Previous Page Next Page 
శ్వేతనాగు - 2 పేజి 11

                                                                            5
    జరీపూలు కుట్టిన దుప్పటిలా ఉంది ఆకాశం దూరంగా శ్రీశైల శిఖరాలు చీకటి రాసిపోసినట్లుగా కనిపిస్తున్నాయి. తాను బయలుదేరిన చోటుని గుర్తించేందుకు ప్రయత్నిస్తూ నడుస్తోంది వాణి.
    సరిగా అర్ధరాత్రి సమయంలో వాసుకి సంభాషించిందామె. కొన్ని శతాబ్దాలపాటు జీవించి ఇచ్చాపూర్వకంగా తనువుచాలించాడు యోగి. అతనితోపాటుగా అద్భుతమైన శక్తులెన్నో పంచభూతాల్లో కలిశాయి. ఆ శక్తులన్నింటినీ పొందగలిగేందుకు  మహాగరుడ యోగం ప్రారంబించింది వాసుకి. కుడంగ్ దొర కృష్ణ సర్పానికి తన అసువులను ఆహుతి ఇచ్చాడు. ప్రాణ సమానంగా భావించే ప్రొఫెసర్ కృష్ణస్వామి మృత ప్రాయులాయి శయ్యమీద పది ఉన్నారు. ఇవన్నీ తలుచుకుని ఖిన్నురాలయింది వాణి.
    ఆమె ఆంతర్యంలో మూగదానివలె రోదించింది. ఒకప్పుడు తాను శ్వేతనాగు పగనించి బయటపడగలిగింది అంటే అందుకు మహానీయులయినవారి అండదండలు అక్కరకు వచ్చినాయి, ఒకవంక వెన్నుతట్టి నడిపించే కృష్ణస్వామి, మరొకవంక తన ఆదర్శాలను ఆదరించే తండ్రి, గౌరవించే ప్రియుడు, అపురూపమయిన ఆతిధ్యమిచ్చిన కుండగ్ దొర, యోగి, సివంగి, సింగడు - వీరంతా తనను రక్షించారు.
    వారు ఇప్పుడు లేరు. తండ్రి, భర్త తనకోసం బాధపదగాలిగిన వారేగాని కర్తవ్య సాధనలో చేయూత ఇవ్వగలిగిన వారు కారు.
    ఇప్పుడు మిగలి ఉన్న ఒకేఒక్క్ ఆధారం ప్రొఫెసర్ కృష్ణస్వామి. కానీ వారు శ్వేతనాగు వల్ల అచేతనంగా శయ్యమీద పడి ఉన్నారు.
    చీకటిలో మిగిలివున్న ఆశాకిరణం వారొక్కరే. తెల్లవారుఝామువరకూ నడిచిందామె. వేగుచుక్క పొడుస్తూ ఉండగా ఒక ఆలోచన మెరుపులా వచ్చింది.
    అడుగులు త్వరితగతిని సాగినాయి. గిరిశిఖరాలకు ఉషఃకిరణాలు బంగారు మలాము పులుముతున్న వేళ అల్లంత దూరాన షైజాను గుర్తించింది వాణి. ఆమెను చూచి రేనో ఎదురుకోలగా పరుగుతీసింది. నాగాల ఆనందం మిన్నుముట్టింది.
    "పట్నవాసం దొరసానీ! వాసుకిని చూచినావా? ఆ తల్లీ ఏం చెప్పింది." అడిగాడు షైజా.
    వేగుచుక్క పొడిచిన వేళ తన మనఃపటలం మీద తళుక్కుమన్న ఆలోచనను ఒక్కసారి మననం చేసుకుంది వాణి. కృష్ణస్వామి ఒక్కరినయినా దక్కించుకోనిదే తాను శ్వేతనాగు పగనుంచి బయటపడడం అసాధ్యం. అందుకు తగినవాడు షైజా ఒక్కడే.
    "నీవు చెప్పినమాటలే వాసుకి చెప్పింది." అందామె పొడిగా.
