"మమ్మీ! అందరిళ్ళల్లో మా ప్రయాణానికి పెద్దవాళ్ళ ఆమోదం లభించింది. కాసిని అక్షింతలు...ఆ తర్వాత ఆశీస్సులు కూడా లభించాయనుకో. ఇంకా నా ప్రయాణమే సాంతం తెలియలేదు. నీవు "ఊ" అనటమే ఆలస్యం..." తల్లి ముఖంలోకి పరీక్షగా చూస్తూ అంది వందనాదేవి.
"నేను మీ నాన్నగారి దగ్గర "ఊ" అనేశాను. ఇప్పుడు "ఊ" అంటున్నాను. ఇంక నీ యిష్టం. మీరంతా అంత సరదా పడుతుంటే నేనెందుకు కాదనాలి. పిల్లలకి నగలు చేయించడం...చీరలు కొనడం... అదొక్కటేకాదు ముచ్చట. వాళ్ళకున్న కోరికలు తీర్చడంలో కూడా ముచ్చట ఉంది." శారద మృదువుగా చెప్పింది.
"ఈ ప్రయాణం విషయంలో మమ్మీ మొదటనించి అడ్డుపుల్లలు వేస్తూనే వుంది. అలాంటిది ఒక్కసారిగా మారిపోయి స్నేహితురాళ్ళ ముందు తన పరువు నిలబెడుతూ ఆనందంగా ప్రయాణానికి ఒప్పేసుకుంది. ఇంకేం కావాలి?" థాంక్స్ మమ్మీ" అని చెప్పి తండ్రివైపు చూసి "సాధించారే" అన్నట్టు చూపులతోనే ప్రశ్నించింది వందనాదేవి.
"ఈ రాజారావంటే ఏమనుకుంటున్నావ్ బేబీ!" అన్నట్టు గొప్పగా చూశాడు రాజారావు.
"మీరు చాలా మంచివారు ఆంటీ!" అంటూ స్నేహితురాళ్ళు శారదని అభినందించారు.
"పెడితే పెళ్ళికూడు...పెట్టకపోతే పిండాకూడు" అన్న సామెత ఆ సమయంలో గుర్తొచ్చింది శారదకి. "పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు" మాటల్లో మాటగా అనుకుంది.
అందరూ కలిసి ప్రయాణాల్లోని సాధక బాధల గురించి...ఇప్పటి ప్రయాణం గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
మాటల్లో పడ్డ వాళ్ళకి సమయం కూడా తెలీలేదు.
నాలుగు గంటలదాకా అలా మాట్లాడుకుంటూనే ఉండిపోయారు.
6
రైలు స్టేషన్ అంతా చాలా హడావుడిగా వుంది.
రాబోయే రైలు...పోబోయే ప్రయాణీకులు...కలగా పులగం మాటలు... అవీ ఇవీ అమ్మేవాళ్ళ కేకలతో ప్లాట్ ఫారమ్ గందరగోళంగా వుంది.
రైలు స్టేషన్ కి స్నేహితురాళ్ళు నలుగురూ వచ్చారు. వాళ్ళ దగ్గర చిన్న వి ఐ పి సూట్ కేస్ లు... తోలు బ్యాగ్ లు... వాటర్ బాటిల్స్ మూడు డబ్బాలు కూడా వున్నాయ్. ఆ మూడు డబ్బాలు సంచీలో పట్టుకోటానికి వీలుగా తాళ్ళు కట్టి వున్నాయ్. అవేమీ చిన్న డబ్బాలు కాదు. పద్దెనిమిది లీటర్ల కిరసనాయిల్ డబ్బా సైజు డబ్బాలు.
