Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 12


    ప్రియాంక ముఖం పాలిపోయింది.


                      *    *    *    *


    "బోస్... హలో బోస్" అంటూ పెద్దగా అరిచింది ప్రియాంక.

`    బోస్ కి ఆ కాలేజీలో పెద్ద రౌడీ అని పేరు.

    ఫైనలియర్ బి.యస్.సి. చదువుతున్న బోస్ ఆ కాలేజీలో చేరి పదేండ్లు అయింది.

    అతనికి చాలాకాలంగా ప్రియాంక మీద మనసుంది. అదే విషయాన్ని ఒకసారి బయటపెడితే అందరిముందు చులకనగా మాట్లాడింది. అప్పటి నుంచి బోస్ ఆలోచనలు మారాయి. బెదిరించి, భయపెట్టి లాభం లేదు. మంచి చేసుకుని సొంతం చేసుకోవాలనే ఆలోచనల్లో వున్నాడు.

    ప్రియాంక పిలవటం ఆశ్చర్యంగా వుంది బోస్ కి. వడివడిగా దగ్గరకు వచ్చాడు బోస్.


                     *    *    *    *


    "రేపు కాలేజీ దగ్గరకు వస్తే మా అమ్మాయిగారు మీకు డబ్బులిస్తామని చెప్పమన్నారండి..." ప్రియాంక ఇంట్లో పనిచేసే తోటమాలి చెప్పిన మాటల్ని ముందు నమ్మలేదు హిందూ.

    నమ్మి కొత్తగా మోసపోయేది కూడా లేదు. "వస్తానని చెప్పు" అంది చివరకు అతనితో.


                     *    *    *    *


    ఉదయం 10.30 అవుతోంది.

    ప్రియాంక, బోస్, ఇంకొందరు కాలేజీ లైబ్రరీ ముందు నించుని హిందూ కోసం వెయిట్ చేస్తున్నారు.

    సరిగ్గా 10-40కి వచ్చింది హిందూ.

    ప్రియాంకకు హిందూని అమాంతం మింగేయాలన్నంత కోపంగా వుంది.

    "డబ్బు లిచ్చేస్తే వెళ్లిపోతాను" సూటిగా అసలు విషయంలోకి వచ్చింది హిందూ.

    "డబ్బులా...? ముందే డబ్బెలా ఇస్తారు...? నువ్విస్తానన్న ముద్దు ఇవ్వకుండానే డబ్బులెలా ఇస్తారు?"

    హిందూకి ప్రియాంక మాటలు అర్ధంకాలేదు. సరిగ్గా ఇదే సమయానికి తిమ్మడు హిందూ రూమ్ కి వచ్చాడు. హిందూ అంతకుముందే కాలేజీకి వెళ్ళినట్లు తెలిసి అనుమానించాడు. అంత నిజాయితీగా డబ్బులిచ్చేదే అయితే ఇలా ప్రవర్తించి వుండేది కాదు. ఇందులో ఏదో మోసం వుందని పరుగులాంటి నడకతో కాలేజీకి బయలుదేరాడు.

    "ముద్దేమిటి...? తమాషాలొద్దు. ఒక్కోసారి ఆ తమాషాయే నీ జీవితాన్ని కాల్చివేస్తుంది" సీరియస్ గా అంది హిందూ.

    అప్పటికే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ చుట్టూ పోగైపోయారు.

    'ఒక్క దెబ్బకు రెండు పిట్టలు' పథకంలో ప్రియాంక వున్నట్లు అటు బోస్ కి గాని, ఇటు హిందూకిగాని తెలియదు. అసలా అనుమానమే రాలేదు వారికి.

    "నా జీవితాన్ని ఎవరూ కాల్చలేరు. ఏదీ కాల్చలేదు. నీ జీవితం కాలకుండా చూసుకుంటే చాలు..." అంటూ బోస్ వైపు చూసింది.

