Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 12


    "మా బామ్మ చాలామంచిది. మా బామ్మ హృదయం నవనీతం. అందుకే ఎల్లవేళలా వెన్నకాచిన నేతితోనే నాకు పిండివంటలు చేసి పెడుతుంది. నా శరీరం ఇలా దుండుముక్కలా...బొండుమల్లెలా ఉందంటే కేవలం మా బామ్మచేతి వంటే. మా బామ్మ అమృత హస్తానికి జై...మా బామ్మచేసిన కొబ్బరి పెరుగుపచ్చడికి జై..." అంటూ కొబ్బరిపచ్చడిని తినసాగింది.


    "చాల్లే ఏదొచ్చినా పట్టలేవు. నేను లేకుండా ఎలా బ్రతుకుతావో ఏమో?" బామ్మగారు బోలెడు దిగులు పడింది.


    "అలా అనకే బామ్మా! నాకు దిగులేస్తుంది. ఆ దిగులుతో చిక్కి శల్యమౌతాను. ఇప్పటికే ఉదయం నించి ఆహారంలేక ఆరుకిలోల బరువు తగ్గుంటాను." తనదేహాన్ని చూసుకుంటూ దిగులుగా చెప్పింది సుందర సుకుమారి.


    మనవరాలు ఆమాట ఎందుకందో బామ్మగారికి బాగానే అర్థమైంది. "ఏమర్రా అమ్మాయిలు! భోంచేసి వచ్చారా...లేదా?" అని అడిగింది.


    "భోజనంచేసే బయలుదేరాం. అయినా ఈ పదార్థాలు చూస్తుంటే ఆకలేస్తున్నది బామ్మగారు!" నవ్వుతూ చెప్పారు ముగ్గురు.


    "ఆసి భడవల్లారా!" అంటూ బామ్మగారు లేచివెళ్ళి మూడు ప్లేట్లలో నిండుగ అక్కడేవున్న డబ్బాల్లోని ఫలహారాలు తీసిపెట్టింది.


    సుందర సుకుమారికి బామ్మ అన్నం కలిపి చేతిలో ముద్దలు పెడుతుంటే తింటం మధ్యమధ్య అలవాటు. ఆ అలవాటు ప్రకారం బామ్మగారు భోజనం కలిపి మనవరాలి చేతిలో ముద్దలు పెడుతూ... "పదార్థాలు రుచి చూడండర్రా!" అంటూ తలో ముద్ద స్నేహితురాళ్ళ చేతుల్లో కూడా పెట్టింది.


    అందరు నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చారు. చివరికి బామ్మగారు కూడా తిన్నారు.


    ప్రయాణంలో ఎంత జాగ్రత్తగా ఉండవలసింది బామ్మగారు చెబుతుంటే "మీమాట మాకు వేదవాక్య" మన్నట్టు "ఊ" కొట్టి ఊరుకొన్నారు.


    వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదు. వచ్చే ఆపదను బట్టి ఎంతో కొంత తప్పించుకోవడమెలాగో తెలిసినవాళ్ళే. బామ్మగారికి గౌరవం యిస్తూ విన్నారంతే. ఎంతయినా వయసులో బామ్మగారు వీళ్ళందరికన్నా పెద్దదే కదా!


    సుందర సుకుమారి విషయంలో కూడా ప్రాబ్లం తీరిపోయింది. ఈ ప్రయాణం విషయంలో వందనకి ఇంకా కాస్తంత అడ్డంకి ఉంది. ఆ అడ్డంకి తీర్చుకోడానికి సుందర సుకుమారిని... స్నేహితురాళ్ళని వెంటబెట్టుకుని బామ్మగారి దగ్గర శెలవు తీసుకుని ఇంటిమొఖం పట్టింది వందనాదేవి.

    
    పోలోమంటు నలుగురు బయలుదేరారు.


                                           5


    "మీరు చేసిందేమీ బాగుండలేదు." అంది శారద.


