"బ్లూరాక్ లో పనిచేస్తూ ఇక్కడికొచ్చి తింటున్నారా మీరు?" అన్నాడు నిలదీస్తున్నట్లు.
దొరికిపోయిన దొంగలా పక్క చూపులు చూసింది నీర్జా.
"అవును. అక్కడ దొరికే స్టఫ్ అంతంతమాత్రం" అని "ఐయాం సో సారీ! రేపు రండి" అంటూ తను ఇంకేం అనడానికి అవకాశం ఇవ్వకుండా త్వరత్వరగా నడుస్తూ వెళ్ళిపోయింది నీర్జా.
ఢిల్లీ పిల్ల దెబ్బ నసాళాని కంటినట్లయ్యింది తనకి.
అనిపిస్తూనే ఉంది తనకి ఆ అమ్మాయి బ్లూరాక్ లో పనిచేయడం పరమ అబద్ధం అని.
అయినా చూసి తేల్చుకోవాలనుకున్నాడు. ఆ అమ్మాయిని అంత తేలిగ్గా వదిలిపెట్టెయ్యాలనిపించలేదు.
మర్నాడు బ్లూరాక్ హోటల్ కి వెళ్లాడు తను. టాక్సీలో కాదు. నడిచే.
బ్లూరాక్ ఫైవ్ స్టార్ హోటల్. అక్కడొక పదిరోజులు ఉంటే బిల్లు హీనపక్షం లక్షరూపాయలు అవుతుంది.
రిసెప్షన్ లోకి వెళ్ళి అడిగాడు నీర్జా కోసం.
"నీర్జానా?" అంది రిసెప్షనిస్టు. కాస్త ఆగి "ఎందుకు?" అంది పరిశీలనగా చూస్తూ.
"ఆమెతో పర్సనల్ వర్క్ ఉంది"
నుదురు చిట్లించి అంది రిసెప్షనిస్టు. "కాన్ట్ యూ బీ మొర స్పెసిఫిక్? మరింత వివరంగా చెబితే బాగుంటుంది"
"నీర్జా నాకు బాకీ! డబ్బు వసూలు చేసుకోవటానికొచ్చాను" అని అన్నాడు తను నిర్మొహమాటంగా.
రిసెప్షనిస్టు ఇంటర్ కమ్ లో ఎవరితోనో మాట్లాడి తర్వాత బెల్ బోయ్ ని పిలిచింది.
హోటల్ బెల్ బోయ్ వచ్చి, రిసెప్షనిస్టు ముందు నిలబడ్డాడు.
"ఇతన్ని ఆఫీసుకు తీసుకెళ్ళు" అంది రిసెప్షనిస్టు, తనని చూపిస్తూ.
వెంటరమ్మన్నట్టు సైగచేసి, కదిలాడు బెల్ బోయ్.
లిఫ్టులో పైకెళుతూ బెల్ బోయ్ ని అడిగాడు తను.
"ఈ నీర్జా....ఇక్కడేం పనిచేస్తూ ఉంటుంది?"
"పనా? అని చులకనగా తనవేపు చూశాడు బెల్ బోయ్.
"నీర్జా మేడమ్! ఈ హోటల్ కీ, ఇంకో ఐదు హోటళ్ళకీ కూడా ఓనరు!" అన్నాడు ఆమెపట్ల ఉన్న భయభక్తులన్నీ గొంతులో పలికిస్తూ.
* * * *
"వెల్ కమ్" అంది నీర్జా నవ్వుతూ. "ప్లీజ్ సిడౌన్"
కూర్చుని ఆశ్చర్యంగా అన్నివేపులా చూశాడు తను. ఏసీ రూము గోడలకంతా వినీర్ పానెలింగ్. ఒక గోడకి ఖరీదయిన హుసేన్ పెయింటింగ్ తగిలించి ఉంది. చంద్రవంకలాగా అర్ధచంద్రాకారంలో ఉన్న తెల్లటి డెకొలామ్ టాప్ టేబుల్. దాని వెనుక చక్కటిచుక్కలా దర్జాగా కూర్చుని వుంది నీర్జా.
"మీరు...." అన్నాడు తను సంభ్రమంగా.
"అవును! నేనే ఈ హోటల్ కి ఓనర్ని!"
"భలే ప్రాక్టికల్ జోక్! నిజం చెప్పాలంటే మిమ్మల్ని బాగా తిట్టుకున్నాను నేను"
చిన్నగా నవ్వింది నీర్జా.
