Previous Page Next Page 
జనవరి 5 పేజి 12

  

      సరీగ్గా అప్పుడే అచ్యుత్ తన అనుచరులతో ఎక్కి వస్తున్న జీప్ ఆ వీధి మలుపు తిరిగింది.
   
    ఆదిలక్ష్మి ఆ గది కిటికీ రెక్కను కొద్దిగా తెరచి తమ ఇంటికేసి వారగా చూడసాగింది.
   
                       *    *    *    *    *
   
    మేఖల, అభిరామ్ ఎక్కిన ఆటో రైల్వే స్టేషన్ ముందు ఆగింది.
   
    మేఖల ఆటోలోంచి దిగి ఫేర్ చెల్లించి తమ్ముడితో సహా స్టేషన్ టిక్కెట్ కౌంటర్స్ కేసి నడిచింది.
   
                      *    *    *    *    *
   
    అచ్యుత్ జీప్ అరుణాచలం ఇంటి ముందు ఆగింది.
   
    ఆదిలక్ష్మి ఆ ప్రమాదాన్ని ముందే ఊహించింది. గనుక అంతగా అప్ సెట్ అవ్వలేదు.
   
    అచ్యుత్ జీప్ దిగగానే అతని పదిమంది అనుచరులు కూడా జీప్ దిగి తమ ఇంటి కేసి వెళ్ళటాన్ని ఆదిలక్ష్మి చూస్తూనే భర్త వేపు తిరిగి శబ్దం చేయవద్దన్నట్లు సైగచేస్తూ తనవేపు రమ్మన్నట్లుగా చూసింది.
   
    అరుణాచలం ఆమె ఉద్దేశ్యాన్ని గ్రహించి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ భార్య దగ్గరకు వచ్చి ఆమె చూస్తున్న వేపుకి చూసి ఉలిక్కిపడ్డాడు.
   
    "ఇప్పుడర్ధమయించా...ఈ ఆదిలక్ష్మి ఏది ఎందుకు చేసిందో? ఈ పాటికి మన పిల్లలు ట్రెయిన్ ఎక్కేసి వుంటారు. వాళ్ళ చేతుల్లో వున్న చెయిన్, గండ్రగొడ్డళ్ళు, కర్రల్ని చూశారా? కన్నబిడ్డలు దూరమైనా క్షేమంగా వుంటే చాలని భావించే తల్లిని నేను. అచ్యుత్ మనుష్యులొస్తారు. మిమ్మల్ని ఏదో చేస్తారు వెళ్ళండి అంటే పౌరుషవంతులయిన మన పిల్లలు వినేవారా? వినకపోతే ఆ కిరాతకుల్ని ఎదుర్కొనే ప్రయత్నం చేసేవారు. అప్పుడేం జరుగుతుంది? మనకు కడుపు కోతేగా?"
   
    తమ యింటిముందు అచ్యుత్ తన అనుచరులు తారట్లాడటాన్ని చూస్తూనే మాట్లాడసాగింది ఆదిలక్ష్మి.
   
    భార్య తెలివితేటలకి అప్పుడు విస్మయపడ్డాడు అరుణాచలం.
   
    అచ్యుత్ తన అనుచరులకు ఏదో చెప్పాడు. వాళ్ళు క్రమంగా తాము తల దాచుకున్న యింటికేసి రాసాగారు.
   
    అరుణాచలానికి పై ప్రాణాలు పైనే పోయినట్లనిపించింది.
   
    ఒక్కక్షణం ఆదిలక్ష్మి కూడా కలవరపడింది. భయపడింది. వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో తాము తల దాచుకున్న ఇంటికేసి వస్తున్నారు? బహుశా విచారించటానికి వస్తున్నారేమో....
   
    ఆ ఆలోచన వస్తూనే ఆమె వేగంగా మధ్య హాల్లోకి వెళ్ళి వాళ్ళకు ఏదో చెప్పి తిరిగి తన భర్త వున్న గదిలోకొచ్చి తలుపులు వేసి గడియపెట్టి భయం భయంగా ఏం జరగనున్నదని ఎదురు చూడసాగింది.
   
    ఒకింత కర్కశంగా వ్యవహరించినా కన్నబిడ్డల్ని ఊరు దాటించ గలిగిన భార్య మీద అరుణాచలానికి ప్రేమాభిమానాలు రెట్టింపయ్యాయి.
   
