Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 13


    "మార్వలెస్ - మీ గొంతు యింత చక్కగా వుంతుందని, మీరింత బాగా పాడగలరని, అసలు రామాయణ, భారత, భాగవతాల్లో శ్లోకాలు యింత వినసొంపుగా వుంటాయన్నది - యీరోజే తెలుసుకున్నాను. సరోజగారూ థాంక్స్, మెనీథాంక్స్ అమ్మ అన్నట్టు మీ నోట ఆ శ్లోకాలు వింటూంటే మా జన్మ ధన్యమైనట్టే అన్పించింది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూంది. రోజూ మీరు చదవాలి. అమ్మా రాత్రిపూట అయితే నేనూ వింటాను. రోజు ఒక గంట సరోజ పురాణం కాలక్షేపం రేపటినించి" అన్నాడు కృష్ణమోహన్ సంతోషంగా, అభినందన పూర్వకంగా సరోజ వంక చూస్తూ. సరోజ సిగ్గుపడి తలదించుకుని వూరుకుంది.
    'వస్తా. నేనిక్కడ మైమరచి వుండిపోయాను మీ పద్యాలు వింటూ, అక్కడ పేషంట్లూ మీ గానామృతం వినిపించగానే రోగాలు తగ్గి వెళ్ళిపోయారో ఏమిటో" అంటూ నవ్వుతూ వెళ్ళాడు.
    "సరోజా అమ్మా, మీ బావ ఎంత దురదృష్టం వంతుడై నిన్ను వదిలి వెళ్ళిపోయాడే, యిలాంటి భార్యతో కాపురంచేసే అదృష్టం అతనికి లేకపోయింది....ఆ అదృష్టం మమ్మల్ని వరించి మా యింటికి నిన్ను పంపింది-చదువమ్మా చదువు..." అంది సరస్వతమ్మ.
    
                                      *    *    *
    
    "జాగ్రత్తరా నాన్నా, జాగ్రత్త, ఏమిటా గాభరా. మెట్లమీదనించి పడిపోతే..." రంగారావు మెట్లమీదనించి చిన్నపిల్లలా గెంతుకుంటూ వచ్చిన గీతని మురిపెంగా చూస్తూ అన్నాడు.
    "డాడీ...నేను మోహన్ దగ్గరికి వెడుతున్నాను. అట్నించి వెడితే ఏ సినిమాకో వెడతాం. నా కోసం వెయిట్ చేయొద్దు-ఓకే-" అంది చేతిలో హాండ్ బాగ్ విలాసంగా తిప్పుతూ గీత.
    "ఆ..ఆ..వెళ్ళు తల్లీ పాపం అప్పుడే నెలరోజులయిపోయింది గదూ మోహనని చూసి....నీ ఆరాటం నాకు తెలుసులే వెళ్ళు-అసలు ఎయిర్ పోర్ట్ కి ఎందుకు రాలేదో చెవులు మెలేసి మరీ అడుగు నెల్లాళ్ళ తర్వాత నీవు వస్తుంటే ఎయిర్ పోర్టుకి వచ్చి రిసీవ్ చేసుకోకుండా ఆ పెద్దమనిషి చేసే రాచకార్యం ఏమిటో నిలేసి అడుగు." కూతురి వంక చిలిపిగా చూస్తూ అన్నారు.
    "ఏముంది, పేషంట్లు పేషంట్లు - అంటూ పాడే పాట వుందిగా..." గీత బుంగమూతి పెట్టి అంది. "అడగనూ...వూరుకుంటానా నేను..."
    "బాగుంది నీలా అతనికి పనిపాటు లేదనుకున్నావా ఏమిటి? రోజల్లా పాపం అతనికి ఒక్క క్షణం విశ్రాంతి వుండదు- నీ వెంటనే కొంగుపట్టుకు తిరగడమేనా పని. అయినాదానికి మరింత నేర్పి పెడుతున్నారు మీరు. బాగుంది మీ తండ్రి కూతుళ్ళవరస" అన్నపూర్ణ భర్తవంక కోపంగా చూస్తూ అంది. ఆ తరువాత గీతవంక ఎగాదిగా చూసి,
    "ఏమిటే తల్లీ ఆ డ్రస్సు...అక్కడికి వెళ్ళేటప్పుడయినా లక్షణంగా చీర కట్టుకుని వెళ్ళకూడదా, ఆవిడ పెద్దావిడ ఏమనుకుంటుందో నీ అవతారం చూసి....అయినా మగాడిలాగ ఆ పంట్లాం లేమిటే తల్లీ రోజు రోజుకి వెఱ్ఱి ముదురుతుంది ఈ కాలం పిల్లలకి...."
    "పో మమ్మీ, నీకేం తెలుసు పేషన్సు. యిప్పుడు బెల్ బాటమ్స్ మాక్సీలు ఫాషన్. చీరెవరు కట్టుకుంటారు ముసలమ్మలా."
    "మీ అమ్మతో ఏమిటిరా నాన్నా....వెళ్ళు వెళ్ళు ఆలస్యం అవుతూంది."
    "ఓకే డాడీ....టాటా......మమ్మీ....." గీత చకచక హైహీల్సు చప్పుడు చేస్తూ బయటికి వెళ్ళి కారెక్కి స్టార్టు చేసింది.
    "దానికి బొత్తిగా భయం భక్తి లేకుండా పాడుచేస్తున్నారు మీరు. ఆవిడ ఏమనుకుంటుంది దీని మగరాయుడి వేషాలు చూసి, దానికి తెలియకపోతే మనం చెప్పాల్సింది పోయి, మీరు దాన్ని వెనుక వేసుకురావటం ఏమిటి. ఒకసారి దెబ్బతిన్నా యింక మీకు బుద్ధి రాలేదు గాబోలు" తీక్షణంగా అంది అన్నపూర్ణమ్మ.
    "చాల్లే...చాల్లే నోరు మూసుకో సరదాలు యిప్పుడు గాకపోతే మరెప్పుడు బట్టలు వేసుకున్నంత మాత్రాన ఏం తప్పు అందరి పిల్లలూ ఇలాగే వేసుకుంటున్నారు. నీకు తెలియకపోతే వూరుకో" భార్యని కసురుకంటూ పేపరు మొహాన అడ్డుపెట్టుకున్నాడు రంగారావు.
    