    కనురెప్పపాటు కాలంలో బోస్ హిందూ ముందుకు దూకాడు. అందరూ చూస్తుండగా చటుక్కున ఆమె తలను రెండు చేతులతో బలంగా పట్టుకుని ఆమె పెదవులపై తన పెదవుల్ని ఆనించి, కావాలని శబ్దం వచ్చేలా ముద్దెట్టుకొని వదిలేసాడు.

    ఊహించని ఆ పరిణామానికి హిందూ షాక్ తింది. కొన్ని క్షణాలపాటు ఆమె శిలాప్రతిమలా బిగుసుకుపోయింది. ప్రియాంక తనను తిరిగి అవమానించటానికే పిలిపించి వుండవచ్చని చూచాయగా వూహించగలిగినా ఇలాంటి పరాభవం చేయిస్తుందని వూహించలేదు.

    ఆ సంఘటన పక్కవార్ని సయితం విభ్రాంతికి గురిచేసింది.

    హిందూ ముఖం అవమానంతో ఎర్రబడింది.

    అంతలో బోస్ అమాయకంగా "ఇప్పుడు చెబుతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకిష్టమైతే పెళ్ళి చేసుకుంటాను..." అన్నాడు ప్రియాంకవైపు చూస్తూ.

    పక్కనున్న వాళ్ళు బిత్తరపోయారు.

    అసలేమిటిదంతా...? అందరూ చూస్తుండగా ఓ అమ్మాయిని ముద్దెట్టుకున్న బోస్ ప్రియాంకను ప్రేమించానని ఓపెన్ గా చెబుతున్నాడు.

    హిందూ మరోసారి షాక్ తింది. ఇది ముందుగా అనుకున్న పథకంలా తోస్తోంది. ప్రియాంకకు పొగరు వుందనుకుందే కాని, ఇంత నీచంగా వ్యవహరిస్తుందనుకోలేదు హిందూ. ప్రియాంక పెద్దగా నవ్వింది. కొన్ని క్షణాలపాటు అలా నవ్వుతూనే వుంది.

    "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా...? జోగ్గా వుంది నాకు. ఏం చూసుకొని ప్రేమించావ్...? చదువా...? పాపం డిగ్రీ ఎప్పటికి పూర్తి చేస్తావో నీకే తెలియదు సంస్కారం కూడా లేదు. సంస్కారం వుంటే పబ్లిగ్గా ఓ అమ్మాయిని ముద్దెట్టుకోవు. తెలివితేటలు కూడా లేవు. అవే వుంటే ఒకమ్మాయిని ప్రేమిస్తూ ఆ అమ్మాయి ముందే మరో అమ్మాయిని ముద్దెట్టుకొని ఎంగిలిపడవు. కామన్ సెన్స్ అసలే లేదు. ఉంటే ప్రేమిస్తున్నానని పబ్లిగ్గా చెప్పమని చెప్పినప్పుడే అనుమానం వచ్చేది. అయినా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తితో బలాదూర్ తిరిగే నీకు గరల్ ఫ్రెండ్ ని మెయిన్ టైన్ చేయగల స్వశక్తి వుందా? రేపు పెళ్ళి చేసుకొని స్వంతంగా ఓ జాకెట్ ముక్క కొనుక్కురాగలవా నీ భార్యకు? కనీసం దోసెడు మల్లెపూలు తేగలవా? నీకు ఆవేశం, అవివేకం, కోపం, కండబలం, గూండాయిజం, రౌడీయిజం తప్ప మరే అర్హతలు లేవు. నేటి తరపు ఏ యువతి అయినా తెలివికలవాడ్ని కోరుకుంటుంది. స్వశక్తి మీద నిలబడే వాడ్ని కోరుకుంటుంది. తాటిచెట్టులా ఎదిగి తల్లిదండ్రుల్ని బెదిరించుకు బ్రతుకుతూ, బాధ్యత లేకుండా బలాదూర్ తిరిగే నీలాంటి వాణ్ణి ఏ యువతీ ప్రేమించదు. అయినా నాకసలు ఎంగిలి అంటే అసహ్యం" అంది అందరికీ వినిపించేలా తిరస్కారంగా.