    ఆదిలక్ష్మి ఊహించినట్లుగానే అచ్యుత్ అనుచరులిద్దరూ ఆ యింటి ముందుకొచ్చి తలుపు తట్టారు.
   
    వెంటనే తలుపులు తీసి రెస్పాన్స్ యివ్వకపోతే ఆమె గతేమవుతుందో తెలిసున్న ఆ యింటి యజమాని వెంటనే వెళ్ళి తలుపులు తీసి "ఎవరు కావాలి బాబు" అంటూ అయిష్టంగానే వాళ్ళపట్ల గౌరవ భావాన్ని వ్యక్తం చేశాడు.
   
    "ఆ యింట్లో వున్నవాళ్ళు ఏమయ్యారు? ఎక్కడికెళ్ళి పోయారు" అరుణాచలం యింటివేపు చూపుడు వేలుతో చూపిస్తూ పొగరుగా అడిగాడో వ్యక్తి.
   
    "వాళ్ళా...? ఇంతకు ముందే ఆటో ఎక్కి ఎక్కడికో హడావిడిగా వెళ్ళిపోయారు. కనీసం మాట మాత్రంగానయినా చెప్పలేదు" అన్నాడు లోలోన భయపడుతూ.
   
    "ఇంటి కీసేమైనా ఇచ్చారా?
   
    మరో వ్యక్తి జబర్ధస్తీగా అడిగాడు.
   
    "మామూలుగా ఐతే యిచ్చేవారే. ఈ రోజేదో హడావుడిలోనో, ఆందోళన మూలంగానో యివ్వకుండానే వెళ్ళిపోయారు. ఇంతకీ మీరెవరు బాబు? మీరు వచ్చినట్లు వాళ్ళకేమన్నా చెప్పమంటారా?" మర్యాదను కనబరుస్తూ చెబుతున్న ఆయన దృష్టిలో దూరంగా రోడ్ మీద ఆగున్న జీప్ ప్రక్కనే వున్న అచ్యుత్, అతని అనుచరులు కంటపడ్డారు.
   
    "మేం వచ్చినట్లు మేమే తెలియబరుస్తాం. అది నువ్వేం చెప్పక్కరలేదు. ఇంతకీ మేమెవరమో తెలుసా...." ఒక వ్యక్తి గర్వంగా భుజాలు ఎగురవేస్తూ ప్రశ్నించాడు.
   
    "తెలీదు బాబు" అన్నాడా యింటి యజమాని చేతులు నలుపుకుంటూ.
   
    "ఈ నగరంలో ఏం చేసినా ఎవరికయితే చెల్లుతుంది?" ఛాతీ విరుస్తు అడిగాడు.
   
    "అచ్యుత్ గారికి, వారి మనుష్యులకు"
   
    "శభాష్, ఎలా చేసినా ఎవరికి చెల్లుతుంది."
   
    ""అచ్యుత్ గారికి, వారి అనుచరులకు"
   
    "డబుల్ శెభాష్"
   
    "ఈ నగర ప్రజలు ఎవరికి ఎదురు తిరగరు?"
   
    "అచ్యుత్ గారికి"
   
    "బ్రతకనేర్చిన వాడివి"
   
    "మీరు అచ్యుత్ గారి అనుచరులే గదా....! ఇంట్లోకొచ్చి మా ఆతిధ్యం స్వీకరించి వెళ్ళండి బాబు"
   
    అన్నాడు బాధను, అవమానాన్ని తనలోనే దిగమింగుకుంటూ.
   
    "ఆతిధ్యం ఆ అరుణాచలం గాడింట్లో తీసుకుందామని వచ్చాం. పిరికి సన్నాసి పెళ్ళాం బిడ్డలతో పారిపోయాడు. మేం వచ్చి వెళ్లినట్టు వాళ్ళకు తెలిసేలా చేసెల్తాం....?" అంటూ వెనుతిరిగి రోడ్ మీదకు వెళ్ళి పోయారు.
   
    అప్పటివరకు బిక్కు బిక్కుమంటూ ప్రాణభయంతో వణికిపోతున్న ఆదిలక్ష్మి, అరుణాచలం ఒక్కసారి వూపిరి తీసుకున్నారు.
   
    ఈలోపు పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కిపడి కిటికీలోంచి బయటకు చూసింది ఆదిలక్ష్మి.
   
