Previous Page Next Page 
మారనికాలంలో మారినమనుషులు పేజి 12

    "ఆరోగ్యం జాగ్రత్తని చెప్పు. మందులు శ్రద్ధగా తీసుకోమని చెప్పు. వీలయితే పై వారంవచ్చి రాధను చూస్తాను" అంది పార్వతి.
    అలాగే అని తలవూపి రఘు వెళ్ళిపోయాడు.
    రఘు అత్తవారిల్లు మరో పేటలో వుంది. రాధకు నాలుగో నెలలో ఎబార్షను అయింది. ఎబార్షను అయికూడా రెండు నెలలు కావచ్చింది.
    అటూ ఇటూ పసిపిల్లలకోసం ఆరాటపడుతుండే తరుణంలో రాధకు కడుపు రావటం అందరికీ ఆనందదాయకం అయింది. పడక్కి పుట్టింటికి వెళ్ళటం, అనుకోనివిధంగా రాధకు అబార్షన్ జరిగింది. ప్రస్తుతం జరిగినదానికి ఎవరూ అంతగా చింతించటంలేదు. రాధ చాలా నీరసంగా వుంది. ఆరోగ్యం గురించి బాధపడుతున్నారు. తరచు రాధను చూచి వస్తున్నాడు రఘు. ఒక్కోరోజు అక్కడే భోంచేస రాత్రికి వుండి మర్నాడు వుదయం యింటికి వస్తున్నాడు. రాధను వెళ్ళి చూచిరావచ్చు గాని, అక్కడే భోంచేసి రాత్రిళ్ళు వుండటం పార్వతికి నచ్చలేదు. చెపితే రఘు బాధపడతాడని వూరుకుంది పార్వతి. రఘు వెళ్లింతరువాత యిదే ఆలోచిస్తూ కూర్చుంది చాలాసేపు.
    "అత్తవారింట్లో అల్లుడు ఎంతవరకుండాలో అంతవరకుంటేనే బాగుంటుంది, చీటికీమాటికి అక్కడికి భోజనానికెళితే ఏం బాగుంటుంది. చూచాయగా హెచ్చరించినా రఘూకు అర్ధంకాదు. అదే కృష్ణ అయితే చెప్పే అవసరం లేదు. చూచి గ్రహిస్తాడు." అనుకుంది పార్వతి. అన్నం మాడువాసన కొట్టడంతో లేచి వంటగదిలోకి వెళ్ళింది.
    వంటగదిలో చిన్నగిన్నెలో పెట్టిన పాలు వలకపోసి కళ్ళు మూసుకు తెరుస్తూ నాకుతున్నది పిల్లి. అడుగులచప్పుడు విని చెంగున అవతలకి దూకి పారిపోయింది. ఇంకా సగం పాలు నేలమీద అలాగేవున్నాయి.
    "ఛీ.....ఛీ.....పాడుపిల్లి రోజూ ఏదోఒకటి నాశనం చేస్తున్నది. తన మతిమరుపుదానికి ఆహారం సమకూరుస్తున్నది. మతిమరుపు వచ్చేసింది. తల సగం నెరిసింది .అప్పుడే ముసలిదాన్నయిపోయానా?" చిన్నగా నవ్వుకుంది తన ఆలోచనకి అన్నందింపేసి చారుగిన్నె, స్టవ్ మీద ఎక్కించి పాలుపడ్డచోట శుభ్రంగా కడిగి స్నానానికెళ్ళింది పార్వతి. స్నానం చేసివచ్చేటప్పటికి చారు కాగింది. చారు దింపి వంటింట్లోంచి బైటపడింది. అన్నంలోకి కూరవున్నా లేకపోయినా చారువుంటేచాలు కృష్ణకు.
    వంట అయిపోవటంతో ఏంచేయాలో తోచక ఎక్కడికక్కడ శుభ్రంగా సర్దివున్న సామానుని తిరిగి సర్దిపెట్టింది. కాసేపటికి ఆపనీ అయింది. పెత్తనాలు అలవాటులేనందున కృష్ణకోసం ఎదురుచూస్తూ పడక్కుర్చీలో పడుకుంది.
    "శకుంతల కాపురానికెళ్ళి ఏడాది కావస్తున్నది. రఘునికాని, కృష్ణని కాని పంపి శ్రీపతినీ, శకుంతలను పండక్కి రమ్మనాలి. ప్రయాణానికి సిద్ధంగా వుండమని ముందుగా ఉత్తరం రాస్తేసరి. అక్కడ శకుంతల, యిక్కడ వీళ్ళు హాయిగావుంటే మధ్యలో రాధకు ఎబార్షను కావటం.
