయి. అక్కడ దట్టంగా గడ్డి పెరిగివుంది. కొద్ది అడుగులమేర గడ్డి ఒరిగిపోయి వుండి, అప్పుడే మెల్లగా లేచి నిలబడుతోంది - స్ప్రింగుని వదిలేస్తే యధారూపానికి వచ్చినట్లు.
అంటే, పెద్దపులి కొద్దిక్షణాలక్రితం దాకా అక్కడే పడుకుని ఉందన్న మాట. ఇక్కడనుంచీ నీళ్ళమడుగు స్పష్టంగా కనబడుతోంది. పులి తనని ఇక్కడనుంచే చూసి ఉండడానికి అవకాశం వుంది.
అంటే, ఇది తనని చూసి, మడుగుని సమీపించబోతూ వుండే సమయానికి తాను వెనక్కి తిరిగి వుంటాడు. అది మెరుపు వేగంతో తిరిగి వెళ్ళిపోయింది.
ఇది పులి ప్రవర్తనకు విరుద్ధం! తనని చూసి తప్పించుకుపోయే ప్రయత్నం చేయలేదు ఈ పులి! నిశ్శబ్దంగా తన మీదకు ఉరకాలని చూసింది.
దీనినిబట్టి ఈ పులి నరమాంసానికి అలవాటు పడుతూ ఉందనుకోవచ్చా ? మనిషి అంటే ఇప్పుడిప్పుడే భయం పోతుందా దానికి ?
ఈ విషయంలో పెద్దపులికీ, చిరుతపులికీ ఒక ముఖ్యమైన తేడా వుందని తెలుసు సందీప్ కి. ఎన్ని వందలమంది మనుషులను చంపినా, మనిషి అంటే భయం చావదు చిరుతకు. అందుకే అది సాధారణంగా రాత్రిపూట మాత్రమే మనుషులని దొంగచాటుగా చంపుతుంది! పట్టపగలు కూడా నిర్భయంగా మనుషులమీద పడేది పెద్దపులే! అందుకనే, మనుషులని తినమరిగి చిరుతను చంపడం కంటే, మాన్ ఈటర్ గా మారిన పెద్దపులిని చంపడం సులభం.
మరో విషయంకూడా, ఈ పులి నరమాంసానికి అలవాటు పడ్డదేమో అన్న అనుమానం కలగజేస్తోంది. తాము ఇంకా అడవి ప్రారంభంలోనే వున్నాం. అడవి అంచున వున్న పల్లెలదాకా ఈ పులి వస్తోందంటే, అడవిలో దానికి సహజ ఆహారమైన జింకలూ, దుప్పులూ, అడవి పందులూ దొరకడం లేదన్నమాట. లేదా వాటిని అది వేటాడి చంపలేక పోతోందన్నమాట.
జంతువులని వేటాడడానికి పులి తన వేగాన్నీ, గోళ్ళనీ, కోరలనీ ఆయుధాలుగా వుపయోగిస్తుంది. ఈ పులి వయసులోనే వుంది కాబట్టి స్పీడు తగ్గివుండే అవకాశం లేదు. ఒకవేళ స్పీడు తగ్గివుంటే, కాలుకి వున్న లోపం ఏదో దానికి కారణం అయివుండాలి. పులి అడుగుజాడలని బట్టి ముందు కాలుకి ఏదో అవకరం వుందని అర్థమవుతూనే వుంది. ఎవరో పులిని వేటాడబోయి, చంపలేక, కేవలం గాయపరచి వదిలేసి వుండవచ్చు. లేదా, ముళ్ళపందులతో పులి పోరాడినప్పుడు వాటి ముళ్ళు విరిగి దాని శరీరంలో గుచ్చుకొని లోపలే వుండిపోవడం, ఆ గాయాలు సెప్టిక్ కావడం తరచుగా జరుగుతుంది. అందువల్ల పరుగెత్తి వేటాడే శక్తి నశించి తను సులభంగా చంపగలిగే మనుషులమీద పడుతుంది.
ఇది కూడా అలాంటి కేసే అయి ఉండవచ్చు.
కొన్ని గడ్డిపరకలకు రక్తం అంటుకొని ఉంది.
వెంటనే జీపువైపు చూశాడు సందీప్. భూతాలరాజు లేడు !
అతని గుండె ఝల్లుమంది. కొంపదీసి భూతాలరాజుని పొట్టన పెట్టేసుకుందా ఈ మాన్ ఈటర్? ఇంక తనకి దారి ఎవరు చూపిస్తారు ? తన ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదా ?
రక్తపు చుక్కలని అనుసరించి వెళ్ళాడు. ఒకచోట మడుగులాగా, జేగురురంగులో గడ్డ కట్టిన రక్తం.
బలహీనంగా ఒక పసిపాప ఏడుపు వినిపించింది.
నొసలు చిట్లించి, ముందుకు నడిచాడు సందీప్ హృదయ విదారకమైన దృశ్యం కనబడింది.
ఒక నడివయస్సు స్త్రీ శవం. పూర్తి నగ్నంగా ఉంది ఆమె. పాదాల దగ్గరనుంచీ నడుముదాకా తినేసింది పులి. ఒక పసిపాప తల్లి రొమ్ములని నీరసంగా చప్పరిస్తోంది పాల కోసం. పాలు రాకపోయేసరికి ఏడుస్తోంది. తనతల్లి చనిపోయిందని అర్థం చేసుకునే వయసు కూడా లేదు ఆ పాపకి.
గుండె నీరయిపోయింది సందీప్ కి. ఆప్యాయంగా చేతులు జూస్తూ ఆ పాప వైపు నడిచాడు.
కానీ అప్పటికే ఆలస్యమయిపోయింది. ఒక రోజంతా చుక్కపాలు లేకుండా, గుక్కపట్టి ఏడుస్తున్న ఆ పసిపాప కళ్ళు తేలవేసి, ప్రాణాలు వదిలేసింది.
ఏం చెయ్యాలో తోచలేదు సందీప్ కి. ఆ తల్లీ కూతుళ్ళు శవాలని అనాధ ప్రేతాలలాగ అక్కడే వదిలేసి వెళ్ళిపోవడానికి అతనికి మనస్కరించలేదు. అలాగని తను పల్లెకి వెళ్ళి ఆ జనంతో మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు. తను పారిపోయిన ఖైదీ అని ఎవరైనా గుర్తించి పోలీసులకి అప్పగిస్తే, తను జాగ్రత్తగా వేసుకున్న ప్లాను పాడయిపోతుంది.