సుందర సుకుమారి బామ్మ పిండి వంటలు చేసి డబ్బాలనిండుగా కుక్కి ఇచ్చింది. ఇంట్లో వాళ్ళని ఒప్పించి వాళ్ళు మాత్రమే ప్రయాణమై స్టేషన్ కి వచ్చారు. అన్నీ బానే వున్నాయ్. ఆ పిండివంటల డబ్బాల నిండుగా...కాస్త బరువుగా వుండి ఆడపిల్లలతో ప్రయాణం చేసేవాటిగా కనిపించటం లేదు. వీళ్ళ సామాన్లకి... వీళ్ళకి దిష్టి తగలకుండా ఉండేవి వున్నాయ్. ప్లాట్ ఫారమ్ మీద అటూయిటూ వెళ్ళేవాళ్ళు వీళ్ళని... వీళ్ళ చేతిలోని అందమయిన బ్యాగులని...పెట్టెలని చూస్తున్నారు. అదే చూపుతో ఆ డబ్బాలని చూసిపోతున్నారు.
"ఈ డబ్బాలు మనతో వస్తుంటే ఏమిటోలాగుందే. ఇలాంటివి మనతో ఉంటే ఏం బాగుంటుంది చెప్పు! ఇక్కడే ఎవరికన్నా ఇచ్చి పోదాం. దారిపొడుగూతా తినే సరుకులు బోలెడన్ని దొరుకుతాయ్. కావలసినన్ని హోటళ్ళు కూడా తగులుతాయ్. చేతినిండా పుష్కలంగా డబ్బు ఉంది..." అంటూ ప్రమద ఏదో చెప్పబోయింది.
"చూడమ్మా ప్రమదామణీ! నువ్వు డబ్బాలు మొయ్యకపోతే మానెయ్...నువ్వు పిండివంటలు తినకపోతే మానెయ్...అంతేగాని పిండి వంట డబ్బాలని చిన్నచూపు చూడకు. వాటిల్లో వున్నవి మా బామ్మ చేతితో చేసిన పిండి వంటలు...నేతి పిండి వంటలు తింటే వదలవ్... తినకపోతే ఆకలేస్తుంది" అంది సుందర సుకుమారి.
"ఆ డబ్బాలేమన్నా నీకు బరువుటే! సుందరి ఒక పట్టు మనం నాలుగుపట్లు పట్టామంటే రెండ్రోజుల్లో ఒక డబ్బా ఖాళీ అయిపోతుంది. ఖాళీ డబ్బాని ఎవరో ఒకరికి దానం చేసేద్దాం. దారి పొడుగూతా పిండివంటలు తింటామని బామ్మగారికి మాట ఇచ్చాం. కనక ఇంక డబ్బాల విషయం మర్చిపో." వందనాదేవి గట్టిగా చెప్పింది.
"తీస్తే తరిగిపోతాయ్...తింటే కరిగిపోతాయ్ ఏంటది? ఈ చిక్కు ప్రశ్న విప్పండే" అంది రాణి.
"అబ్బో మాగొప్ప ప్రశ్న! నీ చిక్కుప్రశ్నకి సమాధానం డబ్బాలో పిండివంటలు అంతేనా?" ప్రమద అంది.
రాణి ఏదో అనబోయింది. ఇంతలో రైలు ప్లాట్ ఫారమ్ మీదకి రావడంతో వాళ్ళ మాటలు ఆగిపోయాయ్. డబ్బాలతో సహా డబ్బాలో (రైలుపెట్టె) ఎక్కేశారు. నలుగురు సీట్లు ఉండటంవల్ల స్థిమితంగా కూర్చోగలిగారు.
స్టేషన్ లో రైలు అయిదు నిమిషాలు మాత్రమే ఆగుతుంది. కాని అరగంట అయినా కదల్లేదు.
"మనం ఎక్కిన రైలు బయలుదేరటానికి ఒక జీవితకాలం లేటులా వుంది" విసుగ్గా అంది ప్రమద.
"అప్పుడే విసుక్కుంటే ఎలాగే ప్రమదామణి! మనం ప్రయాణం ప్రథమ పాదంలోనే ఉన్నాం. బోలెడు ఊళ్ళు వెళ్ళాలి...బోలెడు చోట్లు చూడాలి. ట్రైను కాస్త లేట్ గా బయలుదేరటం వల్ల కొంప మునగదులే" అంది రాణి.