Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 11

    మనోహర్ కి అదంతా అయోమయంగా వుంది.

   
    "చెప్పు....ఆస్థిలేదా? అంతస్తులేదా? పరువు, ప్రతిష్టలులేవా? సామాజిక పరమయిన అభ్యంతరాలేమయినా వున్నాయా? నేను మంచి అర్హతలు గల పెళ్ళి కూతురిని కానా? ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకునే అధికారం, హక్కు మగవాడికి మాత్రమే వున్నాయా? స్త్రీకి లేవని నీ ఉద్దేశమా? అదే నీ ఉద్దేశ్యమయితే అది వివక్షత కాదా? ఒకసారి ఆలోచించు" అంటూ కుర్చీలోంచి లేచి, ముందుకెళ్ళి మనోహర్ వెనుకవేపు వున్న పర్షియన్ కార్పెట్ మీద సాలోచనగా పచార్లు చేయసాగింది. అయినా మనోహర్ ఆమె ఖాళీ చేసిన కుర్చీకేసే చూస్తుండిపోయాడు తప్ప, వెనుదిరిగి చూసే ధైర్యం చేయలేదు.
   
    "నేను నీకు విచిత్రంగా కనిపించవచ్చు. నా మాటలు వింతగా అనిపించవచ్చు. అయినా మనసులో వున్నదే బైటకు చెప్పడం నా అలవాటు. నువ్వు నాకు కావాలి" ఆమె ఇంకేదో అనబోతుండగా చటుక్కున వెనుదిరిగాడు మనోహర్.
   
    "నిన్ను పెళ్ళి చేసుకోవడం నాకు సాధ్యంకాదు" స్థిరంగా అన్నాడు మనోహర్.
   
    "సాధ్యాసాధ్యాల గురించి నువ్వు ఆలోచించకు, అది నాకొదిలెయ్. నాకసలు పెళ్ళి చేసుకునే అర్హత ఉందా...లేదా? నాప్రేమను వ్యక్తం చేసుకునే హక్కు నాకుందా....లేదా? నా ఇష్టానికి అనుగుణంగా నా జీవితాన్ని మలుచుకునేందుకు ఎవరికయినా అభ్యంతరం ఎందుకుండాలి?" ఎంతో ఉద్వేగంగా అన్నది మాయ.
   
    "నువ్వు అందంగా వుంటావు. మామూలు అందంగాకాదు-స్వర్గానికి ఒక స్వరూపం ఇస్తే, ప్రకృతికి ఒక ఆకృతి ఇస్తే ఎంత అద్భుతంగా వుంటుందో అంత అద్భుతంగా వుంటావు నువ్వు"
   
    నువ్వన్నట్లుగా నీకేమీ తక్కువకాదుకదా, ఏదీ తక్కువలేదు."
   
    "మరేం....ఏమిటి- నీ అభ్యంతరం....? ఎందుకు నాతో జీవితాన్ని పంచుకోనంటున్నావ్?" ఒకింత తీవ్ర స్వరంతో అడిగింది మాయ.
   
    వెంటనే సమాధానం చెప్పలేని మనోహర్ కుర్చీలోంచి లేచాడు. తనెంత ఫ్రాంక్ గా అడిగినా సరైన సమాధానం సూటిగా చెప్పలేని మనోహర్ కేసి కోపంగా చూసింది.
   
    ఆమె కళ్ళలో కనిపించిన ఆగ్రహాన్ని చూడగానే మనోహర్ నెర్వస్ గా ఫీలయ్యాడు.
   
    పుట్టిన దగ్గరనుంచీ ఓటమనేది ఎరగని మాయ, మనోహర్ ప్రవర్తనకి లోలోనే ఉద్రిక్తకు లోనయింది.
   
    ఇంకా అక్కడే వుంటే మరేమడుగుతుందో అర్ధంకాని మనోహర్ వడివడిగా డోర్ కేసి నడిచాడు. మరుక్షణంలో స్ప్రింగ్ డోర్ తీసుకుని బైటకు అడుగెయ్యబోతున్న మనోహర్ చేతిని కనురెప్పపాటులో అందుకని అతని చేతికి తన పెదవులని మృదువుగా అద్దింది. ఆ వెంటనే తన వాలు కనులని పైకెత్తి ఓరగా మనోహర్ కేసి చూసి కన్నుగీటింది.
   