"సహజమే కదా! తప్పులేదు. ఇక ముందెప్పుడూ నన్ను తిట్టుకోకుండా ఉంటే చాలు!"
"మీరొచ్చి మా బండీలో తినడం."
"నేనే అన్నిచోట్లకీ స్వయంగా తిరిగి రకరకాల వంటకాలు టేస్ట్ చూసి మా మెనూలో ఇంక్లూడ్ చేస్తూ వుంటాను"
"ఐసీ!"
"నేను మీ బాకీ తీర్చాలి కదూ! ఇదిగో!" అంటూ ఒక కవరు అందించింది నీర్జా.
తీసి చూశాడు.
అపాయింట్ మెంట్ ఆర్డరు! మెయిన్ కిచెన్ లో చెఫ్ దగ్గర అప్రెంటిస్ గా!
ఫైవ్ స్టార్ హోటల్లో తను అప్రెంటిస్! తను ఇప్పుడు ఉన్న పిజిషన్ లో ఈ ఉద్యోగమే తనకి గవర్నర్ గిరీ లాంటిది.
ఫాంటాస్టిక్!
"థాంక్స్! థాంక్స్ ఏ లాట్!" అన్నాడు తను.
తన ఆనందం ఆమెకి తృప్తి కలిగించినట్లుగా చిరునవ్వు నవ్వింది నీర్జా.
మర్నాడే ఆ హోటల్లో చేరాడు తను. మకాం హోటల్ కే మార్చేశాడు. మొదటి రోజున తనకి చాలా సింపుల్ డ్యూటీ అని చెప్పారు. ఆలుగడ్డలు చెక్కు తియ్యడం. అంతే!
"అంతేనా!" అనుకున్నాడు వినగానే. కానీ ఓ చిన్న పర్వతంలా వున్న ఆ బంగాళదుంపలన్నీ చెక్కు తీసేసరికి దుంపతెగిపోయినట్లయింది. చేతులు చచ్చుబడిపోయాయి.
నెల్రోజులు తిరిగేసరికి తన ఉత్సాహం చచ్చి సగమై కూర్చుంది.
మధ్య మధ్య కలుస్తూనే ఉన్నాడు ఉత్తమ్ సింగ్ ఛెడ్డా.
తను హోటల్లో చేరడానికి ముందు రోజున కన్నుగీటి అన్నాడు ఉత్తమ్- "ఆ కుడీ'కి నువ్వంటే ఏదో వుంది. చూస్తూ వుండు ఒకరోజున హోటల్లో ప్రెసిడెన్షియల్ సూట్ లోకి నిన్ను లాక్కెళ్ళిపోయి ప్రేమ డైలాగులు చెబుతుంది" అని.
అంత లెవెల్లో కాకపోయినా నీర్జా తనంటే చాలా అభిమానం చూపిస్తుందని, తనకి హోటల్ లో స్పెషల్ ట్రీట్ మెంట్ వుంటుందని వూహించాడు తను.
ఉండాలని ఆశించాడు కూడా.
అదేంలేదు. అలాగేం జరగలేదు.
నీర్జాని మొదటి రోజున తను కలవడమే! ఆ తర్వాత ఆమె తనకు కనబడలేదు. అసలు తను కిచెన్ లో నుంచి బయటికి వస్తే కదా ఎవరన్నా కనబడేది? తెల్లారకముందే లేవడం, కూరలు కడగడం, చెక్కు తీయడం, తురమడం.... అన్నీ యిన్నీ కూరలు కావు....గుట్టలు గుట్టలు!! గుట్టలు గుట్టలు.... చూస్తుండగానే అర్ధరాత్రయిపోయేది. వెళ్ళి యిట్లా పక్క మీద పడుకోగానే తెల్లారిపోయినట్లు అనిపించేది. మళ్ళీ లేవడం....మళ్ళీ కూరలు!
నీర్జా ఒక్కసారి కూడా కనబడలేదు మళ్ళీ.
ఆమె పద్ధతి తనకి అర్ధం అయ్యింది. ఆమె మంచి బిజినెస్ ఉమన్! మంచి టాలెంట్ స్కాట్! తనలో వున్న స్ఫార్క్ ని కనిపెట్టేసింది. తీసుకొచ్చి కిచెన్ లో కట్టిపడేసింది. ఆ తర్వాత తన సంగతి పట్టించుకోవడం మానేసింది.
