ఉద్యమ నాయకురాలు సహనంగా చెప్పింది.
"పదిలక్షల జన్మలు క్రిములుగా, కీటకాలుగా, పశుపక్ష్యాదులుగా పుట్టాకగానీ మానవజన్మ దొరకదు. దొరికిన మానవజన్మని సద్వినియోగ పరుచుకుని మోక్షం సంపాదించే మార్గం చేసుకోవాలిగానీ, తప్పుడు పనులుచేసి మళ్ళీ తక్కువ జన్మకి జారిపోకూడదు. అసలు సారా తాగడమే తప్పు. సారా అమ్మడం ఇంకా తప్పు. సారా తయారు చెయ్యడం అంటే ఇంక రౌరవాది నరకాలకి రహదారి వెతుక్కోవడమే!"
చెంపమీద ఛెళ్ళుమని కొట్టినట్లయింది కాశీకి.
ఈ మాటలు తను విన్నాడు!
ఇవే మాటలు తను విన్నాడు! నిజంగానే!
కానీ... కానీ...
ఎప్పుడు విన్నాడు తను?
ఎవరు చెప్పారు! ఏ సందర్భంలో?
ఎప్పుడు...? ఎవరు...? ఎప్పుడు...? ఎవరు?
కడుపులో దేవుతున్నట్లు అవుతోంది కాశీకి.
కళ్ళు తిరుగుతున్నట్లుగా అవుతోంది. కాళ్ళు బలహీనమై పోతున్నట్లుగా ఉంది.
మైకం కమ్మినట్టు అయిపోతోంది. నినాదాలు మరింత పెద్దగా వినబడుతున్నాయి.
"వద్దు వద్దు వద్దు! సారా వద్దు! సారా వద్దు! సారా వద్దు!"
ఒక చెట్టు మొదలుకు ఆనుకుని శోష వచ్చినట్లుగా కూర్చుని ఉన్నాడు కాశీ. డ్రౌజీగా అయిపోతోంది అతని మైండు.
"వద్దు వద్దు వద్దు! సారా వద్దు! సారా వద్దు! సారా వద్దు!" అతలాకుతలమై పోయింది అతని మనసు. "పదిలక్షల జన్మలెత్తాక గానీ మానవజన్మ లభించదు. దాన్ని మనం వృధా చేసుకోకూడదు. మంచిపనులు చేసి..."
"సారా వద్దు! సారా వద్దు! సారా వద్దు!"
క్రమంగా అన్ని గొంతులూ కలిసిపోయినట్లయింది. ఇప్పుడు ఒకే గొంతు వినబడుతోంది కాశీకి. అది ఒక స్త్రీ గొంతు. ఆ గొంతు నిండా విషాదం. భయం. వణుకుతున్న గొంతుతో అంటోంది. ఆమె గొంతు అతని చెవులకి వినబడటం లేదు. మనసుకి వినబడుతోంది.
"ఏమండీ! వద్దండీ! ఈ అలవాటు మానెయ్యండీ! సారా మీరు తాగుతున్నారు. తాగడమే కాదు. అమ్ముతున్నారు కూడా! మనకెందుకీ ఖర్మండీ! ఇంతాస్తి ఉండి ఇంకా సారా అమ్మకాలు చేసి సంపాదించాలనుకోవడం తప్పండీ! సంసారాలు నాశనమైపోతాయండీ! బతుకులు బజార్నపడతాయండీ, ఏమండీ! నా మాట వినండీ! వినరూ?"
ఎంతో జాలిగా, ఎంతో దీనంగా... ఎన్నో సంవత్సరాల క్రితం పలికిన పలుకులకి ప్రతిధ్వనిలా... చెవికి వినబడని, మనసుకి వినబడుతున్న ఆ గొంతుని ఇంకా స్పష్టంగా వినాలని ప్రయత్నిస్తున్నాడు కాశీ. ఎవరి గొంతు అది? ఎక్కడ విన్నాడు తను? ఎంతకాలం క్రితం?
చుట్టూతా చూడబోయాడు కాశీ. తల కదల్చలేకపోయాడు. కానీ చిత్రంగా తన బాడీ తనకు కనబడుతున్నట్లయింది. గాల్లో తేలుతున్నాడు తను! పైనుంచి చూస్తున్నట్లు భ్రమ! అక్కడ నుంచి చూస్తే... కింద చుట్టూతా చెట్లు... మధ్యలో...
కళ్ళు చిట్లించి చూశాడు కాశీ.
కొన్ని సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ బ్లాక్ అండ్ వైట్ లో చూపించినట్లుగా, అతనికి అక్కడ ఉన్న దృశ్యమంతా సెపియా కలర్ లో కనబడుతోంది. దిగులుగా ఉండే లేత పసుపురంగులో! తోటా, తోటలో చెట్లూ, చెట్ల మధ్య మనుషులూ - అందరూ వెలిసిపోయిన పాత ఫోటోలోలాగా పసుపుపచ్చ రంగులో కనబడుతున్నారు.
దాదాపు ఒక వందమంది ఉంటారు వాళ్ళు. కానీ, అరె... అదేమిటీ... వాళ్ళ డ్రెస్సులు అలా ఉన్నాయ్. పాతకాలపు ఫోటోల్లోలాగా! ఆడవాళ్ళందరూ బంపర్ జాకెట్టు, పమిటకి బ్రూచ్ లు. మెళ్ళో చంద్రహారాలు, జిగినీ గొలుసులు, మామిడి పిందెల నెక్లెస్ లు, భుజాలకి నాగవత్తులు, నడుముకి వడ్డాణాలు, కాళ్ళకి పాంజేబు పట్టాలు, జడలో, పాపిట్లో అలంకారాలు. మొగవాళ్ళు చాలామంది ధోవతులు కట్టుకుని ఉన్నారు. కొంతమంది షర్టులు ధోవతి లోపలికి టక్ చేసుకుని ఉన్నారు. నడుముకి బెల్టులు, షర్టుల పైన కోట్లు, కోట్ల జేబుల్లో నుంచి బయటికి కనబడుతున్న పాకెట్ వాచీ గొలుసులు. కొందరి నెత్తిన తలపాగాలు. కొందరు సూట్లు వేసుకుని ఉన్నారు.
ఎప్పుడో యాభై ఏళ్లక్రితం బతికిన మనుషులు వేసుకునే రకం బట్టలు అవి!
కాశీ దృష్టి వాళ్ళలో ఒకడిమీద పడింది. అట్టతో చేసినట్లు గట్టిగా ఉండే ఖాకీ రంగు టోపీ పెట్టుకుని ఉన్నాడు. హిట్లరు మీసాలు. ఖాకీ బుష్ కోటు - ఖాకీ నిక్కరు. మోకాళ్ళదాకా వచ్చే మేజోళ్ళు. టకటకలాడే లెదర్ బూట్లు, చేతిలో గన్!
అచ్చం వేటకు బయల్దేరిన ఇంగ్లీషు దొరగారిలా ఉన్నాడు అతను.
ఇతన్ని ఎక్కడో చూశాడు తను! నిశ్చయంగా! ఎక్కడా...? ఎక్కడా...? ఎక్కడా...?
హఠాత్తుగా కాశీ గుండె అదిరిపోయినంత పని అయింది!
అతన్ని ఎక్కడో చూడడం ఏమిటి?
ఆ కనబడుతున్నది తనే!