తిమ్మడి మాటలకు మాలిని మనస్సు చివుక్కుమంది.
ప్రియాంకవైపు నిరసనగా చూస్తూ, "జరిగిందేదో జరిగింది. రెండు వేలిస్తుంది, ఆమెను వదిలేసెయ్" అంది మాలిని.
గంభీరమైన మాలిని తిమ్మడ్ని ఏదో శాసించినట్టనిపించి వదిలేస్తూ అన్నాడు- "ఆమె చెబుతోందని వదిలేస్తున్నాను. నీ మోసం వలన ఒక ప్రాణం బలయింది. ఛీ... ఛీ... నువ్వొక ఆడదానివేనా?" అని.
మేడమ్ మాలిని తనపట్ల చూపించిన క్షమ భరింపరానిదిగా వుంది ప్రియాంకకు.
అప్పటివరకూ స్తబ్దుగా వున్న బోస్ ప్రియాంకను ఒక పామును చూసినట్టు చూస్తూ "ఇదొక రాక్షసి. నన్ను ప్రేమిస్తుందని నమ్మి ఈ అమ్మాయి పట్ల రాక్షసంగా ప్రవర్తించాను" అని హిందూవైపు చూస్తూ. "ఐ యామ్ సారీ" అన్నాడు అక్కడినుంచి వడివడిగా వెళ్ళిపోతూ.
హిందూవైపు ప్రశ్నార్ధకంగా చూశాడు తిమ్మడు. హిందూ మౌనంగా వుంది.
అప్పుడే వచ్చినవారికి ఏం జరిగిందో తెలియక అంతకు ముందు అక్కడున్న వారివైపు చూశారు.
"బోస్ ని రెచ్చగొట్టింది ప్రియాంక. బోస్ ఆమెను పబ్లిగ్గా మా అందరి ముందు ముద్దెట్టుకున్నాడు మేడమ్" అందో అమ్మాయి సిగ్గుగా తలవంచుకుని.
నరాలు చిట్లిపోయేంతగా వచ్చిన ఆవేశాన్ని నిగ్రహించుకోలేక తిమ్మడు చెంగున ప్రియాంకవైపు దూకి రెండు చేతులతో ప్రియాంకను విసురుగా తనవైపు లాక్కొని అందరికీ వినిపించేలా ముద్దెట్టుకొని వెళ్ళిపోయాడు. తిమ్మడు ప్రియాంకను ముద్దెట్టుకున్న దృశ్యాన్ని అక్కడే ఒకరి చేతిలో వున్న కెమెరా నిశ్శబ్దంగా, ఎవరూ పసికట్టని విధంగా కనురెప్పపాటు కాలంలో ఎక్స్ పోజ్ చేసుకుపోయింది.
ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న అందరూ షాక్ తిన్నారు.
తిమ్మడి నుంచి ప్రమాదాన్ని శంకించారు కాని, ఆ ప్రమాదం ఇలా వుంటుందని ఎవరూ ఊహించలేదు. ఒకవేళ ఊహించగలిగినా అతని కదలికలోని మెరుగువేగాన్ని అడ్డుకోవటం అనితరసాధ్యమనిపించింది.
ప్రియాంక ఎవరు? ఆమె బ్యాగ్రవుండ్ ఏమిటి? అనేవి ఏమాత్రం లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా, కసిగా దూకిన అతని గుండె ధైర్యానికి ఆశ్చర్యపోయింది మాలిని. దెబ్బకు దెబ్బ... మోసానికి మోసం... అంతే అప్పుడు అతని కళ్ళలో కనిపించింది.
ఎవరితను...? సరిగ్గా తను ఎంతకాలంగానో కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్న హాలాహల కంఠుడు ఇతనేనా? ఇతనే కావాలి కయ్యానికి కాలుదువ్వడానికి. సమయం ఆసన్నమయింది. ఇక తను రంగప్రవేశం చేయాలి. ఓ ప్రక్క ప్రియాంకను రెచ్చగొట్టి, మరోపక్క అతన్ని రెచ్చగొట్టాలి.
