Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 12


    అంటే, వాళ్ళు తమ తద్దినం తామే పెట్టుకుంటారన్న మాట!

    దాని అర్ధం, ఆరోజు నుంచి వాళ్ళు చనిపోయి, ఇహలొక బంధనాలు లేని కొత్త మనుషులుగా పుడుతున్నారన్న మాట!

    ఆ విధంగా వాళ్ళు సన్యాసులవుతున్నారన్న మాట!

    సాధువులకీ అవే అంత్యక్రియలు. అదే అంతిమ సంస్కారం వాళ్ళకి.

    ఆ తర్వాత సాధువు ప్రాణం ఈ స్థూలదేహాన్ని వదిలేసి వెళ్ళిపోయినా, అతనికి వేరే అంత్యక్రియలు జరిపించనక్కరలేదు. చనిపోయాక సాధువు శవాన్ని సమాధి చెయ్యవచ్చు. లేదా ఏదైనా నదిలో వదిలెయ్యవచ్చు. కూర్చుని ఉన్న భంగిమలో శవాన్ని గంగానదిలో వదిలెయ్యడం ఉత్తమోత్తమం!

    తనకు తానే శ్రాద్ధం పెట్టుకునే తంతు ముగిశాక, ఆ రాత్రికి అతి రహస్యమైన ఆఖరి తంతు ఒకటి జరుపుతారు.

    దానితో అతను సాధువుగా మారినట్లు పరిగణింపబడతాడు. ఇది శైవుల పద్ధతి.

    వైష్ణవ సాధువుగా మారదలచుకున్న వ్యక్తికి, తొలి పరీక్ష మరో విధంగా వుంటుంది. వైష్ణవ సాధువుల్లో చేరదలచుకున్న వ్యక్తి కాలుతున్న పిడకలతో ఉన్న మట్టి కుండను నెత్తిన పెట్టుకుని, బాధని భరించగలగాలి! అప్పుడే అతనికి సన్యాసానికి అనుమతి దొరుకుతుంది.

    కొంతమంది సాధువులు అనితర సాధ్యమైన దీక్షలో వుంటూ వుంటారు. బీహార్ కి చెందిన తపన్ భారతి అనే సాధువు గత తొమ్మిదేళ్ళ నుంచి ఒంటికాలు మీదే నిలబడి వున్నాడు. ఇరవై నలుగు గంటలూ నిలబడే ఉంటాడు. కాబట్టి ఆయనని ఖడేశ్వరీ బాబా అని కూడా పిలుస్తారు. దీనికి తోడు ఆయన మౌనదీక్ష కూడా పాటిస్తాడు. ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడడు!

    ఇంక దిగంబర నాగ సాధువులయితే 'అఖాడాలు' అనే తాలింఖానాలలో యుద్ధవిద్యలు నేర్చుకుంటూ ఉంటారు. తమ తెగని తాము రక్షించుకోవడం, అవసరం వచ్చినప్పుడు హిందూ ధర్మాన్ని రక్షించడం వాళ్ళ ధ్యేయం! దస్ నామీ అఖాడాకి చెందిన యుద్ధ యోధులయిన సాధువులు మధ్య యుగాల్లో ముస్లిం దండయాత్రలని ఎదిరించారు. బ్రిటీష్ వారు పాలించిన రెండొందల సంవత్సరాల కాలంపాటూ కూడా, జూనా అఖాడాకి చెందిన నాగ సాధువులు నిరంతరం తెల్ల దొరలని ఎదుర్కొంటూనే వున్నారు.  

    వీళ్ళలో అద్భుత సక్తులు ఉన్న యోగులు అనేకమంది. యోగాభ్యాసం వల్ల ఇంద్రియాల మీద అపరిమితమైన అదుపు వుంటుంది వీళ్ళకి. కుంభమేళా లాంటి సందర్భాలలో, ఈ నాగ సాధువులు తమ అంగానికి తాడు కట్టి, రాళ్ళని ఎత్తడం, కార్లని ఆపెయ్యడం లాంటి అద్భుతాలు చేస్తూ ఉంటారు.

    ఇంక అఘోరీల సంగతికి వస్తే_

    ఈ సమాజం పెట్టిన ఏ నియమాన్నీ అంగీకరించరు అఘోరీ సాధువులు! అఘోరీ సాధువు స్మశానంలోనే నివసిస్తాడు. చితిమీది మంటల్లోనే అన్నం వండుకుంటాడు. తినడానికీ, తాగడానికీ పాత్రలాగా మానవ కపాలాన్నే ఉపయోగిస్తాడు. ఇది తినొచ్చు, ఇది తినకూడదు అన్న నియమం పెట్టుకోడు. అవసరమైతే పెంట కూడా తింటాడు. శవాలని నంచుకుంటాడు. మూత్రం తాగుతాడు. ఎముకలతోగానీ, కాపాలాలతోగానీ చేసిన మాలని మెడలో ధరిస్తాడు. శవాల మీద కప్పిన బట్టలని తన పక్కబట్టలుగా ఉపయోగిస్తాడు. ఎప్పుడూ నగ్నంగా తిరిగే అఘోరీ సాధువు అత్యవసరమైనప్పుడు మాత్రమే చెట్టు బెరడుతో జననేంద్రియాలని కప్పుకుంటాడు.

