Previous Page Next Page 
సీతాచరితం పేజి 12


    మొత్తంమీద ఆ కాలంలో వివాహబంధం అంత పటిష్టంగా లేదని అర్ధమవుతుంది.


    సమాజంలో అతి ముఖ్యమైన వ్యవస్థ వివాహం. ఈ వివాహాలు కుటుంబానికి కీలకం వంటివి. ఈ వివాహం ద్వారానే బిడ్డలు, ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఈ బంధం వదులుగా వున్నప్పుడు సమాజ శ్రేయస్సుకు భంగం ఏర్పడుతుంది. ఇష్టం వచ్చినప్పుడు భార్య భర్తను లేదా భర్త భార్యను ఒదిలేస్తే సంతానం గతి ఏంకాను? సరియైన పోషణ, క్రమశిక్షణ లేని సంతానం సమాజానికి భారమవుతుంది. అందువల్ల భార్యాభర్తలను ఒక పటిష్టమైన బంధంలో బంధించగల వివాహ వ్యవస్థ అవసరం. ఈ బంధం బలవంతం మీద ఆధారపడిందిగా వుండరాదు. ఒకరి విషయంలో ఒకరు ప్రేమానురాగాలు పెంచుకొని కష్టాలు సుఖాలు పంచుకోవడానికి సిద్ధంగా వుండాలి.


    సుఖాల్లో మాత్రం భర్తవంటి పెట్టుకొని వుండి, ఆపదల సంభవించగానే అతన్ని నిర్లక్ష్యంగా చూడటం, లేదా ఒదిలివేయడం ఆనాటి ఆచారం గానన్పిస్తోంది. ఈ ఆచారానికి భిన్నంగా భార్య భర్త కష్టసుఖాల్లో గాని పాలుపంచుకోవడం అవసరమని చెప్పుకోవడానికే వాల్మీకి సీత పాత్రను సృష్టించినట్లు అర్ధమవుతున్నది.


    "అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథా" సూర్యునికీ - కాంతికీ ఎలాంటి అవినాభావ సంబంధముందో, నాకూ, రామునికీ అలాంటి సబంధముంది అని అంటుంది సీత. సూర్యుడు, కాంతి ఒకదానిమీద ఒకటి ఆధారపడి వున్నారు, అంతేగాని ఒకరు హెచ్చుగాని, ఒకరు తగ్గుగాని కారు. పూవునకు, పరిమళానికున్న అవినాభావ సంబంధమే భార్యా భర్తలకుండాలనేదే వాల్మీకీ ఉద్దేశ్యం. భార్యా-భర్తల సంబంధం కేవలం లైంగికముంది కాదు. ఇది ఒక మానసికమైన బంధం. ఇది అనురాగ బంధం. ఈ అనురాగాన్ని కలకాలం పెంచాలని, సమాజంలో ఆదర్శ దంపతులు వెలయాలనీ ఆశించిన వాల్మీకి సీతారాముల ఆదర్శ దాంపత్యాన్ని చూపాడు. అందుకే సీత రామునితో సహా  అడవులకు వెళ్లింది.


    "ఏవం వర్షసహస్రాణాం శతం వా2 త్వయా సహ వ్యతిక్రమం నవేత్స్యామి స్వర్గోపి నహియేమతః"


    అట్లు నీతో వందలవేల సంవత్సరములనైనను వుండగలను. నిన్ను విడచి స్వర్గమందుండుట సహితం నాకు యిష్టంకాదు అంటుంది సీతరామునితో వనవాసం చేయడాన్ని గురించి.


    రాముడు అలాగే అంటున్నాడు.


    "నేదానీం త్వదృతే సీతే! స్వర్గో2పి మమ రోచతే" ఇక నీవు లేకున్న నాకు  స్వర్గమయిన రుచించదు, అని.


    రామునితో బాటు సీత వనవాసక్లేశాలను అనుభవించింది. అలాగే లక్ష్మణుడున్నూ.