ఇది కేవలం ఒక సాధారణ సంఘటన కాదు. ఒకవేళ అయ్యేలా వున్నా తను కానివ్వరాదు. శత్రువు కాలిగోటిమీద దెబ్బకొట్టి ప్రయోజనం లేదు. ఆయువుపట్టుపై తొలి సమ్మెటపోటు పడాలి. నిజానికి ఇంతకాలం ఇలాంటి సంఘటన కోసమే తను ఎదురుచూస్తోంది. అనుకోకుండా అది ఇంత త్వరగా వస్తుందని ఏమాత్రం ఊహించని మహత్తర దృశ్యం ఇప్పుడు తన దగ్గర బంధించబడింది.
హఠాత్తుగా వాతావరణం వేడెక్కుతుండడంతో ఎవరికివారే అక్కడ్నుంచి సర్దుకున్నారు.
ప్రియాంకను ఎవరో పాపర్ లా వున్న వ్యక్తి పబ్లిగ్గా ముద్దెట్టుకున్నాడనే వార్త క్షణాల్లో కాలేజి అంతా పాకిపోయింది.
మరికొద్ది నిమిషాలకే క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డ్స్, కాలేజీ గోడలు సరికొత్త సమాచారాన్ని అందించడానికి సమాయత్తమవుతున్నాయి.
అక్కడ చివరగా మిగిలింది మాలిని, ప్రియాంకలే.
మాలినికి నిప్పు రాజేసే పని మిగిలిపోయింది. అందుకే ఆమె కదలలేదు.
ఎంతో పవిత్రంగా చూసుకొనే తన పెదవులు పదిమంది ముందు ఎంగిలి కావటాన్నే ఇంకా నమ్మలేక స్థాణువైపోయింది ప్రియాంక. మగవాళ్ళను ఏడిపించడం వరకే సరదాపడే ప్రియాంకకు ఆ సంఘటన ఏడుపు తెప్పిస్తోంది.
ఆవేశం, దుఃఖం, కోపం, ఉక్రోషం, కసి, పగ, అవమానం తెరలు తెరలుగా ఆమెను కుదిపేస్తున్నాయి.
ప్రియాంక మానసిక సంఘర్షణను సరిగ్గా అంచనా వేయగలిగింది మాలిని.
అప్పుడు నెమ్మదిగా ప్రియాంక దగ్గరకు వచ్చి అనునయంగా ఆమె భుజంమీద చేయి వేసింది.
ఆ షాక్ నుంచి అప్పటికిగాని తేరుకోలేకపోయింది ప్రియాంక.
"ఒక ఆడపిల్ల యౌవనవతి అయ్యాకే పెదవులమీద ముద్దుకు ప్రాముఖ్యత వస్తుంది. ఆ తొలిముద్దు ఎంతో పవిత్రమైనదని, విలువైందని, మధుర మైందని- జీవితాంతం మధుర స్మృతిగా మిగిలిపోయే అవకాశం, అదృష్టం కేవలం ఫస్ట్ కిస్ కే వుంటుందని చాలామంది అభిప్రాయం. అదే నా అభిప్రాయం కూడా..." మాలిని మెత్తగా అంటున్నా అందులో వ్యంగ్య ధోరణే కనిపిస్తోంది ప్రియాంకకు.
"నువ్వు గొప్ప అందగత్తెవు స్వతహాగానే. ఆ అందాన్ని ద్విగుణీకృతం చేసుకున్నావ్ నీ ఆత్మవిశ్వాసంతో, డబ్బుతో. కానీ గులాబీపువ్వు లాంటి అందం వెనుకే వున్న ముల్లులాంటి అహం నీకీ చేటు తెచ్చింది. నీకు తెలుసో, లేదో ఒక మతంలో యౌవనవతి అయిన ఆడపిల్లను ఆమెకు ఇష్టం లేకున్నా ఎవరైతే తొలిముద్దు పెట్టుకుంటారో వారినే వివాహం చేసుకుంటారు. నీ అహం బోస్ లాంటివార్ని వంచించడానికి పనికిరావచ్చేమో కాని తిమ్మడిలాంటి పౌరుషవంతుడ్ని కాదు. తెలివికలదాన్ననుకున్నావ్. బోస్ తో, హిందూకి ముద్దు పెట్టిస్తే ఆమెకు అవమానం, బోస్ కి నిన్ను చేసుకునే అర్హత పోతుందను కున్నావ్. ఇప్పుడు నీ అర్హతేమయింది? మీ నాన్నకున్న కోట్లాదిరూపాయలు నీ పెదవులకు పూర్వం వున్న పవిత్రతను తీసుకురాగలవేమో ప్రయత్నించు. స్టుపిడ్ గర్ల్..." అంది ప్రియాంకవైపు జాలిగా చూస్తూ.