    సాధారణంగా సాధువులు యాచన కోసం, తినడం కోసం, ఒక బొచ్చెలాంటిది చేతిలో ఉంచుకుంటారు. నీళ్ళూ అవీ తాగడానికి వేరే కమండలం ఉంచుకుంటారు.

    కానీ అఘోరీ సాధువు తినడానికీ, తగడానికీ, యాచించడానికీ, మంత్రతంత్రాలకీ అన్నిటికీ ఒక మానవ కపాలాన్ని ఉపయోగిస్తాడు.

    ఆ కపాలం కూడా, చనిపోయిన పురుషుడిది అయివుండాలి. కపాలాన్ని కళ్ళ పైభాగం నుంచి కోసేసి, దాన్నే పాత్రగా ఉపయోగించాలని వాళ్ళ తెగలోని కఠోర నియమం! అలా చేసినప్పుడే దారి రహస్య మంత్రతంత్రాలు ఫలిస్తాయిట.

    తక్కిన సాధువుల గురించి బాగా తెలుసు హిందూరావుకి. కానీ అఘోరీ సాధువుల గురించీ, ముఖ్యంగా తను వెదుకుతున్న ఈ అఘోరీ సాధువు గురించీ, అతనికి ఉన్న సిద్దులని గురించీ తను విన్న విషయాలు నిజమేనా? నిజం అయి వుండడానికి అవకాశం ఉందా?

    అఘోరీ సాధువుని కలుసుకోబోతున్నాడు తను యింకొద్ది నిమిషాలలో.

    నిజం తెలిసిపోయే సమయం దగ్గరికొచ్చేసింది యింక.


                                                          *    *    *    *


    అదే సమయంలో__

    ఆకాశమార్గంలో__

    విమానంలో విసుగ్గా వెనక్కి జారగిలబడింది డాక్టర్ సుధారాణి. ఒళ్ళంతా చీదర చీదరగా అయిపోయినట్లు అనిపిస్తోంది తనకి.

    ఇందాక చటుక్కున సీటు మారడంలో ఎవరిదో చెయ్యి తాకింది తనకి.

    అది ఆ అఖిల్ చెయ్యేనా?

    ఆమె ఒళ్ళు జలదరించింది.

    అతన్ని చూస్తేనే తనకి అలర్జీ! ఇంక ఏకంగా తాకితే?

    అబ్బ! అర్జెంటుగా స్నానం చేస్తేగానీ ఈ అసహ్యం పోదేమో!

    ఆమె అలా అనుకుంటూ ఉండగానే, అకస్మాత్తుగా ఒక అనౌన్స్ మెంట్ వినబడింది. పైలట్ గొంతు.

    "లేడీస్ అండ్ జెంటిల్మన్! కొద్దిగా అసౌకర్యం కలిగిస్తున్నందుకు చింతిస్తున్నాము. అనుకోకుండా ఎయిర్ క్రాఫ్ట్ లో ఒక స్నాగ్ డెవలప్ అయ్యింది. ముందుకి వెళ్ళడం మంచిది కాదు. అందుకని వెనక్కి వెళ్ళి, ఢిల్లీలో లాండ్ అయ్యి, రిపెయర్ల తర్వాత మళ్ళీ బయలుదేరుతాం! సారీ ఫర్ ద ఇన్ కమ్ వీనియెన్స్! థాంక్యూ."  

    ప్రయాణీకులందరూ ఒక్కసారిగా ఊపిరి బిగపట్టారు.

    మళ్ళీ వెనక్కి_మళ్ళీ ఢిల్లీకి!

    ఎందుకు? ఎయిర్ క్రాఫ్ట్ లో డెవలప్ అయిన ఆ స్నాగ్ ఏమిటి? మేజర్ రిపెయిరా? ఇంజన్లు చెడిపోయాయా?

    కనీసం ఢిల్లీదాకానన్నా సురక్షితంగా వెళుతుందా విమానం?

    లేదా.... ఈ లోపలే.... ఈ క్షణంలోనో.... మరుక్షణంలోనో?

    అందరి మనస్సుల్లోనూ అదే ప్రశ్న!

    ప్రయాణీకులందరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కూర్చుని వుండగా, విమానం ఆకాశంలో వెనక్కి తిరిగి, ఢిల్లీకి వచ్చేసి లాండ్ అయ్యింది.