    ఆ చర్యతో పెద్ద మిస్సైల్ నెత్తిమీద పడ్డట్టుగా భయపడిపోయిన మనోహర్ పరుగులాంటి నడకతో అక్కడ నుంచి అదృశ్యమయిపోయాడు.
   
    భయంతో పారిపోతున్న మనోహర్ ని వెనుకనుంచి చూసిన మాయ ఒక్క క్షణం నిట్టూర్చింది.
   
    మనోహర్ ని ఎలా ఒప్పించాలో? అతనిని తన దారికి ఎలా తెప్పించుకోవాలో, తెలియని మాయ వెనక్కి వెళ్ళి, తన కుర్చీలో కూర్చుని సీలింగ్ కేసి చూస్తూ ఆలోచనల్లో పడిపోయింది.
   
                                          *    *    *    *
   
    పై సంఘటన జరిగి సరిగ్గా ఆ రోజుకు ఆర్నెల్లయింది. జ్ఞాపకాల పొరల్లోంచి బయటికి వస్తూ కళ్ళిప్పింది మాయాదేవి. డ్రైవర్ కారు తెచ్చి ఎదురుగాపెట్టి బ్యాక్ డోర్ తెరచి వినయంగా నిలబడ్డాడు.
   
    అప్పుడే స్పెషల్ కోర్టునుంచి బయటికి వచ్చిన మాయాదేవిమీద కొన్ని వందల జతల కళ్ళు కేంద్రీకృతమై వున్నాయి. అది గమనించిన మాయాదేవి చిన్నగా నవ్వుకుంది.
   
    కారెక్కబోతూ ఒక్కసారెందుకో పక్కకు తిరిగి చూసింది. దూరంగా చెట్టుకింద మనోహర్ మోటారుసైకిల్ స్టార్ట్ చేస్తూ కనిపించాడు.
   
    అంతే__
   
    ఆ మరుక్షణమే మనోహర్ కేసి వేగంగా నడిచింది.
   
    "ఎందుకొచ్చిన గొడవ చెప్పు? నా మాటవిని కేసు విత్ డ్రా చేసుకో కూడదూ?" నవ్వుతూ అడిగింది మాయాదేవి.
   
    అసలే మోటార్ సైకిల్ స్టార్ట్ కాక ఇరిటేషన్ లో ఉన్న మనోహర్ విసురుగా తలెత్తి కోపంగా ఆమెకేసి చూశాడు.
   
    "ఎందుకయ్యా బాబూ.....అంత కోపంగా చూస్తావ్? ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ - 375 లో ఒక విషయం పొందుపరచడం రాజ్యాంగ నిర్మాతలు విస్మరించారు. అదేమిటో తెలుసా మీకు?" నవ్వుతూనే అంది మాయాదేవి.
   
    "నాకేం తెలిసినా, తెలియకపోయినా, నువ్వుమాత్రం శిక్షనుంచి తప్పించుకోలేవ్" కోపంగా అన్నాడు మనోహర్.
   
    "సాధారణంగా కోపంలో, అలకలో, ఆడవాళ్ళు అందంగా వుంటారని తెలుసుకున్నాను. కోపం వచ్చినప్పుడు, ఉక్రోషం తన్నుకొచ్చినప్పుడు నువ్వెంత ముచ్చటగా వుంటావో నీకు తెలియదు."
   
    "నీవెంత కాకా పట్టినా, పొగిడినా, నేను కేసు విత్ డ్రా చేసుకోను. నీలాంటి రౌడీ ఆడపిల్లలకు గుణపాఠం చెప్పి తీరాల్సిందే" అని తిరిగి మోటార్ సైకిల్ స్టార్ట్ చేయడం ప్రారంభించాడు.

 Previous Page Next Page