Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 12

    కొందరు సమయంచూసి దెబ్బకొడతారు.

    సూరిబాబు ఇప్పుడు చేసింది అదే.


                                      7


    కొత్తొక వింత పాతొక రోత!

    "అమ్మాయిగారూ!" అంటూ అతివినయం చూపుతూ ఆప్యాయంగా మాట్లాడుతూ భయభక్తులు గౌరవం ప్రదర్శించిన ఆ వాడలోని చాలామంది మారిపోయారు.

    మార్పు సహజం!

    మార్పు మంచికైతే ఫరవాలేదు, వంచనకయితేనే ఏ కష్టమైనా.

    మొదట అమ్మాయిగారు ఏదన్నా అడిగితే భయభక్తులతో వదిగి వదిగి గౌరవంగా సమాధానం చెప్పేవారు.

    ఆ తర్వాత...అమ్మాయిగారు ఏదయినా అడిగితే ప్రశ్నకి ఎదురు ప్రశ్న, మాటకి మరో చురుకంటే మాట.

    ఈ కాస్తలోనే ఎంత మార్పు!

    పద్మిని ప్రియదర్శినికి డబ్బు విలువ తెలియదు తల్లి తండ్రికి ఏకైక తనయగా, ముద్దుగుమ్మగా గుమ్మందాటి బయట ప్రపంచం తెలియనిదానిలా పెరిగింది. కారులో వెళ్ళి కారులో తిరిగి ఇంటికి చేరేవిధంగా కాలేజీలో చదివింది. వెర్రివేషాలువేసే వాళ్ళతో స్నేహం చెయ్యలేదు. ఆడంబరాలు అహంకారం ప్రదర్శించటం బొత్తిగా యిష్టం లేనిపని. స్నేహితురాళ్ళు కూడా పరిమితంగానే వున్నారు. సినిమాలు చూడటం, నవలలు చదవటం వీటికి మాత్రం బానిస అయింది.

    పుస్తకాలు చదివి మేధావులు అయినవాళ్ళు కొందరయితే...

    పుస్తకాలు చదివి పాడయిపోయినవారు మరికొందరు.

    పద్మిని ప్రియదర్శిని ఈ రెండు కోవలకి చెందింది కాదు.

    కావమ్మ మొగుడు కాశీ నించి వచ్చాడుట అంటే కాబోలు అనుకున్నారుట...ఆ సామెత కథలా...పద్మిని ఘాటైన తెలుగు సినిమాలు అంతకన్నా ఘాటైన తెలుగు నవలలు [ప్రస్తుతం మార్కెట్ లోకి వచ్చే వాటిల్లో కొన్ని నవలలని పాఠకులు గుర్తించాలి] చదివి వంటబట్టించుకుని బుర్రకెక్కించుకుని బీదాళ్ళంతా మంచివాళ్ళు ధనవంతులంతా చెడ్డవాళ్ళుగా అనుకుంది. ధనవంతుల్లో ఒకరో ఇద్దరో మంచివాళ్ళు వుంటారు. బీదవాళ్ళలో అంతా మంచివాళ్లు వుండి ఒకరో ఇద్దరో చెడ్డవాళ్ళు వుంటారు...అని...పద్మిని ప్రియదర్శిని తిరుగులేని నిర్ణయానికి వచ్చేసింది. కనుకనే తల్లి తండ్రి మాటలు కాదని బయటికి రాగలిగింది. 

    కాని...

    ఇప్పుడు...ఇక్కడ...కథ మారిపోయింది.

    పద్మిని ప్రియదర్శిని చేతిలోని డబ్బు రెక్కలొచ్చినట్లే ఎగిరిపోయింది. అప్పుడు తెలిసింది డబ్బు విలువ.

    పెడితే పెళ్ళికూడు పెట్టకపోతే పిండాకూడు అన్నాట్ట వెనకటికొకడు ఒళ్ళుమండి.

    ప్రస్తుతం అక్కడి పరిస్థితి అలాగే తయారయింది.

    వెంకటమ్మ కూతురు నర్శికి జలుబుచేసింది. "గట్టిగా చీదవే" అంది కూతురితో. ఆ చిన్న పిల్ల చీదకపోగా మరింత గట్టిగ పైకి ఎగబీల్చింది. వెంకటమ్మ వూరుకోలేదు. చాచిపెట్టి ఒకటిచ్చింది వీపు విమానంమోత మోగేలా. అది చాలక "ఏమే ముం...మీ అయ్యఏమన్నా లచ్చాది కారా, డబ్బులుపోసి మందులు కొని వెయ్యటానికి! ముక్కులో పొగాకుకాడ రసం పోయించుకోవే అంటే పోయించుకోవు చీదిచావవే అంటే చీదిచావవు. నెలయింది జలుబుచేసి" అంటూ మాటలతిట్లు లంకించుకుంది.

