Previous Page Next Page 
చెక్ పేజి 12


    ఆరుబయట భోజనాలు చేశాం.

 

    కాసేపు అవీ, ఇవీ మాట్లాడి నేనూ, బావ గుడి దగ్గరకు బయల్దేరాం.

 

    ఊరికి ఫర్లాంగు దూరంలో వుంది గంగమ్మ గుడి. చిన్న గదంత వుందది. దాని ముందు పెద్ద పందిరి వేసుంది.

 

    గుడి ముందు భాగాన పందిట్లో గంగమ్మ బొమ్మ వుంది. ఆమె కనుగుడ్లు కోడిగుడ్డంత సైజులో భీకరంగా వున్నాయి. ముఖాన అరచేయంత కుంకుమ బొట్టు ఎర్రగా విరబూసిన మందారం పువ్వులా వుంది. చెవులకున్న గిల్ట్ జుమికీలు చేపపిల్లలను తగిలించినట్టున్నాయి. మెడలోని తెల్లపూసల హారం ఎముకలను పూసలుగా చేసి తయారుచేసినట్టుంది. మొత్తానికి ఆ బొమ్మ పసిపిల్లల్ని తినేసేటట్టుంది.

 

    గుడి ముందు చాలా మందే వున్నారు.

 

    స్త్రీలు, పురుషులు కాగడాల వెలుగుల్లో అటూ ఇటూ బొమ్మల్లా తిరుగుతున్నారు. వాళ్లల్లో నీగ్రో ఛాయలు వుండడం వల్ల నేను ఆఫ్రికా ఖండంలో వున్నట్టనిపించింది.

 

    చూస్తూండగానే జనం ఎక్కువయ్యారు.

 

    అందరూ కారు నలుపు రైతులే. చామన ఛాయలో వున్నారు. యానాదులంతా నల్లగా బొగ్గు గనుల్లోనే పుట్టి పెరిగినట్టున్నారు. మధ్యలో అణిగిపోయిన ముక్కుల వల్ల అక్కడ రెండు రంధ్రాలున్నట్టున్నాయి. పెదవులు నల్లగా కుండ అంచుల్లా వున్నాయి. వాళ్ళ కండలు ఎర్ర వెలుగుల్లో మెరుస్తున్నాయి.

 

    స్త్రీలు కడవలు నెత్తికెత్తుకున్నారు. మొత్తం ఇరవైమంది దాకా వుంటారు వాళ్ళు. కడవల అంచుల చుట్టూ వేపాకు దండలు కట్టుకున్నారు.

 

    వాళ్ళు ముందు నడుస్తుంటే డప్పులవాళ్ళు అనుసరిస్తున్నారు. ఒకరిద్దరు వెల పదాలు (బూతు పాటలు) పాడుతున్నారు.

 

    మెరవణి గుడి నుంచి బయల్దేరి భుజంగం ఇంటికి చేరుకుంది.

 

    భుజంగం బయటికొచ్చాడు.

 

    కడవలకేసి చూస్తూ దండం పెట్టుకున్నాడు. స్త్రీల ముందు వంగి టెంకాయ కొట్టాడు.

 

    డప్పుల శబ్దం ఎక్కువైంది.

 

    "జాతర ప్రారంభమైందన్న మాట" బావ నాతో చెప్పాడు.

 

    స్త్రీలు అక్కడి నుంచి బయల్దేరి ప్రతి ఇంటి ముందూ ఆగుతున్నారు. ఆ ఇంటి యజమాని టెంకాయ కొట్టి, దండం పెడుతున్నాడు.

 

    మా ఇంటికొచ్చాక మేము ఆగిపోయాం.

 

    మెరవణి సాగిపోయింది.

 

    కాసేపు అదీ ఇదీ మాట్లాడాక గీర్వాణి, ఆమె అత్త ఇంట్లోకెళ్ళి పడుకున్నారు.

 

    నేనూ, బావ ఆరు బయట నులక మంచాలమీద పడుకున్నాం.

 

    "భుజంగం టెంకాయ కొట్టడంతోనే జాతర ప్రారంభమవుతుందా?" అడిగాను నేను.

 

    "అవును. అది ఆచారం. మెరవణి ఆ ఇంటికి వెళ్ళగానే జాతర ప్రారంభమైందన్నమాట. మెరవణి అంటే అంబలి వున్న కడవలు వూరంతా తిరగడం. ఇప్పుడు జరిగింది అదేనన్నమాట. రేపు ఉదయం పొంగళ్ళు ప్రారంభమవుతాయి. రూపు సాయంకాలం బలులు ప్రారంభమవుతాయి. కన్యార్పణం వుంటుంది. రాత్రికి కన్యార్పణం తరువాత గంగమ్మ బొమ్మ చెంప నొకదానిని నరికేస్తారు ఆతల్లి చూపులు తీక్షణం. అందుకే బొమ్మ చెంప నరికేస్తారు. గంగమ్మ విగ్రహం లోపలుంటుంది. జాతర సందర్భంగా మట్టి బొమ్మను తయారుచేసి బయట పెడతారు. కన్యార్పణంతో జాతర ముగుస్తుంది" వివరించాడు బావ.

 

    "కన్యార్పణమంటే" మంచం మీద నుంచి లేచి కూర్చుని ప్రశ్నించాను. బావకూడా లేచి కూర్చున్నాడు.