    భగవంతుడికి ధన్యవాదాలు అర్పిస్తూ కిందికి దిగారు ప్రయాణీకులు.

    కాక పిట్ లో నుంచి బయటకు వచ్చాడు పైలట్. అతని పెదిమల మీద విజయగర్వంతో కూడిన చిరునవ్వు.

    అంత డేంజరస్ సిచ్యుయేషన్ లో నుంచి ప్రయాణీకులందరినీ సురక్షితంగా రక్షించగలిగినందుకు అతను ఆ మాత్రం గర్వం ఫీలవడంలో తప్పు లేదనిపించింది డాక్టర్ సుధారాణికి.

    కానీ ఆమె ఊహ తప్పని అతని త్వరలోనే తేలిపోయింది.

    లాండ్ అయీ అవగానే విమానం 'రిపెయిర్ల' కోసం హాంగర్ లోకి వెళ్ళింది.

    వెంటనే రొమ్ము విరుచుకుని నడుస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లోకి వెళ్ళాడు పైలట్. అతని వెనకనే వెళ్ళాడు కో పైలట్.

    ఇద్దరూ జంటకవుల్లాగా, తమకి వంట్లో బొత్తిగా బాగాలేదని, అర్జెంటుగా లీవు కావాలని చెప్పారు.

    ఆఫీస్ స్టాఫ్ కి అర్ధమైపోయింది.

    లైటెనింగ్ స్ట్రయిక్ చేస్తున్నారు పైలట్లు! అధికారికంగా ప్రకటించిన సమ్మె కాదది. అందరూ కలిసి ఒకేసారి సిక్ లీవు పెట్టేస్తున్నారు.

    అప్పటికే తక్కిన ఎయిర్ పోర్స్ నుంచి మెసేజెస్ వచ్చేశాయి. ముప్పాతిక మూడొంతుల మంది పైలట్లు అప్పటికే మెడికల్ గ్రౌండ్స్ మీద లీవు అప్లయ్ చేసేశారు. మిగతావాళ్ళు లీవు అప్లయ్ చేసే ప్రయత్నంలో వున్నారు.

    దానితో ఫ్లైట్ షెడ్యూల్స్ అన్నీ అప్ సెట్ అయిపోయాయి.

    విమానాలని నడిపే పైలెట్లు లేకపోవడంవల్ల విమానాలన్నిటినీ గ్రౌండుమీదే ఉంచెయ్యవలసి వస్తోంది. ఎయిర్ లైన్స్ కి కోట్ల రూపాయల నష్టం.

    ప్రయాణీకులకు అలవికానంత కష్టం_నష్టం.

    అది పైలట్లకేం పట్టింది. ఆ విషయానికొస్తే ఎవరి విషయం ఎవరికేం పట్టింది.

    భరతమాత బతికి ఉండగానే ఆమె దేహంలో ఎవడికి దొరికిన ముక్కని వాడు పీక్కుతినే సంస్కృతి బలిసిపోయాక.

    పైలట్ లకి నెలకి పదిహేను వేల రూపాయలదాకా జీతం వస్తుంది. హాల్డింగ్ అలవెన్సు లాంటివన్నీ కలుపుకుంటే యింకో పదిహేను వేలు. అంటే నెలకు దాదాపు ముప్పయివేల రూపాయలదాకా జీతం వస్తుంది.

    అయితే అదిలేదు ఇదిలేదు అని ఎప్పటికప్పుడు చిలిపి తగాదాలు! వాళ్ళు తిరగబడితే వేరే దిక్కే లేదన్న ధీమాతో బ్లాక్ మెయిలింగ్.

    ఇప్పుడు కూడా ఈ విమానానికి రిపెయిర్ అనేది ఉత్తమాట. నాటకం. అది కేవలం విమానాన్ని వెనక్కి తెచ్చేసి పాసెంజర్లని అప్ సెట్ చేయడానికో వంక! అంతే!

    పైలట్లు అందరూ కూడబలుక్కుని ఒకేసారి సిక్ లీవుకి అప్లయి చేసిన సంగతి నిమిషాల్లో పాసెంజర్స్ అందరికీ తెలిసిపోయింది.

    ఆ ప్రయాణీకుల్లో అత్యవసరమైన పనులమీద వెళుతున్న వాళ్ళున్నారు. చితిమీద ఉన్న ఆప్తులని చివరిసారిగానైనా చూడడానికి వెళుతున్నవాళ్ళు, రాత్రికి రాత్రి హైదరాబాద్ చేరుకోకపోతే బతుకూ తెల్లారిపోయేవాళ్ళు వున్నారు.

    అదంతా ఎవరికి పట్టింది?

    "చిన్ని నా బొజ్జకీ శ్రీరామరక్ష" అనుకుంటున్నారు పైలట్లు.

 Previous Page Next Page