అంతే....పక్కా బిజినెస్ ఉమన్!
అంతకంటే ఘోరమైన విషయం ఏమిటంటే....
ఫస్ట్ తారీఖున జీతం కోసం వెళ్ళాడు తను.
ఇప్పుడు కాదు_ ఇంకో పదిరోజుల తర్వాత అన్నారు ఆఫీసులో.
పదిరోజులు కాదు_ చూస్తుండగానే ఇంకో ఫస్ట్ తారీఖు వచ్చేసింది.
అయినా జీతం లేదు.
వెయ్యి కళ్ళతో ఎదురు చూశాడు తను జీతం కోసం.
జీతం తన కోసం కాదు.
మొదటి నెల జీతం రాగానే అమ్మకి ఏదన్నా కొని పంపాలని తహతహలాడిపోయాడు తను.
అవును....
తను తొలిసారిగా శ్రమపడి సంపాదించిన జీతంతో అమ్మకి అపురూపంగా ఏదన్నా కొని పంపాలనుకున్నాడు.
అమ్మకి అన్నీ ఉన్నాయి.
అయినా సరే తను పంపడం వేరు. అమ్మ ఎంత సంతోషిస్తుంది? అమ్మ సంతోషం చూస్తే తన జన్మ తరించిపోదూ....
రెండో నెల పదో తారీఖు దాకా చూసి ఇంక ఉండబట్టలేక ఆఫీస్ కి వెళ్ళాడు తను.
అక్కడ నీర్జా లేదు.
ఏదో కాన్ఫరెన్స్ లో ఉందట.
జీతం కోసం అకౌంటెంట్ ని అడిగాడు.
తేలిగ్గా అన్నాడు అకౌంటెంట్ - "నీ జీతం ఎంత ఇవ్వాలో ఇంకా ఫిక్స్ కాలేదు" అని.
అప్పుడు గుర్తొచ్చింది తనకి. తనకి అప్రెంటిస్ గా అపాయింట్ మెంట్ యిస్తున్నట్లుగా ఆర్డర్ యిచ్చారుగానీ దాన్లో తన జీతమెంతో ఎక్కడా రాయలేదు.
అప్పుడు ఇంకో విషయం కూడా గుర్తు వచ్చింది తనకి.
ఆ రోజున అప్పనంగా తినేసిన భేల్ పూరీ, ఆలూటోస్టూ, గప్ చుప్ ల తాలూకు అప్పు కూడా యింకా తీర్చనేలేదు యీ అమ్మాయి.... ఈ అందగత్తె!
అమ్మో డబ్బు మనిషి!
"నా జీతం ఎంతో ఎప్పుడు ఫిక్స్ చేస్తారు?" అన్నాడు అకౌంటెంటుతో. తన గొంతులో కొద్దిగా అసహనం.
"సెల్లార్ లో పడుకోడానికి నీకు చార్ పాయ్ ఇచ్చాంగా! చాయ్ పానీ, రోటీ యిస్తున్నాంగా? ఇంక జీతం కోసం గడబిడ చేస్తావెందుదూ....?" అన్నాడు అకౌంటెంట్ చిరాగ్గా.
"మా అమ్మ కోసం!" అనాలనుకున్నాడు తను. కానీ ఉగ్గబట్టుకుని ఊరుకున్నాడు.
డబ్బున్నవాళ్ళు డబ్బు ఎలా సంపాదిస్తారో అప్పటికప్పుడే అర్ధమైపోయింది తనకి!
ఎదుటివాడి శ్రమని, ఎదుటివాడి శక్తిని, ఎదుటివాడి సామర్ధ్యాన్ని దోపిడీచేసి క్యాష్ చేసుకోవడం! ఈ నీర్జాదీ అదే పద్ధతి!
అప్పుడు విన్నాడు తను కొలిగ్స్ ద్వారా....
పైసా ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినట్లు విలవిల్లాడిపోతుందిట ఈ నీర్జా. పైసా విదిల్చాలంటే పదివేలసార్లు ఆలోచిస్తుందట!
అమ్మకి ఏదన్నా కొని పంపాలనే ఆరాటం అలాగే ఉండిపోగా ఒక రోజున ఉత్తమ్ ని కలుసుకోవడానికి బయలుదేరాడు తను.
హోటల్ లోంచి బయటకి రాగానే కనబడ్డాడు ఒకతను.
అతనే....కిల్లర్!!