"అంతా బావుంది. కాకపోతే కాస్త కష్టంగా వున్నది ఏమిటంటే మనం పెద్దవాళ్ళని ఈ ప్రయాణానికి ఒప్పించడానికి చిన్న అబద్ధం ఆడామే...అది...కాస్త బాధగా వుంది" అంది వందనాదేవి.
"అవసరానికి చిన్నచిన్న అబద్ధాలు ఆడవచ్చు. వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు పెద్దలు. అబద్ధాలు ఆడి పెళ్ళి చెయ్యొచ్చనే సాంప్రదాయం మనకున్నప్పుడు ఒక చిన్న అబద్ధం ఆడి ఒక ప్రయాణం చెయ్యొచ్చని మనము చెబుదాం" సుందర సుకుమారి అంది.
"నువ్వు చెప్పింది బావుంది" అంది వందన.
"స్టేషన్ లో ఈ హడావుడి చూస్తుంటే నాకు కవిత్వం పొర్లిపొర్లి వస్తోంది." కిటికీలోంచి బయటికి చూస్తూ సుందర సుకుమారి చెప్పింది.
"పొర్లి పొర్లి రావొద్దు...దొర్లిదొర్లి రావొద్దు. అసలే ఆగిపోయిన రైలు నీ కవిత వింటే ఇక్కడే కుదేసుకు పోతుందేమో! మన సాహసయాత్ర సవ్యంగా జరగనియ్యి తల్లీ!" అంది వందన.
"నా కవిత విని కదిలే రైలు ఆగిపోవచ్చు. కాని కదలని రైలు ఆగిపోదు. ఒక కవిత చదువుతాను. మీరే చూడండి రైలు ముందుకు పరుగెడుతుందో లేదో" అంటూ సుందర సుకుమారి కవిత్వం అందుకొంది.
ఓ రైలు! నా పాలిట జైలు
ఈ స్టేషన్ వదులు
ముందుకు కదులు
మైలు మైలుకి అలుగు
మరీ మరీ గుబులుగా ఉంటే...
సుందర సుకుమారి సాంతం కవిత చదవనే లేదు 'కూ' అంటూ గట్టిగా కూతేసి శరవేగంగా ప్లాట్ ఫారమ్ వదలి ముందుకు సాగింది రైలు.
"నీ కవితకి దడుచుకొని రైలు పరుగందేసుకుందే సుందరీ!" ప్రయాణ ఉత్సాహంతో ఆనందంగా చెప్పింది వందన.
"ఇది శ్రీశ్రీ...క్షమించాలి సుసుగారి కవిత. మాటలనుకున్నారా! మజాకా అనుకున్నారా...! బామ్మగారు కూడా దీని కవితలకే కదలిపోయి మనతో పంపిస్తున్నారు. బామ్మగారు కదలగా లేనిది రైలు కదలడం ఒక లెక్కా!"
ప్రమద మాటలకి అందరూ నవ్వేశారు.
నలుగురూ కావలసినన్ని కబుర్లు చెప్పుకొన్నారు. కొత్తవాళ్ళతో మాట్లాడదామా అంటే ప్రక్క ప్రయాణీకుల మొహాలేవీ వీళ్ళకు నచ్చలేదు. అరగంట కాగానే ఎవరికి వారే మౌనం వహించారు.
ఉన్నట్టుండి రాణి వందనకి దగ్గరగా జరిగి "నేనొకటి కనిపెట్టానే వందనా" అంది.
"ఏమిటే అది?" వందన అడిగింది.
"ఏమిటేమిటే అది?" అంటూ ప్రమద, సుందర సుకుమారి కూడా దగ్గరకి జరిగారు.
