ఇంట్లో అంతా గందరగోళంగా వుంది. నౌకర్లు గజగజా వణికి పోతున్నారు. ఆమె కోపం ఎందరి ఉద్యోగాల్ని బలిగొంటుందో, ఎందరి బతుకుల్ని నడిరోడ్డుమీదకు ఈడుస్తుందో గతంలో ఎరుగున్నవారు కనుకే అలా వణికిపోతున్నారు.
అలా వణికించడం అంటే ప్రియాంకకు భలే సరదా. ఎవరి మీద తన తండ్రికి కంప్లయింట్ ఇవ్వబోతోందో తెలియకుండా అందరివైపు కోపంగా చూస్తూ వారి వెన్నులో చలిపుట్టిస్తుంది.
కారు దిగిన సుదర్శన్ రావు సరాసరి కూతురి గది ముందుకు వచ్చి "కన్నా... ఏమైందిరా?" అన్నాడు లాలనగా.
సమాధానంగా గదిలోంచి విసురుగా ఒక వస్తువొచ్చి బయటపడింది.
అక్కడే వున్న భార్యవైపు చూశాడు ఏం జరిగిందన్నట్లు.
"దాన్ని చేతులారా మీరే పాడుచేస్తున్నారు. చిన్నప్పుడు ఎత్తుకు తిప్పడం కోసం ఏడ్చి బ్లాక్ మెయిన్ చేసేది. ఇప్పుడు అలిగి అన్నం తినకుండా ఆ పని చేస్తోంది" ఆమె భయపడుతూనే మెల్లగా అంది.
సుదర్శన్ రావు భార్యవేపు కోపంగా చూశాడు. ఆమె బాధగా తలొంచుకుని విసవిసా వెళ్ళిపోయింది అక్కడినుంచి.
"నేనొచ్చానమ్మా... రా... నీవు అలగటమేంటి తల్లీ? కొండమీది కోతి కావాలన్నా క్షణాలు చాలు తల్లీ...." అంటూ ప్రాధేయపడ్డాడు.
గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాల్లోంచి కనిపించిన అతని కళ్ళలోని కసిని, అతని అంతరంగంలో క్షణాల్లో రూపుదిద్దుకునే ప్రమాదకరమయిన ఆలోచనల్ని పసిగట్టగలిగినవారెవ్వరూ లేరు ఇంతవరకు.
అంతలో విసురుగా బయటకొచ్చింది ప్రియాంక. "కోతే కావాలనుకుంటే నీదాకా అక్కర్లేదు డాడీ! నాకు కావల్సింది మీరు దింపాలనుకునే కోతులు, కొండముచ్చులు కాదు..." ఆవేశంతో ఆమె శరీరం కంపించిపోతోంది.
సుదర్శన్ రావు ఓ క్షణం కూతురువైపు అర్ధంకానట్లు చూశాడు.
"ఏదైనా పర్వాలేదమ్మా! నీకోసం ఏదైనా చేస్తాం. కానీ నీవు ఇలా అన్నం, నీళ్ళు మానేస్తే నేను భరించలేను తల్లీ... ఏం కావాలో చెప్పు... నేను, నీ అన్న ఇన్ని పాట్లు పడేది నీకోసమేగా చిట్టితల్లి" కూతురికి దగ్గరగా వచ్చి ఆమెని పొదివి పట్టుకుని తలపై నిమురుతూ అన్నాడు.
"ఎక్కినవాటిని దించాలి" అంది ప్రియాంక చిన్నపిల్లలా తండ్రి భుజంమీద వాలిపోయి వెక్కిళ్ళుపడుతూ.
"వేటిని దింపాలి చెప్పు..." ఆజ్ఞాపించమన్నట్లు అడిగాడు సుదర్శన్ రావు.
ప్రియాంక తండ్రి నుండి దూరంగా జరిగి కళ్ళు తుడుచుకుని అంది- "నాకు ఘోరమైన అవమానం జరిగింది... తెలుసా?"
అలాంటిది ఈ ప్రపంచంలో జరగరాదన్నట్టు చూశాడో క్షణం.
"ఒక మూర్ఖుడు నన్ను కొన్నివేలమంది ముందు అవమానపర్చాడు. దానికి తగిన శాస్తి చేయాలి డాడీ!" ఆమె మాటలు ఇంకా పూర్తికాలేదు.