తిమ్మడు వెళుతున్న వైపుకు వేగంగా దూసుకుపోయింది.
మొత్తానికి పది నిమిషాలకు అతన్ని చేరుకుంది మాలిని.
"నువ్విప్పుడు ముద్దెట్టుకుంది ఎవర్నో తెలుసా?" మాలిని ఒకింత ఆందోళనను కావాలని తెచ్చుకుంది కళ్ళలోకి.
తిమ్మడు ఆగిపోయి మాలినివైపు నిర్లక్ష్యంగా చూసాడు. ఆ తరువాత హిందూవైపు తిరిగి "నువ్వింటికెళ్ళు. నేను తర్వాత వస్తాను" అన్నాడు.
హిందూ వెళ్ళిపోయింది.
"ఎవరైతేనేం...?" మొండిగా అన్నాడు తిమ్మడు.
"అలా తేలిగ్గా కొట్టిపారేయకు- నువ్వు ముద్దెట్టుకుంది ప్రియాంకను. ప్రియాంక ఓ పొగరుబోతు కోటీశ్వరుడి కూతురు..."
"అయితే...?" తిమ్మడికి ఆమెతో సంభాషణ చిరాగ్గా వుంది.
"ఆ అమ్మాయి తండ్రి నిన్ను ఊరికే వదలడు-"
తిమ్మడి స్థయిర్యాన్ని, ధైర్యాన్ని అంచనా వేసుకునే సందర్భంలో అతన్ని జాగ్రత్తగా రెచ్చగొడుతూ పరీక్షిస్తోంది.
"వాడెవడయినా తప్పు నావైపు లేనప్పుడు భయపడను" తిమ్మడు కసిగా అన్నాడు.
"నిజంగా నీకంత ధైర్యముందా?"
మాలిని అతన్నే పరిశీలనగా చూస్తూ మరింత లోతుకు వెళుతోంది.
"చెప్పను... అవసరమొచ్చినప్పుడు చేసి చూపిస్తాను..." అంటూ ముందుకు కదిలాడు తిమ్మడు.
వెళుతోన్న తిమ్మడివైపే చూస్తూ ఆలోచనల్లో పడిపోయింది మాలిని.
ఇప్పుడిక... ఇంత జరిగాక ప్రియాంక ఊరుకోదు. తండ్రిని ఉసి కొల్పుతుంది. అప్పుడు సుదర్శనరావు ఉగ్రరూపం దాల్చటం ఖాయం. ఆ ప్రమాదం నుంచి శక్తితోగాని, యుక్తితోగాని తిమ్మడు బయటపడగలిగితే తన నిరీక్షణ ఫలించినట్లే. తన అన్వేషణ ముగిసినట్లే...
ఒకవేళ తిమ్మడు కేవలం ఆవేశపరుడైన అమాయకుడే అయితే ప్రియాంకను రెచ్చగొట్టడం అన్నది తన తప్పుగా మిగిలిపోతుంది.
తిమ్మడు ప్రమాదం నుంచి బయటపడగలిగితే అతన్ని తన ఆయుధంగా మార్చుకుంటుంది. లేనప్పుడు తిమ్మడు సుదర్శనరావు చేతిలో బలి కాకుండా ఏర్పాట్లు చేసి, ఆ తరువాత తన దగ్గరున్న నెగిటివ్ కి పని చెప్పాలి. అప్పుడైనా మరోరకంగా తన కసి తీరుతుంది...
చాలా సంవత్సరాల తర్వాత ఆమెలో హుషారు చోటుచేసుకుంది.
* * * *
తన ఇరవై ఏళ్ళ జీవితంలో శారీరకంగా చిన్న గాయాన్ని కాని, మానసికంగా వీసమెత్తు అవమానాన్ని కాని ఎదుర్కొన్న సంఘటన అనుభవంలోకి రాని ప్రియాంక ఈ సంఘటనతో, మాలిని మందలింపుతో పూర్తిగా షాక్ తింది. మొహం పాలిపోయింది.
ఆమె గులాబీరంగు ముఖం, విశాలమైన తెల్లటి నుదురు అవమాన భారంతో ఎర్రగా కందిపోయాయి. బాణంలా వంపులు తిరిగి, ఎప్పుడూ ఆర్ద్రంగా మెరిసే పెదవులు వణుకుతున్నాయి.
