Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 12

    ఆమె పిచ్చి పిచ్చి ఊహలకి పకపకా నవ్వాడు.
    "నవ్వుతావేం?" ముక్కు చిట్లించి అడిగింది.
    "నీ ప్రశ్నకి? లేకపోతేనే చెప్పేది సరిగా సరిగా వినకుండా అదే ధోరణిగా మాటాడుకుంటూ పోవటమేనా? నేను ట్యూషన్ కి వెళ్ళేంత ధనవంతుడినా? తింది జరగటమే అంతంతమాత్రం. ఆ స్కాలర్ షిప్ లేకపోతే పుస్తకాలు, గుడ్డలు కూడా యాంచించాల్సి వచ్చేది. జ్యోతీ! నేను టెన్త్ క్లాసు అబ్బాయిలకి ట్యూషన్ చెబుతున్నాను. నలుగురు కుర్రాళ్ళు వస్తారు. తలా పాతిక యిస్తారు. అదీ నా ఫుడ్! అంతే!" వివరంగా చెప్పాడు శ్రీకర్.
    "అయాం వెరీసారీ! డోంట్ మిస్టేక్ మి!" దీనంగా అంది.
    "పోన్లే వెళదాం మరి"
    అయినా జ్యోతి కదలలేదు. ఆమె మనస్సులో ఏవో ఊహలు మెదులుతున్నాయి. కొద్దిసేపాగి అంది మృదువుగా.
    "శ్రీ...నేన ఎలాగూ నీ అంతయింటిలిజెంట్ ని కాను. అసలు డబ్బుకి చదువులకి లంకె కుదరదులే అంటుంది మా నాయనమ్మ. నాకు చదువుకోవటానికే టైం దొరకదు. శ్రీ...ఉదయం నిద్దర్లేచేసరికే ఎనిమిది అవుతుందా! తర్వాత బ్రేక్ ఫాస్టు. మార్నింగ్ కాల్స్. బాత్ అదీ అయ్యేసరికి తొమ్మిది. అప్పుడు టాయిలెట్ మొదలుపెడితే మెట్లు దిగేసరికి తొమ్మిదినలభై. కారు రెడీగా మెట్లవద్దే ఉంటుంది. అంతే కాలేజీకి వచ్చేస్తావా?"
    అమాయకంగా చెవుతూ వుంటే చెవులు రిక్కబెట్టుకుని విన్నట్టుగా నవ్వుతూ వింటున్నాడు శ్రీకర్.
    ఇక సాయంకాలం ఇంటికి వస్తానా! కాలేజీలో చదువకున్నా వినీ విననట్లుగా కూర్చోవాలిగా. అంచేత బాగా అలిసిపోతాను. ఇంటికి వచ్చి స్నానంచేసి యిదో యిలా ఎవరితోనో ఒకరితో బాతాఖానీ వేసుకుని కూర్చుంటే బాగా చీకటిపడుతుంది. తర్వాత ఓ గంటో అరగంటో టేప్ వినేసరికి డిన్నర్ రెడి! అదయ్యేసరికి తొమ్మిది కొడుతుంది. రెప్పలమీదకి నిద్ర సిన్సియర్ అయిన డ్యూటీ క్లర్క్ లా వచ్చేస్తుంది. ఇక చదివేటప్పుడు చెప్పు?"
    నవ్వేశాడు శ్రీకర్ జవాబివ్వకుండా.
    'నవ్వుతావేం?'
    "ఏం చేయను చెప్పు?"
    "......"
    "జ్యోతీ! అసలు నీకు చదువెందుకు చెప్పు?"
    "మైగాడ్! ఎంతమాట అన్నావు? చదువుకోకపోతే ఎలా? డిగ్రీ రాకపోతే మాన్లే కనీసం కాలేజీకయినా వెళ్ళి వస్తూ వుండద్దూ? చదువు ఆపేస్తే మా నాయనమ్మ పోరు పెట్టినట్లు యిక పెళ్ళి చేసేస్తారు అంతే!"
    "పోనీ పెళ్ళిచేసుకోరాదూ?"  
    "పెళ్ళా? ట్రాష్...అప్పుడే ఆ బందిఖానా? వద్దు బాబోయ్. ఏం శ్రీకర్ నేనిలా హాయిగా వుండటం నీకిష్టం లేదా?"
    "అదెందుకులే! ఇంతకీ నీ చదువు విషయంలో ఏమిటో చెప్పు!"
    "ఊహుఁ ముందది చెప్పు?"
    "ఏమిటి?"
    "నేను సుఖంగా ఉండొద్దూ?"
    "జ్యోతీ! వెనుకటి సంగతేమో కానీ యిప్పుడు మాత్రం నువ్వు సుఖంగా, సంతోషంగా, హాయిగా త్రుళ్ళుతూ ఉండాలని కోరుకునేవారిలో మాత్రం నన్ను మించినవారుండరు. ఆఖరికి మీ డాడీ_మమ్మీ అయినా నాలా కోరుకోరేమో?"