"అంత దమ్మున్నవాడు వున్నాడా ఈ సిటీలో? చూస్తాను. వాడి అంతు ఈ రోజే చూస్తాను. వాడెవడో చెప్పు... నిముషాల్లో వాడి సమాధికి గుంట త్రవ్విస్తాను" అతని కళ్ళు కోపంతో నెత్తురు చిమ్ముతున్నాయి.
దూరంగా వుండి ఇదంతా గమనిస్తున్న ప్రియాంక తల్లి ఓ క్షణం ఒణికిపోయింది.
ఎప్పుడూ టైం మనదే కాదు. ఎక్కడో ఎప్పుడో ఇంతకంటె బలమైనవాడు, తెలివికలవాడు తారసపడక తప్పదు. వాడు ప్రళయకాల రుద్రుడైతే...? ఒక ప్రభంజనమైతే...? అపర శివుడే అయితే...? వాడు మూడో కన్నే తెరుస్తే...? అప్పుడు తమ బతుకులు ఏమౌతాయి? అదీ ఆమె భయం.
ప్రియాంక తల్లికి వినిపించకుండా గుసగుసలాడుతున్నట్టు చెప్పింది అతనెవరైందనేది.
మరికొద్ది నిముషాలకే రెండు జీపులు, రెండు మోటారు సైకిల్స్ బయలుదేరాయి.
* * * *
"అతని గురించి మీకూ తెలిసే వుంటుంది. పగపట్టాడంటే అది తీరేవరకు నిద్రపోడు. ఇప్పుడు ఖచ్చితంగా అతని కూతురు ద్వారా అతని దృష్టి తిమ్మడి మీద పడుతుంది. అతను తప్పు చేసినా చట్టపరంగా శిక్షించే హక్కు శాంతిభద్రతలు కాపాడే అధికారిగా మీకుంటుంది, వుండాలి... ఆ సుదర్శన్ రావుకి కాదు..." మాలిని చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు ఎస్.ఐ. పక్కనే నిలబడ్డ కోటి మాలినివేపు చూస్తూ, ఆమె చెప్పే మాటలు వింటూ ఒకింత కంగారుపడ్డాడు.
"మీకు తెలుసనుకుంటాను... మా ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ మా ఎస్.పి. చేతిలో వున్నా అవి నామమాత్రమే. ఎప్పుడయితే అతనికి ఎదురెళ్తామో ఆ పవర్స్ అతని గుప్పిట్లోకి వెళ్ళిపోతాయి..."
"భయపడుతున్నారా...?" ఎస్.ఐ. అసమర్ధతను ఎత్తిచూపుతూ అంది మాలిని.
"ఆ భయమే వుంటే సుదర్శన్ రావుకి వ్యతిరేకంగా మీరు మాట్లాడినప్పుడే భయపడి వుండేవాణ్ణి. పోలీసుశాఖపై అతనికున్న గ్రిప్ తెలియడం కోసం చెప్పాను. ఇకపోతే నేను తిమ్మడికి రక్షణ కల్పించాలంటే అతనన్నా, అతని తరపువారన్నా కంప్లైంట్ ఇవ్వాలి. మీరిస్తారా...?" ఎస్.ఐ. రాఘవ స్థిరంగా అన్నాడు.
"ఎస్..." అంటూ అప్పటికప్పుడే కంప్లయింట్ రాసిచ్చింది మాలిని.
ఆ కంప్లైంట్ ని ఫైల్ చేస్తూ ఓరగా కోటివేపు చూశాడు రాఘవ.
మరో నిమిషంలో పోలీస్ జీప్ తిమ్మడ్ని పట్టుకునేందుకు బయలుదేరింది.
* * * *
సుదర్శన్ రావు వాహనాలు, తిమ్మడి జాడకోసం రోడ్లమీద దూసుకుపోతున్నాయి.
సరిగ్గా అదే సమయంలో మాలిని తన కెమేరాలోంచి నెగిటివ్ ని బయటకు తీసి డెవలప్ చేస్తోంది- తనకు తెలిసినవాళ్ళ స్టూడియో డార్క్ రూమ్ లో.
ఆమె నాజూకైన చేతివేళ్ళు హైపో కెమికల్ ట్రేలో చకచకా పని చేసుకుపోతున్నాయి.