నిలువెల్లా దహించుకుపోతున్న అవమానభారం ఉక్రోషంగా, కన్నీటిగా మారింది.
కొద్ది నిమిషాల్లో తేరుకున్న ప్రియాంక కాళ్ళను విసురుగా నేలకేసి కొట్టి, పెదవుల్ని అరచేత్తో బలంగా రుద్దుకుని కారువేపు నడిచింది విసవిసా.
* * * *
బోస్ చేసిన పనికి హిందూ మనస్సు తీవ్రంగా గాయపడింది. మగవాళ్ళ మధ్య ఎంత స్వేచ్చగా సంచరిస్తున్నా తన పెదవులపై పడిన తొలిముద్దు ఆమెను ఒక స్త్రీగా బాగా కదిలించివేసింది.
అప్పుడప్పుడే ఆమె అంతరంగంలో ఓ ఆకృతి పొందుతున్న ఒక మధురమైన స్వప్నం చెదిరిపోయింది.
తిమ్మడితోపాటు గదికొచ్చిన హిందూ కొద్ది నిమిషాల తర్వాతగాని తేరుకోలేకపోయింది.
* * * *
ఆరోజల్లా ధుమధుమలాడుతూనే వుంది ప్రియాంక. ఆ విషయం ప్రియాంక తండ్రి సుదర్శన్ రావుకి తెలిసిపోయింది.
ఎంతో ముఖ్యమైన పనుల్ని సయితం వదిలేసి హడావుడిగా బయలుదేరాడు. సుదర్శన్ రావు ఓ చిత్రమైన మనిషి. ఆకాశం విరిగి మీద పడబోతోందన్నా నిబ్బరంగా నవ్వగల స్థయిర్యం వుందతనికి. చాపక్రింద నీరులా ఇటు పారిశ్రామిక ప్రపంచంలో, అటు రాజకీయ చదరంగంలో బలంగా పాతుకుపోయాడు.
ఇంట్లో కూర్చునే ఎవరెవరు ఏ సీట్లోకి వస్తున్నారు, ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారు, ఎవరి బలహీనత ఏమిటి లాంటి వివరాల్ని నిశ్శబ్దంగా తన గ్రహింపుకు తెచ్చుకోగల సమర్ధుడు సుదర్శన్ రావు. అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ వన్ పారిశ్రామికవేత్తగా, కాంట్రాక్టర్ గా కోట్లకుకోట్లు గడించాడు.
వేలకు వేల టన్నుల సిమెంట్ సొంత నిర్మాణాలకు నిర్భయంగా వాడేసుకుంటే నిజాయితీపరుడైన ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ వాటిని వెలికిలాగితే తప్పును అతనిమీదకే నెట్టి తను నిజాయితీపరుడుగా బయటపడిన అతి ప్రమాదకరమైన వ్యక్తి. అతనితో శతృత్వం కన్నా స్నేహమే లాభిస్తుందన్న నిర్ణయానికి వచ్చేశారు చాలామంది అధికారులు.
అతనికి ఎదురు తిరిగికాని, పోటీపడి కాని ఎప్పుడూ ఎవ్వరూ నెగ్గలేదు. సుదర్శనరావు ఫలానా వర్క్ కి టెండర్ వేస్తున్నాడని తెలిస్తే ఆపాటికే టెండర్ వేసినవాళ్ళు సయితం భయంతో గైర్ హాజరవుతారు.
అలాంటి సుదర్శన్ రావుకున్న ఒకే ఒక బలహీనత అతని కూతురు ప్రియాంక. ఆమె పుట్టాకే తనకు బాగా కలిసి వచ్చిందనే నమ్మకం మూలంగా వచ్చిన బలహీనత. సుదర్శనరావు మరో సంతానం కొడుకు. తండ్రి కోరిక ప్రకారం స్టేట్స్ వెళ్ళి ఎం.బి.ఎ. చేసి వచ్చాడు. ప్రస్తుతం తండ్రికి కుడిభుజంలా వ్యాపార, వ్యవహారాలలో మసలుకుంటుంటాడు.
రాష్ట్ర వ్యాపార కార్యక్రమాలను తన చెప్పుచేతల క్రింద పెట్టుకున్న ది గ్రేట్ సుదర్శన్ రావు గారాల కూతురు అలిగింది. అది అతను సహించలేడు.