    పెద్ద పదవులు కాకపోయినా బ్యాంకులో పని రఘుకి బాగానేవుంది. శ్రీపతి కూడా మంచివాడు దొరికాడు. కృష్ణ కార్యశూరుడు. వాడి బిజినెస్ దినదినాభివృద్ది అవుతున్నది. కృష్ణకు పెళ్లి అయితే తన బాధ్యత తీరిపోతుంది. పెళ్లి చేసుకోరా! అంటే "ఇప్పుడేం తొందరమ్మా? మెడకో గుది బండను తగిలిస్తానంటావు. నే సుఖంగా వుండటం నీకు సంతోషంగా లేనట్లుంది?" అంటాడు. అక్కడికి తనదే తప్పయినట్లు నిష్టూరంగా మాట్లాడుతాడు. చెట్టంత కొడుకుని ఏమని దండిస్తుంది?
    "అమ్మా!" గుమ్మం బైట నుంచుని కృష్ణ పిలవటంతో చటుక్కున కుర్చీలోంచి లేచింది పార్వతి.
    మరోసారి......."అమ్మా?" అన్నాడు కృష్ణ.
    వచ్చినవాడు సరాసరి లోపలికి రాకుండా గుమ్మం అవతలనుంచుని పిలవటం.....పార్వతికి ఆశ్చర్యమూ, ఆందోళనా ఏకకాలంలో కలిగాయి. "లోపలికి రారా, కృష్ణా!" అంది నుంచున్నచోటునించి కదలకుండ.
    "లోపలికి పద సుధా!" అంటూ కృష్ణ గుమ్మందాటి పార్వతి దగ్గరకు వచ్చాడు. కృష్ణ వెనుకనే దాదాపు పద్దెనిమిదేళ్ళ  అమ్మాయి తలవంచుకు బితుకు బితుకు మంటూ వచ్చింది.
    కృష్ణ విశాలమైన ఛాతీతో ఎత్తూ, లావు భారీమనిషి, కృష్ణతో వచ్చిన అమ్మాయి పొట్టీపొడుగుగాని మధ్యరకం పాలుకారుతున్న మోము, లతలా వుంది ఆ అమ్మాయిని కృష్ణ పక్క చూస్తుంటే మరీ సన్నగా, నాజూగ్గా అనిపిస్తున్నది.
    పార్వతి యిరువురిని మార్చి మార్చి చూస్తూ__కృష్ణకు ఆ అమ్మాయిని "సుధా!" అని పేరుపెట్టి పిలిచేంత చనువు ఎలావచ్చిందా అని ఆలోచిస్తున్నది.
    "ఈ అమ్మాయి పేరు సుధారాణి అమ్మా !" అన్నాడు కృష్ణ.
    "ఊ" కొట్టి వూరుకొంది పార్వతి.
    "సుధ మనయింట్లోనే వుంటుందమ్మా! నీకేమయినా అభ్యంతరమా. సుధా ఎవరో ఏమిటో? ఎందుకు వచ్చిందో వివరం చెపుతాను. ముందు భోజనం చేద్దాము" ఎవరో తరుముతున్నట్లు గబగబా చెప్పాడు కృష్ణ.
    పార్వతి అన్నింటికీ......ఊకొట్టడం మినహా ఏమీ అనలేదు.
    "నామీద__నే చేసేపనిమీద నీకు నమ్మకం వుంది కదమ్మా?" అని కృష్ణ అనటంతో తెలివితెచ్చుకుంది పార్వతి.
    "నీపేరేమిటి?" అంది సుధారాణితో.
    "సుధారాణి అండీ!" అంది సుధ నమ్రతగ.
    సుధ స్వరం కోటివీణలు మారుమ్రోగినట్లుంటుందని గ్రహించింది పార్వతి.
    "స్నానం చేసిరా కృష్ణా! భోంచేద్దాము. లోపలికి వెళదాం రా సుధా" అంది పార్వతి ఇప్పటికిప్పుడు నిలబెట్టి అడగవలసింది ఏమీలేదు. కృష్ణ చెప్పబోయేది ఆనక వినటం తప్ప. పరాయిపిల్లముందు, జరిగింది ఏమిటో తెలియకుండా అర్ధంలేని ప్రశ్నలేసి వేధించటం కూడా తప్పు. తనపెద్దరికానికే ముప్పు అనుకుంది.
    "మా అమ్మలాంటి దేవత మరొకరుండరని చెప్పాను. గుర్తుందా సుధా" కృష్ణ మెల్లిగా అంటే "అవునండీ అందరికీ మీ అమ్మలాంటి వుత్తమురాలు తల్లిగా దొరకదు." అంత కన్నా మెల్లిగా అంది సుధ.
    వాళ్ళెంత చిన్నగా మాట్లాడుకున్నా పార్వతికి వినపడకపోలేదు. "నూతన అధ్యాయం మొదలయిందా?" అనుకుంది పార్వతి.    

 Previous Page Next Page