ఏ ఇంట్లోనైనా ఆవేశపరుడైన మనిషి ఒకరుంటే చాలు డొంకంతా కదలడానికి. నీ పతనానికి ముహూర్తం నీ ముద్దుల కూతురే నిర్ణయించబోతోంది. మాలిని ఆలోచనల నుంచి తేరుకొని డెవలప్ చేసిన ఫిల్మ్ ని రెడ్ లైట్ కి ఎదురుగాపెట్టి చూసింది. అప్పుడు మెరిసాయామె కళ్ళు... సుదర్శన్ రావు గారాల కూతుర్ని తన కబంధ హస్తాల్లో బంధించి ముద్దు పెట్టుకుంటున్న తిమ్మడు... స్పష్టంగా ఆ దృశ్యం కనిపిస్తోంది నెగిటివ్ లో.
సంతృప్తిగా తల పంకించి నెగిటివ్ ని పైన కట్టివున్న ఓ నైలాన్ తాడుకి వేలాడదీసింది.
సంధ్యా సమయమయింది. ప్రచండ భాస్కరుడు తన సహస్ర కిరణ కాంతి పుంజాన్ని ఉపసంహరించుకొని పశ్చిమాద్రి గర్భంలో కలిసి పోతున్నాడు. చివరగా మామిడి తోపును కూడా సుదర్శన్ రావు మనుష్యులు అంగుళం, అంగుళం గాలించారు. తిమ్మడి జాడ లేదు. వారిలో చీకటి చిక్కబడే కొద్దీ భయం పెరుగుతోంది. ఉత్తచేతులతో వెళ్తే తమ బతుకులకు తామే మంగళ గీతం పాడుకోవాలి. అంగుళం అంగుళం, వీధి వీధి క్షుణ్ణంగా గాలించి వేశారప్పటికే.
పోలీస్ జీప్ కూడా ఎక్కడా క్షణం ఆగకుండా అవిరామంగా తిమ్మడు తిరిగే ప్రాంతాలవేపు దూసుకుపోతోంది.
సరీగ్గా ఇదే సమయంలో మాలిని తన గదిలో, రాఘవ పోలీస్ స్టేషన్ లో అసహనంగా పచార్లు చేస్తున్నారు. ఇద్దరికీ సుదర్శన్ రావుని నమిలి మింగేయాలన్నంత కోపంగా వుంది.
ఇవేమీ తెలియని తిమ్మడు చీకటి నిశ్శబ్దంలో కప్పబడిన సిద్దప్ప గుడిసె మధ్య కూర్చుని నిస్తేజంగా పైకప్పుకేసి చూస్తున్నాడు. ఈ స్థలం ఒక్క హిందూకి తప్ప మరెవరికీ తెలియదు.
సుదర్శన్ రావుకి తెలిసిపోయింది తిమ్మడు ఇక తన మనుష్యులకు దొరకడని. అప్పుడు తిమ్మడి గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. కేవలం కుట్రలతో, కుయుక్తులతో పైకొచ్చిన సుదర్శనరావుకి తిమ్మడు ఎక్కడుంటాడో ఊహించలేకపోయినా, ఎవర్ని పట్టుకుంటే జాడ తెలుస్తుందో తెలిసిపోయింది.
మరో రెండు నిమిషాలకు సుదర్శన్ రావు నౌకరు హిందూ రూమ్ ముందున్నాడు భయం భయంగా బిత్తరచూపులు చూస్తూ.
నౌకరుని చూసిన హిందూ ఏం ఆసక్తి కనబర్చలేదు.
"ఒక ప్రమాదం ముంచుకొచ్చిందమ్మా..." అన్నాడు నౌకరు.
అయినా హిందూలో రియాక్షన్ కనిపించలేదు. కాని ఇంజనీర్ ఆందోళనగా ఒకడుగు ముందుకేసి "ఏం జరిగింది?" అన్నాడు.
"తిమ్మడు మా చిన్నమ్మగార్ని అవమానించాడట. అది తెలిసి మా పెద్దయ్యగారు మండిపడి అతన్ని ఎక్కడున్నా పట్టుకొచ్చేయమని ఆజ్ఞాపించారు. ఆయన సంగతి బాగా తెలిసినవాడ్ని కనుక తిమ్మడ్ని రక్షించుకొమ్మని చెప్పటాని కొచ్చాను. తిమ్మడిమీద ప్రేమతో ఈ విషయం చెప్పలేదు. మా యజమాని మీద కోపంతో చెబుతున్నాను. అతని కోసం గాలించబట్టి చాలాసేపయింది. ఇంకా దొరకలేదు. జాగ్రత్తపడమని చెప్పటానికొచ్చాను" అంటూ వడివడిగా వెళ్ళిపోయాడు.