 

    "కన్యార్పణం పెద్ద తంతు. బలులైపోయాక వూర్లోనూ, యానాది సెంటర్ లోనూ వుండే పెళ్లికాని అమ్మాయిల పేర్లన్నీ చిన్నచీటీల్లో రాస్తారు. ఆ చీటీల పళ్ళాన్ని పూజారి గుడిలోపలికి తీసుకెళ్లి మంత్రాలు చదివి బయటికి తీసుకొస్తాడు. అంత క్రితం బసిలి అయిన అమ్మాయి ఆ చీటీల నుంచి ఒక చీటీని ఎత్తడం వుంటుంది. ఆ చీటీలో ఎవరి పేరుంటే ఆ అమ్మాయి ఆ రాత్రి భుజంగంతో గడపాలి. ఇక అప్పటి నుంచి ఆ అమ్మాయిని బసిలి అని పిలుస్తారు. బసిలి అయిన అమ్మాయి మరుసటిరోజు నుంచి ఏ మగాడు పిలిచినా కాదనకుండా పోవాలి. అతనిచ్చే అర్ధో, పావలానో తీసుకుని జీవనం సాగించాలి."

 

    డప్పుల శబ్దం ఎక్కువైంది. రాత్రి నిశ్శబ్దంవల్ల పలకల మోత ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. ఆకాశం కొడిగట్టిన కాగడా కొసలా వుంది.

 

    "ఈ ఆచారం దారుణం బావా" అన్నాను. ఎందుకో నా మనసంతా బాధగా తయారైంది.

 

    "దారుణం ఏముందిరా. పెద్దలు పెట్టిన నియమాలివి" సమర్థించాడు మా బావ.

 

    బిసిలిగా మారిపోయిన అమ్మాయి ఎంత నరకం అనుభవిస్తుందో వూహించాను. నా కళ్ళు చెమ్మగిల్లాయి.

 

    బావతో ఇక ఏం మాట్లాడాలనిపించలేదు. పడుకుని దుప్పటిని మీదకు లాక్కున్నాను.

 

    "నిద్రొస్తుంటే పడుకోరా" అని మా బావ కూడా నడుం వాల్చాడు.

 

    డప్పులు మోగుతూనే వున్నాయి.

 

    నేను నిద్ర లేచేసరికి ఎనిమిది దాటింది. మా అక్క అప్పుడే పట్టుచీర కట్టుకుని నుదుటన రూపాయి బిళ్ళ సైజులో కుంకుమ పెట్టుకుని కనిపించింది.

 

    "ఏరా మదన్. రాత్రి బాగా పొద్దు పోయేవరకు బావతో బాతాఖానీ వేసినట్టున్నావ్. మొద్దు నిద్రపోయావ్" అంది నాతో.

 

    తనే మళ్ళీ "లేచి స్నానం చెయ్ రా. పొంగళ్ళు దగ్గరకు వెళదాం" అంది.

 

    బద్దకంగా పడకమీద నుంచి లేచాను.

 

    ఆకాశంలో సూర్యుడ్ని మబ్బులు మూసివేయడంతో సాయంకాలంలా వుంది. ఆ వూరికి కొత్త కళ వచ్చినట్టుంది. వీథిలో కోలాహలంగా వుంది. డప్పులు లయబద్ధంగా గొంతు చించుకుంటున్నాయి.

 

    నేను స్నానంచేసి వచ్చేసరికి మాఇంటి ముందు ఓ గుంపు వుంది. నలుగురు పలకలు మోగిస్తున్నారు. ఆ దరువుకు అడుగులేస్తున్నాడు ఒకతను. అతని నడుంచుట్టూ చర్మానికి సూదులు వేలాడుతున్నాయి. నెత్తిమీద బెండుతో చేసిన చప్పరం వుంది.

 

    పలకల శబ్దం ఏదో తెలియని భయాన్ని గుండెల్లో ఒంపుతోంది.

 

    ఆ గుంపు వెళ్లిపోయాక మరో గుంపు వచ్చింది. ఆడ వేషాలేసుకున్న ఇద్దరు పురుషులు అడుగులేస్తున్నారు. ఆ ఆడడం చాలా ఎబ్బెట్టుగా వుంది. స్త్రీలకుండే లాలిత్యం ఆ బిరుసెక్కిన గూడల్లో ఆత్మహత్య చేసుకుంది.

 

    వాళ్ళటు వెళ్ళగానే పులివేషాలు వచ్చాయి.

 

    వాళ్ళ శరీరంపై పసుపు, నలుపుల గీతలున్నాయి. పెయింట్ వేసుకోవడంతో శరీరం బిరుసెక్కి పలకలా కనిపిస్తోంది. ముఖాలు మామూలుగా వుండడం వల్ల వాళ్ళు వింత జంతువుల్లా వున్నారు.

 

    నేనూ, గీర్వాణి, బావ పొంగళ్ళు పెట్టడానికి బయల్దేరాం.

 

    రైతులు గుడి పక్కగా పొంగళ్ళు పెడుతుంటే యానాదులు గుడికి దూరంగా పొంగళ్ళు పెట్టుకుంటున్నారు. రైతు కుటుంబాలు ఇరవైదాకా వుండి, యానాదులు వందల సంఖ్యలో వున్నారు.

 Previous Page Next Page