 
    రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. రామునికి మరొక స్త్రీ దొరకక కాదు. భార్య విషయంలో గల అతని అనురాగం, అంత ప్రయత్నంచేసి ఒక మహా యుద్దం చేసి, రావణుని చంపేట్లు చేసింది. ఏకపతిత్వం ప్రవచించడం వాల్మీకి ఉద్దేశ్యాలలో మొదటిగా కన్పిస్తోంది. అనేక మంది భార్యాలవల్ల కల్గిన అనర్ధాలను పారద్రోలడానికి, ఇదే ఒక ఉపాయంగా కన్పించుండవచ్చు. అందుకోసం ఏకపతిత్వ సిద్ధాంతం ప్రచారం చేయడానికి రామాయణం రచించాడని చెప్పవచ్చు.


    దశరథుని కుటుంబానికి సంబంధించినంతవరకు అది వాల్మీకి చూడదల్చిన ఆదర్శ కుటుంబం. వాలీ-సుగ్రీవుల గురించి ఆలోచిస్తే, వారిద్దరు అన్నదమ్ములు. ఒకరి నొకరు శత్రువులుగా భావించారు. ఇద్దరు కొట్టుకొని చావడానికి సిద్దమయ్యారు. యుద్ధాలు చేసుకున్నారు. కుటుంబం విచ్ఛిన్నమయి, సుగ్రీవుడు ఋష్యమూకం మీద తలదాల్చుకోవల్సి వచ్చింది.


    "తమ ద్వైవ  ప్రియార్ధం మేవై రిణం భాతృరూపిణమ్I
    వాలినం జహి కాకుత్ త్స! మయా బద్ధో2యమజ్ఞలిఃII"


    "రామా! నన్ను సంతోష పెట్టుటకు గాను, అన్నరూపమున నన్ను శత్రువైన వాలిని ఇప్పుడే వధింపుము. ఇదే చేతులు జోడించి నిన్ను ప్రార్థించుచున్నాను." అని సుగ్రీవుడు రామునితో అంటాడు.


    సుగ్రీవుడు అన్నను 'వైరిణం భాతృరూపిణం' అంటున్నాడు. అన్నరూపంలో శతృవు అంటున్నాడు. అన్నను చంపడానికి పన్నాగాలు పన్నుతున్నాడు. ఇక ఆ కుటుంబం ఎలా వుంటుందో ఆలోచించవచ్చు. మనస్పర్థలు, వైరం, కలహాలు వున్న కుటుంబంలో శాంతి ఎక్కడిది? అందువల్ల పరస్పరానురాగం, ప్రేమ, ఆదరం, వీటికి అన్నదమ్ముల్లో సృష్టించి ఒక ఆదర్స సమాజాన్ని తిలకించదలిచాడు వాల్మీకి.


    ఇక రావణుని గురించి ఆలోచిస్తే అక్కడ అది అంతే. అక్కడ పరస్పరమయిన అవగాహన లేదు. రావణునికి విభీషణునితో వైరం వచ్చింది. రావణునికి అనేకమంది భార్యలు. ఏస్త్రీనైనా ఎత్తుకురావడం అతని సరదా. అతడు ఎవరిమాట వినడు. అతడు జ్ఞాతులను గురించి, "తామరాకుపై పడిన నీటి బిందువులు ఒకదానితోనొకటి ఎట్లు కల్సుకోవో అట్లే జ్ఞాతులు కూడ. మకరందపానం తర్వాత తుమ్మెద ఒక్కక్షణం కూడ పూవు మీద వుండదు. అలాగే జ్ఞాతులుకూడా. ఐశ్వర్యం వున్నప్పుడు అనుభవిస్తాడు. అదిపోగానే వెళ్లిపోతారు. శరదృతువులో మేఘాలు ఉరుముతాయి. కాని ఒక్కనీటిచుక్కనైన కురిపించవు. జ్ఞాతుల సానుభూతి అలాంటిదే" అని అంటాడు రావణుడు. అంటే కుటుంబాలు అలాంటి పరిస్థితిలో ఉన్నాయని అర్థం. అది చూచి బాధపడిన వాల్మీకి మంచి కుటుంబాన్ని గురించి ఊహించి రూపకల్పన చేశాడు.