    "మరే విశేషాలు  చూడలేదా?" అన్నాడు షైజా.
    మెరిసే మొక్కలు కొన్నింటిని చూశాను. యోగి ఇచ్చాపూర్వకంగా మరణించాడని కూడా విన్నాను."
    చెప్పింది వాణి. ఆ మాటలకోసమే షైజా ఎదురు చూస్తూ ఉంటాడని ఆమెకు తెలుసు.
    'మెరిసే మొక్కలు' అన్నమాట వినగానే అతని ముఖముద్ర మారిపోయింది.
    "దొరా! ఈ శ్రీశైల పర్వతాలలో అద్భుతమైన రహస్యమైన నెలవులు ఎన్నో ఉన్నాయి. వాటిలో వాసుకి యోగసాధన చేస్తున్న చోటు మరింత విచిత్రమయినది. అద్భుతమైనడి. ఆ చోటులో మెరిసే మొక్కలు అంతకన్నా అసాధారణమైనవి. బహుశా నీవు ఆశించిన తృణజ్యోతి, కాష్టజ్యోతి మూలికలు అవే అనుకుంటాను. ఎంతకష్టం సాధ్యమయినా, అవసరమయితే నా తను మనఃప్రాణాలు అర్పించి అయినా అపురూపమయిన ఆ మూలికల్ని నీకు సాధించి ఇస్తాను." అందామె.
    షైజా కనులు ఆనందంతో తరళాయితమయినాయి.
    "దొరసానీ! నీవు త్యగామూర్తివి. ఒకప్పుడు సప్తధాతు సంజీవని సంపాదించి నాగమణి బహూకృతిగా పొందినావు. తృణజ్యోతిని సంపాదించేందుకయినా అర్హురాలవు, అవి సంపాదించి ఇవ్వగలిగితే మరొక అపురూపమైన బహుమానం నీకు ఇవ్వాలనుకుంటున్నాను," అన్నాడు షైజా.
    వాణి కావాలనుకున్నది సాహసంతో సాదిచుకోవటమే కానీ అడిగి పుచ్చుకోవటమెన్నడూ చేయలేదు. ఇవ్వటమే కాని పుచ్చుకోవటం ఆమెకు తెలియదు. అందునించి రవంత సేపు సంశయపడి ఊరుకుంది. కాని శ్వేతనాగు పగా, ప్రొఫెసర్ కృష్ణస్వామి స్థితి జ్ఞాపకం వచ్చాక మరింక నిగ్రహించుకోలేక పోయిందామె.
    "దొరా! నాగభూమి నుంచి వచ్చి ఈ తెలుగు నేల మీద ఎన్నో అద్భుతమైన మూలికలను సాదించావు. ఆ పని మా వారు సాధించలేకపోయారన్న బాధ ఉన్నా, నిన్ను చూచి నేను గర్విస్తున్నాను. నీకు తృణజ్యోతి, కాష్ట జ్యోతి మూలికలు సాధించేందుకు ప్రాణాలయినా అర్పిస్తానని అన్నాను కదా! అయితే అది కేవలం త్యాగభావంతో అన్న మాటలు కావు. ఈసారి నీ నించి నేను ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాను." అన్నది వాణి. శ్రోతలు రాపడిపోయినారు.
    తమనుంచి ఆమె ఏదో ఆశిస్తున్నదని తెలియగానే షైజా పొంగిపోయినాడు.
    "దొరసానీ! నీవు చేయి చాచితే నా తల అయినా నీకు అర్పించుకుంటాను. అభిజాత్యం కలిగిన ఆడదానివి. నీవు పెదవి కదిపితే అదీ నాకు పవిత్ర మంత్రమే కాగలదు. ఏం కావాలి తల్లీ, నీకు?" అన్నాడతడు.
    వాణి రవంతసేపు మౌనం వహించింది, ఆ తరువాత నెమ్మది అయిన స్వరాన చెప్పసాగింది.

 Previous Page Next Page