    బోస్ అచేతనుడయ్యాడు. అతని జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నా, జరిగిన ఘోరమైన పరాభవాన్ని అర్ధం చేసుకోగలిగినా, ఏం చేయలేకపోతున్నాడు.

    "ఒక దెబ్బకు రెండు పిట్టలు సామెతంటే భలే ఇష్టం నాకు. నన్ను అవమానించినందుకు నీకు అవమానం... నామీద అత్యాసకు పోతే నీకు చెప్పు దెబ్బ..." అంది హిందూ, బోస్ ల వేపు చూపులని మార్చి మార్చి చూస్తూ.

    ఎవ్వరూ మాట్లాడలేదు. అందరూ బిగుసుకుపోయి చూస్తున్నారు.

    "ఈ అవమానాలకు సాక్ష్యం వున్నా కోర్టు పరిధిలోకి నేను రాను. నా చేతికి మట్టంటకుండా నా రెండు పనులూ పూర్తయ్యాయి" అంది హేళనగా నవ్వుతూ ప్రియాంక.

    ఈ గొడవ, గందరగోళం చూసి లెక్చరర్స్, మిగతా స్టూడెంట్స్ కూడా పరుగెత్తుకొచ్చారు ఏం జరుగుతుందో చూద్దామని. అలా వచ్చిన వారిలో లెక్చరర్ మాలిని కూడా వుంది.

    సరిగ్గా అప్పుడే తిమ్మడు కాలేజీ కాంపస్ లో అడుగుపెట్టాడు.

    తిమ్మడు వేగంగా వస్తూనే అనుకున్నాడు హిందూకి జరగరానిది ఏదో ఈపాటికే జరిగేవుండాలని.

    "ఏం జరిగింది ప్రియాంక? ఈ అమ్మాయెవరు?" మాలిని కేజువల్ గా అడిగింది.

    హిందూ నోరు విప్పితే తను బయటపడిపోక తప్పదు. ఎలా ఈ ప్రమాదం నుంచి బయటపడటం? రెండువేలు ఇచ్చి వుండవల్సిందేమో? చేసిన తప్పుకు ఒక క్షణం ప్రియాంక చింతించినా ఆమె అహం ముందు అదెంతసేపో నిలబడలేదు.

    ప్రియాంక ఏదో చెప్పబోయేలోపే తిమ్మడు అక్కడకు చేరుకున్నాడు.

    తిమ్మడ్ని చూస్తూనే ప్రియాంక అదిరిపడింది. హిందూ ముఖం మ్లానమై వుండడాన్ని తిమ్మడు పసిగట్టాడు. చిన్న చిన్న విషయాల్ని అంతగా లెక్క చేయదు హిందూ. పైగా ఎప్పుడూ ధీమాగా తలెత్తుకుని తిరిగే హిందూ తలవంచుకుని గోళ్ళు కొరుకుతూ వుంది.

    ఎవరూ మాట్లాడలేదు. అన్ని వందలమంది అక్కడున్నా చిత్రమైన నిశ్శబ్దం అలముకుందక్కడ.

    "ఏం జరిగిందిక్కడ?" వురుములా గర్జించిన తిమ్మడివేపు ఉలిక్కిపడి చూసారక్కడ. ఎవరికీ ధైర్యం చాలడంలేదు నోరు విప్పటానికి.

    "నేను దేన్నయినా సహిస్తాను. మోసాన్ని సహించలేను. బిల్డింగ్ ప్లాన్ చెబితే రెండు వేలిస్తానన్నావ్. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదంటున్నావ్. నిన్ను తేలిగ్గా వదిలిపెట్టను" ప్రియాంకవైపు కోపంగా చూస్తూ అన్నాడు తిమ్మడు.

    మాలిని తిమ్మడివైపు విస్మయంగా చూసింది.

    బిల్డింగ్ ఛాలెంజ్ కి తానే పరిష్కారం కనుక్కున్నానని ఇచ్చిన పార్టీ!

    అది నమ్మాలో లేదో తెలియడంలేదు. నమ్మకుండా వుందామంటే ఆ అభియోగాన్ని ఖండించలేదు ప్రియాంక.