    సిన్సియర్ గా అతనన్నదానికి తృప్తిగా విశ్వసించింది. గుండెలపై చేయి వేసుకుని "హమ్మయ్య! బ్రతికించావు నౌ అయామ్ లక్కీ" అంది.
    "థాంక్యూ."
    "ఎందుకూ?"
    "నువ్వు బ్రతికిపోయావు కదా! నువ్వు బ్రతుకుంటేనే కదా నీకు హాయిగా వుంటుంది."
    ఆ మాటలకి విరగబడినవ్వింది. నవ్వి అలసిపోయింది. నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అలా నవ్వినవ్వి తిరిగి అడిగింది.
    "శ్రీకర్! ఓ విషయం చెప్పు. మీరెంత బీదవాళ్ళు. మీఆస్తి విలువ ఓ లక్షరూపాయలుంటుందా? సంవత్సరానికి పదివేల అయిదువేజు వస్తుందా?"
    అమాయకత్వమా? హేళనా? అనుకుని ఆమె కళ్ళలో నిశితంగా చూశాడు. స్వేచ్చగా నిర్మలంగా వుండే ఆ ముఖం అందులో నీలికలువల్లా దర్పణాల్లా వుండే ఆ కళ్ళు చూశాక అతను తృప్తిగా విశ్వసించాడు.
    "జ్యోతీ! మేం బీదవాళ్ళం. లక్షరూపాయల ప్రాపర్టీ వుంటే యింకేం? అసలు మాకు ఆస్తిలేదు. ఓ ఇల్లుమాత్రం వుంది అంతే!"
    "మైగాడ్!"
    "అవును! కేవలం వేయి రూపాయలైనా జీతం వస్తుందా?"
    నిట్టూర్చాడు శ్రీకర్.
    "జ్యోతీ! నువ్వెంత అమాయకురాలివి? నువ్వెలా ఈ మాయా ప్రపంచంలో నెగ్గుకొస్తావు?"
    "అవును శ్రీకర్! మా నాయనమ్మ అలాగే అంటుంది ఏం చేస్తాను చెప్పు _ నాకేం తెలియదు. మా డాడీ నన్ను ఏమీ తెలియకుండా పెంచారు."
    "అదృష్టవంతురాలివి! నీ జీవితమంతా ఇలాగే గడిచిపోవాలని అనుకుంటున్నాను. జ్యోతీ! మా నాన్నగారి జీతం నేను ఎసెస్సీ పాసయ్యేదాకా నెలకి వందా యాభయ్! ఈ మధ్య జీతాలు పెరిగాక నాలుగొందలు వస్తుంది అంతే_"  
    "ఓహ్! నేను వూహించలేకుండా వున్నాను. మా డాడీ నెలనెలా పాకెట్ మనీ క్రింద అయిదొందలు యిస్తారు నాకు-నెలాఖరికి మళ్ళీ అడిగితేకానీ బండి దొర్లదు. అలాంటిది మీరెలా నెట్టుకొస్తున్నారు? బాధగా అడిగింది.
    జ్యోతీ! నీకు సిద్ధార్దుడి కథ తెలుసా? ఇలాంటి విషయాలు వింటే, యీ వూళ్ళో మురికివాడలు చూస్తే - వాళ్ళ జీవితాలు పరిశీలిస్తే నువ్వు సన్యసిస్తావు. లేదా ఫారిన్ కి పారిపోతావు. అందుకే భగవంతుడిని నీకు కష్టం రాకుండా వుండాలని కోరుకుంటున్నాను."
    దీర్ఘంగా నిట్టూర్చింది జ్యోతి. ఆమె మనసులో ఆరాటం మొదలైంది. ఎలాగయినా అతని కుటుంబానికి, కనీసం అతనికి తోడ్పడాలని అనిపించింది. వీలయితే వాళ్ళకి డబ్బు మంచినీళ్ళలా యిచ్చెయ్యాలనీ, ఆ కుటుంబాన్ని యిక్కడికి రప్పించి సాయపడాలనీ అనిపించింది. ఏం చేయాలో తెలీక ఆరాటంలో కొట్టుమిట్టాడింది.
    ఆమె ముఖ కమలంమీద తారట్లాడే కారుమేఘల్లాంటి ఆలోచనా భ్రమరాల్ని చూసి, జ్యోతిని బాధపెట్టానా?' అనుకున్నాడు.
    "శ్రీకర్!" ప్రేమగా పిలిచింది. "నేనో విషయం చెపుతా దయచేసి అపార్ధం చేసుకోకుండా వింటావా?" మృదు మధురంగా అడిగింది.
    "వూ!"
    "నాకు ట్యూషన్ చెబుతావా?" 

 Previous Page Next Page