ప్రయాణికుల్లో కొందరు పెద్దగా కేకలేసి మాట్లాడారు. కొందరు సణుక్కుంటూ కూర్చున్నారు.
ఎయిర్ లైన్స్ తాలూకు సీనియర్ ఆఫీసర్ ఒకాయన వచ్చి ప్రయాణికులకు నచ్చచెప్పడానికి చూశాడు.
అతను చెప్పినదాని సారాంశం!
"జరుగుతున్న దానికి మేము జవాబుదారీకాదు. ఇదంతా పైలట్ల క్రమశిక్షణా రాహిత్యం అంతే. ఈ సమస్య ఇప్పటికిప్పుడు సెటిలయ్యేది కాదు. దీన్లో చాలామందికి తెలియని రాజకీయాలు వున్నాయి. ఎయిర్ లైన్స్ మానేజ్ మెంటు మీద సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ సవారీ చేస్తుంది. పైలట్ల అసోసియేషన్ కి, మినిస్ట్రీ సపోర్టు వుంది. పైలట్లతో మేము కఠినంగా వ్యవహరిద్దామనుకుంటే మినిస్ట్రీ అడ్డం పడుతుంది. అందుకని మేం వాళ్ళని దార్లోకి తేలేం! అయినా మేం ఊరికే కూర్చోలేదు. రేపు ట్రెయిన్ లో వీలయినంత మందికి టిక్కెట్లు బుక్ చేస్తాం. ఇవాళ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో మీకు బస ఏర్పాటు చేస్తాం. సారీ ఫర్ ద ఇన్ కన్వీనియెన్స్" అన్నాడు అపాలెజెటిక్ గా.
అతన్ని పీకి పాకానపెట్టినా అంతకంటే జరిగేదీ, ఒరిగేదీ ఏమీలేదని అందరికీ తెలుసు. అందుకని నిరసనధ్వనులు క్రమక్రమంగా చప్పబడ్డాయి.
ఎయిర్ లైన్స్ వారి వెహికల్స్ లో అందరికీ ఫైవ్ స్టార్ హోటల్ కి చేర్చారు.
అప్పటికే అర్దరాత్రి అయిపోయింది.
నిద్రపోయేవేళ దాటిపోయింది చాలామందికి.
అందుకని లాబీలో చేరారు. ట్వంటీఫోర్ అవర్సూ తెరిచేవుండే 'కాఫీ షాపు' ఆ పక్కనే వుంది. కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకోవడం మొదలెట్టారు కొంతమంది.
డాక్టర్ సుధారాణి కాఫీ తాగుదామా వద్దా అని ఆలోచించి వేళకాని వేళ కాఫీ వంటికి మంచిది కాదని నిర్ణయించుకుని 'హాట్ మిల్కు' ఆర్డర్ చేసి నిండా పాలతోవున్న పొడుగాటి గ్లాసు తీసుకువచ్చి ఒక సోఫాలో కూర్చుంది.
వెంటనే వెనకనుంచి ఊదర బెడుతున్నట్లు సిగరెట పొగ నికోటిన్ విషవాయువులు.
అసహనంగా తిరిగి చూసింది డాక్టర్ సుధారాణి.
వెనకనే వున్న సోఫాలో కూర్చుని వున్నాడు అఖిల్.
అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానంలో వున్నట్లు కూర్చుని వున్నాడు అతను.
అఖిల్ సిగరెట్ ని ఎన్ జాయ్ చేస్తున్నట్లు లేదు. టెన్షన్ తో త్వరత్వరగా పొగపీల్చి వదిలేస్తున్నాడు. అంతే.
వలయాలుగా పైకిలేస్తున్న పొగవేపు తదేకంగా చూస్తున్నాడు అఖిల్.
* * * *
అప్రయత్నంగానే అతని మనసు మళ్ళీ గతంలోకి వెళ్ళింది.
తనకి మిత్రుడయిపోయిన ఉత్తమ్ సింగ్ ఛెడ్డా దగ్గర వుంటూనే తను చిన్న చిన్న పనులు అనేకం చేశాడు. కూలీ చేశాడు. నాలీ చేశాడు. సంపాదించిన కాసిని డబ్బులూపెట్టి ఇంటికి కావలసినవి ఎవన్నా కొనుక్కు వెళ్ళేవాడు.
