Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 12


    "మాట వరసకి అంటున్నాను. ఆస్తి ఎవరికి చెందుతుంది లక్కీ?"


    "అమ్మకి"


    "అమ్మా! ఎవరికి అమ్మ! నాకు కాదు - ఆమె నా సవతి తల్లి! మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది"


    అనుమానంగా ఐశ్వర్య వైపు చూసింది లక్కీ.


    "అంటే... ఏమిటి నువ్వంటున్నది?"


    "ఉన్నమాటే! ఈ డెసర్ట్ ఎవరు ఆర్డరు చేశారు? ఎవరి అజమాయిషీలో ఇదంతా జరిగింది?" మాటల కోసం తడుముకుంటూ అంది లక్కీ.


    "అమ్మ"


    "అమ్మ అనకు! పార్వతి అను!"


    "శ్రీ - కళ్ళు పోతాయి!"


    "కళ్ళు పెట్టుకు చూడమంటున్నాను"


    "నువ్వు రాంగ్ ట్రాక్ లో ఊహిస్తున్నావు శ్రీ! అమ్మ డెసర్ట్ ఆర్డర్ చేసింది. కానీ దగ్గర ఉండి తెచ్చింది నేను కదా - ఆ లెఖ్ఖన నేను విషం కలిపి ఉండకూడదా?"


    చటుక్కున తన స్నేహితురాలి దగ్గరికి చేరి ఆమెని కావలించేసుకుంది ఐశ్వర్య.


    "లక్కీ! నాకు తెలుసు! నేను నీ ప్రాణం! నీ ప్రాణాన్ని నువ్వే ఎందుకు తీసుకుంటావ్! ఇది ఆవిడ చేసిన పనే!"


    "అలా అని నువ్వు..."


    లక్కీని వారించి, తోటలో జరిగిన ఇన్సిడెంట్ ని గురించి చెప్పింది ఐశ్వర్య.


    నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయింది లక్కీ. చాలాసేపటి తర్వాత నిదానంగా అంది.


    "ఉన్న గొడవలన్నింటికీ తోడు ఇదో కొత్త గొడవా?"


    "ఏం గొడవలు లక్కీ?"


    "మన వియత్నాం ప్లాంట్ లో..."


    "నైక్?" అంది ఐశ్వర్య.


    "యా!"


    "ఓహ్ షిట్!" అంది ఐశ్వర్య.


    "అక్కడి మన ఫ్యాక్టరీకి "రాక్షసి కొలిమి" అని పేరుపెట్టారు ఈ లేబర్ యాక్టివిస్టులు. మనం అక్కడి లేబర్ ని దారుణంగా ఎక్స్ ప్లాయిట్ చేసేస్తున్నామని ఒకే ఏడుపు!"


    "కేసు సీరియస్సా?" అంది ఐశ్వర్య అనుమానంగా.


    "వెరీ సీరియస్! వెరీవెరీ!" అంది లక్కీ.


    కొద్దిగా ఆలోచనలో పడింది ఐశ్వర్య.


    ఇది మామూలుగా అయితే రొటీన్ వ్యవహారమే! ఇంటర్నేషనల్ బ్రాండు వస్తువుల్ని తయారుచేసే కంపెనీలు ఉంటాయి. తమ ప్రాడక్ట్స్ ని విపరీతమైన ధరలకి అమ్మకాలు చేస్తాయి. కానీ తయారీమాత్రం డెవెలప్ డ్ కంట్రీస్ లో కాకుండా పేద దేశాల్లో ఫ్యాక్టరీలు పెట్టించి, వాటిని సబ్ కాంట్రాక్టుకి ఇచ్చేసి చేయిస్తూ ఉంటాయి. అక్కడి పేద ప్రజల చేత తక్కువ జీతాలకి పని చేయిస్తూ నూటికి వెయ్యిశాతందాకా లాభాలు చేసుకుంటాయి. "నైక్" షూస్ ఫేమస్ ఇంటర్నేషనల్ బ్రాండ్. వాటిని వియత్నాంలో, జావాలో అక్కడా చేస్తూ ఉంటారు. వియత్నాం సబ్ కాంట్రాక్ట్ ఐశ్వర్య తీసుకుంది. అక్కడి వర్కర్ లకి రోజుకి ఒకటిన్నర డాలర్లు ఇస్తారు. వాళ్ళు రోజుకి వేలకొద్దీ షూస్ తయారు చెయ్యాలి. ఆ షూస్ షాపుల్లో రెండొందల డాలర్లకి అమ్ముతారు. ఇండియన్ కరెన్సీ అయితే ఆరు వేలు, ఏడు వేల రూపాయల ధర! ప్రొడక్టవిటీ పెంచడానికి తను ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకుంది. తన ఫ్యాక్టరీ వర్కర్స్ లో ఎక్కువమంది ఆడవాళ్ళే. వాళ్ళు రోజూ రెండొందల జతల షూస్ తయారు చేస్తారు. కోటా మూడొందల జతలకి పెంచింది తను. కంపల్సరీగా ప్రతివాళ్ళూ రోజూ కొన్ని గంటలపాటు ఎక్స్ ట్రాగా ఓవర్ టైం చేసి తీరాలని రూలు పెట్టింది. హాలిడేస్ బాగా తగ్గించేసింది.


    తప్పేముంది?


    వాళ్ళు ఒళ్ళొంచి పనిచెయ్యకపోతే తనకి లాభాలు వస్తాయా?

    
    ఆ మాత్రం దానికే ఈ యాక్టివిస్టులు ఏదో కొంప మునిగిపోయినట్లు పెద్ద గొడవ! బుల్ షిట్!


    "శ్రీ! వియత్నాం ప్లాంట్ విషయంలో పెద్ద గొడవే జరిగేటట్లుగా ఉంది" అంది లక్కీ ఆమె ఆలోచనలకు అడ్డం వస్తూ.


    "జరిగితే జరగనీ!" అంది ఐశ్వర్య కేర్ లెస్ గా.


    "శ్రీ! చీప్ లేబర్ మస్తుగా ఉంది కదా అని కొన్ని కంపెనీలు ఇండియాలో పెడదామని చూస్తున్నాయి. వాటిమీద దీని ఎఫెక్టు ఉంటుందేమో!" అంది లక్కీ.


    "నా మీద ఎవరి ఎఫెక్టూ ఉండదు, నీ ఎఫెక్టు తప్పిస్తే. నువ్వు డల్ గా అయిపోయి నన్ను నిరుత్సాహ పరిచేయకు! పద పద! పనులు చూడు!" అంది ఐశ్వర్య.


    "హెచ్చరించాను. మనసులో పెట్టుకో!" అంది లక్కీ.


    సాయంత్రం ఆరు గంటలకి ఫంక్షను మొదలయింది. తోటలో పూలు రాసిపడ్డట్లుగా అందంగా అలంకరించుకున్న ఆడవాళ్ళు. ఫ్యాషనబుల్ గా ఉన్న మొగవాళ్ళు. ధోతీ, లాల్చీల రాజకీయవేత్తలు, సఫారీ సూట్లు, పియరీ కార్డిన్ పర్సనల్ గా డిజై చేసిన సూట్లు - గ్లామరస్ గా ఉంది వాతావరణం.

 Previous Page Next Page