Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 13


    "ఇంకొద్ది నిముషాల్లో! గొప్ప తమాషా జరుగబోతోంది!" అన్నాడు బాలూ ఉత్సాహంగా.


    "ఇంతకీ ఏం ఫంక్షన్ ఇదీ?" అన్నాడు కాశీ. "మేడమ్ గారి బర్త్ డే బాస్! దానికి తోడుగా, ఆసియాలో ఎక్కడా లేనంత పెద్ద ఫ్యాక్టరీ ఒకటి పెడుతోంది గదా ఆవిడ!"


    "ఏం ఫ్యాక్టరీ!" అన్నాడు కాశీ ఆసక్తిగా.


    "నోటితో చెప్పడమెందుకు దోస్త్! అటు చూడు!"


    చూశాడు కాశీ.


    అతని కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి.


    అక్కడ ఒక పెద్ద కేటర్ పిల్లర్ ట్రక్కు మీద రెండస్తుల భవనం సైజులో ఉంది ఒక సీసా!

    
    దానిమీద చాలా అట్రాక్టివ్ గా ఉన్న లేబులు!


    "శ్రీ అండ్ లక్కీ"


    లేబుల్ మీద ఇద్దరమ్మాయిల బొమ్మ ఉంది.


    ఇండిపెండెన్స్ డేకి పెరేడ్ గ్రౌండ్ లో ఊరేగింపుగా ఫ్లోట్స్ వస్తాయే అలా ఉంది ఆ బ్రహ్మాండమైన సీసా. ట్రక్కు నెమ్మదిగా కదుల్తోంది. ట్రక్కు ముందర అటొకడూ ఇటొకడూ కొయ్యకాళ్ళమీద నడుస్తూ వస్తున్నారు. ఆ వెనక బ్యాండ్ - ఉద్వేగం కలిగించే మ్యూజిక్.


    ట్రక్కు వచ్చి తోట మధ్యలో ఆగింది. బాగా దగ్గరికొచ్చాక తెలుస్తోంది, అది ఒక రేకు సీసా - దానిమీద కలర్స్ వేశారు. నాచురల్ గా కనబడుతోంది - నిజం సీసాలాగే ఉంది చూడడానికి!


    "ఇంక మొదలవుతుంది! ఇంక మొదలవుతుంది!" అంటున్నాడు బాలు ఉత్సాహంగా.


    కానీ కాశీ అది వినిపించుకోవడం లేదు - కళ్ళార్పకుండా చూస్తున్నాడు. అతనికి కడుపులో తిప్పుతున్నట్లు ఉంది.

    
    లిక్కర్ ఫ్యాక్టరీ!


    అంటే


    ఇండియాలో తయారయ్యే విదేశీ సారా! ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్! IMFL! తయారు చేయబోయేది ఐశ్వర్య!


    చిన్నప్పట్నుంచీ అమెరికాలోనే పెరిగిందా ఆ అమ్మాయి? అయితే మరి తను ఎక్కడ చూశాడూ?


    బాండ్ మేళం ఊపు అందుకుంది.జనంలో ఉత్సాహం - కేరింతలు. బ్రహ్మాండమైన సారా బుడ్డి. రాంలీలా ఉత్సవంలో రావణాసురుడి బొమ్మలా నెమ్మదిగా మళ్ళీ కదలడం మొదలుపెట్టింది.


    ఇంతలో


    ఉన్నట్లుండి ఇంకోరకం కేకలు - అరుపులు!


    అవి కడుపునిండిన వాళ్ళ కేరింతలు కావు. కడుపు మండిన వాళ్ళ క్రోధపు ఛాయలు.


    ఆ కేకలు క్రమంగా పెద్దవవుతున్నాయ్. వాళ్ళు ఏమని అరుస్తున్నారో, ఎందుకు అరుస్తున్నారో కాశీకి అంతుబట్టడంలేదు.


    బాలూ కాశీకి చెబుతున్నాడు.


    "దీని తిక్క తిన్నగా కుదురుతుంది ఇవాళ! వాళ్ళెవరనుకున్నావ్! సారా వ్యతిరేకోద్యమం సభ్యులు! ఈవిడ ఆసియాలోకెల్లా అతిపెద్ద లిక్కర్ ఫ్యాక్టరీ పెడుతుంది కదా - పెట్టకూడదని వాళ్ల డిమాండు!"


    బయట కేకలు పెడుతున్న గుంపు క్రమక్రమంగా పెద్దదవుతోంది. సారా వ్యతిరేకోద్యమాన్ని అదో తపస్సుగా చేస్తున్న స్త్రీలు అందులో కొందరున్నారు. ఉబుసుపోకకి ఉద్యమాలు నడిపే మొగరాయుళ్ళు కొందరున్నారు. ఏవిధమైన కమిట్ మెంటు లేకుండా, అప్పటికప్పుడు ఆవేశానికి లోనై గుంపులో చేరేవాళ్ళు ఎక్కువమంది ఉన్నారు. ఈ మూడో కేటగిరీ వాళ్ళ వల్లనే ఉద్యమాలకి పాలపొంగు ఎఫెక్టు వస్తుంది. వాళ్ళు ఎక్కువ సంఖ్యలో చేరారా - పాలు పొంగినట్లే! వాళ్ళు తప్పుకున్నారా - పొంగు చల్లారిపోయినట్లే!


    చూస్తూ ఉండగానే గుంపు పెద్దదయిపోతుంది.


    ఉద్యమ నాయకులు నిజాయితీగా నినాదాలు ఇస్తున్నారు. పాలపొంగు జనం మాత్రం నిగ్రహం లేకుండా తిట్లూ, శాపనార్థాలూ లంకించుకున్నారు.


    ఇదంతా చూసి, అసలే ఎర్రగా ఉండే ఐశ్వర్య మొహం మరింత కందిపోయింది.


    "ఏమిటీ గోల?" అంది చిరాగ్గా.


    ఉబుసుపోకకి ఉద్యమాలలో దూరే రామలింగం గారు కీచుగొంతుతో అరిచి ఏదో చెప్పాడుగానీ అదెవారికీ బుర్రకెక్కలేదు.


    స్త్రీలలో ఒక నాయకురాలు సౌమ్యంగా చెప్పింది.


    "చూడమ్మా! చిన్నపిల్లవి! దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు"


    "దేవుడి సంగతి వదిలెయ్యండి! అసలు సంగతి చెప్పండి" అంది ఐశ్వర్య. ఆమె తెలుగు మాట్లాడినా కూడా ఇంగ్లీషు మాట్లాడినట్లే ఉంటుంది.

 Previous Page Next Page