ఆ తర్వాత ఒక భేల్ పూరీ అమ్మే బండి దగ్గర ప్లేట్లు కడిగే పనిలో కుదుర్చుకున్నాడు. అందుకు చిన్నతనం ఫీలవలేదు తను. పైపెచ్చు చాలా గర్వంగా ఫీలయ్యాడు కూడా! డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు.
ఒకరోజున బండీవాలాకు వంట్లో బాగోలేదు. ఆ ఒక్కరోజుకీ ఆ తినుబండారాల బండిని చూసుకునే బాధ్యత తనకి అప్పగించాడు అతను.
ఆ బండి దగ్గరికి అలవాటుగా వస్తుండే గిరాకీలు అసలు మనిషి లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు. కొత్తవాళ్ళు మాత్రం కొద్దిమందే వచ్చారు.
అప్పుడు వచ్చింది ఒక అమ్మాయి. తనని చూడగానే అదోలా మొహం పెట్టింది.
"ఆజ్ వో బండీవాలా నహీ ఆయా?" అంది.
బండీవాలాకి ఒంట్లో బాగాలేదని అందుకనే అతను రాలేదని చెప్పాడు తను హిందీలోనే.
ఆ అమ్మాయి సంకోచిస్తూ నిలబడింది. ఈ బండిలో తిందామా, ఇంకోచోట తిందామా అని ఆలోచిస్తూ_
ఆ అమ్మాయి ఒక నిర్ణయానికొచ్చేలోపలే తను భేల్ పూరీ తయారు చేసేశాడు.
తప్పనిసరై తీసుకుంటున్నట్లు అందుకుంది ఆ అమ్మాయి. మరమరాలు, మసాలా, కారప్పూస కలిపి చేసిన భేల్ ని రూపాయి కాసంత చిన్న పూరీతో తీసుకుని నోట్లో పెట్టుకుంది ఆ అమ్మాయి.
వెంటనే ఆమె మొహంలో ఆశ్చర్యం కనపడింది.
"అర్రెవా! మజా ఆయా!" అంది మెచ్చుకోలుగా అంటూనే ఇంకాస్త భేల్ నోట్లో పెట్టుకుంది.
"బహుత్ అచ్చా బనాయా బాబూ! బెహ్తరిన్."
"థాంక్యూ మేడమ్!" అన్నాడు తను తృప్తిగా అని అనాలోచితంగా ఇంకో మాట కూడా అనేశాడు.
"ఐయామ్ సో ఫ్లాట్టర్డ్!"
"క్యా తుమ్ అంగ్రేజీ బీ అచ్చీతరఫ్ జాన్ తేహో!" అంది ఆ అమ్మాయి ఆశ్చర్యంగా.
అబద్ధం ఆడవలసిన అగత్యం కనబడలేదు తనకి.
ఇంగ్లీషులోనే అన్నాడు "కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతూ మానేశాను."
"గాడ్ ఓహ్ గాడ్!" అంది ఆ అమ్మాయి ఆశ్చర్యం పట్టలేక. "నువ్వు....ఐయామ్ సారీ....మీరు కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంటా?"
అవునన్నట్లు తల పంకించాడు తను.
"మరి...." అంటూ ఆగిపోయి తనవేపు, బండీ వేపూ మార్చిమార్చి చూసింది ఆ అమ్మాయి.
"కూటికోసం కోటి విద్యలు" అన్నాడు తను.
"కారణమేమిటి?"
"పర్సనల్ వ్యవహారాలు" అన్నాడు ముక్తసరిగా.
"ఓహ్!" అని, "మీది ఢిల్లీ నేనా?" అంది.
"కాదు. హైదరాబాద్ దగ్గర."
"అనుకున్నా మీ హిందీ యాస వినగానే" అంది ఆ అమ్మాయి తెలుగులో. ఆమె మొహంలో ఎగ్జయిట్ మెంట్ కనబడుతోంది.
"మేమూ తెలుగువాళ్ళమే! నా పేరు నీరజ. నీర్జా అని పలుకుతారు ఇక్కడివాళ్లు. నీర్జా తెలాంగ్. మూడు తరాల క్రితం ఇక్కడికి వచ్చి సెటిలయిపోయాం మేము. ఒకప్పుడు తెలుగువాళ్ళం కదా! అందుకని ఇంటిపేరు తెలాంగ్ అయిపోయింది" అని నవ్వి "అది సరే! భేల్ పూరీ ఇంత బాగా ఎలా చెయ్యగలిగారూ? రోజూ ఇంత రుచి రాదే" అంది.
