ఇదంతా సరస్వతీదేవి చిరునవ్వుతో తిలకిస్తూ ఉండగా లీడర్ లీలారాణి గట్టిగా ఒక్క అరుపు అరిచింది "ఆపండి" అంటూ.
అంతా సైలెంట్ అయిపోయారు.
"మా కోర్కెలు ఇవికావు తల్లీ! మా కోర్కెలు...ఇవి మాకు మీరివ్వాల్సిన వరాలు...ఇవి. ఇవే మా కష్టాలు ఇవే మా కోర్కెలు. ఇదంతా విన్నవించుకోడానికే మేమంతా కలిసి మీ దగ్గరకొచ్చాం" అంటూ అసలు విషయం బయట పెట్టింది లీడర్ లీలారాణి.
"వీరి రాకలోని ఆంతర్యం ఇదా!" అని ఆశ్చర్యపోయిన సరస్వతీదేవి తన దివ్యదృష్టితో ఒక్కసారి భూలోకంవైపు తన చూపు సారించింది.
భూలోకంలో ఇప్పటికే చాలామంది ఆడవాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహించే ఉన్నారు. అయినా కూడా వాళ్ళు సుఖసంతోషాలు లేక నానాపాట్లు పడుతున్నారు. (ఉదాహరణకి మన ప్రియతమ ఒకనాటి ప్రధాని ఇందిరాగాంధి జీవితమే) అలాంటి ఎన్నో రకాల బాధలు కళ్ళకు కట్టినట్లు కనిపించాయి సరస్వతీదేవికి విషన్న వదనంతో అంది-
"మీ బాధల్ని నేనర్ధం చేసుకున్నాను. మీ కష్టాలు అలాంటివి ఇలాంటివి కావు. మీ కష్టాన్ని చూసి కఠిణ శిలలు కూడా కరుగుతాయి. కాని ఈ విషయంలో మీ కోర్కెలు తీర్చలేక పోతున్నందుకు విచారిస్తున్నాను. కాని నాకు చేతనయినంతవరకు కొన్ని వరాలు ఇవ్వగల దానను."
సరస్వతీదేవి అన్న ముందుమాటలకు విచారించి ఆ తర్వాత అన్న మాటలకి రవ్వంత ఆనందించి "ఏమి వరాలు ఇవ్వగలవు తల్లీ!" అని అందరూ వినమ్రులై అడిగారు.
"పత్రికా ఎడిటర్లందరూ ఆడవాళ్ళే అయ్యేటట్లు అన్ని పత్రికల్లో ఆడవాళ్ళ రచనలే పడేటట్టు అన్ని పదవులలో ఆడవాళ్ళే ఉండేటట్లు వరాలు ఇవ్వగలను. అయితే ఇక్కడో చిక్కుంది. మీ ఈ కోర్కెలు తీరాలంటే మగవాళ్ళంతా చదువురాని పరమ మూఢులై ఉండాలి. చదువూ సంధ్యాలేని పరమ శుంఠలై ఉండాలి. వాళ్ళ నాలికలు తిరక్కుండా ఓ అంటే న అని పలకలేని విధంగా నాలుకలు మందంగచేసి మాటలే సరీగా పలకలేని సంస్కార విహీనుల్ని చేస్తాను. అప్పుడింక మీదే రాజ్యం" అంది సరస్వతీదేవి.
అందరి మొహాలు వెలవెల బోయాయి. కొందరి చూపులయితే వికారంగా మారాయ్. మరి కొందరయితే అలవాటు ప్రకారం మూతులు తిప్పేసుకున్నారు. వాళ్ళల్లో రవ్వంత సంతోషించింది ఎవరయ్యా అంటే మహారచయిత్రి మహాదేవి మాత్రమే.
"ఒక తెలివిగల ఆడది ముగ్గురు మేధావులయిన మగవాళ్ళని తల కిందులు చేయగలదు. అది స్త్రీ శక్తి. ఒక్క తిక్క వెధవనీ ముగ్గురు మేధావులయిన ఆడవాళ్ళుకూడా లొంగదీయలేరు. అది స్త్రీ బలహీనత. "మీరు మగవాళ్ళకి చదువు సంధ్య సంస్కారం లేకుండా చేయగలరు. కాని వాళ్ళ పశుకోరికలు మామూలేకదా ఆ మగజంతువుని మేము పెళ్ళాడాల్సిందేకదా! మళ్ళీ మేము నవమాసాలు మోసి ఒక ఆడపిల్లనో, ఒక తెలివి హీనుడయిన పసువునో కనాల్సిందేకదా! ఎంతోచదువులు నేర్చుండీ కూడా సంస్కారంలేకుండా ప్రవర్తిస్తున్న మగవాళ్ళతో ఇప్పటికే చస్తున్నాము. అది చాలక పరమ మూఢులతో సంసారం చేయాలంటే మాకు కొత్త కష్టాలు తప్ప వచ్చిపడే లాభం మాత్రం అణుమాత్రంకూడాలేదు. ఒకవేళ వాళ్ళకి చదువు సంస్కారంతోపాటు మంచి బుద్ది పెట్టినాకూడా మాతృత్వం అని స్త్రీలకున్న ఈ వరంవల్ల కష్టాలు తప్పవు. మాకు కావాల్సింది మాతో సమానంగా మగవాళ్ళు కూడా..."
"అంట్లు ముట్లు
కడుపులు గట్రా
ఆడది ఆడదాన్నే కనాలి. మగవాడు మగవాడ్నే కనాలి.
అదే మా కోరిక...అదే మా కోరిక..అదే మా కోరిక."