                                      *    *    *
    
    "హాయ్. మోహన్..." సుడిగాలిలా లోపలకు వచ్చిన గీతని చూడగానే ఒక్క క్షణం కృష్ణమోహన్ కళ్ళలోకి వెలుగు వచ్చింది. "హాల్లో గీతా....వచ్చేశావా. యిప్పుడే అనుకుంటున్నాను నీ గురించి..." అన్నాడు సంతోషంగా అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ వెనక్కు తిరిగి.
    "అన్నీ అబద్దాలు. అంత నేను గుర్తుండి వుంటే ఎయిర్ పోర్టుకే వచ్చేవాడివి. అసలెందుకు రాలేదు చెప్పు. నేను వస్తున్నానని తెలిసీ నన్ను రిసీవ్ చేసుకోడానికి రాలేదు కదూ." -గారాలు గుడుస్తూ బుంగమూతి పెట్టి అంది గీత.
    "సారీ వెరీ సారీ, ఎమర్జన్సీ ఆపరేషన్ అటెండ్ కావాల్సి వచ్చింది. ఏం చెయ్యను చెప్పు. ఎంతో ప్రయత్నించాను వద్దామని - సరే సాయంత్రం పేషంట్లని పంపాక నేనే వద్దామనుకున్నాను ఈలోగా నీవే వచ్చేశావు"
    "సర్లే - నీ పేషంట్లు, ఆపరేషన్లు ఎప్పుడూ చెప్పే సంజాయిషీలే చెప్తావని నాకు తెలుసు. అది సరే, యీపూట యింక పేషంట్లు అంటూ కూర్చుంటే వూరుకోను. పద, అలా యిద్దరం ఎటో తిరిగి వద్దాం...అబ్బ, ఈ నెలరోజులు నీవు కనబడక పోయేసరికి పిచ్చి ఎక్కిందనుకో" అంటూ కృష్ణమోహన్ బుజాలమీద తల ఆన్చి గోముగా అంది.

 Previous Page Next Page