"నాకు వంట చేయడంలో అనుభవం వుంది."
"ఎలా?"
నవ్వాడు తను.
"నాకు అమ్మ అంటే ప్రాణం! నేనంటే అమ్మకి పంచప్రాణాలు. అమ్మని వదిలి క్షణం కూడా వుండలేకపోయేవాడిని. కానీ అమ్మ ఎప్పుడూ వంటింట్లోనే వుండేది. అమ్మతోబాటు నేనూ కేరాఫ్ వంటిల్లే. అందుకని చిన్నప్పుడే వంట చెయ్యడం పర్ ఫెక్టుగా వచ్చేసింది నాకు.
"ఓరీ! నన్ను మించిపోయావే!" అనేది అమ్మ నవ్వుతూ. వంటొచ్చిన మొగాణ్ణి నేను. ఆ రౌడీ గ్యాంగ్ లో మేమిద్దరం....
"రౌడీగ్యాంగా?" అంది నీర్జా అర్ధం కానట్లు.
"చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాణ్ణి నేను. అందుకని అమ్మ అనను రౌడీ అని పిల్చేది ముద్దుగా" అని సరిదిద్దుకున్నాడు తను.
నీర్జా భేల్ పూరీ తినడం పూర్తి అయ్యింది. బండిలో వున్న తినుబండారాలన్నీ పరిశీలనగా చూసింది నీర్జా. "రగడా బాగుందా!" అంది.
"తిని చూసి చెప్పండి" అన్నాడు తను నవ్వుతూ.
"ప్లేటువద్దు. కొద్దిగా శాంపిల్...." అంది నీర్జా.
రెండు స్పూన్ల రగడా ఇచ్చాడు. తినిచూసి మెచ్చుకుంది.
"గుడ్!" ఆలూటోస్ట్....చిన్నముక్క చాలు!
"తప్పకుండా" అంటూ ఒక ఆలూటోస్టు ఇచ్చాడు.
తినిచూసి "బ్రహ్మాండం" అంది తెలుగులో. "పావ్ భాజీ కూడా బాగానే కుదిరిందా! ప్లేటు వద్దు. స్పూనుతో చాలు....ఊరికే శాంపిల్ కి...."
తన మొహంలో నవ్వు తగ్గింది. మొహం కొంచెం గంభీరంగా పెట్టి ప్లేట్లో కాస్త భాజీ, ఒక పావ్ పెట్టి ఇచ్చాడు.
"అరెవా! మజా ఆయా!" అంది నీర్జా తిన్నాక.
"పావ్ భాజీ ప్లేటు ఇమ్మంటారా?" అన్నాడు తను.
"వద్దొద్దు" అంది నీర్జా గప్ చుప్ లవేపు చూస్తూ.
"గప్ చుప్ లకి జాన్ అంతా మసాలానీళ్ళలో ఉంటుంది. పాళ్ళు సరిగ్గా సరిపోయాయా?" అంది.
వినిపించుకోనట్లు ఇంకోవేపు తిరిగి కొత్త కస్టమర్ ని పలకరించాడు తను.
ఈలోగా నీర్జా పెరుగువడ ఒకటి అందుకుని నోట్లో వేసుకుంది.
ఆ అమ్మాయి తనని ఆట పట్టిస్తుందేమోనని అనుమానం వచ్చింది అతనికి. అందుకని కాస్త పదునుగా అన్నాడు ఇంగ్లీషులో.
"యువర్ బిల్ ఈజ్ సిక్స్ రుపీస్ మేడమ్!"
"ఓ....అయామ్ సారీ....!" అంటూ పర్సు తెరిచింది నీర్జా.
వెంటనే ఆమెకి నిలువుగుడ్లు పడ్డాయి.
"బాప్ రే బాప్! పర్సులో డబ్బులు పెట్టుకురావడం మరిచిపోయాను నేను. సరికొత్త వందరూపాయల నోట్లకట్ట! ఇంట్లోనే పెట్టేసి వచ్చా!" అంది ఆదుర్దాగా. "ఇప్పుడెలాగా?"
తన పెదిమలు బిగుసుకున్నాయి.
అంతలోనే నీర్జా అంది-
"నేను బ్లూరాక్ హోటల్లో పనిచేస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే రేపు హోటల్ కి వచ్చి డబ్బు కలెక్ట్ చేసుకుంటారా? టేక్సీలో వచ్చేయండి! నేను పే చేస్తాను"
నిదానంగా అన్నాడు తను-