అంటూ అందరూ కలిసి గట్టిగ అరిచారు.
సరస్వతీదేవికూడా తమ కోర్కెలునెరవేర్చలేనిది అయినందువల్ల అందరికి బి.పి వచ్చేసింది. అందరూ కలిసి మరోసారి గట్టిగా నినాదాలు చేశారు.
"చూడండి తల్లులారా! మానవుల్లో దుష్టబుద్ది ఎక్కువై పలురకాలుగా బుద్దులు పెడత్రోవ పట్టగ పిచ్చిరాతలు రాస్తున్నారు. ఆ రాతల్ని సరిచేయలేక ఒక కమీషన్ ని వేశాము. ఎందరో అసిస్టెంట్లని పెట్టుకున్నాను. నాకు రాని స్వరాలు కూడ వాళ్ళక్కడ తింగిరి బింగిరిగా కుదురుస్తూ తిక్కిరి బిక్కిరి పాటల్ని రాస్తుంటే ఆ పాటల్ని విని ఉక్కిరి బిక్కిరై మీ ఆడ మగ పాడుకుంటూ ఆనందిస్తున్నారు వాటిని సరిదిద్దలేక సాహిత్యాన్ని సరిదిద్డలేక నా తల వాచిపోతున్నది. అందర్ని ఒక్కసారిగా మూగవాళ్ళని చేసి పారేస్తే సరిపోతుందన్న దుష్టపు ఆలోచన కూడా వచ్చింది. కానీ అది తగదుకదా! అలా చేయటం సంస్కార విహీనమని ఊర్కొన్నాను. మీరు ఇదే కోరిక కోసం వచ్చారేమో! కొందరు ఎడిటర్లు రచయితలు కవుల నాలుకలు బండబారేట్టు వరమిద్దాం కదా! అనుకొన్నాను. చూడబోతే మీ కోర్కెలు ఇవి కాదని తెలిసీ పోయింది. చదువు రాకుండ చెయ్యగలనేమోగాని మిగతావేమీ చెయ్యలేను. అయాం సారీ" అని చెప్పేసింది సరస్వతీదేవి.
"పోనీ మగవాళ్ళని తిక్కవెధవలని చేస్తే ఎలా వుంటుంది?" త్రివేణి అత్తగార్ని అడిగింది.
"మీ మావగారు వో తిక్కశంకరయ్య ఆయనతో ఇన్నాళ్ళూ సంసారం చేసి వో తిక్క వెధవను కన్నాను. (అదేమో ఆయన్ని) ఇలాంటి తిక్కకోరికలు కోరితే ఇకపై నీకు పుట్టుకొచ్చే వాళ్ళంతా తిక్కవెధవలే అవుతారు. చాల్చాల్లే తిక్కమాటలూ నీవూనూ" అంటూ త్రివేణి అత్తగారు అలివేణి ని తిన్నగా మందలించింది.
"అయితే ఇప్పుడు మా అగతి ఏమిటి తల్లీ! మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు?" లీడర్ లీలారాణి వినమ్రంగ అడిగింది.
"మీరంతా రావటం రావటం నా దగ్గరికే వచ్చారా! ఎక్కడికైనా వెళ్ళి వచ్చారా?" సరస్వతీదేవి అడిగింది.
"శ్రీ మహాలక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి వచ్చాం. ఎంతయినా ఆమె మీకు అత్తగారు. వయసులో ఆమె మీ కన్నా పెద్దది కదాని అక్కడ కెళ్ళి ఇక్కడి కొచ్చాం" అంటూ శ్రీమహాలక్ష్మి దగ్గర ఏం జరిగింది... ఆమె ఏం అన్నది...వివరంగ చెప్పింది లీడర్ లీలారాణి.
"వయసు రాంగానే సరా! బుద్దికూడ తిన్నగ పనిచేయాలి కదా! ఈ మధ్య మా అత్తగారికి ఆశ మరీ ఎక్కువైంది స్విస్ బ్యాంక్ లొ దాక్కోవటం, బంగారం బిస్కెట్లుగ మారిపోవడం, బ్లాకులో ఉండిపోవటం, పదవిలో వున్న రాజకీయ నాయకుడిని పట్టుకొని వేళ్ళాడటం నెంబర్ వన్ సినిమా యాక్టరైతే చాలు వాడి చుట్టూ తిరగటం ఎప్పుడు ఎన్నిక లొస్తాయో అని ఎదురుచూడ్డం...అటు ఇటు కుప్పిగంతులు వెయ్యటమే సరిపోతోంది. కనీసం ఒకచోట నిలకడగా ఉండొచ్చుకదా! ఇలా ఉంటుంది అలా పోతుంది అలా పోతుంది ఇలా వస్తుంది. ఈ మధ్య మరీ చాదస్తం ఎక్కువైంది." అంటూ అత్తగారిమీద కోపం వాళ్ళందరి ముందు వెళ్ళబుచ్చి కాస్త మనసు చల్లబరచుకొంది చదువుల తల్లి.
అత్తా కోడళ్ళ దగ్గరకెళ్ళడం మాదే బుద్ది తక్కువ అనుకున్నారు అందరు.
"చదువు సంస్కారం నా సొత్తు కాబట్టి చక్కటి సలహా ఇస్తాను పాటించండి. ఆదిపరాశక్తి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళండి. నేను పంపించానని చెప్పండి. నా మాట తీసివేయదు, మీకు కావలసిన వరాలు ఆ వరమే శ్వరి ద్వారా పొందండి" అంటూ మార్గం చూపింది సరస్వతీదేవి.