లాజిగ్గా ఆలోచించే అలవాటు లేకపోతే వచ్చే ప్రమాదమే వచ్చింది. పట్టుకోవాలనుకునే శత్రు వర్గమే జాగ్రత్తని హెచ్చరించి తద్వారా అవతలవారు వేసే తప్పటడుగులో పని సాధించుకుంటుంది. హిందూ, ఇంజనీర్, సైంటిస్ట్ ఆందోళనగా సిద్దప్ప గుడిసెవైపు వెళ్ళటం- తనను తాను రక్షించుకోమని తిమ్మడికి చెప్పటం- తిమ్మడు నవ్వి తేలిగ్గా వారి భయాన్ని కొట్టిపారేయటం- హిందూ వెనుకే బయలుదేరిన సుదర్శన్ రావు మనుష్యులకు తిమ్మడి ఆచూకీ తెలియటం అంతా చాలా తేలిగ్గా జరిగిపోయింది.
మరో పదినిమిషాలకు నలుగురూ సుదర్శన్ రావు భవనపు నేలమాళిగలో బంధించబడ్డారు.
ఇంజనీర్ కి, సైంటిస్ట్ కి భయంగా వుంది. చేసిన పొరపాటుకు అప్పటికే కొన్ని వందలసార్లు వాపోయారు. సమయం మించిపోయింది. శక్తి చాలలేదు.
బంధించిన పదినిమిషాలకొచ్చారు సుదర్శన్ రావు, ప్రియాంకలు.
తిమ్మడ్ని చూడటం అదే తొలిసారి సుదర్శన్ రావుకు.
"తెలుగు సినిమాలో విలన్ గా మిమ్మల్ని బంధించగలిగినా, ఆ పద్ధతిలోనే ఆవేశంగా అనవసరమైన డైలాగ్స్ చెప్పను.
నా కూతురు ఇష్టపడింది దేన్నైనా, ఎవర్నయినా కొంటాను- కష్టపెట్టింది ఏదైనా ఎవరైనా బ్రతకనివ్వను. మీకు విధించాల్సిన శిక్ష నా కూతురే నిర్ణయిస్తుంది" అంటూ అక్కడే వున్న ఓ సోఫాలో కూర్చుంటూ "కమాన్ బేబీ..." అన్నాడు.
మరుక్షణం ఆమె చేతిలో ఒక కొరడా ప్రత్యక్షమయింది.
హిందూకి, తిమ్మడికి తప్ప మిగతావారి వెన్నులో చలి ప్రారంభమయింది.
ఆత్మాభిమానం, పట్టుదల వున్న వారికి కొద్దిపాటి అవమానం జరిగినా అదే ఓ ప్రమాదకరమైన మలుపుకి హేతువవుతుంది.
ప్రియాంక కళ్ళు ఎర్రగా రక్తం చిమ్ముతున్నట్టున్నాయి.
ఆమె చేతిలో కసిగా లేచిన కొరడా తలా ఒకసారి వార్ని కర్కశంగా తాకింది.
ఇంజనీర్, సైంటిస్ట్ ప్రాణభయంతో గావుకేకలేశారు. హిందూ పళ్ళ బిగువున ఆ దెబ్బను భరించింది. తిమ్మడు ఏమాత్రం చలించలేదు. పైగా చిరునవ్వుతో ప్రియాంకవైపు చూశాడు.
"నువ్వొక అల్పురాలివి కనుకే ఆ అర్భకుల్ని కూడా హింసిస్తున్నావ్. నన్ను మోసం చేసింది నీవు. నిన్ను అవమానించింది నేను. ఇది మనిద్దరి మధ్యే తేలాల్సిన విషయం..."
తిమ్మడి మాటలు పూర్తికాలేదు- ఒక్క అంగలో సుదర్శన్ రావు ప్రియాంక చేతిలో కొరడాని అందుకొని టపటప నాలుగుసార్లు కొరడాతో బాదాడు తిమ్మడ్ని. ఆ దృశ్యాన్ని చూడలేక హిందూ బాధగా కళ్ళు మూసుకుంది. ఇంజనీర్, సైంటిస్ట్ భయంతో వణికిపోతున్నారు.
అంతలో ప్రియాంక పరిగెత్తుకొచ్చి తండ్రి చేతిలోని కొరడాను లాక్కుంది.