Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 12


    "అదేమిటమ్మా, ఆ అమ్మాయిచేత పనులు చేయిస్తున్నావు. ఏం బాగుంటుంది. ఏం అనుకుంటుందో" అన్నాడోరోజు కృష్ణమోహన్ "ఏం చెయ్యనురా వద్దన్నా వినిపించుకోదు. వూరికే కూర్చొని ఏం చెయ్యనంటుంది. అదీ నిజమే, ఏదన్నా కాలక్షేపం వుండాలి గదా."
    సరోజ ఆ మాట వింటూనే "ఏమండీ, మీరు నాకింత చేస్తున్నారు. నేనా మాత్రం అయినా చేసి మీ పట్ల కృతజ్ఞత చూపుకోవాలనుకుంటే అది తప్పా..."
    "అయితే మేం పెట్టే తిండికి బదులు తీర్చుకోవాలనా మీ ఉద్దేశం." కృష్ణమోహన్ లేచాడు నవ్వుతూనే.
    "తిండికి బదులు తీర్చుకోగలను గానీ, మీ దయాభిమానాలకి ఎలా బదులు తీర్చుకోగలను-" నొచ్చుకుంటూ అంది సరోజ.
    "వాడేదో సరదాగా అన్నాడమ్మా. నట్టింట మహలక్ష్మిలా తిరుగుతూంటే నాకు ఎంత తృప్తిగా వుందో నీకేం తెలుసు వాడి మాటలకేంలే నీ వన్నట్టు నిన్ను మేం పరాయి మనిషిగా భావించినపుడు నీవూ అలాగే మమ్మల్ని భావించాలికదా...కోడలు వచ్చేవరకు నీదే పెత్తనం వాడెవడు కాదనటానికి---" అంది సరస్వతమ్మ.
    కృష్ణమోహన్ భుజాలు ఎగరేసి అదోలా నవ్వాడు. "అయినా నేనేం కష్టపడి పోతున్నాను. వంట ఆవిడ వుంది. పనివాళ్లున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం మినహా నేను చేస్తున్నది ఏముంది."
    "సరే, సరే--మీ యిష్టం నా కెందుకీ గొడవ" నవ్వి వెళ్ళిపోయాడు కృష్ణమోహన్.
    తెల్లవారి లేస్తూనే స్నానం చేసి దేముడి గదిలో పూజకి అన్నీ సిద్దపరుస్తుంది సరోజ, సరస్వతమ్మగారు స్నానం హేసి వచ్చేసరికి, తరువాత కాఫీ ప్రయత్నానికి వెడుతూ ఆవిడ పూజ అయ్యాక ఆమెకి అందించుతుంది. ఆ లోగా కృష్ణమోహన్ లేస్తాడు. అతనికి కాఫీ అందించి, షేవ్ చేసుకోడానికి వేన్నీళ్ళు అమర్చుతుంది. కృష్ణ మోహన్ ముందు సరోజ కాఫీ తెచ్చి యిచ్చినా మొహమాట పడేవాడు. కాని సరోజ అజమాయిషీలో అతని వస్తువులు, అతని గది ఎంత నీట్ గా వుంటుందో ఇదివరకు తల్లికి ఓపికలేక, చూసే దిక్కులేక ఎక్కడి బట్టలు అక్కడే, పుస్తకాలు చిందర వందరగా వుండే గది-ప్రతి వస్తువు వెతుక్కో నక్కర లేకుండా నీట్ గా సర్ది వుండడం, ఏ రోజు ఏబట్టలు కట్టుకోవాలో అవి కూడా తీసిపెట్టి, బూట్స్ దగ్గిరనుంచి పాలిష్ చేసి వుండడం చూసేసరికి అతను మొహమాటపడ్డా, వారించినా సరోజ ఆ పనులు మానక పోవడంతో అతను యిప్పుడు పూర్తిగా సరోజమీద ఆధారపడి ప్రతి చిన్న విషయానికి సరోజని పిలుస్తూంటాడు. చాకలికి బట్టలు  వేయటం దగ్గిరనుంచి సరోజదేపని - ఆమె యింట్లో ప్రవేశించాక ఆ యింటికి ఏదో కళ, జీవం వచ్చినట్లనిపించుతుంది. ఆ తల్లి కొడుకులకి, కలకలలాడుతూ అన్ని పనులు చక్కబెట్టుకుంటూ సరస్వాతమ్మగారిని బలవంతపెట్టి ఫలహారాలు కాఫీ తినిపిస్తూ ఆవిడ విచారం పోగొట్టడానికి ఆమెని ఆ దేముని గదిలోంచి బయటకు తీసికొచ్చి రికార్డులు పెట్టి, పుస్తకాలు చదివి వినిపించుతూ, సాయంత్రం ఏ భగవద్గీతో, రామాయణమో, శ్లోకాలు తన శ్రావ్యమైన గొంతుతో చదివి వినిపించుతూ ఆవిడ మనసు ఎప్పుడూ సంతోషంగా వుంచాలని తాపత్రయ పడ్తుంది సరోజ. భగవద్గీత శ్లోకాలు రాగయుక్తంగా చక్కగా చదవడంవిని సరస్వతమ్మ ముందు రోజు ఆశ్చర్యపోయింది. "యింత చక్కగా ఎలా చదువుతున్నావమ్మా ఎవరూ నేర్పారు. సంస్కృతం వచ్చా నీకు, ఎంత హాయిగావుంది వింటూంటే అంటూ ఆశ్చర్యానందాలతో మెచ్చుకుంటూ అడిగింది మామయ్య చిన్నప్పటినుంచి నన్ను బావని కూడా సంస్కృతం చదివించాడు. రోజూ భాగవతం భారతం అన్నీ చదివించేవాడు. ఎన్నిసార్లు చదివానో యించుమించు ఈ శ్లోకాలన్నీ కంఠతా వచ్చునాకు. యిప్పటికీ మామయ్య తోచనపుడు మనసు బాగులేనపుడు చదివి వినిపించు తల్లి. అంటాడు. అమ్మా ఈ బీదవాడి యింట్లోకాక ఏ గొప్ప వాళ్ళ యింట్లోనో వుంటే నీ చక్కని శ్రావ్యమైన గొంతుకి తోడు సంగీతం నేర్పించితే ఎంత బాగా పాడేదానివో" అంటూ విచారిస్తాడు మామయ్య" అంది సరోజ.
    "నిజం సరోజా! నీ గొంతులోనే వుంది రాగం...నీ వలా చదువుతూంటే ఎన్ని గంటలయినా వినాలనే వుంది. నా మనసు ఎటో తేలిపోతున్నట్లుంది" అంటూ ఒకటే మెచ్చుకుంది సరస్వతమ్మ.
    ముందురోజు-సాయంత్రం తీరికగా ఐదు గంటలవేళ సరస్వతమ్మగారికి రామాయణ శ్లోకాలు చదివి వినిపిస్తూంటే కన్సల్టింగ్ రూములో పేషంట్సుని చూస్తున్న కృష్ణమోహన్ ఆ గొంతు విని, ఒక్క క్షణం చేస్తున్న పని మరిచి తన్మయుడై వింటూ వుండిపోయాడు. అంత శ్రావ్యంగా శ్లోకాలు ఎవరు చదువుతున్నారు? రేడియోలోనా! ఆత్రుత, ఆరాటం అణుచుకోలేక లేచి లోపలికి వచ్చాడు. రామాయణం ముందుపెట్టుకుని రాగయుక్తంగా చదువుతున్న సరోజని -మైమరిచి వింటున్న తల్లిని చూసి ఆశ్చర్యచకితుడై అలా నిలబడిపోయాడు. హఠాత్తుగా తలెత్తిన సరోజ, తన్మయుడై చూస్తున్న కృష్ణమోహన్ ని చూసి సిగ్గుపడి ఆపేసింది చదవడం. తల్లీకొడుకులు యిద్దరూ యీ లోకంలోకి వచ్చారు...ఆశ్చర్యానందాలతో కృష్ణమోహన్ నోట మాట రాలేదు. "చూశావురా, విన్నావురా కృష్ణా. సరోజ ఎంత చక్కగా చదువుతూందో రామాయణం. సీతమ్మ కష్టాలు కళ్ళముందు నిలిచాయిరా...అమ్మా, సరోజా! నా జన్మ ధన్యమయినట్లుంది ఇవాళ రోజూ చదువు తల్లీ...నా కింతకంటే ఏం అక్కరలేదు" సరస్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ అంది.

 Previous Page Next Page