విమానంలో ప్రయాణికులు సీటు నెంబర్లు చూసుకుని కూర్చుంటున్నారు. ప్రింటెడ్ సిల్కు చీరలు కట్టుకున్న ఎయిర్ హోస్టెస్ లు ఇద్దరూ, నేవీ బ్లూ రంగు పాంట్లూ తెల్ల షర్టులూ వేసుకున్న స్టివార్టులు ఇద్దరూ వాళ్ళకి సాయం చేస్తున్నారు.
ఏదో పనిమీద కిందకు దిగి టెర్మినల్ బిల్డింగులోకి వెళ్ళిన సవ్యసాచి హుందాగా పెద్దపెద్ద అంగలు వేస్తూ విమానంవైపు తిరిగి వస్తున్నాడు. దాదాపు అయిదు వేలరూపాయల జీతమేకాక, నైట్ హాల్టు లాంటి అవలెన్సులూ నెలకి పదివేల రూపాయలదాకా వస్తాయి.
ప్లేన్ కాక్ పిట్ లో కో పైలట్ వినోద్ కూర్చుని వున్నాడు. సవ్యసాచి కంటే జూనియర్ అతను. సవ్యసాచి ఎంత రిజర్వుడుగా ఉంటాడో ఇతను అంత కేర్ ఫ్రీ.
సీట్లో కొంచెం వెనక్కి తిరిగి కేబిన్ డోరు దగ్గర నిలబడివున్న ఎయిర్ హోస్టెస్ ని పిలిచాడు "మోనికా?"
మోనికా అతనివైపు తిరిగి "ఏమిటి?" అంది.
"ఒకసారి ఇలారా!"
"ఎందుకు?" అంది అనుమానంగా! సవ్యసాచి లేకపోతే కాక్ పిట్ లోకి వెళ్ళడానికి సంకోచమే తనకు!
"ఈ డయల్ వైపే చూస్తుండు. రీడింగు ఎంత వచ్చిందో చెప్పు నాకు ఓకే?"
వంగి డయల్ వైపు చూస్తోంది మోనికా? వినోద్ రవి తన చేతిని ఆమె పిరుదుల మీదికి పోనిచ్చి చిన్నగా గిచ్చి "ఇందుకే పిలిచాను. బాగుందా?" అన్నాడు నవ్వుతూ.
ఒక్క ఉదుటున వెనక్కి జరిగింది మోనికా. "ఉత్త యానిమల్ వి నువ్వు! నువ్వింక మారవు?" అంది కోపంగా.
తను విసురుగా వెనక్కి రావటంతో అప్పుడే ఎక్కుతున్న ఒక పెద్ద మనిషిని తగిలింది.
"ఐయామ్ సారీసర్! ఎక్స్యూజ్ మీ?" అంది తొట్రుపడుతూ. "నమస్తే! ఇటు రండి!"
తెల్లగా, పొడుగ్గా కింగ్ సైజు సిగరెట్ లా ఉన్నాడాయన? తెల్లటి పట్టుకుచ్చులా ఉన్న జుట్టు, పాలనురుగులా ఉన్న తెల్లసూటు, తెల్లటి చిరునవ్వు, ప్రశాంతంగా ఉన్న మొహం.
ఆయన్ని చూడగానే, ఎంతటి భయంలో ఉన్నవాడికయినా ధైర్యం కలుగుతుంది.
"నా పేరు సుభాష్ చంద్రబోస్!" అన్నాడాయన చిరునవ్వుతో. 'నీ పేరేమిటి యంగ్ మిస్?"
"మోనికా!" అని చిరునవ్వు నవ్వి, ఆయనకి సీటు చూపించింది తను.
ఈ లోపల మరో పెద్దమనిషి ఎక్కాడు. అట్టే తెలివైనవాడిలా కనబడటం లేదు. దళసరి కళ్ళద్దాలు, అయోమయంగా అటూ ఇటూ చూస్తున్నాడు. రెండు పాదాలకీ రెండు సాక్సు వేసుకుని ఉన్నాడు.
"నా...సీటు...ఎక్కడ? ఎక్కడ?...నేను సుందరం...ప్రొఫెసర్ సుందరం" అన్నాడాయన తికమకగా.