    "ఏమిటి శారదా! నేనేం చేశాను." చేసిందేమిటో తెలీక రాజారావు అన్నాడు.


    "అమ్మాయికింకా ప్రపంచజ్ఞానం పూర్తిగా రాలేదు. డిగ్రీ పూర్తిచేసినంత మాత్రాన అనుభవజ్ఞులని కాదు. అడ్డమైన పుస్తకాలు చదివి... దిక్కుమాలిన సినిమాలు చూసి... సాహసయాత్రలు చేద్దాము... సముద్రంలో ఈదుదాము... కొండలెక్కి దూకుదాము... ఏదేదో ఘనకార్యం చేద్దామని మోజుపడుతున్నది గాని అమ్మాయికేం తెలుసు? దాని స్నేహితురాళ్ళకేం తెలుసు? ఆడపిల్ల వంటరిగా ఇల్లుకదిలి వెళ్ళటం ఎంత ప్రమాదమో అర్థంకావడంలేదు. మీరు చెప్పాల్సిందిపోయి అది తాన అంటే మీరు తందాన అంటుంటిరి." నిష్ఠూరంగా అంది శారద.


    "ఒక్కోసారి అలా అనాలోయ్! తప్పదు" అన్నాడు రాజారావు.


    "అంటే? నాకేం అర్థం కావడంలేదు సరీగ్గా చెప్పండి."


    "మన బేబి నాలుగేళ్ళ పసిపాప కాదు. పెద్దపిల్లలని మందలిస్తే బాధపడతారు. ఎదిగిన వయసు...పెరిగిన మనసు."


    "అందుకని వాళ్ళేం కోరినా మనం తలవూపాలా."


    "ఒక్కోసారి అయిష్టంగానయినా సరే తలవూపక తప్పదు. దాని స్నేహితురాళ్ళ ఇళ్ళల్లో ప్రయాణానికి ఒప్పుకున్నారనుకో...మనము ఒప్పుకోక తప్పదు. ఇది నాకు తెలియంది కాదు శారదా."


    "అదేనండి నా బాధ."


    "బాధపడకు శారదా! నేనేదైనా ఉపాయం ఆలోచిస్తాను."


    "నాకు తెలుసండి...నన్ను ఒప్పించడానికి మీరు ఉపాయాలు...గుపాయలు అంటున్నారు. అది ఆడపిల్ల... ఏ అపాయము రాకుండా చూడండి ఎలా చూస్తారో! ఏం చేస్తారో నాకు తెలీదు ఇంక. మీ ఇష్టం అంది శారద.


    "బేబి ఆడపిల్ల మాత్రమే కాదు...నీకు నాకు కూడా అమ్మాయి... మనమ్మాయి సరేనా!"


    "చాల్లెండి...ఇదేదో ఇప్పుడే తెలుసుకున్నట్టు చెబుతున్నారు" శారద అంది.


    "చెప్పటం కాదోయ్ శారదా! ఏదో ఒకటి చేసి చూపిస్తాను. బేబి గురించి... ఈ ప్రయాణం గురించి ఏమీ బాధపడకు. స్నేహితురాళ్ళ ముగ్గురిళ్ళల్లో పెద్దవాళ్ళు వప్పుకొంటే మనంకూడా టకీమని వప్పేసుకుందాం. ఆ పిల్లలముందు మనకి గౌరవంగానూ ఉంటుంది... బేబి పరువు కాపాడినట్టు ఉంటుంది." రాజారావు నచ్చచెప్పాడు.


    అయిష్టంగానే "మీ ఇష్టం" అంది శారద.


    భార్యభర్త లిరువురు ఒక నిర్ణయానికి వచ్చారో లేదో సరిగ్గా అప్పుడే వందనాదేవి... స్నేహితురాళ్ళు ముగ్గురిని తీసుకుని ఇంట్లో కాలుపెట్టింది.

 Previous Page Next Page