"విన్నావుగా నాయనా, తొందరపడి మింగిందట, తప్పయిపోయింది, ఇంకెప్పుడూ అలా మింగదు. చెంపలు వేసుకుంటుంది" ఆమె తండ్రి చెప్పాడు.
"ఇంకెప్పుడూ అల్లా చెయ్యదులెండి, ఇదే ఆఖరి రోజుగా" విక్రమ్ కిరోసిన్ డబ్బా మూత తీస్తూ అన్నాడు.
"నాయినా! పెద్దవాడ్ని, కాళ్ళు పట్టుకుంటే ఆయుక్షీణం. కాబట్టి ఇవి చేతులుకావు కాళ్ళు అనుకో..." ఆయన అతని చేతులు పట్టుకోబోయాడు.
విక్రమ్ మాట్లాడలేదు. నాలుగు మూలలా కిరోసిన్ వొంపసాగాడు.
"ఒసే తెలివితక్కువ పక్షీ! ఆ చిరునామా ఏమిటో గుర్తున్నంత వరకూ చెప్పి చావు" అరిచాడాయన.
విక్రమ్ నోట్లో సిగరెట్టు పెట్టుకుని అగ్గిపెట్టె తీసి వెలిగించుకున్నాడు.
ఆ పుల్ల ఏమూల విసురుతాడో అని ఆ ముసలాయన గుండెలు గుబగుబలాడాయి.
భ్రమరాంబ గుర్తుకు తెచ్చుకుంటున్నట్టుగా మొహం పెట్టి "ఏదో నగర్ అని వస్తుంది విక్రమ్! వెంకటేశ్వర నగరో...శ్రీనివాస నగరో, శ్రీనగరో గుర్తుకు రావడం లేదు" అంది.
"త్వరగా గుర్తుకు తెచ్చుకోవే దేభ్యం మొఖమా" అరిచాడు భ్రమరాంబ తండ్రి కీచుగా.
"ఆ__గుర్తొచ్చింది"
విక్రమ్ ఆమెవైపు ఆశగా తిరిగాడు.
"పిన్ కోడ్ 48 అని రాసింది" అంది.
"నిజంగానా?" అడిగాడు ఆమె జబ్బ పట్టుకుని.
"ఆ...అది మాత్రం గుర్తుంది."
అతను ఆమెని వెంటనే వదిలేసి వెనక్కి తిరిగాడు.
"ఎక్కడికీ?" అడిగింది భ్రమరాంబ.
"పోస్టాఫీసుకి, ఆ పిన్ కోడ్ తో వచ్చిన ఉత్తరాలు వెతికితే వర్షిణి అడ్రస్ దొరకవచ్చు."
"రోజుకి ఎన్ని వేల ఉత్తరాలు వస్తాయో! అన్నీ చూస్తావా?"
"ఆ చూస్తాను. ఆర్నెల్లలో వర్షిణి పేరుతో ఒక్క ఉత్తరమూ రాదా!"
"విక్రమ్-నీకు పిచ్చెక్కిందా?" ఆమె మాట పూర్తవకుండానే అతను విసురుగా వెళ్ళిపోయాడు.
"వెళ్ళిపోనీయవే బాబూ!" అధర్వణాచారి గజ గజా వణుకుతూ అన్నాడు.
అమృతా ప్లీజ్! నన్ను వదిలిపెట్టు. నా ఇష్టం వచ్చినట్టయినా కదలనీయకపోతే ఎలా?" హర్ష మారాం చేస్తున్నట్టు అన్నాడు.
"చూడు. కనీసం ఈ టైంలోనయినా నేను చెప్పినట్టు వినకపోతే వంటింట్లోకి వెళ్ళిపోతానంతే..." బెదిరించింది.
హర్ష నెమ్మదిగా తల ఎత్తి, ఆమె మొహంలోకి చూడాలని ప్రయత్నించడం, అతని ప్రయత్నానికి అవరోదంగా ఎత్తుగా ఆమె గుండెలు. హర్ష ఆ వింధ్య సానువుల మధ్య తల వుంచి "ప్చ్" అని ముద్దు పెట్టుకున్నాడు.
అమృత చప్పున అతని తలని దూరంగా తోసి "ఇదిగో, ఇలా అల్లరి చేస్తే నేను నీ తల ఎప్పుడూ దువ్వనే దువ్వను" అంటూ దువ్వెన డ్రస్సింగ్ టేబుల్ మీదకి విసిరికొట్టింది.
అతను నవ్వుతూ దువ్వెన అందుకుని "థ్యాంక్స్" అన్నాడు.
"ఎదురింటాయనలా మధ్య పాపిడి తీసి అరటి ఆకులా నున్నగా దువ్వుకో నాకేం" అంటూ ఆమె మూతి బిగించి వంటింటివైపు నడిచింది.
వంటింట్లోకి రాగానే మూతి బిగించి సడలించి చిరునవ్వు నవ్వుకుంది. ఆమెకి అందుకు ముందు అతను బాత్రూంలో చేసినా అల్లరి ఇంకా గుర్తుకొస్తూనే వుంది.
"గత అనుభవం నవ్వు తెప్పిస్తే అది మధుర స్మృతి. కన్నీరు చిలికిస్తే అది వ్యధా దృతి."
ఆమె శరీరంలోని ప్రతి అణువూ అతని పిలుపుకి ప్రతిస్పందిస్తూ వుంటే పట్టి ఆపుతూ "నేను పనిలో వున్నాను" అంది కినుకగా.
"అబ్బా! ఈ టైనాట్ వెయ్యవా?" అతని గొంతులో స్వల్పంగా విసుగు.
ఆమె నవ్వు బిగబట్టి, పొయ్యిమీద గిన్నెని గరిటతో కలియబెడ్తోంది. అది పప్పో, పాలో ఆమెకే తెలియడం లేదు. ఆమె ఆమెలో వుంటేగా!
"అమృతా ప్లీజ్!" హర్ష అన్నాడు.
ఇంకా ఆమె ఆగలేక ఒక అంగలో అతన్ని చేరుకొని, టైముడి వేస్తూ "నువ్వు నాకు మూడు ముడులే వేశావు. కానీ నేను నీకు ఎన్ని ముడులు వేశానో ఇప్పటిదాకా తెలుసా?" అంది నవ్వుతూ.
టై కట్టడం పూర్తవగానే కదలబోయింది.
అమృతా వెళ్ళకు" హర్ష ఆమె భుజాలు పట్టుకుని ముందుకు వంగబోయాడు.
"అరే! ఇంకా టిఫిన్ రెడీ చెయ్యలేదు. టైం అవుతోంది నీ ఆఫీసుకి."
"టిఫిన్ అక్కర్లేదులే!"
"అదేం?"
"నేను ఆఫీసుకి వెళ్ళడం లేదు" ఆమెని అమాంతం పైకి ఎత్తుతూ అన్నాడు.