    ఆ శబ్దాన్ని యింటి యజమాని కూడా విని అసంకల్పితంగా ద్వార బంధంవేపు నాలుగడుగులు వేసి బయటకు చూశాడు.
   
    అప్పుడక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ తిన్నారు.
   
    అచ్యుత్ జీప్ దగ్గరే డానికి ఆనుకొని విలాసంగా నిలబడి వుంటే అతని అనుచరులు అరుణాచలం ఇంటి ముందుకెళ్ళి తలుపుల్ని పగలగొడుతున్నారు.
   
    శాంతిభద్రతల్ని పరిరక్షించటానికి మానవులచే, మానవతా వాదులచే వ్రాయబడిన చట్టం ఆ ప్రక్కనే వుండగా, దాన్ని అమలుజరిపే పోలీసు శాఖ ఆ నగరంలో శాఖలుగా విస్తరించుకొని వుండగానే దోషుల్ని నిర్భీతితి, నిజాయితీతో శిక్షించమని శాసించే న్యాయస్థానం ఆ నగర నడిబొడ్డున వుండగానే, దౌర్జన్యాన్ని, హింసను ఖండించే బాధ్యతాయుతమైన పౌరులు, మేధావులు వుండగానే జరుగుతున్న గూండాగిరి అది....
   
    తనకై తాను తన రాక్షస ప్రవృత్తిద్వారా, బల నిరూపణ ద్వారా సొంతం చేసుకున్న అహంభావంతో, అధికారంతో పవిత్రమయిన భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని ప్రజా ప్రభుత్వాల్ని హేళన చేసే అమానుష కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోతోంది.
   
    బోనులోకెక్కి చెప్పలేని ప్రజలు దానికి సాక్ష్యం... సాక్షులులేనిదే శిక్షించలేని న్యాయస్థానం దానికో అస్థిరత్వపు ప్రశ్న...
   
    రాత్రింబవళ్ళు శ్రమించి, రక్తం ధారబోసి, పైసా పైసా కూడబెట్టుకొని చిన్న గూడును తలదాచుకునేందుకు నిర్మించుకున్న అరుణాచలం దంపతులు కనీసం పెద్దగా ఏడ్చేందుకు బాధను వ్యక్తం చేసుకొనేందుకు కూడా ధైర్యం లేక అటుకేసి గుండెలు పగిలిపోయిన స్థితిలో చూస్తుండి పోయారు వాళ్ళు.
   
    మూడో నిమిషానికి ఆ యింటి తలుపులు బ్రద్దలయిపోయాయి.
   
    స్వయంకృషితో నిర్మించుకున్న చెక్క తలుపులు కన్నా, దౌర్జన్యంతో వాళ్ళు చేతబూనిన యినుప కడ్డీలే బలమైనవని ఋజువయింది.
   
    అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం ఆరున్నర గంటలు అవుతోంది.
   
    పొందికగా పేర్చి వున్న ఆ యింటిలోని వస్తువులన్నీ అచ్యుత్ అనుచరుల చేతుల్లో నాశనమైపోతున్నాయి. ఆ చర్యల తాలూకు శబ్దాలు ఎదురింటి వరకు వినిపిస్తున్నాయి. అది పిరికివాళ్ళు మాత్రమే చేసే పని అని అచ్యుత్ కి తెలుసు.
   
    ఆ నగరంపై, నగర ప్రజలపై తను కాపాడుకుంటూ వస్తున్న పట్టు చేజారిపోతుందేమోనన్న భయం అచ్యుత్ అంతరాళంలో నిలిచి ప్రశ్నిస్తుండడంతో చేయిస్తున్న పిరికి పనినే తన ధైర్య సాహసాలకు ప్రతీకనుకొని మురిసిపోతున్నాడు. ఆత్మవంచన చేసుకుంటున్నాడు.
   
    ఆ యింటికి చుట్టుప్రక్కల వున్న యిళ్ళలోని వ్యక్తులు భయంతో తలుపులేసుకుని క్షణాలు లెక్కిస్తూ, బిక్కు బిక్కుమంటూండగా, ఎదురింటిలో వున్న ఆదిలక్ష్మి, అరుణాచలం తమకు జరుగుతున్న నష్టాన్ని కనులారా చూస్తూ, చెవులారా వింటూ బోరుమని ఏడుస్తున్నారు.

 Previous Page Next Page