"ఈయనొక ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అని వేరే చెప్పనక్కరలేదు" అనిపించింది మోనికాకి తను నవ్వేస్తానేమో అని భయపడుతుండగానే పక్కనే నిలబడి ఉన్న మరో హోస్టెస్ అనుపమా గంగూలీ అంతపని చేసేసింది. అంతలోనే నవ్వును తొక్కిపట్టేసి, "వేర్ ఈజ్ కాటన్ రే?" అంటూ మాట మార్చేసి, అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
ఆ వెనకనే ఒక లేడీ పాసెంజర్ ఎక్కింది. తను ప్రెగ్నెంటు. తొమ్మిది నెలలూ నిండినట్లు కనబడుతోంది. ఇవాళో రేపో డెలివరీ అయ్యేటట్లు ఉంది. మోనికా, అనుపమా కలిసి ఆమెని జాగ్రత్తగా సీట్లో కూర్చోపెట్టి, సౌకర్యంగా ఉండేటందుకు రెండు దిళ్ళు అమర్చారు.
కాక్ పిట్ లో ఇన్ స్ట్రుమెంట్ పానెల్స్ అన్నీ పరికించి చూసి సీట్లో నిటారుగా కూర్చున్నాడు పైలట్ సవ్యసాచి. అతని పక్కనే ఉన్న కోపైలట్ సీట్లో వినోద్ రవి ఉన్నాడు. మరో సీట్లో ఫ్లయిట్ ఇంజనీర్ కూర్చుని ఉన్నాడు.
విమానము ప్రయాణానికి సిద్ధంగా ఉంది.
ఇక కంట్రోల్ టవర్ వాళ్ళు ఇంజన్లు స్టార్టు చెయ్యడానికి పర్మిషన్ ఇవ్వాలి. అంతే.
ఎయిర్ పోర్టు లాంజ్ లో, రెస్టారెంట్ లో ఉన్న స్పీకర్లలో మళ్ళీ అనౌన్స్ మెంట్ వినబడింది.
"అటెన్షన్ ప్లీజ్! దిసీజ్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ టూ మిస్టర్ జి. కృష్ణకుమార్ పాసెంజర్ టూ ఢిల్లీ! ఢిల్లీ వెళ్ళే పాసెంజర్ జి. కృష్ణకుమార్ వెంటనే సెక్యూరిటీకి రిపోర్టు చెయ్యాలి. ఇదే చివరి పిలుపు. థాంక్యూ!"
కృష్ణకుమార్ టిక్కెట్టుతో వస్తున్న రాజేందర్ టాక్సీ ఎయిర్ పోర్టుకి ఇంకా కిలోమీటరు దూరంలో ఉంది.
విమానం మెట్లమీద నిల్చుని, లాంజ్ పైన టెర్రెస్ లో నిలబడి ఉన్న తల్లివైపు చూస్తూ, చెయ్యి ఊపుతోంది ఆ స్మిత అనే పాప. దూరంగా ఉన్న ఆ తల్లి కళ్ళలో కొద్దిగా ఆందోళన మెదులుతోంది. పాపని ఒక్కదాన్నే పంపడం అదే మొదటిసారి. మొదట్లో ఇద్దరూ కలిసే వెళ్ళాలని టిక్కెట్లు కూడా బుక్ చేసుకుంది గానీ, చివరి గంటలో అనుకోని పరిస్థితులు ఎదురై, తను ప్రయాణం కాన్సిల్ చేసుకుంది. కానీ అప్పటికే ప్రయాణం సరదాలో పడిపోయిన స్మిత మాత్రం వూరుకోలేదు. "రెండు గంటల ప్రయాణమే కదా! నేనొక్కదాన్నే వెళతాను" అని మొండికేసింది.
రెండు గంటల ప్రయాణమే! అయినా....
పాప భుజంమీద మృదువుగా చెయ్యి వేసింది ఎయిర్ హోస్టెస్ మోనికా. "ఇంక లోపలికి వచ్చేయ్ స్వీటీ! నీ పేరేమిటి?"
"స్మిత! నీ పేరేమిటక్కా?" అంది స్మిత చొరవగా వరస కలిపేస్తూ.
"మోనికా."