    తిమ్మడి మాటలకు అక్కడ గుమిగూడిన అందరూ ఆశ్చర్యపోయారు.

    "నువ్వు చెప్పేది నిజమేనా?" మాలిని తిమ్మడివైపు సూటిగా చూస్తూ అడిగింది.

    "అడగండి కావాలంటే. నీతి, నిజాయితీ వున్నదయితే నిజం చెబుతుంది" పౌరుషంగా అన్నాడు తిమ్మడు.

    మాలిని ఈసారి ప్రశ్నార్ధకంగా ప్రియాంకవైపు చూసింది. బెదిరే ఆమె కనురెప్పల కదలికలే ఆ అనుమానాన్ని కలిగిస్తున్నాయి. చేసిన తప్పును కప్పి పుచ్చుకునే అనుభవం ఇంకా ప్రియాంకకు రాలేదు.

    "మొత్తానికి ఆ తండ్రికి తగ్గ కూతురువే. తెలివితేటల్ని అమ్ముకునే వాడు అమాయకుడే అయినా నిజాయితీపరుడు. వాటిని కొనుక్కునేవాళ్ళు వాటి ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించగలిగినా ఒప్పుకొన్న డబ్బు ఒప్పందం ప్రకారం ఇచ్చినప్పుడే నిజాయితీపరులౌతారు. నీలాంటివాళ్ళు నా స్టూడెంట్స్ అని చెప్పుకోవటానికి నాకు సిగ్గుగా వుంది ప్రియాంక. మర్యాదగా అతని డబ్బులు అతనికిచ్చెయ్" క్షమా ధోరణిలో అంది మాలిని.

    ప్రియాంక అంటే పడని స్టూడెంట్స్ ప్రియాంకవైపు హేళనగా చూస్తూ అన్నారు-

    "అదా అసలు సంగతి? పెద్ద తనే ఐడియా ఇచ్చినట్లు ఫోజ్ పెట్టి ప్రైజ్ డబ్బు కొట్టేసి పార్టీ ఇచ్చింది- అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. నిజానికి లక్ష రూపాయలు అతనివి పాపం."

    ఈసారి తిమ్మడితోపాటు హిందూ ఉలిక్కిపడింది.

    లక్షరూపాయలా?

    ప్రియాంక ముఖం అవమానంతో ఎర్రబడింది.

    "పోయినసారి జరిగిన మర్యాదే ఈసారీ జరుగుతుంది. మర్యాదగా బయటకు వెళ్ళండి" అంది ప్రియాంక ఆవేశంతో ఊగిపోతూ.

    తిమ్మడు పళ్ళు పటపట కొరుకుతూ ఒక్క అంగలో ప్రియాంకను సమీపించి, ఒకచేత్తో ఆమె భుజాన్ని ఒడిసి పట్టుకొని "మర్యాద చేస్తావా? ఏది చేయించు చూస్తాను. దమ్మున్న మొగవాడ్ని రమ్మను. ఎముకలు విరిచేస్తాను" తిమ్మడి కళ్ళు నెత్తురు చిమ్ముతున్నాయి.

    "ఇదిగో మిస్టర్... అసలేం జరిగింది?" మాలిని దగ్గరగా వస్తూ అడిగింది మరిన్ని వివరాలకోసం.

    తిమ్మడి బలమైన చేతిలో గువ్వపిట్టలా ఇరుక్కుపోయిన ప్రియాంక గింజుకుంటోంది.

    "చెప్పాను గదా! మాకు రెండు వేలిస్తానని మాటిస్తే ఆ కాంప్లెక్స్ కి ఐడియా ఇచ్చాం. అది తన ఐడియా అని సిగ్గు లేకుండా గొప్పగా చెప్పుకుంది. ఇలాంటిచోట్ల చదువుతోపాటు నీతి, నిజాయితీ కూడా నేర్పుతారనుకునే వాడ్ని" ఈసడింపుగా అన్నాడు. 

 Previous Page Next Page