Previous Page
Next Page
ఖడ్గసృష్టి పేజి 12
గాంధీజీ!
మరచిపోయిన సామ్రాజ్యాలకు
చిరిగిపోయిన జెండా చిహ్నం
మాయమైన మహాసముద్రాలను
మరు భూమిలోని అడుగుజాడ స్మరిస్తుంది
శిథిలమైన నగరాన్ని సూచిస్తుంది
శిలాశాసనం మౌనంగా
ఇంద్రధనుస్సు పీల్చే ఇవాళటి మననేత్రం
సాంద్రతమస్సు చీల్చే రేపటి మిణుగురు పురుగు
కర్పూర ధూమధూపంలాంటి
కాలం కాలుతూనే ఉంటుంది
ఎక్కడో ఎవ్వడో పాడిన పాట
ఎవ్వడో ఎందుకో నవ్వేపాప
బాంబుల వర్షాలు వెలసిపోయాక
బాకుల నాట్యాలు అలసిపోయాక
గడ్డిపువ్వులు హేళనగా నవ్వుతాయి
గాలి జాలిగా నిశ్వసిస్తుంది
ఖడ్గాన్ని రద్దు చేస్తుంది ఖడ్గం
సైన్యాన్ని తినేస్తుంది సైన్యం
పొలంలో హలంతో రైతు
నిలుస్తా డివాళా రేపూ
ప్రపంచాన్ని పీడించిన పాడుకలని
ప్రభాత నీరజాతంలో వెదకకు
ఉత్పాతం వెనుకంజ వేసింది
ఉత్సాహం ఉత్సవం నేడు
అవనీమాత పూర్ణగర్భంలా
ఆసియా ఖండం ఉప్పొంగింది
నవప్రపంచ యోనిద్వారం
భారతం మేలుకుంటోంది
నేస్తం మన దుఃఖాలకి వాయిదా వేద్దాం
అసౌకర్యాలు మూటకట్టి అవతల పారేద్దాం
ఇంకోమాటు వాగ్వాదం ఇంకోనాడు కొట్లాట
ఇవాళ మాత్రం ఆహ్లాదం ఇవాళ తురుఫాసు
- ఆంధ్రజ్యోతి మాసపత్రిక - ఫిబ్రవరి, 1946
Previous Page
Next Page