"మనం నెమ్మదిగా మాట్లాడుకోవడం మంచిది" ముందే హెచ్చిరించి అప్పుడు చెప్పింది రాణి. "అదిగో ఆ మూల సీటు మీద కూర్చుని పేపర్ ముఖానికి అడ్డుపెట్టుకొని చదువుతున్నట్టు నటిస్తున్న అందమైన ఆ యువకుడు ఈ ప్రయాణంలో మనతోపాటే వస్తున్నాడు. నేను కనిపెట్టాను తెల్సా!"
"అబ్బ....రాణీగారు మా గొప్ప సత్యం కనిపెట్టారు. ఈ రైలు నా తాతది కాదు నీ తాతది కాదు. ఎందఱో రైలు ఎక్కుతారు...ఎంత దూరమో ప్రయాణిస్తారు" అంది ప్రమద.
"ఆల్ రైట్ నీ మాట నేనెందుకు కాదనాలి! మరి గుమ్మం దగ్గర నుంచొని బీడీ తాగుతున్నాడే! ఆ వ్యక్తి సంగతి ఏమిటట?" అంది రాణి.
"ఎవరే ఆ వ్యక్తి? వికార స్వరూపంతో భయం గొలుపుతూ వున్నాడు. పెద్ద గుమ్మడికాయంత తల...చీకిపారేసిన తాటి టెంకెలాంటి తెల్లజుట్టు... సొరకాయల్లాంటి కాళ్ళు, చేతులూ... ఉల్లిపాయ బుట్టలాంటి పొట్ట...
సుందర సుకుమారి మాట పూర్తి చేయకముందే ప్రమద అందుకుంది "కూరగాయలతో వర్ణించావ్ ఇంకానయం మీ బామ్మ చేసిచ్చిన పిండివంటలతో వర్ణించలేదు."
"మా బామ్మ చేసిచ్చిన పిండివంటలమీద పడతావేమిటే ప్రమదామణీ" వాపోయింది సుందర సుకుమారి.
"తిందామని" వ్యంగ్యంగా అంది ప్రమద.
"ఇష్! మనం చిన్నగా మాట్లాడటం మంచిది. మీరేకాదు నేనూ కనిపెట్టాను. మనం రైలు ఎక్కింది మొదలు మన నీడలా ఆ వ్యక్తి మనతోపాటు వస్తున్నాడు. ఫ్లాట్ ఫారమ్ మీద కూడా వీడిని చూశాను. ఒకసారి చూస్తే గుర్తుండిపోయేలా ఉన్నాడు. చెదలు తినేసినట్లున్న మొహం...దొప్ప చెవులు... పెద్ద తలకాయ... మేకుల్లా నిక్కబొడుచుకున్న మూడొంతులు నెరిసిన సన్న క్రాఫ్... హిట్లర్ మీసాలు... ఎర్ర జీరలతో ఉన్న కనుగుడ్లు... రాయిలాంటి మొద్దు శరీరం...ఇవి చాలక ముతక దుస్తులు ధరించాడు. నడక...నడత చూస్తుంటే అచ్చం హంతకుడిని చూసినట్టుంది" వందనాదేవి చిన్న గొంతుకతో చెప్పింది.
"ఇంత కనిపెట్టిన దానివి మాకెందుకు చెప్పలేదే వందనా!" రాణి అడిగింది.
"నేను ఆ వ్యక్తిమీద వో కన్నువేసి ఉంచాను. నాది అనుమానం అనుకున్నానో లేదో నీవు కనిపెట్టిన సంగతి చెప్పావ్. దాంతో నేనూ చెప్పాను" అంది వందన.
"వాడిని చూస్తుంటే నాకో అనుమానం వస్తున్నదే! మా బామ్మ ఇచ్చిన నేతి పిండివంటలు డబ్బాల్లో ఉన్నాయి కదా! బహుశా వాడిది చీమ ముక్కయి ఉంటుంది. నేతి తీపి వాసనలు పసిగట్టి వుంటాడు. డబ్బాలు దొంగిలించు కెళతాడో ఏమో?" సుందర సుకుమారి అనుమానం వ్యక్తం చేసింది.