Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 11


    ఒంటరిగా, పెళ్ళిచేసుకోకుండా ఆడపిల్ల ఉండడంలో మజా ఏమిటో సీతకి తెలియ చెప్పాలని పగపట్టాడు శంకరం. యింటి కెదురుగ్గా కిళ్ళీబడ్డీ మీద బైఠాయించి సీతవంక చూపించి యేదో చెప్పడం, ఆ తర్వాత వెక్కిరింతలు వెకిలిపాటలు, ఈలలు, రకరకాల పేర్లు పెట్టి పిలవడం ఆరంభించాడు. సీత స్కూలుకి వెళ్ళేటప్పుడు యెదురుగా కూర్చుని యేవేవో వెకిలి పనులు చేయడం, యెలగో లాగ యేడిపించాలని చూడ్డం అతని ఉద్యోగమయింది.
    ఏం చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో పడింది సీత. ఆ మాటలు చేతలు చూస్తుంటే యీడ్చి చెంప వాయగొట్టాలన్నంత కోపం ముంచుకొచ్చేది. కాని తన ఏహ్యత, ద్వేషాన్ని లోలోపలే దాచుకుని వీలయినంత వరకు శంకరం కంటబడకుండా వుండడానికే ప్రయత్నించేది.
    రాను రాను శంకరం చేష్టలు భరించడం దుస్సహమై పోయింది. శంకరం ఆ కిళ్ళీకొట్టు వాడేగాక, ఇంకా యెవరో నలుగురయిదుగురు రౌడీలు ఆ కిళ్ళీకొట్టు ముందు చేరారు. జుగుప్స కలిగించే వేషాల్లో. కిళ్ళీ బిగించి, సిగరెట్ పొగ విలాసంగా వదుల్తూ, చవకబారు పాటలతో, పోకిరీ చూపులతో సీత గదిముందు కిళ్ళీకొట్టు దగ్గిర తిష్టవేసి సీత యెప్పుడు బైటికి వస్తుందా ఎప్పుడు ఏడిపిద్దామా అని రాబందుల్లా కాచునేవారు. యెంత వినకూడదనుకున్నా, వాళ్ళని, వాళ్ళ మాటలని పట్టించుకోకూడదనుకున్నా సాధ్యపడేది కాదు సీతకి. యెంత వాళ్ళ కంటబడకూడదనుకున్నా స్కూలుకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తప్పేది కాదు సీతకి. ఇంట్లోంచి బయట పడాలన్నా, యింటికి సమీపిస్తున్నా సీత గుండెలు దడ దడ లాడేవి. చేతులు కాళ్ళు వణికేవి. ఆ కంగారు చూసి పెద్ద ఘనకార్యం సాధించిన వాళ్ళలా విరగబడి నవ్వేవాళ్ళు.
    రోజు రోజుకి పరిస్థితి అధ్వాన్న మవుతూంటే యింటికి మార్చడం తప్పించి గత్యంతరం లేకపోయింది సీతకి. కాని యెంత ప్రయత్నించినా ఆ సదుపాయంతో, ఆ మాత్రం అద్దెతో అనుకున్నంత తొందరగా ఇల్లు ఏది దొరకలేదు సీతకి.
    శంకరానికి, వాళ్ళకి భయపడి గదిలోంచి కదలడమే మానుకుంది. గాలి వెల్తురు వచ్చే కిటికీ మూసుకు కూర్చునేది. మరీ గాలిలేక ఉక్కపోసి ఏ క్షణాన్నయినా భయపడ్తూ కిటికీ తెరవగానే సినిమా ప్రేమ గీతాలు వినిపించేవి.
    ఎవరితో చెప్పుకోడం! ఏమని చెప్పుకోడం? యేమిటి చెయ్యడం? యెలా వీళ్ళ బారినించి తప్పించుకోడం? రాత్రింబవళ్ళు సీతకి అదే ఆలోచన, అదే సమస్య అయికూర్చుంది.
