Previous Page Next Page 
కొత్తనీరు పేజి 11


    మొదట్లో అన్నింటికీ బాధపడుతూవచ్చినా, తర్వాత తర్వాత అనుభవం నేర్పిన పాఠంవల్ల, ప్రతీదాన్ని గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ, వ్యథపడుతూ మనశ్శాంతి లేకుండా చేసుకోకుండా ఏం వచ్చినా తేలిగ్గా తీసుకోవడం అలవరచుకున్నారు ఆ తల్లిదండ్రులు.
    అందుకే పెద్దకొడుకు అరవ పిల్లని పెళ్ళాడినా, రెండో కొడుకు నలభైఏళ్ళవరకు పెళ్ళి చేసుకోకుండా తరవాత మహారాష్ట్ర కన్యను కట్టుకున్నా, శకుంతల భర్త కోపిష్టి అయి భార్యనిరాపాడినా, అన్నపూర్ణ తాము ఎంచిన వరుణ్ణి పెళ్ళాడనన్నా, శంకర్ ఎయిర్ ఫోర్సులో చేరి పెళ్ళాడకపోయినా, విజయ విదేశాలలో ఉండి పోయినా....బాధపడడం మాని క్రమంగా సర్దుకుపోవడం అలవరచుకున్నారు.
    