    ఆ దెబ్బకి "అమ్మో" అంటూ నోరంతా తెరిచి రాగం తీసింది. దాంతో ముక్కుకి అసలు గాలాడక గట్టిగా రెండు తుమ్ములు తుమ్మేసింది. ఇదికూడా ఒకరకం వైద్యమేమో ముక్కులోంచి రెండు పిల్లకాలువలు ఆనకట్టకి అడ్డువేసినట్లు ఒక్క దుముకు దుమికి బయటికి వచ్చాయి. 

    వెంకటమ్మ పిల్ల దానిముక్కు గట్టిగ పింది ఆ ద్రవపదార్ధాన్ని విసిరి ఓ పక్కగా వేసింది అదేమో వెళ్ళి గోడకి పిడకలా కొట్టుకుంది. ఆ పక్కనే దండానికి వేలాడుతూ బట్టలు వున్నాయి.

    వెంకటమ్మ తన పని అయిపోయిందన్నట్లు ఆ చేతినలాగే తీసుకెళ్ళి చీరకి పూసుకుంది. అక్కడితో ఆగక అచ్చమ్మ బియ్యం ఏరుతుంటే తనూ చాటలో చెయ్యిపెట్టి బియ్యం కెలుకుతూ కబుర్లు వేసుకుంది.

    వాళ్ళకి దగ్గరగా అక్కడే కూర్చున్న పద్మిని ప్రియదర్శినికి భళ్ళున వాంతివచ్చింది. ఎలాగో తమాయించుకుంది. వాళ్ళింట్లోను యెప్పుడో ఒకప్పుడు కోల్డు వేవ్ వచ్చినప్పుడు జలుబు చేస్తుంది.

    వెంటనే విక్స్, పసుపు వగయిరాలు వేడినీటిలో వేసి ఆవిరిపట్టి ఏదయినా టేబ్ లెట్ వేసుకుని మెత్తని గాజుగుడ్డతో ముక్కు తుడుచుకుని ఆ గాజుగుడ్డని మళ్ళీ వాడకుండా వేస్ట్ బాస్క్ ట్ లో పారేసి చాలా శుభ్రంగా వుంటారు. జలుబులో చాలా సూక్ష్మ క్రిములుంటాయని జలుబు చాలా తొందరగా అంటుందని అంతకుముందు జాగ్రత్త తీసుకోవటం జరుగుతుంది.

    ఇక్కడ అలాకాదే! జలుబయేది మోషన్స్ అయేది దాని తాత అయితే ప్రాణంమీదకి రానంతవరకు డోంట్ కేర్. 

    మనసు వూరుకోక "అదేంపని?" అంది పద్మిని ప్రియదర్శిని.

    "ఆ పిల్లకి డబ్బుంటే వుండుగాక, వాళ్ళయ్యకి కోట్లు వుండుగాక ముఖం అలా చిట్లించి అడిగితే ఏమిటి అర్ధం?" వెంకటమ్మకి మండిపోయింది. "యేం చేశానేంటి?" అంది.

    "ఆ పిల్ల వాడి ముక్కు చూడు యెంత ఎర్రబడిందో? ముక్కు చాల సున్నితమైన భాగం. మెత్తటి గాజుగుడ్డతో ముక్కుని అద్ది క్లీన్ చేయాలి. జలుబు అంటువ్యాధి! అలా ఎక్కడపడితే అక్కడ వేయటం, చీదటం మంచిపని కాదు. జలుబులో సూక్ష్మక్రిములుంటాయి. గాలిలో అవి ప్రయాణించి ఇతరులని బాధకి గురి చేస్తాయి" పద్మినికి అర్ధమయేలా వివరించి చెప్పింది.

    "ఎట్టెట్టా?" బుగ్గన వేలేసుకుని ఆశ్చర్యపోతూ అంది వెంకటమ్మ.

    అల్లంత దూరాన కూర్చుని పేలు తీస్తున్న అలివేలు కిసుక్కున పైకే నవ్వింది.

    "అమ్మాయిగారు అదెవతో (టి.వి.) టి.యి.లో చెప్పినట్టు చెప్పారు" అంది అచ్చమ్మ.

    అంతే అందరికి నవ్వొచ్చింది. పైకే నవ్వేశారు.

    "ఎందుకు మీకు నవ్వులొస్తాయి?" పద్మిని ముఖం చిన్నది చేసుకుని అడిగింది.

    "ఎందుకా?" అంటూ మళ్ళీ నవ్వింది వెంకమ్మ.

    "మాలాంటోరికి అవన్నీ యెలా కుదురుతాయి అమ్మాయిగారూ! తుమ్మొస్తే తుమ్ముతాం. దగ్గువస్తే దగ్గుతాం. మాకాడ డబ్బుంటే మీకన్నా సుబ్బలాలు ఎక్కువే పలుకుతాం. చణాల్లో అన్ని మందుబిళ్ళలు కొనుక్కుని గుటుక్కు గుటుక్కు మని మింగుతాం" అంటూ మాటన్నంత వేగంగాను రెండు పేలను తీసి చిటుక్కు చిటుక్కుమని కుక్కింది అలివేలు.

 Previous Page Next Page