    యింకో యింటికి వెడితేమాత్రం, యీ శంకరాలు అక్కడమాత్రం ఎదురవరని ఏమిటి నమ్మకం? లోపం, తను ఆడపిల్ల.... వంటరిగా వుండడంలో వుంది. పోనీ, తండ్రిని సాయం తెచ్చుకుందామన్నా, తండ్రి మంచాన వున్నాడు. కదలలేడు. తను బయటికి వెడితే చూసేవారు లేరు. అయినా తన వెర్రికాని.... యెవరు యెన్నాళ్ళు సాయముండగలరు? యింకా ముందు ముందు యెంతో బ్రతుకుంది. తనకి యెప్పుడూ ఎవరు తోడుంటారు! ఆ సమస్య పెళ్లాడితేగాని తీరదు! ఎవరో ఒకర్ని పెళ్లాడుదామన్నా క్షణాలమీద జరిగెదా? తను అనుకొన్నా తనని చేసుకోడానికి సిద్ధంగా ఎవరున్నారు! పోనీ ఉద్యోగం వదిలిపెట్టి అన్నగారి యింట్లో భారమైపోతుందా? అప్పుడుమాత్రం జీవితం యింకో మాదిరి నరకం కాదా?
    యెన్ని విధాల ఆలోచించినా పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోడం మినహా యింకోదారి తోచలేదు సీతకి.
    అవును, ఇలాంటి వెధవలకి తను భయపడడం ఏమిటి? ఏం చెయ్యగలరు వీళ్ళు తనని? నోటితీట తీరేదాకా కూస్తారు. వాళ్ళ కూతలు తనెందుకు పట్టించుకోవాలి. ఇలాంటి అల్పులకి జడిసి మనసు పాడుచేసుకోడం ఏమిటి తను?
    ఆ రోజునుంచి సీత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఆరంభించింది. వాళ్ళు నవ్వుతున్నా, వెక్కిరిస్తున్నా గాభరాపడకుండా, తొణక్కుండా సూటిగా ధైర్యంగా వాళ్ళ మొహాలవంకే చూస్తూ వెళ్ళిపోయేది. వాళ్ళు ఏ పేర్లు పెట్టి పిలుస్తున్నా కోపం తెచ్చుకోకుండా నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయేది.
    సీత ప్రవర్తన వాళ్ళకి మొదట్లో ఆశ్చర్యం కలిగించింది. ఆమె నిర్లక్ష్యానికి రకరకాల అర్థాలు తీశారు. అలవాటు పడిపోయింది. యింక పాతయెత్తులు పనికిరావని ఒకడంటే మెత్తబడి దార్లోకి వస్తూంది. అవకాశం జారవిడవకూడదని ఒకడన్నాడు.
    రెండు రోజులు ఏ అల్లరి లేకుండా గడిచిపోయాయి. సీత వాళ్ళ అల్లరి తగ్గడానికి కారణం తెలియకపోయినా, విసుగెత్తి వూరుకుని ఉంటారని సంతోషించింది.
    ఆమె సంతోషం కాస్తా రెండు రోజులు కాకముందే అణగారిపోయింది. ఆ రోజు సాయంత్రం స్కూలునించి వచ్చి మామూలుగా వంట చేసుకుంటూంటే తలుపు తట్టిన చప్పుడయింది. ఎవరో కుర్రవాడు పొట్లం ఒకటి చేతిలో పెట్టి 'ఆయన' ఈయమన్నారని కిళ్ళీ కొట్టు వైపు చూపించి తుర్రుమన్నాడు.
    పొట్లం విప్పిచూసింది సీత. మల్లెపూలు, మిఠాయి, ఓ కాగితం ముక్క. రాత్రి పదిగంటలకి.... తలుపు తెరచి వుంచుతావుగదూ!' ఒకే ఒక వాక్యం! యెదుట కిళ్లీకొట్టుమీద మామూలుగా కనబడే నలుగురు ఐదుగురిలో ఒకడు జేబులో చేయిపెట్టి సిగరెట్ దమ్ము లాగుతూ వెకిలిగా నవ్వుతూ చూశాడు.