                            *    *    *
    
    డిస్ట్రిక్ జడ్జిగా రిటైరయిపోయి హైదరాబాదులో స్వంత యిల్లు కట్టుకుని, ఆస్తి ఏర్పరచుకుని కృష్ణా రామా అనుకుంటూ కాలం గడిపే వయసు వచ్చింది జగన్నాథంగారికి.
    రామం మద్రాసులో ఓకంపెనీలో చీఫ్ ఇంజినీరుగా మూడువేల జీతం మీద పనిచేస్తున్నాడు. రామానికి ఇద్దరే పిల్లలు. కొడుకు శ్రీనివాస్ యం.బి.బి.యస్. ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. కూతురు ఉష ఎమ్.యే. ప్యాసయి పెళ్ళికి సిద్దంగా వుంది.
    శకుంతలకి ఆరుగురు పిల్లలు. పెద్దపిల్ల ఇరవై నిండిన అనూరాధ, తర్వాతవరసవారీగా ఎనిమిదేళ్ళ పిల్లవరకు వున్నారు. శకుంతల భర్త సూర్యనారాయణ ప్లీడరు. ప్రాక్టీసు అంతచెప్పుకోతగింది కాదు. ఏదో సామాన్యంగా సంసారం నెట్టడానికి మాత్రమే సరిపోతూంది. శకుంతల విషయం జగన్నాథంగారికి ముందునుంచీ అసంతృప్తిగానే ఉంది-చదువు సగంలో ఆగిపోవడం, పెళ్ళి అనుకున్నట్లు జరగకపోవడం, భర్తవల్ల అట్టే సుఖపడక పోవడం, తక్కిన పిల్లలందరికంటే ఆర్ధికంగా వెనకబడి ఉండడం ఏటేటా కాన్పులతో, ఎబార్షన్ లతో, పిల్లలు పుట్టి పోవడాలతో ఆరోగ్యం క్షీణించి పోవడం ఆయనకి చింత కలిగిస్తూనే వచ్చాయి.
    కృష్ణమూర్తి నలభై ఏళ్ళవరకు పెళ్ళి చేసుకోకుండా ఉండి, తర్వాత పెళ్ళి చేసుకుని, ప్రస్తుతం బొంబాయిలో భార్యాభర్తలు యిద్దరూ పనిచేస్తున్నారు. కృష్ణమూర్తి అంతగా ఇంటికి రాకపోకలు చేయడు. విదేశాల్లో చాలా యేళ్ళు ఉండిపోవడం, తర్వాత ఇండియా వచ్చాక అయినా తరుచు రాకపోవడంతో ఆ కొడుకు తన కేనాడో దూరమయాడని జగన్నాధంగారు అనుకున్నారు. అసలు కృష్ణమూర్తిది చిన్నప్పటినుంచీ వింతస్వభావమే! మితభాషి, అవసరమున్నంత వరకే మాట్లాడతాడు. ఎప్పుడూ నలుగురితో కలియక ఏమూలో, ఏ పుస్తకమో పట్టుక కూర్చుంటాడు. తన చదువు, తన రీసెర్చి, తన థీసెస్ విషయాలలో తప్ప మిగతా వాటిలో ఆసక్తి లేదు. అతనికి సరిఅయినదే భార్య సావిత్రి కూడాను. పెళ్ళి చేసుకోకూడదనుకున్న ఆమె మనసు ముఫ్ఫయిఐదేళ్ళకు మారింది. తోటి స్కాలర్ కృష్ణమూర్తిని చూశాక, వారి పరిచయం ప్రేమగా మారి, విదేశంలోనే పెళ్ళి చేసుకుని ఇండియా తిరిగి వచ్చారు. సాధారణంగా ఆ యిద్దరూ బొంబాయి వదిలి రారు. అంచేత ఆకోడలితో అసలు పరిచయం, చనువు తక్కువ ఇంట్లో అందరికి. పదిసార్లు రాయగా, రాయగా ఏ రెండేళ్ళకో వచ్చి నాలుగు రోజులుండి వెడతారు. వాళ్ళకి ఓ రెండేళ్ళ కొడుకు ప్రస్తుతం.
    అన్నపూర్ణ భర్త సుందర్రావు ఇప్పుడు వాల్తేరులో కాలేజి ప్రిన్సిపాల్ గా ఉన్నాడు. అతను సహృదయుడు. సరసుడు. పూర్ణకి అంత ఉత్తముడైన భర్త లభించినందుకు తనెంతో అదృష్టవంతురాలినని మురిసిపోతుంది. పెళ్ళి అయాక సుందర్రావు పూర్ణను ప్రైవేటుగా ఎమ్.యే. చదివించాడు. తరవాత కాలేజీలో లెక్చరరుగా ఉద్యోగం వేయించాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయడం వాళ్ళ ఆర్ధికస్థితి బాగానే వుండేది. సుందర్రావు పెళ్ళయాక ఉద్యోగం చేస్తూనే రీసెర్చిలు అవీ చేసి డాక్టరేట్ తెచ్చుకుని ఉద్యోగంలో అభివృద్ధి పొందాడు. వాళ్ళకి ఒకే ఒక్క కూతురు! పద్దెనిమిదేళ్ళ సుజాత. మొదట్లో సుందర్రావంటే కాస్త కోపంగా వుండేది జగన్నాథంగారికి. పూర్ణ తను తెచ్చిన సంబంధం కాదనడానికి కారణం అతనేనని అతనితో కాస్త ముభావంగా వుండేవారు. కాని అతని మంచితనం, సహృదయత, ముఖ్యంగా పూర్ణపట్ల అతని ప్రేమానురాగాలు గుర్తించి మనసు మార్చుకుని అల్లుడితో మామూలుగా వుండడం మొదలుపెట్టారు.
    శంకర్ ఎయిర్ ఫోర్సులో వింగ్ కమాండర్ గా ఢిల్లీలో ఉన్నాడు. పెళ్ళి చేసుకోమని చెప్పి చెప్పి విసిగిపోయారు పార్వతమ్మ, జగన్నాథంగారు. ముఫ్ఫయిఆరేళ్ళు నిండిన కొడుకు యింక వివాహం చేసుకుంటాడన్న ఆశ వదిలేసుకున్నారు యిద్దరూ. పార్వతమ్మ మాత్రం మనసు ఉండబట్టక కొడుకు యింటికి వచ్చినప్పుడల్లా పెళ్ళి చేసుకోమని పోరుతూంటుంది. ఏం జవాబు చెప్పకుండా నవ్వేస్తాడు శంకర్.
    శంకర్ కులాసాతత్వం మనిషి. ఏ విషయమూ సీరియస్ గా తీసుకోడు. ఎంతసేపూ ఫ్రెండ్సు. పార్టీలు, త్రాగుడు, కార్లలో తిరగడం. మంచి మంచి డ్రస్సులు ఉంటే చాలు, ఎప్పుడూ చుట్టూ పదిమందిని పోగువేసుకుని ఉంటాడు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. ఎయిర్ ఫోర్సు ఉద్యోగం అవడంవల్ల అతని అభిలాష లన్నీ తీర్చుకోడానికి సౌకర్యంగా వుంది.
    "ఇంత సంపాదిస్తున్నావు. దమ్మిడీ మిగల్చావు. రేపొద్దున్న పిల్లా పాప పుడితే ఎలారా? ఇంత దూబరా ఏమిటి!" అని చాదస్తంగా పార్వతమ్మ కొడుకుని యింటి కొచ్చినప్పుడల్లా సాధిస్తుంది.
    "అందుకేగా పెళ్ళి చేసుకోకపోవడం! నేను ఆదా చేసి ఎవరికి పెట్టాలి! బ్రతికే నాలుగురోజులు హాయిగా అనుభవించడానికే కదా డబ్బు! ఏమో రేపు పొద్దున ఏం అవుతుందో ఎవరు చూశారు! అందులో మా ఉద్యోగంలో చావు ఏ క్షణాన వచ్చినా రావచ్చు. అందుకే బ్రతికే నాలుగురోజులు హాయిగా బ్రతకడం!" అంటాడు శంకర్ నవ్వుతూ. పార్వతమ్మ కళ్ళు చెమరుస్తాయి.

 Previous Page Next Page