    ఇవ్వాల్టికి మనం రాముని కుటుంబంలాంటి కుటుంబము వుండాలనే ఆశిస్తాం. రావణుడు, వాలి లాంటి కుటుంబాలు వుండాలని ఎవరూ కోరుకోరు. పరస్పర అవగాహనతో కుటుంబ సభ్యులు మెలిగినవాడు, కుటుంబంలో శాంతి సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి. ఇవ్వాల్టికి ఈ ధ్యేయంతోనే చాలవరకు సాహిత్యం సృష్టించబడుతోంది. కాబట్టి రామాయణాన్ని కాదనలేం.


    ప్రేమానుబంధం మీద నమ్మకం లేనివాళ్లు, వివాహ వ్యవస్థ మీద విశ్వాసం లేనివాళ్లు, రామాయణం చదవటం సంభవిస్తే విపరీతార్థాలు తీస్తారు.

    
    రామాయణంలో ప్రక్షిప్తం


    వాల్మీకి రామాయణం వచించి వేల సంవత్సరాలవుతుంది. 'వచించి' అని ఎందుకంటున్నానంటే ఆనాటికి లిపి లేదని నమ్మకం. వాల్మీకి రామాయణం గురించి "సర్వశృతి మనోహరం" వినడానికి అనుకూలమైందని అర్ధం. వాల్మీకి రామాయణ మహాకావ్యం చేసి దానిని పాడి వినిపించే వారికోసం వెదికాడు. అప్పుడు అతనికి కుశలవులు కన్పించారు. తొలుత రామాయణాన్ని గానం చేసినవారు కుశలవులు. ఆ తర్వాత తరతరాలుగా వినడం ద్వారా ఒకరి తర్వాత ఒకరికి సంక్రమించిన రామాయణం, లిపి వచ్చింతర్వాత లిపి బద్ధమైంది. అచ్చు వచ్చింతర్వాత అచ్చయింది.


    లిపి లేదనడానికి మరో కారణం - ఇంత కథలో ఎక్కడా ఒక్క చీటీ ముక్కను గురించిన ప్రసక్తిలేదు. రాముడు హనుమంతుని గురించి చెబుతూ "నూనం వ్యాకరణం కృత్స్న మనేన బహుధా శృతమ్." ఇతడు పెక్కుమార్లు వ్యాకరణం విన్నాడు. వ్యాకరణం విన్నాడు అనే పదంవల్ల, వ్యాకరణం వినడమే వుందికాని చదవడం లేదని అర్ధమవుతుంది.


    లిపి అవసర మేర్పడిన ఘట్టాలు రామాయణంలో వున్నాయి. రాముడు హనుమంతుణ్ని సీత దగ్గరకు పంపిచేటప్పుడు ఉత్తరం వ్రాసి పంపించవచ్చు. అతడలా చేయలేదు. హనుమంతుడు రాముని దూత అని తెల్సుకోవడానికి అనేక గుర్తులు చెబుతాడు. ఇక్కడ ఒక సందేహముంది. రాముడు తన పేరు చెక్కిన ఉంగర మిచ్చినాడని అంటున్నాడు. ఈ ఉంగరపు కథ ప్రక్షిప్తమని నా ఉద్దేశ్యం. ఎంచేతంటే ఈ ఉంగరం కథాగమనానికి అంతగా పనికివచ్చినట్లుంలేదు. ఉంగరం తీసుకపోయిన హనుమంతుడు సీతకది అందిస్తే, అతణ్ణి రామదూతగా గుర్తించాలి. కాని అలా జరగలేదు. హనుమంతుడు తనను రామదూతగా సీతచేత గుర్తింపబడటానికి, రామ కథను సీతకు వినిపిస్తాడు. తన గురించి చెబుతాడు. తన గుర్తుగా సీత కాకాసుర వృత్తాంతం చెబుతుంది.ఆ తర్వాత చూడమణి ఇస్తుంది.

 Previous Page Next Page