    సీత ఒక్కక్షణం మూఢురాలైంది. ఆ తర్వాత అణుచుకోలేని ఆగ్రహావేశాలతో చరచర గుమ్మం దిగి వాడి దగ్గిరకి వెళ్ళి మొహాన్న ఉమ్మేసింది. పొట్లం విసిరి కొట్టింది మొహాన్న. "రాస్కెల్, యెవరనుకున్నావు పూలు పంపడానికి! పదిగంటలకు తలుపుతీసి వుంచాలా! అలాగే, చెప్పుదెబ్బలు తినాలని వుంటే, రా!" ఏమిటో అనేసింది సీత. ఆవేశంలో అన్న సీత వెంటనే అవతల వాడి మొహం అవమానంతో నల్లబడడం, కళ్ళలో పగ రాజుకోడం వగైరాలు చూసి భయంతో కాళ్ళు తేలిపోతూండగా గదిలోకి ఒక్క వురుకుతో వచ్చిపడింది.
    గదిలోకి రాగానే మంచం మీదపడి వెక్కి వెక్కి ఏడవసాగింది. యెలా బ్రతకడం? ఏమిటిదారి? మనోవ్యధ, అనుమానం, దుఃఖం ఆమెని కాల్చసాగాయి. ఆరునెలల వంటరి జీవితమే యింత దుర్భరమైతే, యింక బ్రతుకంతా యెలా వెళ్ళదీయడం! నిజంగా వాళ్ళు నలుగురు కలిసికట్టుగా తనమీద దాడిచేస్తే తనకెవరు దిక్కు! వంటరిగా తనేం చేయగలదు? వాడి కళ్ళతో పగ స్పష్టంగా కనిపిస్తూంది! నిజంగా ఏ దురంతానికైనా ఒడిగడితే తనని ఎవరాదుకుంటారు! ఏం చేస్తుంది! ఇక్కడనించి ఉద్యోగం వదులుకుని వెళ్ళిపోయినా ఇంకో వూర్లో మాత్రం ఇలాంటి రాబందులు వుండవని ఏమిటి నమ్మకం? ఆడది వంటరిగా బ్రతకడానికి స్థానంలేదా యీ దేశంలో!
    అలా ఓగంట ఏడుస్తూ పడుకుంది సీత. ఆ క్షణాలలోనే ఏదో నిశ్చయానికి వచ్చింది. ఎదురు తిరిగే మనసుని నొక్కిపట్టింది. స్థిరంగా లేచినుంచుంది. ఏడ్పుతో ఎర్రబడ్డ కళ్ళు తుడుచుకుంది. మొహం కడుక్కుని. జుత్తు సరిచేసుకుని.... ఇంటావిడతో మాట్లాడడానికి వెళ్ళింది మళ్ళీ తన నిశ్చయం మారకుండా.
    అసంభవ మనుకున్న కూతురు పెళ్ళి జరుగుతూంటే, మంచంలోంచే చూసి, కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు విశ్వనాథం. అవి ఆనందబాష్పాలు!
    శంకరం మెడలో మూడుముళ్ళు కడుతూంటే, సీత కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళనించి రెండు నీటిబొట్లు ఆమె చేతిమీదకి జారి పడ్డాయి.
    విశ్వనాథం కన్నీటికి, సీత కన్నీటికి తేడా వుందా! ఏమో! ఆ తేడా ఏమిటో తెలిస్తే సీతకి, యింకా తెలిస్తే ఆ పిల్లకి జన్మ యిచ్చిన దేముడుకి మాత్రం తెలుస్తుంది!
    సీత ఆ క్షణాన్న భగవంతుడిని ధనం అడగలేదు! భర్త అనురాగం ఆదరణ కావాలని అడగలేదు. తన గృహం స్వర్గసీమగా చేయమని ప్రార్థించలేదు. కళ్లు మూసుకుని ఒకే ఒక విన్నపం దేముడికి వినిపించింది. భగవంతుడా, యే జన్మకైనా, యెన్ని జన్మలకైనా నాకు ఆడజన్మ మాత్రం యీయకు! అంతకన్నా ఏతుచ్ఛమైన పురుగయినా సరే' అని మాత్రం కోరుకుంది.

                                                            (ఆంధ్ర విశ్వసాహితి పోటీలో ద్వితీయ బహుమతి పొందినది)

                                                                              *  *  *  *

 Previous Page Next Page